Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఎంబీఏ స్పెషలైజేషన్లు ఎంచుకోవడం ఎలా?

ఎంబీఏ మొదటి సంవత్సరం పూర్తిచేసిన విద్యార్థులు రెండో ఏడాది ప్రవేశానికి ముందు ఐచ్ఛికాలను (స్పెషలైజేషన్లు) ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాథమిక విషయ పరిజ్ఞాన (కోర్‌) కోర్సులు అభ్యసించడం వల్ల వీరికి ఈ ఎంపిక పట్ల స్థూలంగా ఓ అవగాహన కలుగుతుంది. ఈ సందర్భంగా ఒక్కో స్పెషలైజేషన్‌ ప్రత్యేకతలను గమనించి, వాటికి సరిపోయే స్వభావ లక్షణాలను గ్రహిస్తే, శాస్త్రీయంగా ఎంపిక నిర్ణయం తీసుకోవచ్చు!
ఎంబీఏలో ప్రాథమిక కోర్సులు విద్యార్థులకు మేనేజ్‌మెంట్‌ భావనల, సిద్ధాంతాల పట్ల పటిష్ఠమైన పునాది వేస్తాయి. రెండో సంవత్సరంలో మార్కెటింగ్‌, ఫైనాన్స్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌, అనలిటిక్స్‌, ఆపరేషన్స్‌, సిస్టమ్స్‌, బ్యాంకింగ్‌-ఇన్సూరెన్స్‌, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌, కన్సల్టింగ్‌, రిటైలింగ్‌ వంటివి అందుబాటులో ఉంటాయి. విద్యార్థి్థ తన ఆసక్తి, మునుపటి విద్యా నేపథ్యం, వ్యక్తిగత ప్రాధాన్యం, మార్కెట్‌ గిరాకీ, వేతనం, ఉద్యోగ ప్రొఫైల్‌, ఉద్యోగంలో ఎదుగుదల లాంటి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని స్పెషలైజేషన్లను ఎంపిక చేసుకోవాలి.

మార్కెటింగ్‌
ప్రతి వాణిజ్య సంస్థలో మార్కెటింగ్‌ విభాగం కీలకపాత్ర పోషిస్తుంది. ప్రపంచీకరణ మూలంగా సంస్థల మధ్య పోటీతత్వం వల్ల సంస్థలు తమ వస్తువులను వైవిధ్యంగా నిలుపుకోవడం, అమ్మకాలు పెంచుకోవడం, కొనుగోలుదారుడిని ప్రభావితం చేయడం, సంస్థకంటూ ప్రత్యేక స్థానాన్ని వినియోగదారులు, మార్కెట్‌ వర్గాల్లో ఏర్పరచడం వంటి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.
మార్కెటింగ్‌ను ఎంచుకునే విద్యార్థులు బృంద నైపుణ్యాలు, భావప్రకటన నైపుణ్యాలు, ఆకట్టుకునే వ్యక్తిత్వం, వాక్‌చాతుర్యం, బహిర్ముఖంగా వ్యక్తపరచడం, విశ్లేషణాత్మక నైపుణ్యాలను కలిగి ఉండాలి. మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌, ఇంటర్నేషనల్‌ మార్కెటింగ్‌, సేల్స్‌ఫోర్స్‌ మేనేజ్‌మెంట్‌, సోషల్‌ మార్కెటింగ్‌, బ్రాండ్‌ మేనేజ్‌మెంట్‌, కన్సూ్యమర్‌ బిహేవియర్‌ వంటి కోర్సులు అభ్యసించాల్సి ఉంటుంది. బీటెక్‌/ డిగ్రీలో ఏ సబ్జెక్టు చదివినవారైనా తమకున్న ఆసక్తిని బట్టి మార్కెటింగ్‌ను ఎంచుకోవచ్చు.
ప్రస్తుత అంతర్జాల యుగంలో విద్యార్థులు పాఠ్యాంశాలతోపాటు ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మార్కెటింగ్‌ వంటి యాడ్‌ఆన్‌ కోర్సులు చేయడం వల్ల మెరుగైన ఉద్యోగావకాశాలను పొందవచ్చు. మార్కెటింగ్‌ స్పెషలైజేషన్‌ అభ్యసించినవారికి మార్కెటింగ్‌ మేనేజర్‌, బ్రాండ్‌ మేనేజర్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌ కన్సల్టెంట్‌, సేల్స్‌ మేనేజర్‌, రిలేషన్‌షిప్‌ మేనేజర్‌, బిజినెస్‌ డెవలపర్‌ వంటి అవకాశాలుంటాయి.

ఫైనాన్స్‌
స్పెషలైజేషన్లలో ఫైనాన్స్‌ ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది. ప్రతి వ్యాపార, వాణిజ్య సంస్థ తమ పెట్టుబడులు, వ్యయాల అంచనా, షేర్ల కొనుగోళ్లు, అమ్మకం, చర, స్థిరాస్తుల కొనుగోళ్లు, అమ్మకాలు, ఆడిటింగ్‌ వంటి ముఖ్యమైన నిర్ణయాలు ఫైనాన్షియల్‌ మేనేజర్‌ తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు వ్యాపార రంగంలో వస్తున్న జీఎస్‌టీ, టాక్సేషన్‌, అకౌంటింగ్‌ స్టాండర్డ్స్‌, ఎక్స్‌ బీఆర్‌ఎల్‌ రిపోర్టింగ్‌, ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్‌ స్టాండర్డ్స్‌ వంటి నూతన పోకడల గురించి ఆచరణాత్మక అవగాహనను సంపాదించుకోవాల్సి ఉంటుంది.
దీన్ని ఎంచుకునే విద్యార్థులకు రిపోర్టింగ్‌, మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలు, గోప్యత, ఆర్థిక వనరుల వినియోగం, ఆర్థిక సలహాలను ఇచ్చే నైపుణ్యం, రిస్క్‌ను అధిగమించడం, అంకెల పట్ల ఇష్టం, మేథమేటికల్‌ స్కిల్స్‌ ఉండాలి. బీకాం చదివినవారికి ఫైనాన్స్‌ పట్ల అవగాహన ఉంటుంది. అలాగని కామర్స్‌ విద్యార్థులు మాత్రమే దీన్ని ఎంచుకోవాలని కాదు. ఈమధ్య బీటెక్‌, బీఎస్‌సీ చదివినవారు ఫైనాన్స్‌కు ఉన్న ఎక్కువ శాతం అవకాశాలను బట్టి దీన్ని ఎక్కువగా ఎంచుకుంటున్నారు.
ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌, క్యాపిటల్‌ మార్కెట్స్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌, కాస్ట్‌ మేనేజ్‌మెంట్‌, ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌, పోర్ట్‌ఫోలియో అనాలిసిస్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ సబ్జెక్టులను ఫైనాన్స్‌ విద్యార్థి అభ్యసిస్తాడు. అదనపు కోర్సులైన ఎన్‌ఎస్‌సీ సర్టిఫికేషన్‌ ఇన్‌ ఫైనాన్షియల్‌ మార్కెట్స్‌, ఫైనాన్షియల్‌ అనలిటిక్స్‌ వంటి కోర్సులు చేస్తే ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉంటాయి.
విద్యార్థి తన ఎంబీఏ అభ్యసించే సమయంలో ఆంగ్ల వ్యాపార దినపత్రికలు క్రమంగా చదువుతూ ఉంటే ఫైనాన్షియల్‌ లిటరసీపై పట్టు పెరుగుతుంది. ఎంబీఏ ఫైనాన్స్‌ పూర్తిచేసినవారికి బ్యాంకింగ్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ రంగాల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వీరికి వెల్త్‌ మేనేజర్‌, ఫైనాన్స్‌ మేనేజర్‌, టాక్స్‌ కన్సల్టెంట్‌, ఫైనాన్షియల్‌ అడ్వయిజర్‌, కాస్ట్‌ స్పెషలిస్ట్‌, ఈక్విటీ అనలిస్ట్‌, రిస్క్‌ మేనేజర్‌, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ ఫైనాన్స్‌ వంటి అవకాశాలు ఉంటాయి.

అనలిటిక్స్‌
ప్రస్తుత పోటీ ప్రపంచంలో అంకెలు, డాటా పాత్ర కీలకమైంది. ప్రతి వ్యాపారసంస్థకూ వివిధ నిర్ణయాలు తీసుకోవడంలో డేటా సేకరణ, అన్వయం, కండెన్సింగ్‌ ఆఫ్‌ డాటా చాలా విలువైంది. ఇటీవలి కాలంలో అనలిటిక్స్‌ పట్ల విద్యార్థుల్లో ఆసక్తి పెరిగింది. ఉన్నత వేతనాలు, విరివిగా ఉన్న ఉద్యోగావకాశాలు దీనికి ముఖ్య కారణాలు.
డిగ్రీలో మేథ్స్‌, స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, బీటెక్‌ చేసిన అభ్యర్థులకు ఇది నప్పుతుంది. అంకెలపట్ల మక్కువ, గణిత నైపుణ్యాలు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, చురుకుదనం, కోడింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు దీన్ని ఎంచుకోవచ్చు. యాడ్‌ఆన్‌ కోర్సులైన ఆర్‌ సాఫ్ట్‌వేర్‌, హడూప్‌, పైథాన్‌, బిగ్‌ డేటా, అడ్వాన్స్‌డ్‌ స్టాటిస్టిక్స్‌ లాంటి కోర్సులను coursera.com, edx.org వెబ్‌సైట్లలో నేర్చుకోవచ్చు. ఎంబీఏ అనలిటిక్స్‌ పూర్తి చేసినవారికి దేశ విదేశాల్లో డేటా అనలిస్ట్‌, డేటా సైంటిస్ట్‌, బిగ్‌ డేటా కన్సల్టెంట్‌, డేటా ఆర్కిటెక్ట్‌, బిజినెస్‌ అనలిస్ట్‌ లాంటి ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయి. 2020 నాటికి మన దేశంలో 5 లక్షలమంది డేటా అనలిస్టుల అవసరం ఉంది.

ఆపరేషన్స్‌
మారుతున్న సంస్థ అవసరాల దృష్ట్యా ఎంబీఏ ఆపరేషన్స్‌కు ప్రత్యేకత పెరుగుతోంది. రవాణా, లాజిస్టిక్స్‌, ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌, లే అవుట్‌ ప్లానింగ్‌, ఫ్యాక్టరీ సెటప్‌, మెటీరియల్‌ లభ్యత, ప్లానింగ్‌, ఆర్గనైజింగ్‌ ఆవశ్యకత, రిసోర్స్‌ హ్యాండ్లింగ్‌ వంటి నిర్ణయాల నేపథ్యంలో ఆపరేషన్స్‌ నిపుణుల అవసరం సంస్థకు తప్పనిసరి. టైం మేనేజ్‌మెంట్‌, వనరుల సద్వినియోగం, దూరదృష్టి, నెగోషియేషన్‌ వంటి నైపుణ్యాలు ఉండాలి.
ఆపరేషన్స్‌ రిసర్చ్‌, ప్రొడక్షన్‌ మేనేజ్‌మెంట్‌, లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌, సప్లయి చైన్‌ మేనేజ్‌మెంట్‌, రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ వంటి కోర్సులను చదవాల్సి ఉంటుంది. బీటెక్‌ మెకానికల్‌, బీఎస్‌సీ స్టాటిస్టిక్స్‌ లేదా మేథమేటిక్స్‌ చేసిన విద్యార్థులకు ఈ ఆపరేషన్స్‌ లాభిస్తుంది. ట్రాన్స్‌పోర్టేషన్‌ మేనేజర్‌, రూటింగ్‌ స్పెషలిస్ట్‌, స్పోర్ట్స్‌ మేనేజర్‌, ఫ్యాక్టరీ హెడ్‌, సప్లయి చైన్‌ మేనేజర్‌, ప్రొడక్షన్‌ మేనేజర్‌ వంటి ఉద్యోగావకాశాలు ఉన్నాయి.

సిస్టమ్స్‌
సర్వీస్‌, మాన్యుఫాక్చరింగ్‌...ఇలా ప్రతి రంగం ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీపై ఆధారపడి ఉంది. ఈ కంప్యూటర్‌ యుగంలో ఐటీ లేనిదే ఏ పనీ జరగదనే అభిప్రాయం ఏర్పడింది. ఎంబీఏ సిస్టమ్స్‌ .. టెక్నికల్‌, మేనేజీరియల్‌ నైపుణ్యాల మేలు కలయిక. పెరుగుతున్న ఐటీ ధోరణి సిస్టమ్స్‌ పరిధిని మరింత పెంచుతోంది. మేనేజర్‌కు విషయ పరిజ్ఞానంతోపాటు టెక్నికల్‌, ప్రాబ్లమ్‌ హ్యాండ్లింగ్‌ పరిజ్ఞానాన్ని అందిస్తుంది. బీసీఏ, బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ), బీఎస్‌సీ కంప్యూటర్స్‌ చదివినవారికి ఇది ఎక్కువ అనుకూలిస్తుంది. కోడింగ్‌ స్కిల్స్‌, డేటా మైనింగ్‌, బిగ్‌ డేటా, హడూప్‌, డేటా సైన్స్‌ వంటి కోర్సులను ఈ స్పెషలైజేషన్‌ విద్యార్థులు చదివి, నైపుణ్యం సాధించాల్సి ఉంటుంది. ఐటీ బిజినెస్‌ అలైన్‌మెంట్‌, ఐటీ గవర్నెన్స్‌, బిజినెస్‌ అనలిస్ట్‌, డేటా సైంటిస్ట్‌ వంటి ఉద్యోగావకాశాలు వీరికి ఉంటాయి.

బ్యాంకింగ్‌- బీమా
దేశంలో బ్యాంకింగ్‌, బీమా రంగాలు పరివర్తన దశలో ఉన్నాయి. పూర్వంతో పోలిస్తే నిరుద్యోగం తగ్గుముఖం పట్టడం, ఉద్యోగులకు అయిదంకెల జీతం రావడం వల్ల ప్రజల్లో పొదుపుపట్ల ఆసక్తి పెరిగింది. ఏ డిగ్రీ చేసిన అభ్యర్థులు అయినా దీన్ని ఎంపిక చేసుకోవచ్చు. ముఖ్యంగా భావప్రకటన నైపుణ్యాలు, చలాకీగా పనిచేసే తత్వం, అంకెలపట్ల ఆసక్తి, కస్టమర్‌ మేనేజ్‌మెంట్‌, అమ్మకపు నైపుణ్యాలు ఉండాలి.
బ్యాంకింగ్‌ రెగ్యులేషన్స్‌, ఫండ్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్సూరెన్స్‌ మేనేజ్‌మెంట్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, కార్పొరేట్‌ బ్యాంకింగ్‌, ట్రేడ్‌ ఫైనాన్స్‌ వంటి కోర్సులను విద్యార్థులు అభ్యసిస్తారు. వీరికి పర్సనల్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌, ఫండ్‌ మేనేజర్‌, బ్యాంకింగ్‌ స్పెషలిస్ట్‌, సిప్‌ అడ్వైజర్‌, రిస్క్‌ మేనేజర్‌, ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్‌, స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులుంటాయి.

రిటైలింగ్‌
వేగవంతమైన మార్పులు చెందుతున్న రంగాల్లో రిటైలింగ్‌ మొదటి వరసలో ఉంటుంది. మార్పుతోపాటు విరివిగా ఉద్యోగావకాశాలు అందిస్తున్న రంగమిది. భారత్‌లో బిర్లా, టాటా, అంబానీ, అదానీలు రిటైలింగ్‌లో తమకంటూ ప్రత్యేకమైన ముద్రను వేసుకున్నారు. సేల్స్‌, అడ్వర్టైజింగ్‌, మార్కెట్‌ రిసర్చ్‌, కస్టమర్‌ ఎక్స్‌పీరియన్స్‌ పట్ల ఆసక్తి ఉన్నవారు దీన్ని ఎంచుకోవచ్చు.
కొత్తదనాన్ని ఎప్పుడూ కోరుకునే వినియోగదారుడికి దాన్ని అందించగలిగే నైపుణ్యం ఉన్న అభ్యర్థి దీనిలో రాణించగలడు. విద్యార్థులు మర్చండైజింగ్‌, రిటైల్‌ మేనేజ్‌మెంట్‌, ఎక్స్‌పీరియన్స్‌ మేనేజ్‌మెంట్‌, స్టోర్‌ ఆప్టిమైజేషన్‌, కస్టమర్‌ సైకాలజీ వంటి కోర్సులను అభ్యసిస్తారు. క్రియేటివ్‌ అడ్వర్టైజింగ్‌హెడ్‌, రిటైల్‌ మేనేజర్‌, కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌, బ్రాండ్‌ స్పెషలిస్ట్‌, ఈ-కామర్స్‌ రంగాల్లో ఉపాధి అవకాశాలున్నాయి. సిక్స్‌ సిగ్మా, లీన్‌ మేనేజ్‌మెంట్‌, క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ వంటి యాడ్‌ఆన్‌ కోర్సులు చేసి విద్యార్థులు తమ అవకాశాలను మెరుగుపరచుకోవచ్చు.

ఆంత్రప్రెన్యూర్‌షిప్‌
ఉద్యోగంలో ప్రవేశించాలనుకునే ఆలోచనలు లేకుండా తమకున్న ఆలోచనలను వ్యాపార రూపంలో కార్యరూపంలోకి తేవాలనుకునేవారు దీన్ని ఎంచుకోవచ్చు. కుటుంబ వ్యాపార నేపథ్యం, కొనసాగింపు, అభివృద్ధి చేయాలనుకునేవారు దీన్ని ఎంచుకోవచ్చు. దేశ అభివృద్ధిలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల పాత్ర విడదీయలేనిది. మేక్‌ ఇన్‌ ఇండియా, స్టార్టప్‌ ఫండింగ్‌, ఏంజిల్‌ ఇన్వెస్టింగ్‌, ఉద్యోగకల్పన వంటి కొత్త పోకడలు యువతను తమ సొంత సంస్థలు నెలకొల్పేలా ప్రేరేపిస్తున్నాయి. వీరికి సృజనాత్మకత, రిస్క్‌ టేకింగ్‌, పీపుల్‌ స్కిల్స్‌, దూరదృష్టి, అపజయానికి కుంగిపోని మనస్తత్వం, పట్టుదల వంటి లక్షణాలు ఉండాలి. దీన్ని పూర్తిచేసినవారు స్టార్టప్స్‌, కుటుంబ వ్యాపారాలు, సొంత సంస్థలు నెలకొల్పడం, ఏంజెల్‌, సీరియల్‌ ఆంత్రప్రెన్యూర్‌గా రాణించవచ్చు.

కన్సల్టింగ్‌
ప్రతి వ్యాపార సంస్థా్థ తమ నిర్ణయాలను తీసుకునే క్రమంలో అనుభవజ్ఞుడైన వ్యక్తి లేదా కన్సల్టెంట్‌ సలహాలు, సూచనలను తీసుకుంటుంది. కన్సల్టెంట్లకు సంబంధిత రంగంలో విశేష అనుభవం, జ్ఞానం, లోతుగా అధ్యయనం చేసే నేర్పరితనం, స్పష్టత, పోటీని తట్టుకుని వ్యాపారాన్ని అభివృద్ధి చేయగలిగిన సామర్థ్యం, రిస్క్‌ మిటిగేషన్‌ వంటి నైపుణ్యాలు అవసరం.
కన్సల్టింగ్‌లో ఐటీ, హెచ్‌ఆర్‌, ఫైనాన్స్‌, టాక్స్‌, స్ట్రాటజీ, స్టార్టప్‌ కన్సల్టింగ్‌ వంటి ప్రత్యేకతలను అలవరచుకోవాల్సి ఉంటుంది. మంచి బిజినెస్‌ స్కూల్‌లో ఎంబీఏ కన్సల్టింగ్‌ చేసినవారికి ప్రపంచ ప్రసిద్ధి చెందిన బూజ్‌ అండ్‌ కంపనీ, మెకిన్సే కన్సల్టింగ్‌, ఎటీ కార్నీ, బీసీజీ వంటి సంస్థలు ఎర్రతివాచీ పరుస్తున్నాయి.


Back..

Posted on 15-7-2017