Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఎంబీబీఎస్‌ సీటు సాధించేదెలా!

ఇంటర్‌ తర్వాత వైద్యవిద్యలో ప్రవేశించి డాక్టర్‌ కావాలనుకునే విద్యార్థులకు నేడున్న పోటీ పరీక్షలు మూడు మాత్రమే. నీట్‌, ఎయిమ్స్‌, జిప్‌మర్‌. వీటికి సమగ్రంగా, సమర్థంగా సిద్ధమయ్యేందుకు మెలకువలు... ఇవిగో!
ఎయిమ్స్‌, జిప్‌మర్‌ రెండూ ప్రత్యేక ప్రతిపత్తి ఉన్న సంస్థలు. సంబంధిత సంస్థల్లో ఎంబీబీఎస్‌ ప్రవేశానికి వారే వేర్వేరుగా ప్రవేశపరీక్షలను నిర్వహిస్తున్నారు. ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) సంస్థలు మొత్తం 7 ఉన్నాయి. అవి: ఎయిమ్స్‌- దిల్లీ, భోపాల్‌, భువనేశ్వర్‌, జోధ్‌పుర్‌, పట్నా, రాయ్‌పూర్‌, రిషికేష్‌.
మొదటి నుంచీ మనదేశంలో వైద్య విభాగంలో ప్రాముఖ్యమున్న సంస్థ ఎయిమ్స్‌. నేటికి కూడా విద్యార్థులు అధిక ప్రాధాన్యమిచ్చే సంస్థ ఎయిమ్స్‌-న్యూదిల్లీ మాత్రమే. దానిలో సీటు సాధించిన విద్యార్థి మిగిలిన ఏ సంస్థలోనూ ఎంబీబీఎస్‌ చేయడానికి ఇష్టపడరు. మిగిలిన ఎయిమ్స్‌లన్నీ నూతనంగా ప్రారంభమయ్యాయి. కాబట్టి ఎక్కువమంది విద్యార్థులు వాటికంటే మన ఉస్మానియా, గాంధీ మెడికల్‌ కళాశాలలకే ప్రాధాన్యం ఇస్తున్నారు.

పరీక్ష విధానం
ఎయిమ్స్‌ ప్రవేశపరీక్ష మే 28న కంప్యూటర్‌ ఆధారిత రూపంలో ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో జరుగుతుంది. పరీక్ష కాలవ్యవధి 3.30 గంటలు. 171 పట్టణాల్లో జరిగే ఈ పరీక్ష ఉదయం 9 గం.ల నుంచి మధ్యాహ్నం 12.30 గం.ల వరకు; మధ్యాహ్నం 3 గం.ల నుంచి సాయంత్రం 6.30 గం.ల వరకు జరుగుతుంది. పరీక్షలో మొత్తం 200 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. ఈ 200 ప్రశ్నల్లో 60 భౌతికశాస్త్రం, 60 రసాయనశాస్త్రం, 60 బయాలజీ (బోటనీ+ జువాలజీ) ప్రశ్నలు. మిగిలిన 20 ప్రశ్నలు జనరల్‌ నాలెడ్జ్‌ నుంచి ఉంటాయి.
ఇతర పరీక్షలకూ, ఎయిమ్స్‌కూ ఉన్న ముఖ్యమైన తేడా రీజన్‌ అండ్‌ అసర్షన్‌ ప్రశ్నలు. ఇవి ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీల నుంచి 20 ప్రశ్నల చొప్పున మొత్తం 60 ప్రశ్నలు ఉంటాయి. ఎయిమ్స్‌ ప్రవేశపరీక్షలో తుది ర్యాంకును ప్రభావితం చేసేవి ఈ 60 ప్రశ్నలు, జనరల్‌ నాలెడ్జ్‌లోని 20 ప్రశ్నలు. వీటిలో ఎక్కువ ప్రశ్నలకు సరైన జవాబులను గుర్తించగల విద్యార్థి ఎయిమ్స్‌, న్యూదిల్లీలో సీటు సాధించే అవకాశం ఉంటుంది. 2016 పేపరు విశ్లేషణ చేస్తే, 2017 తయారీకి ఉపయోగపడుతుంది. గత ప్రశ్నపత్రాలతో పోలిస్తే 2016 ఎయిమ్స్‌-ఎంబీబీఎస్‌ పేపర్‌ క్లిష్టంగా ఉందని విశ్లేషకుల అభిప్రాయం.

జనరల్‌ నాలెడ్జ్‌
ఎయిమ్స్‌-ఎంబీబీఎస్‌లోని జనరల్‌ నాలెడ్జ్‌ సెక్షన్‌ గత సంవత్సరం చాలా సులభంగా ఉంది. దీనిలో కరెంట్‌ అఫైర్స్‌ మీద ఎక్కువ ప్రశ్నలు ఉన్నాయి. ప్రశ్నలు ఎక్కువగా ప్రభుత్వ పథకాలమీద, వార్తల్లో ఎక్కువగా ఉంటున్న వ్యక్తుల మీద ఉన్నాయి. రోజువారీ వార్తాపత్రికలను చదివే అలవాటున్న విద్యార్థులకు ఈ విభాగం సులువే.

ఫిజిక్స్‌: గత సంవత్సరం ఫిజిక్స్‌ బాగా కష్టంగా ఉందని విద్యార్థుల అభిప్రాయం. దీనిలో సిద్ధాంతపరమైన ప్రశ్నలు, సాధించాల్సిన లెక్కలు రెండూ ఉన్నాయి. సాధించాల్సిన లెక్కల్లో ఎక్కువ కాలం తీసుకునేట్లు, కొంత విభిన్నంగానే ఉన్నాయి. సిద్ధాంతపరమైన ప్రశ్నలు ఎక్కువగా రీజన్‌ అండ్‌ అసర్షన్‌ రూపంలో ఉన్నాయి.
యాంత్రికశాస్త్రం (మెకానిక్స్‌)- 12, విద్యుత్తు-అయస్కాంతత్వం (ఎలక్ట్రిసిటీ అండ్‌ మేగ్నటిజం)-15, ఆధునిక భౌతికశాస్త్రం (మోడర్న్‌ ఫిజిక్స్‌)-10ల నుంచి అత్యధికంగా ప్రశ్నలు వచ్చాయి.

కెమిస్ట్రీ: గత సంవత్సరం కెమిస్ట్రీ ప్రశ్నపత్రం మరీ సులభంగా లేదా కష్టంగా కాకుండా మధ్యస్థంగా ఉంది. సిద్ధాంతపరమైన ప్రశ్నలు ఉన్నాయి కానీ, విద్యార్థిని తికమక పెట్టే ప్రశ్నలు లేవు. పరీక్షకు తయారైన విద్యార్థులకు కెమిస్ట్రీ ప్రశ్నపత్రం పెద్దగా కష్టం అనిపించలేదు.
అత్యధికంగా ప్రశ్నలు వచ్చిన అంశాలను చూస్తే... కెమికల్‌ అండ్‌ అయానిక్‌-6, కెమిస్ట్రీ ఆఫ్‌ రెప్రజెంటేటివ్‌ ఎలిమెంట్స్‌-13, ఆర్గానిక్‌ కాంపౌండ్స్‌ కంటైనింగ్‌ ఆక్సిజన్‌-7.

బయాలజీ: దీనిలో బోటనీ, జువాలజీ రెండింటి నుంచీ ప్రశ్నలుంటాయి. ఫిజిక్స్‌, కెమిస్ట్రీలతో పోలిస్తే గత సంవత్సరం బయాలజీ చాలా సులభంగా ఉంది. ప్రశ్నలు బాగా సులభంగా జవాబులు గుర్తించేవిధంగానే ఉన్నాయి. జువాలజీ కంటే బోటనీలో ప్రశ్నల సంఖ్య ఎక్కువగా ఉంది. జనరల్‌ బయాలజీ-27, హ్యూమన్‌ అనాటమీ అండ్‌ ఫిజియాలజీ-7, ప్లాంట్‌ అనాటమీ-6ల నుంచి అత్యధికంగా ప్రశ్నలు వచ్చాయి.

ప్రతి సరైన సమాధానానికీ +1 మార్కు, తప్పు సమాధానానికి 1/3 రుణాత్మక మార్కు. మైనస్‌ మార్కులున్నాయి కాబట్టి తెలియని ప్రశ్నలకు జవాబులు గుర్తించేటప్పుడు జాగ్రత్త అవసరం.

తయారీ విధానం
* బైపీసీ విద్యార్థులకు సీపీటీ (కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష) రాయడంపై అవగాహన ఉండదు. అందుకని తుది పరీక్షలో ఇబ్బందికి లోనుకాకుండా ఉండటానికి ఈ 20 రోజుల్లో కనీసం 5 నమూనా పరీక్షలు కంప్యూటర్‌పై రాయడానికి ప్రయత్నించాలి. ఎంత ఎక్కువగా తర్ఫీదు పొందగలిగితే అంత మేలవుతుంది.
* మామూలుగా విద్యార్థులకు 3 గంటల పరీక్ష రాయడం అలవాటు ఉంది. కానీ 3.30 గం.ల పరీక్ష పూర్తిగా అలవాటు ఉండదు. అందువల్ల తుది పరీక్ష జరిగే సమయంలోనే అంటే ఉదయం 9.00 నుంచి 12.30 వరకు; మధ్యాహ్నం 3.00 నుంచి 6.30 వరకు పరీక్ష రాయడానికి అలవాటు చేసుకోవాలి.
* నీట్‌ లాంటి పరీక్షల్లో మొత్తం ప్రశ్నపత్రంలో సగం ప్రశ్నలు బయాలజీ నుంచి ఉంటాయి. కాబట్టి కాల ఒత్తిడి తక్కువ. ఎయిమ్స్‌లో బయాలజీలో 60, ఫిజిక్స్‌, కెమిస్ట్రీల్లో 120 ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి సమయపాలన చేసుకోవాలి.
* అసర్షన్‌ అండ్‌ రీజన్‌ తరహా ప్రశ్నలపై తెలుగు విద్యార్థులకు పట్టు ఉండదు. కాబట్టి ఎక్కువ సమయం ఆ తరహా ప్రశ్నలను అభ్యసించడానికి కేటాయించాలి.
* జనరల్‌ నాలెడ్జ్‌కు సంబంధించి గత 5, 6 సంవత్సరాల ప్రశ్నపత్రాల్లోని వాటిని పరిశీలించి, తగ్గట్టుగా నేటి కాలపరిస్థితులపై విద్యార్థి స్వయంగా నోట్స్‌ తయారుచేసుకోవాలి.
* తప్పు సమాధానానికి రుణాత్మక మార్కులున్నందున జవాబులు గుర్తించేటప్పుడు జాగ్రత్త తప్పనిసరి.
* ఫిజిక్స్‌లో చాలా ప్రశ్నలు లెక్కించడం నిడివిగా ఉంటున్నాయి. ఆ తరహా ప్రశ్నలను నమూనా పరీక్షల్లో ఎక్కువగా అభ్యాసం చేయాలి.

ఇంగ్లిష్‌, రీజనింగ్‌ ముఖ్యం
జిప్‌మర్‌ (జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసర్చ్‌) పుదుచ్చేరిలో ఉన్న మెడికల్‌ విద్యాసంస్థ. దీనిలో 150 సీట్లు ఉండేవి. గత సంవత్సరం దీనికి తోడుగా కరైకల్‌లో కూడా వేరొక సంస్థను ప్రారంభించారు. దీనిలో 50 సీట్లు. అంటే జిప్‌మర్‌ పరీక్ష ద్వారా 200 ఎంబీబీఎస్‌ సీట్లు భర్తీ కానున్నాయి.

పరీక్షా విధానం
జిప్‌మర్‌ ప్రవేశపరీక్ష జూన్‌ 4న జరుగుతుంది. ఇదీ కంప్యూటర్‌ ఆధారిత పరీక్షే. రెండు షిఫ్టుల్లో ... ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు; మధ్యాహ్నం 3.00 గం.ల నుంచి సాయంత్రం 5.30 గం.ల వరకు నిర్వహిస్తారు. అంటే జిప్‌మర్‌ ప్రవేశపరీక్ష 2.30 గంటల కాలవ్యవధిలోనే జరుగుతుంది. పరీక్ష ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. పరీక్షలో ప్రశ్నల సంఖ్య పట్టికలో చూడండి.
ప్రతి సరైన సమాధానానికీ +4 మార్కులు. తప్పు సమాధానం గుర్తించినా రుణాత్మక మార్కులు ఉండవు. తెలియని ప్రశ్నలకు కూడా నిర్భయంగా జవాబులను గుర్తించి, అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చన్నమాట.
జిప్‌మర్‌, ఎయిమ్స్‌ రెండింటిలోనూ 200 ప్రశ్నలు ఉన్నాయి. కానీ జిప్‌మర్‌ పరీక్ష 2.30 గంటలు; ఎయిమ్స్‌ 3.30 గంటలు.
ఈ రకంగా జిప్‌మర్‌ సులభంగా ఉంటుందని చెప్పవచ్చు.
ఈ పరీక్షలో ఎక్కువ శాతం విద్యార్థులు బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీలలో బాగానే ప్రతిభ చూపుతున్నారు. ఇంగ్లిష్‌, రీజనింగ్‌ మాత్రం సరిగా చేయలేక సీటు సాధించే మార్కును పొందలేకపోతున్నారు. అందుకని 20 ప్రశ్నలే అయినప్పటికీ ఎక్కువ ప్రాధాన్యం ఇంగ్లిష్‌, రీజనింగ్‌లకు ఇస్తే మంచి ర్యాంకు సాధించుకోవచ్చు. భౌతికశాస్త్రంలో చాలావాటికి జవాబులు ప్రశ్నను చూడగానే గుర్తించేలా ఉంటాయి. సిద్ధాంతపరమైన ప్రశ్నలు ఎక్కువగా ఉంటున్నాయి.

ఉమ్మడిగా సిద్ధం కావొచ్చు
జిప్‌మర్‌ అయినా ఎయిమ్స్‌ అయినా సిలబస్‌ ఒకటే. బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీల్లోని ప్రశ్నల సంఖ్య కూడా ఒకటే కాబట్టి, ఉమ్మడి తయారీ విధానాన్నే అనుసరిస్తూ... అదనంగా ఇంగ్లిష్‌, రీజనింగ్‌, జనరల్‌ నాలెడ్జ్‌లపై శ్రద్ధ వహిస్తే రెండింటిలోనూ మంచి ర్యాంకులు సాధించుకోవచ్చు. రెండూ కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలే కాబట్టి ఒకటి తయారైనా రెండోదానికి ఉపయోగపడుతుంది. కంప్యూటర్‌పై ఎక్కువ పరీక్షలను 2.30 గంటల కాలవ్యవధిలోనూ 3.30 గంటల కాలవ్యవధిలోనూ అభ్యాసం చేయాలి.
గత పేపర్ల విశ్లేషణను చూస్తే జిప్‌మర్‌ పేపర్లలో ఇంగ్లిష్‌ మినహా మిగిలిన విభాగాలు సులభంగానే ఉంటున్నాయి. నీట్‌ కోసం విద్యార్థి బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ పూర్తి చేసుకున్నారు. కాబట్టి ఈ 20 రోజులు వాటి పునశ్చరణ చేస్తూ ఇంగ్లిష్‌, రీజనింగ్‌, జనరల్‌నాలెడ్జ్‌ నేర్చుకోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. ఆపై నమూనా పరీక్షలను కంప్యూటర్‌పై అభ్యాసం చేస్తూ వెళితే కచ్చితంగా ఈ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించి సీటు పొందవచ్చు. ఎయిమ్స్‌ దిల్లీ, పుదుచ్చేరిల్లో ఎంబీబీఎస్‌ చేసిన విద్యార్థులకు పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ చేయడం చాలా సులభం అవుతుంది.


Back..

Posted on 08-05-2017