Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
పోయే సీట్లు తక్కువ... పోటీ పడేవి ఎక్కువ!

* పీజీ వైద్యవిద్య ప్రవేశాలపై కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ కరుణాకరరెడ్డితో ముఖాముఖి
అఖిలభారత వైద్యవిద్య సీట్ల కూటమి (నేషనల్‌ పూల్‌)లోకి చేరడం వల్ల తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు మేలే జరుగుతుందంటున్నారు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ కరుణాకరరెడ్డి. ఏ రాష్ట్ర వైద్యసీట్లు ఆ రాష్ట్ర విద్యార్థులకే దక్కాలనుకోవడం సంకుచిత స్వభావమనీ, వైద్యసీట్లను జాతీయ సంపదగా గుర్తించింది కాబట్టే.. అఖిల భారత స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశాలను నిర్వహిస్తోందన్నారు. ఇతర రాష్ట్రాల్లో సీట్లు పొందడం వల్ల కొన్ని అత్యుత్తమ కళాశాలల్లో పీజీ చదివే అవకాశం విద్యార్థులకు లభిస్తుందన్నారు. పీజీ వైద్యవిద్య ప్రవేశాలు ఈ వారాంతంలోగా ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఉపకులపతి ‘చదువు’తో ప్రత్యేకంగా మాట్లాడారు.ఆ విశేషాలు..

* అఖిల భారత వైద్యవిద్య సీట్ల కూటమిలో ఎందుకు చేరాల్సి వచ్చింది?
దేశంలోని అన్ని రాష్ట్రాలూ ఈ కూటమిలోకి ఎప్పుడో చేరిపోయాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలే చివరివని చెప్పొచ్చు. ఇందులో చేరడం వల్ల ఆయా రాష్ట్ర ప్రభుత్వ వైద్యకళాశాలల్లోని 50 శాతం పీజీ సీట్లను అఖిల భారత కూటమిలోకి ఇవ్వాల్సి వస్తుంది. దీన్నొక జాతీయ సంపదగా భావిస్తారు. ఈ సంపదను పొందే అవకాశం అందరికీ సమానంగా ఉంటుంది. అలా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన సీట్లను.. అన్ని రాష్ట్రాల విద్యార్థులకు వర్తింపజేస్తారు. సుమారు 8 వేల పీజీ సీట్లకు అన్ని రాష్ట్రాల విద్యార్థులూ పోటీపడతారు. ఏ రాష్ట్ర విద్యార్థులు ఎక్కువ కష్టపడతారో.. ఎక్కువ సమర్థులో.. ఎక్కువ ప్రతిభ సాధిస్తారో.. వారికి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలుంటాయి. దేశం మొత్తం మీద ఈ విధానం అమల్లో ఉండాలనే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం ఈ విధానంలోకి తెలుగు రాష్ట్రాలనూ ఆహ్వానించింది. మన రాష్ట్రాలూ సానుకూలంగా స్పందించాయి.
* పీజీ వైద్యవిద్య ప్రవేశాల ప్రక్రియలో తెలంగాణలో ఎన్ని కోటాలున్నాయి?
కూటమిలో చేరడం వల్ల రాజ్యాంగపరమైన రిజర్వేషన్లలో ఎలాంటి మార్పులుండవు. గత ఏడాది మాదిరిగానే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్లు ఈ ఏడాది కూడా యథావిధిగా కొనసాగుతాయి. స్థానిక విద్యార్థులకు 85 శాతం.. అన్‌రిజర్వుడ్‌ అంటే ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు ఇద్దరూ పాల్గొంటారు. దీనికి 15 శాతం కేటాయింపులున్నాయి. అయితే 15 శాతం అన్‌రిజర్వుడ్‌ కోటా, ఇన్‌సర్వీస్‌ వైద్యులకు 30 శాతం క్లినికల్‌ కోర్సుల్లో, 50 శాతం నాన్‌క్లినికల్‌ కోర్సుల్లో రిజర్వేషన్లు ఇప్పటివరకూ ఉన్నాయి. అఖిల భారత వైద్యవిద్య కూటమిలో చేరడం వల్ల ఈ అన్‌రిజర్వుడ్‌, ఇన్‌సర్వీస్‌ రిజర్వేషన్లను కొనసాగించడంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. త్వరలోనే దీనిపై ఉత్తర్వులు వెలువడుతాయి.
* రిజర్వేషన్లలో స్థానికత, ఏపీ అని ఎలా నిర్ణయిస్తారు?
రిజర్వేషన్ల కేటాయింపులో ఇప్పటికే అమల్లో ఉన్న రాష్ట్రపతి ఆదేశాల ప్రకారమే నడుచుకుంటాం. అర్హత పరీక్షకు ముందు వరుసగా నాలుగేళ్లు ఏ రాష్ట్రంలో చదువుకుంటారో.. వారికి ఆ రాష్ట్రమే స్థానికత కిందకు వస్తుంది. పీజీ వైద్యవిద్యకొచ్చేసరికి ఎంబీబీఎస్‌ ఎక్కడ చదివితే ఆ రాష్ట్రమే వారికి స్థానికతగా పరిగణనలోకి వస్తుంది. ఇది ఇప్పటివరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అమల్లో ఉన్న విధానమే.
* అఖిల భారత వైద్యవిద్య సీట్ల కూటమిలోకి ప్రైవేటు వైద్య కళాశాలల్లోని కన్వీనర్‌ కోటా సీట్లు చేరుతాయా?
ప్రైవేటు వైద్యకళాశాలల్లోని మొత్తం సీట్లలో 50 శాతం సీట్లను ఇప్పటికే కన్వీనర్‌ కోటాలోకి ఇచ్చేశారు. ఇక మిగిలిన 50 శాతం సీట్లను యాజమాన్య, ప్రవాస భారతీయ, వైద్యసంస్థ స్వేచ్ఛ కోటాల కింద నీట్‌ ర్యాంకుల ప్రాతిపదికనే భర్తీ చేయాల్సి ఉంటుంది. వీటిని కూడా కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పర్యవేక్షణలోనే భర్తీ చేస్తాం. కన్వీనర్‌ కోటాలోకి చేరిన 50 శాతం ప్రైవేటు వైద్యకళాశాలల సీట్లు అఖిల భారత కోటాలోకి చేరవు. కేవలం ప్రభుత్వ కళాశాలల్లోని మొత్తం సీట్లలో 50 శాతం చేరతాయి. అది కూడా విభాగాల వారీగా గుర్తించినప్పుడు కొన్నిసార్లు సగం కంటే తక్కువ సీట్లే చేరే అవకాశాలుంటాయి. ఉదాహరణకు ఒక విభాగంలో పీజీ సీట్లు 5 ఉన్నాయనుకోండి.. రెండే అఖిల భారత కూటమిలో చేరతాయి.
* అఖిల భారత వైద్యవిద్య సీట్ల కూటమిలో చేరడం వల్ల తెలుగు విద్యార్థులకు నష్టమేననే భావన ఉంది? వాస్తవమెంత?
ఆ భావనలో వాస్తవం లేదు. తొలి 100 ర్యాంకుల్లో 50 మనమే సాధించలేదు కాబట్టి.. మనకు నష్టమనే భావన సరైంది కాదు. నిజానికి తెలంగాణలో మూడే ప్రభుత్వ వైద్యకళాశాలలున్నాయి. ప్రభుత్వ పీజీ సీట్లు దక్షిణాదిలో తక్కువున్నాయి. ప్రైవేటు పీజీ సీట్లు ఇక్కడ ఎక్కువున్నాయి. అదే ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రభుత్వ పీజీ సీట్లు ఎక్కువ. మరి 50 శాతం సీట్లు ప్రభుత్వ వైద్యకళాశాలల నుంచి ఈ కూటమిలోకి చేర్చుతున్నప్పుడు.. మన సీట్లు కోల్పోయేది చాలా తక్కువ. పోటీ పడేవే ఎక్కువ.
వచ్చే రెండేళ్లలో 80కి పైగా కొత్త ప్రభుత్వ కళాశాలలు రాబోతున్నాయి. 2 వేల పీజీ సీట్లు పెరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో అవకాశాలు పెరిగినట్లే. మన పిల్లలకు మంచి ర్యాంకులే వచ్చినా.. మన రాష్ట్రంలో అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య పరిమితం కావడంతో ఎక్కువమంది పీజీ వైద్యవిద్యను అభ్యసించలేకపోతున్నారు. ఇప్పుడు అఖిల భారత కోటాలో చేరడం వల్ల దేశంలోని అత్యుత్తమ వైద్య కళాశాలల్లో పీజీ వైద్యవిద్యను అభ్యసించడానికి మార్గం సులభతరమైంది.
గట్టి ప్రయత్నం చేసిన విద్యార్థికి తాను కోరుకున్న పీజీ కోర్సులో ఏ రాష్ట్రంలోనైనా పొందే అవకాశాలు మెరుగయ్యాయి. ఉదాహరణకు ఒక విద్యార్థి జనరల్‌ మెడిసిన్‌లో సీటు కోరుకుంటే.. ఆ విద్యార్థికి వచ్చిన ర్యాంకుకు ఉత్తరాది రాష్ట్రంలో సీటు వచ్చిందనుకుందాం. వెళ్లాలి. అలా కాకుండా.. అక్కడ వరకూ వెళ్లకుండా.. మన రాష్ట్రంలోనే పీజీ సీటులో చేరాలనుకుంటే.. అప్పుడు తను కోరుకున్న జనరల్‌ మెడిసిన్‌ కాకుండా ఉదాహరణకు ఈఎన్‌టీలోనో మరో కోర్సులోనో చేరి రాజీపడాల్సి వస్తుంది.
విద్యార్థులు మరో ప్రాంతంలో చదివితేనే అక్కడి సంస్కృతులు తెలుస్తాయి. విశాల దృక్పథంతో రోగులకు చికిత్సలందించగలుగుతారు. ఇతర రాష్ట్రాల్లో అభ్యసించడం వల్ల కేంద్ర వైద్య సంస్థల్లో పనిచేయడానికి మ³ందుకొస్తారు. జాతీయస్థాయిలో ఉద్యోగావకాశాలు, వృత్తిపరమైన అవకాశాలు పెరుగుతాయి. తద్వారా రాష్ట్రంలోనూ పోటీ తగ్గుతుంది. అందువల్ల ఈ ఒక్క సంవత్సరం ర్యాంకులను పరిగణనలోకి తీసుకోవద్దు. దేశవ్యాప్తంగా అవకాశాలు మెరుగయ్యాయనే స్ఫూర్తితో ముందుకెళ్లాలి. ఇప్పుడు కష్టపడినా కోరుకున్న సీటు దక్కించుకోలేని స్థితి నుంచి కష్టపడితే సాధించగలిగే స్థితికి చేరుకోవడం శుభపరిణామమే కదా!
* ఇతర రాష్ట్రాల్లో పూచీకత్తు అనేది ఏమైనా ప్రతిబంధకంగా మారుతుందా?
దీనిమీద వేర్వేరు అభిప్రాయాలున్న మాట వాస్తవం. అఖిల భారత స్థాయిలో వైద్యవిద్యలో ఒకే విధమైన విధానాన్ని అమలుచేయాలని ఇటీవల మన ప్రభుత్వం కూడా కేంద్రప్రభుత్వాన్ని కోరింది. ఒకే విధమైన కోటాను అఖిల భారత స్థాయిలో అమలుచేస్తున్నప్పుడు ఒకే విధమైన నియమ నిబంధనలుండాలని ఆ ప్రతిపాదనల్లో కోరాం. పీజీ వైద్యవిద్యలో ఒక్కో రాష్ట్రంలో ఒక రకమైన నిబంధనను అమలు చేస్తున్నారు. వారి రాష్ట్రంలో పీజీ వైద్యవిద్య పూర్తిచేసిన అనంతరం తప్పనిసరిగా అక్కడే కొంతకాలం పనిచేయాలనేది నిబంధన. ఒక రాష్ట్రంలో ఏడాది ఉంటే.. ఇంకో రాష్ట్రంలో రెండేళ్లు.. మూడేళ్లు కూడా ఉంది. ఒకవేళ పనిచేయకపోతే కొంత మొత్తాన్ని చెల్లించాలనే నిబంధన కూడా పెట్టారు. ఇది కూడా కొన్ని రాష్ట్రాల్లో రూ.5 లక్షలుంటే.. కొన్నింటిలో రూ.25 లక్షలు.. రూ.50 లక్షలు కూడా ఉంది. దీన్ని దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉండేలా అమల్లోకి తీసుకురావాలని కోరాం. ఒకవేళ పూచీకత్తు మన రాష్ట్రంలో అమలు చేయాల్సి వస్తే.. ఈ విధానం ఎలా ఉంటుందనేది కూడా పరిశీలిస్తున్నాం.
అయినా పూచీకత్తు అనేది ప్రతిబంధకంగా భావించకూడదు. మనం కోరుకున్న సీటు దక్కుతున్నప్పుడు ఆ కోర్సులో చేరడంపైనే దృష్టిపెట్టాలి. మన రాష్ట్రం కాకపోతే ఏ రాష్ట్రంలో నచ్చిన కోర్సు వస్తే అక్కడ చేరిపోవాలి. ఆ రాష్ట్ర ప్రభుత్వ వైద్యకళాశాలల్లో చదువుకొని.. అక్కడి ప్రభుత్వ నిధులతో వైద్యవిద్య అభ్యసించి.. ఆ రాష్ట్రంలో ఒకట్రెండు ఏళ్లు పనిచేయాల్సి వస్తే.. అందుకు వెనుకడుగు ఎందుకు వేయాలి? కోరుకున్న కోర్సు దక్కుతున్నప్పుడు ఇవన్నీ చిన్న విషయాలే. పైగా అక్కడేమీ ఉచిత వైద్యసేవలందించడం లేదు కదా! పనిచేసినన్ని రోజులూ ఉపకార వేతనం పొందుతారు కదా! జాతీయ భావన ఉండాలి.
* పూచీకత్తు అఖిల భారత కోటాకే ఉంటుందా? రాష్ట్ర ప్రభుత్వ కన్వీనర్‌ కోటాకూ ఉంటుందా?
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి నిబంధనను ఎత్తేసింది. ఒకవేళ పూచీకత్తును సరళీకృతంగా పెట్టాల్సి వచ్చినా.. అన్ని సీట్లకూ ఉంటుంది. కేవలం అఖిల భారత కోటా విద్యార్థులకు పూచీకత్తు పెట్టి.. కన్వీనర్‌ కోటా విద్యార్థులకు పూచీకత్తు పెట్టకపోవడమంటూ ఉండదు. అలా చేస్తే వివక్ష చూపినట్లు అవుతుంది. న్యాయపరంగా అది నిలబడదు కూడా. ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే విధానముంది. అయితే నిబంధనలన్నీ అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధంగా ఉండాలనేదే మన డిమాండ్‌.
* ఎన్నిసీట్లు అఖిల భారత కోటాలోకి చేరతాయి?
ప్రభుత్వ కళాశాలల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సీట్లు సుమారు 705. వీటిలో సుమారు 350 వరకూ అఖిల భారత కోటాలోకి చేరతాయి. మరికొన్ని పీజీ సీట్లకు ఇంకా అనుమతులు రావాల్సి ఉంది. మరో వారంలో ఎన్ని సీట్లు కచ్చితంగా చేరుతాయనే స్పష్టత వస్తుంది. ఈ కోటాలోకి చేరిన సీట్లు పోను మిగిలిన సీట్లూ.. ప్రైవేటు కళాశాలల నుంచి వచ్చిన కన్వీనర్‌ కోటా సీట్లు కలుపుకొని సుమారు 710 వరకూ కన్వీనర్‌ కోటాలో అందుబాటులో ఉంటాయి. మనం జాతీయ స్థాయికిచ్చిన సీట్లకు.. దాదాపు 20 రెట్లు అధికంగా పీజీ సీట్లు అందుబాటులోకి వస్తాయి.
* అఖిల భారత కోటాలో చేరాలంటే రాజ్యాంగ సవరణ ఏమీ అక్కర్లేదా? ఇంకా ఏమైనా ఆటంకాలున్నాయా?
సందేహాలేమీ అక్కర్లేదు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర పీజీ సీట్లు అఖిల భారత కోటా సీట్ల జాబితాలోకి చేరిపోయాయి. ఉస్మానియా, గాంధీ, కాకతీయ, నిమ్స్‌ కళాశాలల నుంచి 50 శాతం పీజీ సీట్లు ఆ కోటాలో గుర్తించారు. వైద్యవిద్యలో రాజ్యాంగ సవరణ అక్కర్లేదని గత ఏడాది సూపర్‌ స్పెషాలిటీ సీట్ల ప్రవేశాల సందర్భంగానే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని న్యాయస్థానమూ సమర్థించింది. కాబట్టి ఇంకా ఆటంకాలంటూ ఏమీ లేవు. అఖిల భారత వైద్యవిద్య కూటమిలో చేరడమనేది పురోగమన విధానం. దీన్ని స్వాగతించాల్సిందే.
* పీజీ సీట్ల ప్రవేశాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి?
ఈ వారంలోగా ప్రవేశ ప్రకటన వెలువడుతుంది. అఖిల భారత వైద్యవిద్య సీట్ల కూటమి ప్రకటనే ఇంకా వెలువడలేదు. ఆ ప్రవేశ ప్రక్రియ మొదలైన కనీసం రెండుమూడు రోజుల తర్వాత మన ప్రక్రియ కూడా ప్రారంభం అవుతుంది. సీట్ల సమాచారాన్ని కూడా అప్పుడే ప్రకటిస్తాం. అఖిల భారత కూటమి సీట్ల భర్తీని కేంద్రం నిర్వహిస్తుంది. రాష్ట్రంలో కన్వీనర్‌, ప్రైవేటులోని యాజమాన్య కోటా సీట్ల భర్తీ ప్రక్రియను ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది.

- అయితరాజు రంగారావు, ఈనాడు-హైదరాబాద్‌

Back..

Posted on 20-03-2018