Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
గెలుపును చేరువ చేసే ఆలోచన ధోరణి

ఎంతో కష్టపడి పోటీపరీక్షలకు సిద్ధమవుతుంటే.. తేదీలన్నీ మళ్లీ మళ్లీ మారిపోతున్నాయ్‌. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో జాబ్‌ కొట్టి, ఇక చేరడమే తరువాయి అనుకుంటే ఎప్పుడు చేరేదీ మళ్లీ చెబుతామని కబురు. ఉద్యోగం దక్కిందని ఊపిరి పీల్చుకున్నామో లేదో అసలు ఉంటుందో లేదో తెలియని స్థితి. ఒకటా, రెండా.. విద్యార్థులూ, ఉద్యోగార్థులూ, ఉద్యోగులూ ప్రతి ఒక్కరిదీ ఏదో ఒక ఆందోళన. కొవిడ్‌ పరిణామాలు తీసుకొచ్చిన పరిస్థితే ఇది. అయితే ఇది ఒక్కరి సమస్య కాదు కదా! ఉమ్మడి సమస్య అయినపుడు సానుకూలంగా తీసుకుంటే సరిపోదా?

రమేష్, మహేష్‌ ఉద్యోగార్థులు. బ్యాంకు ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారు. ఎప్పటిలాగే నోటిఫికేషన్‌ వస్తుందని సన్నద్ధత మొదలుపెట్టారు. తీరా చూస్తే వస్తుందనుకున్న సమయానికి నోటిఫికేషన్‌ రాలేదు. ఈ ఏడాది ఉండకపోవచ్చన్న ఊహాగానాలు మొదలయ్యాయి. అప్పటిదాకా సీరియస్‌గా సాగిస్తున్న సన్నద్ధతకు రమేష్‌ ఫుల్‌స్టాప్‌ పెట్టేశాడు. మహేష్‌ మాత్రం ఆశావహమైన ఆలోచనలతో తన సన్నద్ధతను అలాగే కొనసాగించాడు. రెండు నెలల ఆలస్యంతో నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆలస్యం కావడంతో ప్రకటనకూ పరీక్షకూ మధ్య ఎక్కువ సమయం ఇవ్వలేదు. రమేష్‌కు ఈ కొద్ది సమయం సరిపోలేదు. పరీక్ష దగ్గరపడుతున్నకొద్దీ కంగారుపడ్డాడు. అప్పటిదాకా పట్టున్న అంశాలూ మర్చిపోయే పరిస్థితి. మహేష్‌ మాత్రం ఏ కంగారూ లేకుండా ఆఖరి సన్నద్ధతకు సిద్ధమయ్యాడు.

ఎవరు గెలిచారన్న సంగతి పక్కన పెడితే.. గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయో అర్థం చేసుకోవడం మాత్రం సులువే. ఇప్పుడు కరోనా కారణంగా మన విద్యార్థులు, ఉద్యోగార్థులు, ఉద్యోగులు.. దాదాపు రమేష్‌ పరిస్థితిలోనే ఉన్నారు.

ఎంతోమంది పరీక్ష రాస్తారు. అందరూ పాస్‌ కాలేరు. ఇంటర్వ్యూ వరకూ చాలామంది వెళతారు. ఉద్యోగం సాధించేదీ కొందరే. ఇక్కడ అందరూ విజయం కోసం ప్రయత్నించినవారే. గెలిచినవారు మాత్రం కొందరే. ఇక్కడ మార్కులు, పరిజ్ఞానం.. అన్నీ సమానంగా ఉన్నా కొరవడుతున్న అంశం వేరే ఉంది. అదే పాజిటివ్‌ థింకింగ్‌ (సానుకూల దృక్పథం). దాన్ని పెంపొందించుకుంటే విజయానికి చేరువైనట్లే అంటున్నారు నిపుణులు. ప్రస్తుత పరిస్థితుల్లో అది మరింత అవసరమంటున్నారు.

అంతా మంచే జరుగుతుందనీ, అనుకూల ఫలితాలనే సాధిస్తామనీ నమ్మడాన్నే సానుకూల దృక్పథంగా చెప్పవచ్చు. కొత్తగా ఆలోచించే, అననుకూల పరిస్థితులు ఎదురైనపుడు ధైర్యంగా ఎదుర్కొనే శక్తి దీని ద్వారానే ఏర్పడుతుంది. సానుకూలంగా ఆలోచించడమంటే వాస్తవాలను మర్చిపోవడం కాదు. భవిష్యత్తులో అంతా మంచే జరుగుతుందని నమ్మడం. సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగిపోవడం. ఇలాంటివారికే సంస్థలూ పెద్ద పీట వేస్తాయి.

ఎలా సాధించొచ్చు?
* ప్రతికూల ఆలోచనలు, ప్రతిదాన్నీ విమర్శించే మనస్తత్వం ఉన్నవారికి దూరంగా ఉండాలి. సానుకూలంగా ఆలోచించే వారిని గమనించడం, వారితో మెలగడం వంటివి చేయాలి. సహాధ్యాయులు, ఉద్యోగులను ఎంచుకునే వీలు ఉండకపోవచ్చు. కానీ వారిలో ఎవరిని స్నేహితులుగా ఎంచుకోవాలో మన చేతుల్లోనే ఉంటుంది. వదంతులు, విమర్శలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. వీటి పర్యవసానాలు మనసుపై ప్రభావం చూపుతాయి.
* కోపం, బాధ ప్రతి మనిషికీ ఉంటాయి. ఇలాంటివి ఎదురైనపుడు సహజంగానే దానికి అనుగుణంగా ప్రతిస్పందిస్తుంటాం. ఒక్కోసారి తప్పుగానూ అర్థం చేసుకునే వీలుంటుంది. కొన్నిసార్లు తప్పు సరిదిద్దుకోవచ్చు. కానీ అన్నిసార్లూ అది కుదరదు. పైగా స్పందించే తీరును బట్టి మనిషిని అంచనా వేస్తారు. పరిస్థితిని అంచనా వేయడంపై దృష్టిపెట్టడం అలవాటు చేసుకోవాలి. ఉపయోగించే పదాలపైనా దృష్టిపెట్టాలి.
* మనసు బాగుంటే చుట్టూ వాతావరణం కూడా ఆహ్లాదంగా కనిపిస్తుందంటారు. పాటలు వినడం, పుస్తకాలు చదవడం, అభిరుచులను పెంపొందించుకోవడం అలవాటు చేసుకోవాలి. మనసు ఆనందంగా ఉంటేనే ఆలోచనలు, మాటతీరూ బాగుంటాయి. కొత్త విషయాలను తెలుసుకోవడం, నేర్చుకోవడం అలవరచుకోవాలి. వ్యాయామం, ధ్యానం వంటివీ సాయపడతాయి.
* ప్రతి పనికీ ప్రణాళిక వేసుకుని, ఆ సమయంలోగా పూర్తిచేయాలి. దీన్ని ఒక అలవాటు చేసుకోవాలి. సరైన సమయంలోగా పూర్తవని పనులు ఒత్తిడికి కారణమవుతాయి. ఒత్తిడీ మనసుపై అననుకూల ప్రభావాన్నే చూపుతుంది. రేపు చేయాల్సిన పనులనూ ఈరోజే నిర్ణయించుకోవాలి. వాయిదా పద్ధతినీ మానుకోవాలి.
* కొత్త పని చేయడం ఎవరికైనా కొంత ఇబ్బందిగానే ఉంటుంది. అలాగని వాటికి దూరంగా ఉండటం మంచిది కాదు. కళాశాల అయినా, ఆఫీసు అయినా కొత్త బాధ్యతలను అప్పగించినపుడు తీసుకోవడం మంచిది. దానిలో పొరబాట్లు జరిగినా అంగీకరించగలగాలి. అప్పుడే నేర్చుకోవడం సాధ్యమవుతుంది. కొత్త ప్రయత్నాలకీ ఆస్కారముంటుంది.
* ఈరోజు శాశ్వతం కాదు. ఈరోజు బాలేదని భవిష్యత్తూ అలాగే ఉంటుందనడానికి లేదు. కాబట్టి, భవిష్యత్‌ బాగుండటానికి ఏం చేయాలో/ దానిని ఎదుర్కోవడానికి ఎలా ఉండాలో ఆలోచించుకుని దానిపై దృష్టిపెట్టడం ప్రారంభించాలి. ఈ విధమైన ఆలోచనే నలుగురిలో భిన్నంగా నిలబెట్టగలుగుతుంది.
* ఇతరులు చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోకూడదు. అలాచేయడం మనసుకెంతో ఆనందాన్నిస్తుంది. సాయం చేసినవారికీ మున్ముందు ఇంకొందరికి సాయం చేయాలన్న ఉత్సాహం కలుగుతుంది.

Back..

Posted on 23-06-2020