Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఎంపీసీ/బైపీసీ తర్వాత సీఏ!

చార్టర్డ్‌ అకౌంటెన్సీ (సీఏ) కోర్సు ఇంటర్లో కామర్స్‌ గ్రూపులు చదివినవారికి మాత్రమేననీ, మిగతా గ్రూపులవారు ఇది చదవటం కష్టమనీ ఓ అభిప్రాయం విద్యార్థుల్లో ఉంది. ఇది వాస్తవం కాదు. ఇంటర్లో ఎంపీసీ/బైపీసీ గ్రూపు చదివినవారు చాలామంది సీఏ కోర్సులో మంచి ఫలితాలు సాధిస్తున్నారు!

ఇంటర్లో ఎంపీసీ గ్రూపు తీసుకుని, సీట్లు సులభంగా దొరుకుతున్నాయని చాలామంది ఇంజినీరింగ్‌లో చేరుతున్నారు. బీటెక్‌/బీఈ పూర్తిచేసిన తర్వాత మెరుగైన ఉద్యోగావకాశాల కోసం ఎంబీఏ లాంటి కామర్స్‌ కోర్సులు తీసుకుంటున్నారు. అంటే ఎంపీసీ విద్యార్థులు కామర్స్‌ కోర్సులు చదవడం కొత్తేమీ కాదని అర్థం చేసుకోవచ్చు.
సీఏ కోర్సు చదవడానికి ఇంటర్లో ఎంఈసీ గ్రూపు ద్వారా రావడమే సరైన పద్ధతి. పదో తరగతి తర్వాత సీఏ గురించి తెలియక ఎంపీసీ/బైపీసీ గ్రూపు తీసుకున్నవారిలో కొందరు ఆ తర్వాత ఈ కోర్సు ప్రాధాన్యం గుర్తిస్తున్నారు. ఇంటర్‌ ముగిశాక సీఏ కోర్సును ఎంచుకుంటున్నారు.

నాలుగేళ్ళలోనే...
* ప్రణాళికాబద్ధంగా చదివితే ఇంటర్‌/బైపీసీ తర్వాత కేవలం నాలుగు సంవత్సరాల్లో సీఏ కోర్సును పూర్తిచేయవచ్చు. మంచి ఉద్యోగావకాశాలు అందుకోవచ్చు.
* సీఏ చదవటానికి ఇంటర్‌ తర్వాత సీపీటీ (కామన్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌) అనే ప్రవేశపరీక్ష రాయాల్సివుంటుంది.
* సీపీటీలో అర్హత పొందితే చాలు. ర్యాంకు రావాల్సిన అవసరం లేదు. ఇలా అర్హత పొందిన విద్యార్థి దేశంలో తనకిష్టం వచ్చిన సీఏ కళాశాలలో కోచింగ్‌ తీసుకుని, సీఏ కోర్సు అభ్యసించవచ్చు.
* కోర్సు చదువుతున్నపుడే సంపాదించే అవకాశం (ఎర్న్‌ వైల్‌ యూ లెర్న్‌) ఉంది. ఐపీసీసీ పూర్తిచేశాక మూడేళ్ళపాటు ఒక ప్రాక్టీసింగ్‌ సీఏ వద్ద ఆర్టికల్‌షిప్‌ చేయాల్సివుంటుంది. ఆ సమయంలో ప్రాక్టీస్‌ చేసే ప్రాంతాన్ని బట్టి రూ.2000-రూ.5,000 స్టైపెండ్‌గా పొందవచ్చు.
* కోర్సు రెండో దశ ఐపీసీసీలోని మొదటి గ్రూపు చదివి చదవడం ఆపివేసినా విద్యార్థికి ఏటీసీ (అకౌంటింగ్‌ టెక్నీషియన్‌ సర్టిఫికెట్‌) లభిస్తుంది. ఇది ఉన్నవారికి కనీసం రూ. 20,000-25,000 సంపాదన కలిగిన ఉద్యోగాలు దొరికే వీలుంటుంది.
* సీఏ చదివే విద్యార్థులు మూడేళ్ళు ప్రాక్టికల్‌ ట్రెయినింగ్‌ తప్పనిసరిగా పూర్తిచేయాలి. ఇలా ప్రాక్టికల్‌ అప్రోచ్‌ ఉండటం వల్ల సీఏ చదివినవారికి ఉపాధి అవకాశాలు బాగా ఉంటున్నాయి. * సీఏ చదువుతూ డిగ్రీ కోర్సును కూడా పూర్తి చేసుకోవచ్చు. అంటే రెండు కోర్సులూ ఏకకాలంలో చదివే అవకాశం ఉంది.
* సీఏలో ఒకవేళ విఫలమైతే కేవలం ఆరునెలలకే మళ్ళీ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించవచ్చు.
* సీఏ కోర్సులో ఒక్క రూపాయి కూడా డొనేషన్‌ చెల్లించనవసరం లేదు.

రాణించగలరా?
ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు కామర్స్‌ అంటే తెలియదు. ఎకనామిక్స్‌పై అవగాహన ఉండదు. మరి అలాంటివారు సీఏ కోర్సులో రాణించగలరా?
* ఫిజిక్స్‌, కెమిస్ట్రీలతో పోలిస్తే కామర్స్‌, ఎకనామిక్స్‌ అంత కష్టం కాదు. ఈ గ్రూపులు చదివినవారికి ఉండే కష్టపడే మనస్తత్వం వల్ల సీఏ వారికి సులువుగానే ఉంటుంది.
సీఏలో ర్యాంకులుంటాయా? వాటిని బట్టే సీట్లు వస్తాయా?
* సీఏలో ర్యాంకులుంటాయి గానీ అవి విద్యార్థి ప్రతిభను ప్రోత్సహించడానికి మాత్రమే. సీఏ కోర్సులో పాసైతే చాలు, ఇష్టం వచ్చిన కళాశాలలో సీఏ కోర్సును పూర్తిచేయవచ్చు.
ఈ కోర్సు ఇంగ్లిష్‌మీడియం వారికే పరిమితమా?
* ఇంగ్లిష్‌ లేదా తెలుగు మీడియం వారు ఎవరైనా చదవొచ్చు. కోర్సు మాత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది.

ఆర్టికల్‌షిప్‌ ఎవరి వద్ద చేయాలి?
* సీఏ చదువుతున్న విద్యార్థులు ప్రాక్టీసులో ఉన్న చార్టర్డ్‌ అకౌంటెంట్‌ వద్ద ఆర్టికల్‌షిప్‌ చేయాల్సివుంటుంది. పేరున్న ఆడిట్‌ సంస్థల్లో, ప్రసిద్ధ సీఏల వద్ద కూడా ఆర్టికల్‌షిప్‌ చేయవచ్చు.
కోర్సు రెండో దశ ఐపీసీసీలోని మొదటి గ్రూపు చదివి చదవడం ఆపివేసినా విద్యార్థికి ఏటీసీ (అకౌంటింగ్‌ టెక్నీషియన్‌ సర్టిఫికెట్‌) లభిస్తుంది. ఇది ఉంటే ఆకర్షణీయమైన వేతనంతో ఉద్యోగాలు దొరికే వీలుంటుంది.

మాది ప్రకాశం జిల్లా తిమ్మనపాలెం. పదో తరగతిలో 513 మార్కులూ, ఇంటర్‌ ఎంపీసీలో 96 శాతం మార్కులూ వచ్చాయి. ఎంసెట్‌, ఐఐటీ ప్రవేశపరీక్షలు రాశాను. ఇంజినీరింగ్‌లో నేను చదువుదామనుకున్న బ్రాంచి రాలేదు. తక్కువ ఖర్చుతో పూర్తికాగలిగిన, త్వరగా సెటిల్‌ కాగలిగిన కోర్సు కోసం వెదికితే సీఏ కోర్సు కనపడి దాన్ని ఎంచుకున్నాను. ముందుగా ఎకౌంట్స్‌, ఎకనామిక్స్‌ ప్రాథమికాంశాలపై పట్టు తెచ్చుకున్నా. రెండు నెల్ల పాటు 200కి పైగా రివిజన్‌ పరీక్షలూ, 20కి పైగా మాక్‌ టెస్టులూ రాశాను. 2013లో సీఏ సీపీటీలో ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకు రావటం సంతోషం కలిగించింది. ప్రస్తుతం సీఏ ఫైనల్‌లో ఉన్నాను. నన్ను చూసి చాలామంది సీఏ వైపు రావడం నాకు నిజంగా గర్వంగా ఉంది. - సాయి బ్రహ్మతేజ

మాది నెల్లూరు. నాకు పదో తరగతిలో 520 మార్కులూ, ఇంటర్‌ ఎంపీసీలో 92 శాతం మార్కులూ వచ్చాయి. ఎంసెట్‌ రాసి 3000 ర్యాంకు తెచ్చుకున్నా. ఇంజినీరింగ్‌ కోర్సు కాదనుకుని సీఏ ఎంచుకున్నాను. ఇది సరైన నిర్ణయం కాదని భావించినవారందరూ 2011లో సీఏ-సీపీటీలో నాకు ఆలిండియా మొదటి ర్యాంకు రావటంతో ఆశ్చర్యపోయారు. నేను ఎంఈసీ చదివివుంటే ఫండమెంటల్స్‌పై ఇంకా పట్టుసాధించివుండేవాడిని కదా అనిపిస్తుంది. సీఏ ఫైనల్‌ గత ఏడాది పూర్తిచేశాను. ఎంపీసీ విద్యార్థులు కూడా నిర్భయంగా సీఏ చేరవచ్చనేది నా సలహా. - సందేష్‌రెడ్డి


Back..

Posted on 12-07-2016