Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
హ్యాట్రిక్‌ సాధించింది

ఈ అమ్మాయి పేరు నిధి మయూరికా. బెంగళూరు, ఒలింపియాడ్‌ పాఠశాలలో తొమ్మిదోతరగతి చదువుతోంది. 15 ఏళ్ల ప్రాయంలోనే ఈ విద్యార్థిని పేరు రాష్ట్రవ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. ఇందుకు కారణం నాసా ఏటా పెట్టే ‘నాసా ఎయిమ్స్‌ స్పేస్‌ సెటిల్‌మెంట్‌ కాంటెస్ట్‌ ( ఏఎస్సెస్‌)’ లో విజేతగా నిలవడమే. గత రెండేళ్ల నుంచి ఈ అవార్డును వరుసగా అందుకున్న నిధి ఈసారీ దాన్ని సొంతం చేసుకుంది. తాజాగా మూడుసార్లు తెచ్చుకుని, హ్యాట్రిక్‌ సాధించింది. భవిష్యత్తులో ఖగోళశాస్త్రవేత్తగా కావాలనే నిధి ఆశయానికి ఈ విజయాలు పునాదులుగా నిలవనున్నాయి.
నిధికి పదకొండేళ్ల వయసు నుంచే సూర్యచంద్రులు, నక్షత్రాలపై అమితాసక్తి ఉండేది. అది గమనించిన స్కూల్‌ ప్రధానోపాధ్యాయులు ఏటా నాసా నిర్వహించే ‘ఏఎస్సెస్‌’ కాంటెస్ట్‌ గురించి చెప్పారు. దాంతో అప్పట్నుంచీ ఆ పోటీలో నిధి పాల్గొనడం మొదలుపెట్టింది.
అంతరిక్షంపై ఆలోచనలు... నిధి ఏడో తరగతిలో మొదటిసారిగా ఈ పోటీల్లో పాల్గొంది. అలా మూడేళ్లపాటు తన ఆలోచనలను పంపి, నాసా ప్రశంసలను అందుకుంది. ‘నేను దీని కోసం చాలా కృషి చేశా. స్కూల్‌లో తరగతులు అయిపోయిన తరువాత ఈ పోటీల కోసం చదివేదాన్ని. నా సందేహాలన్నింటినీ మా ఫిజిక్స్‌ సర్‌ని అడిగి తెలుసుకునేదాన్ని. అంతేకాదు, ఖగోళ శాస్త్రానికి సంబంధించి ఎడిన్‌బర్గ్‌, బోస్టన్‌, ది ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ విశ్వవిద్యాలయాలు నిర్వహించే ఆన్‌లైన్‌ కోర్సుల్లో చేరా. అలా చాలా విషయాలను తెలుసుకున్నా. నా ఆలోచనల మేరకు, అదెంత వరకు సాధ్యమవుతుందనే అంశంపై వర్క్‌ చేసి, ఓ ప్రాజెక్టుగా రూపొందించి పోటీకి పంపేదాన్ని. అలా మూడేళ్లపాటు నా ఆలోచనల ప్రతిరూపాలే ‘సైకతం’, ‘సోహాం’, ‘స్వస్తికం’. ఇవే నన్ను విజేతను చేశాయి...’ అని చెబుతుంది నిధి.
సైకతం.. భూమి, చంద్రగ్రహాల మధ్య గురుత్వాకర్షణశక్తి ఉండే ప్రాంతంలోని లాగ్‌రేంజ్‌్ పాయింట్‌ వద్ద... మూడు అంతస్తులుగా స్పేస్‌ కాలనీ ఏర్పాటు చేసే ప్రాజెక్టు ఇది. అందులో కృత్రిమ గురుత్వాకర్షణతోపాటు నీరు, ఆహారం, గాలి వంటి నిత్యావసరాలను కల్పించడం. మనుషులు జీవించడానికి అనువుగా ఏర్పాట్లు చేయడం. ఈ ప్రాజెక్టు ఆలోచనకు నిధి ‘సైకతం’ అనే పేరు పెట్టింది. ఇలా రూపొందించిన స్పేస్‌కాలనీలో నాలుగువేల మందితోపాటు వెయ్యి పెంపుడు జంతువులను ఉంచవచ్చని చెబుతుందామె.
సోహం... భూమి ఉపరితలానికి 350 కిలోమీటర్ల దూరంలో స్పేస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేసి, అక్కడే శాటిలైట్స్‌ను తయారుచేయవచ్చు. వాటిని అక్కడి నుంచే అంతరిక్షంలోకి పంపించవచ్చు. ఈ ప్రాజెక్టు నాసాకు నచ్చడంతో గతేడాది నిధిని విజేతగా ప్రకటించింది.
స్వస్తికం ఇది కృత్రిమ డీఎన్‌ఏతో సృష్టించిన అంతరిక్ష కాలనీ. ప్రాణులు కొత్త వాతావరణాన్ని తట్టుకుని మనుగడ సాగించడానికి వీలుగా రూపొందించిందే ఇది. ఇక్కడ ఉండే రేడియేషన్‌, వేడి, నిరంతర వెలుగు, గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వంటి ప్రతికూల పరిస్థితులకు అనుగుణంగా జీవరాశి మనుగడ మారడానికి ఈ అంతరిక్ష కాలనీ తోడ్పడుతుందని వివరిస్తుంది నిధి.

చదివింది బీకాం నేర్చుకొంది ఫిజిక్స్‌

విమానం నడపాలని కలలు కన్నాడు. కుటుంబ పరిస్థితిమో కారు డ్రైవర్‌గా మార్చింది.
అయినా తన కలలకు కళ్లెం వేసుకోలేదు. పెద్ద విమానాలు నడిపే పైలట్‌ కాకపోయినా చిన్న విమానాల ఆవిష్కర్తగా మారాడు.
చదివింది బీకామే అయినా ఇంజినీర్లు చేయలేని అద్భుతాలు చేస్తున్నాడు వరంగల్‌ ఉర్సుకు చెందిన దుస్సా దిలీప్‌.
దిలీప్‌ది అతి సాధారణ కుటుంబం. చిన్న రేకుల ఇల్లు. లోపలికి అడుగుపెడితే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. ఆ ఇంట్లో ఎక్కడ చూసినా గోడలపై చిన్నపాటి విమానాలు కనిపిస్తాయి. బల్లలపై డ్రోన్లు ఉంటాయి. వాటిని నియంత్రించేందుకు అయిదారు రిమోటు కంట్రోళ్లు దర్శనమిస్తాయి. దిలీప్‌ సృజనకు ఆకాశమే హద్దని అవి చాటి చెబుతాయి. ఇటీవల దిల్లీలో నిర్వహించిన వరల్డ్‌ రొబోటిక్‌ ఛాంపియన్‌షిప్‌లో ఇతను రూపొందించిన విమాన నమూనా ద్వితీయ స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్‌ఐటీ సాంకేతిక విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులు పాల్గొనే ఈ పోటీలో 63 బృందాలు పోటీపడగా దిలీప్‌ నమూనా రెండో బహుమతి పొందింది. 2017 అక్టోబరులో వరంగల్‌ నిట్‌లో జరిగిన టెక్నోజియాన్‌ వేడుకల్లో ఏరోమోడల్స్‌ విభాగంలో దిలీప్‌ తృతీయ బహుమతి పొందాడు.
* వేగంగా ప్రయాణించగలిగే రేసింగ్‌ డ్రోన్‌ ఆవిష్కరించాడు.
* తక్కువ సమయంలో పంటలపై క్రిమిసంహారక మందులు చల్లే డ్రోన్‌ తయారీలో నిమగ్నమయ్యాడు.
* ఇక త్రీడీ మ్యాపింగ్‌ ఇప్పటికే ప్రారంభించాడు. ఇది ఎలాంటి ప్రాంతంలో సర్వే చేయాలన్నా ఉపకరిస్తుంది.
అంతర్జాలమే గురువు : 2015 నుంచి దిలీప్‌ రిమోట్‌ కంట్రోల్‌తో నియంత్రించే బుల్లి విమానాలు, డ్రోన్లు అనేకం తయారుచేశాడు. ఇల్లే అతని ప్రయోగశాల. అంతర్జాలమే గురువు. పాఠశాలలో ఎన్‌సీసీ ఎయిర్‌ వింగ్‌ విభాగంలో పాల్గొన్నప్పుడు విమానం ఎక్కే అవకాశం వచ్చింది. అప్పటి నుంచి విమానమే అతని లోకమైంది. ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ చేసి, పైలట్‌గా జీవితంలో స్థిరపడాలనుకున్నాడు. ఆర్థిక పరిస్థితుల కారణంగా డిగ్రీ చదవాల్సి వచ్చింది. కానీ తన చిరకాల స్వప్నాన్ని వదులుకోలేదు. నాన్న పరమేశ్‌ పుస్తకాల బైండింగ్‌ పని చేస్తారు. అన్నయ్య కారు డ్రైవర్‌. ఇద్దరి సంపాదనతో ఇల్లు గడిచేది. 2013లో అన్నయ్య చనిపోయారు. ఇది అతని జీవితంలో పెద్ద కుదుపు. తండ్రి సంపాదించే కొద్దిపాటి ఆదాయం సరిపోక కారు డ్రైవర్‌గా మారాడు. డబ్బులు సంపాదిస్తూనే డిగ్రీ పూర్తి చేశాడు. ఎంబీయేలో చేరినా మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. అతని ఆసక్తి, అభిరుచి ఊరకుండనివ్వలేదు. వచ్చిన డబ్బులో కొంత పొదుపు చేసి చిన్న విమానాలను రూపొందించడం మొదలుపెట్టాడు. ఇలా రూ. 3 లక్షల వరకు వెచ్చించాడు. ఇంట్లో వాటిని దాచే స్థలమూ లేకపోవడంతో గోడలపై వేలాడదీస్తున్నాడు. ఇప్పటికి రెండు డ్రోన్లు రూపొందించాడు. తాజాగా వినాయక చవితి సందర్భంగా బరువులు మోసే డ్రోన్‌పై గణపయ్య బొమ్మను పెట్టి ఆకాశంలో ఊరేగిస్తున్నాడు దిలీప్‌.

Posted on 29-9-2018

Back..