Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
నేరుగా ఆర్కిటెక్చర్‌లోకి..నాటా

నేషనల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఆర్కిటెక్చర్‌ (నాటా) ప్రవేశ ప్రకటన వెలువడింది. ఆర్కిటెక్చర్‌ను కెరియర్‌గా ఆశించినవాళ్లు ఈ పరీక్ష ద్వారా ఉన్నత సంస్థల్లో ప్రవేశం పొందవచ్చు. భారతీయ ఆర్కిటెక్చర్‌ కౌన్సిల్‌ (సీఓఏ) ఈ పరీక్షను నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా దాదాపు 450 సంస్థలు నాటా స్కోర్‌తో ప్రవేశాలకు అనుమతిస్తున్నాయి. ఎన్‌ఐటీలు, ఐఐటీలు మినహాయిస్తే దేశంలోని మిగతా అన్ని ఆర్కిటెక్చర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే నాటాలో పొందిన స్కోర్‌ ప్రామాణికంగా నిలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ పలు ఇంజినీరింగ్‌ కళాశాలలు ఈ స్కోర్‌తో బీఆర్క్‌ కోర్సులో ప్రవేశం కల్పిస్తున్నాయి. పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మ్యాథ్స్‌లో పరిజ్ఞానం, వివిధ రకాల చిత్రాలు,. ఆకృతులు గీయడంలో నైపుణ్యం ఉన్నవాళ్లు ఈ పరీక్షలో రాణించగలరు.
విద్యార్హత: మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా ఇంటర్‌ లేదా మూడేళ్ల డిప్లొమా కోర్సు 50 శాతం మార్కులతో పూర్తిచేసి ఉండాలి. ఈ కోర్సుల్లో ఆఖరు సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష ఇలా...
మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 2 భాగాలు ఉంటాయి. పార్ట్‌-ఎకు 120 మార్కులు కేటాయించారు. ఈ విభాగాన్ని 90 నిమిషాల్లో పూర్తిచేయాలి. ఇందులో మ్యాథ్స్‌ నుంచి 20, జనరల్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 40 ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. రుణాత్మక మార్కులు లేవు. పార్ట్‌-బి కూడా 90 నిమిషాల వ్యవధిలోనే ఉంటుంది. అయితే దీనికి మార్కులు 80. ఎ-4 పరిమాణమున్న పేపర్‌పై రెండు వూహాత్మక చిత్రాలు / ఆకృతులు గీయాలి. ఒక్కో చిత్రానికి 40 చొప్పున మార్కులు ఉంటాయి.
అర్హత సాధించాలంటే...
పార్ట్‌-ఎలో కనీసం 25 శాతం అంటే 120కి 30 మార్కులు పొందాలి. అలాగే పార్ట్‌-బిలోనూ 25 శాతం మార్కులు (80 కి 20) పొందడం తప్పనిసరి ఇలా అర్హత మార్కులు సాధించిన అభ్యర్థుల జాబితా నుంచి మెరిట్‌, రిజర్వేషన్ల ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారు.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తుల ప్రారంభ తేదీ: జనవరి 16
దరఖాస్తు ఫీజు: రూ.1800. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1500.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 2
హాల్‌ టికెట్లు: ఏప్రిల్‌ 2 నుంచి అందుబాటులో ఉంటాయి.
పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 29 (ఆదివారం) ఉదయం 10:30 గం. నుంచి మధ్యాహ్నం 1:30 గం. వరకు
ఫలితాలు: జూన్‌ 1న ప్రకటిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం.


Back..

Posted on 11-01-2017