Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
నాటా బాటలో.. ఆర్కిటెక్చర్‌!

* ఐదేళ్ల కోర్సుకు ప్రవేశప్రకటన విడుదల

సుప్రసిద్ధ కట్టడాలు... గృహాలు.. వాణిజ్య సముదాయాలు.. రహదారులు.. అన్ని రకాల నిర్మాణాలూ ఆర్కిటెక్చర్ల సృజనాత్మక ఊహల నుంచి రూపొందినవే. ఠీవిగా నిలిచే అద్భుత నిర్మాణాలకు వీరి నైపుణ్యమే వెన్నెముక. ఇందుకోసం బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (బీఆర్క్‌) కోర్సు పూర్తిచేయడం తప్పనిసరి. ప్రవేశానికి నేషనల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు ఇన్‌ ఆర్కిటెక్చర్‌ (నాటా) నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 465 సంస్థలు ఆర్కిటెక్చర్‌ కోర్సులు అందిస్తున్నాయి. ఈ సంస్థల్లో ప్రవేశాలకు నాటా స్కోరు ఉపయోగపడుతుంది.

బీఆర్క్‌ కోర్సు వ్యవధి ఐదేళ్లు. ఇందులో ప్రవేశానికి నాటాను ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తారు. రెండుసార్లూ రాసుకోవచ్చు. ఎక్కువ మార్కులు వచ్చిన దాన్నే తుది స్కోరుగా పరిగణిస్తారు. ఈ పరీక్షలో చూపిన ప్రతిభతో జవహర్ల్‌ాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌ తోపాటు దేశవ్యాప్తంగా 465 సంస్థల్లో బీఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. ఈ కోర్సు అనంతరం ఎంఆర్క్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో చేరవచ్చు..నిర్మాణరంగ సంస్థల్లోనే కాకుండా ప్రభుత్వ విభాగాలు, రైల్వే, రక్షణ శాఖ, ఎయిర్‌ పోర్టు అథారిటీ, హౌసింగు బోర్డులు, కార్పొరేషన్లు, కార్పొరేట్‌ సంస్థల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

పరీక్ష ఇలా...
మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 2 భాగాలుంటాయి.
* పార్ట్‌-ఎకు 125 మార్కులు కేటాయించారు. ఈ విభాగాన్ని 135 నిమిషాల్లో పూర్తిచేయాలి. ఇందులో 3 ప్రశ్నలు ఉంటాయి.ఈ ప్రశ్నలకు 35, 35, 55 మార్కులు కేటాయించారు. వాటికి సంబంధించిన డ్రాయింగ్‌ ఏ4 పేపర్‌పై గీయాలి.
* పార్ట్‌-బికి 75 మార్కులు. దీన్ని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఇందులో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ నుంచి 15, జనరల్‌ ఆప్టిట్యూడ్‌, లాజికల్‌ రీజనింగ్‌ నుంచి 35 ప్రశ్నలుంటాయి. మొత్తం 50 ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకు 1.5 మార్కులు. రుణాత్మక మార్కులు లేవు. కాలవ్యవధి 45 నిమిషాలు.
* పార్ట్‌ ఎ, పార్ట్‌ బి మధ్య 15 నిమిషాల విరామం ఉంటుంది. పరీక్షలో అర్హత సాధించడానికి ఒక్కో విభాగంలోనూ కనీసం 25 శాతం మార్కులు సాధించాలి. అంటే పార్ట్‌-ఎలో 125కి 32, పార్ట్‌-బిలో 75కి 18 పొందడం తప్పనిసరి. అర్హుల జాబితా నుంచి మెరిట్‌, రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయిస్తారు.

విద్యార్హత: మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం మార్కులతోపాటు ఇంటర్మీడియట్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు, ప్రస్తుతం ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా 50 శాతం మార్కులతో డిప్లొమా పూర్తిచేసినవారూ, ఆఖరు సంవత్సరం విద్యార్థులూ అర్హులే. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఎన్‌సీఎల్‌, దివ్యాంగులకు అర్హత మార్కుల్లో 5 శాతం సడలింపు వర్తిస్తుంది.

ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: మార్చి 16 (మొదటి పరీక్షకు); మే 4 (రెండో టెస్టుకు)
పరీక్ష ఫీజు: ఒక పరీక్షకు రూ.2000. రెండు పరీక్షలకూ కలిపి రూ.3800. ఎస్సీ, ఎస్టీలకు ఒక పరీక్షకు రూ.1700. రెండు పరీక్షలకూ కలిపి రూ.3100.
పరీక్ష తేదీ: మొదటిది ఏప్రిల్‌ 19, రెండోది మే 31.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, వరంగల్‌, గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.
వెబ్‌సైట్‌: http://www.nata.in/

సన్నద్ధత ఇలా!
* డ్రాయింగ్‌ విభాగంలో ఎక్కువ మార్కులు సొంతం చేసుకోవడానికి సృజనాత్మకమైన ఆకారాలు (చిత్రాలు) గీసే నేర్పు, సునిశిత పరిశీలన, ఆలోచనా నైపుణ్యం ఉండాలి. చిత్ర నైపుణ్యం, ఊహ, పరిశీలన అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. పరీక్షలో అడిగినదానికి సృజనాత్మకతతో ఆకట్టుకునే అర్థవంతమైన రూపాన్ని ఇవ్వాలి. అందంగా గీయగలగడం ఎంత ముఖ్యమో నిర్ణీత ప్రమాణాల మేరకు ఆ రూపం ఉండేలా చూసుకోవడమూ ముఖ్యమే.
* పాత ప్రశ్నపత్రాలను పరిశీలించడం ద్వారా ప్రశ్నల స్వభావాన్ని అర్థం చేసుకోవచ్చు. వీలైనన్ని మాక్‌ పరీక్షలు రాయాలి. మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ ప్రశ్నలకు ఇంటర్‌ పాఠ్యపుస్తకాలు చదువుకుంటే సరిపోతుంది. జనరల్‌ ఆప్టిట్యూడ్‌ విభాగం ప్రశ్నలకు ప్రపంచంలోని వివిధ కట్టడాలు, వాటిని నిర్మించిన విధానం తదితరాలను పరిశీలించాలి. 3డీ, 2డీ చిత్రాలు, ఎనలిటికల్‌ రీజనింగ్‌, మెంటల్‌ ఎబిలిటీ...తదితరాల్లో అవగాహన పెంచుకోవాలి. రీజనింగ్‌ ప్రశ్నలు తర్క నైపుణ్యంపై ఆధారపడి ఉంటాయి.

Back..

Posted on 17-02-2020