Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఎనిమిది ఫెయిలైనా.. ఇంజినీరింగ్‌ పాసైనా..

* నిరంతర ఉపాధికి నిర్మాణరంగం

నిర్మాణరంగంలో ఉపాధి అవకాశాలు నిరంతరం ఉంటాయి. అయితే వాటిని అందుకోడానికి తగిన నైపుణ్యాలను నేర్చుకోవాలి. అలాంటి స్కిల్స్‌కి సంబంధించిన పలు రకాల కోర్సులను హైదరాబాద్‌లోని ‘నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌’ నిర్వహిస్తోంది. ఎనిమిదో తరగతి తప్పిన వాళ్ల నుంచి ఇంజినీరింగ్‌ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ల వరకు అందరూ వీటిని చేయవచ్చు. ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు.

ఎనిమిదో తరగతి ఫెయిలైన శేఖర్‌ కుటుంబ ఆర్థిక సమస్యల కారణంగా చదువు కొనసాగించలేక పోయాడు. ఏదైనా ఉద్యోగం చేసి కుటుంబానికి సాయపడాలనుకున్నాడు. తనకున్న అర్హతతో ఉపాధి పొందే అవకాశాల గురించి తెలియక నిరాశపడుతున్నాడు.

రవి సివిల్‌ ఇంజినీరింగ్‌ చదివి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్లినా పని అనుభవంలేని కారణంగా ఉద్యోగం సంపాదించలేకపోతున్నాడు. ఇలాంటి వారందరి పాలిటా ‘నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌’ వరమనే చెప్పాలి.

సాధారణంగా ఏ కోర్సులో అయినా ప్రవేశాలకు పాసైనవాళ్లనే తీసుకుంటారు. కానీ ఇక్కడ ఎనిమిదో తరగతి ఫెయిల్‌ అయినా, డిగ్రీ ఫెయిలయినా కూడా ప్రవేశానికి అర్హులే. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన అభ్యర్థులకు శిక్షణ పూర్తిగా ఉచితం. జనరల్‌ అభ్యర్థులకు నామమాత్రపు ఫీజుతో ప్రవేశం కల్పిస్తారు. ప్రతినెలా మొదటి, పదహారో తారీకున ప్రవేశాలు మొదలవుతాయి.

ఈ కోర్సుకు ఆదరణ ఎక్కువ...
సివిల్‌ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్స్‌ ప్రోగ్రామ్‌కు ప్రస్తుతం ఎక్కువగా గిరాకీ ఉంది. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీంట్లో శిక్షణ పొందినవారు డబుల్‌ బెడ్‌రూమ్‌ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్నారు. నెలకు 20 వేల నుంచి 25 వేల రూపాయిల వరకూ సంపాదిస్తున్నారు.

స్కిల్‌ ఇండియా సర్టిఫికెట్‌
శిక్షణ పూర్తిచేసిన అభ్యర్థులకు గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా నుంచి ‘స్కిల్‌ ఇండియా సర్టిఫికెట్‌’ లభిస్తుంది. శిక్షణ పూర్తయిన తర్వాత అభ్యర్థులకు పరీక్ష నిర్వహిస్తారు. దిల్లీ నుంచి వచ్చే నిపుణులు వీటిని దిద్దుతారు. వీరు ఇచ్చే ఫలితాల ఆధారంగా అభ్యర్థులకు సర్టిఫికెట్లను అందజేస్తారు. శిక్షణ తర్వాత ఈ సంస్థ అందించే సర్టిఫికెట్‌కు ఎంతో విలువ ఉంటుంది. ఐటీఐ పూర్తిచేసిన ఎంతోమంది అభ్యర్థులు ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నారు. మూడు నెలల కోర్సులో ప్రాక్టికల్‌ శిక్షణ లభిస్తుంది. అంటే అభ్యర్థి ఉపాధి పొందడానికి కావాల్సిన పనిని నేర్చుకోగలుగుతున్నాడు.
* శిక్షణ పూర్తయిన అభ్యర్థికి ఉపాధి చూపించిన తర్వాత మూడు నెలలపాటు ప్రతినెలా వెయ్యి రూపాయలు అభ్యర్థి అకౌంట్‌లో జమ చేస్తారు. ఉద్యోగం వచ్చాక కూడా అభ్యర్థికి చేయూతనివ్వాలనే సదుద్దేశంతో ఇలాంటి ఏర్పాటుచేశారు.
* ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అభ్యర్థులే కాకుండా ఆసక్తి ఉన్న జనరల్‌ అభ్యర్థులు కూడా ఈ సంస్థలో శిక్షణ తీసుకోవచ్చు. ప్రత్యేక విభాగాలకు చెందిన అభ్యర్థులతోపాటు వీరికీ శిక్షణ అందిస్తారు. కాకపోతే జనరల్‌ అభ్యర్థులు నిర్ణీత రుసుం చెల్లించాల్సి ఉంటుంది.
* మరిన్ని వివరాల కోసం 8328622455 లేదా 9395102825లో సంప్రదించవచ్చు.
వెబ్‌సైట్‌: www.nac.edu.in

ఎందరికో ఉపాధి...
గడిచిన నాలుగేళ్లలో ఆరువేలమందికి పైగా సివిల్‌ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు శిక్షణ తీసుకుని ఉద్యోగాలు సాధించారు. ఆర్కియాలజీ, నేషనల్‌ ఫిషరీస్‌ బోర్డ్‌లలో ఉద్యోగాలు పొందినవారు ఉన్నారు. జీహెచ్‌ఎంసీ, డబుల్‌ బెడ్‌రూమ్‌ ప్రాజెక్టుల్లో ఉద్యోగాలు పొందినవారూ ఉన్నారు. టాటా, మైహోమ్‌ ప్రాజెక్టులు, ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్‌లాంటి ప్రముఖ సంస్థల్లో కొందరు ఉద్యోగాలు పొందారు. ప్లంబింగ్‌, వెల్డింగ్‌ పనులలో 150 మంది తెలంగాణ పోలీసులు ఇక్కడ శిక్షణ పొందారు. ఇక్కడ శిక్షణ తీసుకుని దుబాయ్‌లో ఉద్యోగాలు సంపాదించిన వారు 20 మంది వరకూ ఉన్నారు. కొందరు సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి విజయం సాధించారు.

ఏయే విభాగాల్లో శిక్షణ?
సివిల్‌ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్స్‌ ప్రోగ్రామ్‌, వెల్డింగ్‌, పెయింటింగ్‌, ఎలక్ట్రీషియన్‌, ప్లంబింగ్‌, స్టోర్‌ కీపర్‌, జనరల్‌ వర్క్స్‌ సూపర్‌వైజర్‌... ఇలా వివిధ విభాగాల్లో శిక్షణ లభిస్తుంది. శిక్షణ కాలం మూడు నెలలు. ఈ సమయంలో అభ్యర్థికి ఉచిత వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత ఉపాధి చూపిస్తారు.

అవార్డులతో గుర్తింపు
శిక్షణ పొందిన అభ్యర్థికి ఉపాధి భరోసాను కల్పించడం ఎన్‌ఏసీ ప్రత్యేకత. శిక్షణలో భాగంగా అభ్యర్థిని అన్ని విధాలుగానూ తీర్చిదిద్దుతాం. ఈ ప్రత్యేకతల కారణంగానే విశ్వకర్మ అవార్డును వరుసగా అయిదుసార్లు అందుకున్నాం. గోల్డెన్‌ పీకాక్‌ నేషనల్‌ ట్రెయినింగ్‌ అవార్డును రెండుసార్లు గెలుచుకున్నాం. అసోచమ్‌ అవార్డ్‌, బెస్ట్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్స్‌ అవార్డులూ గెలుపొందాం.
- కె.బిక్షపతి, డైరెక్టర్‌ జనరల్‌

శిక్షణలో రికార్డులు
నిర్మాణ రంగంలో ఇప్పటివరకూ సుమారు మూడులక్షల తొంబై వేల మందికి శిక్షణ అందించాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుమారు అరవైరెండు వేలమందికి శిక్షణనిచ్చాం. దేశంలోని ఏడు రాష్ట్రాలు, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్‌ దేశాలకు చెందిన విద్యార్థులు మా సంస్థలో శిక్షణ పొందారు. గడిచిన నాలుగేళ్లలో ఆరువేలమందికి పైగా సివిల్‌ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు మా సంస్థలో శిక్షణ తీసుకుని ఉద్యోగాలు సంపాదించారు.
- ఐ.శాంతిశ్రీ, ట్రెయినింగ్‌, ప్లేస్‌మెంట్‌ డైరెక్టర్‌


Back..

Posted on 13-03-2019