Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 

కోటి కొలువుల కొత్తకారు!

ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకూ ఇంధన భద్రత అతి పెద్ద సమస్యగా మారడంతో ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ మొదలైంది. ఇందులో భాగంగా మన దేశం చాలా ముందు చూపుతో 2013లోనే నేషనల్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ మిషన్‌ ప్లాన్‌ -2020 (ఎన్‌ఈఎంఎంపీ)ని రూపొందించింది. దీనికి సంబంధించి ఇటీవల మరో అడుగు పడింది. ఎలక్ట్రిక్‌ మొబిలిటీ పరిశ్రమకు అవసరమైన వర్క్‌ ఫోర్స్‌పై ఒక బ్లూప్రింట్‌ను మినిస్ట్రీ ఆఫ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఆంత్రప్రిన్యూర్‌షిప్‌ విడుదల చేసింది. దీని ప్రకారం ఈ రంగంలో దాదాపు కోటి ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. అవసరమైన నైపుణ్యాలను పెంచుకుంటే ఆ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.

మన దేశం తన శక్తి అవసరాల కోసం ఎక్కువగా ఆయిల్‌ దిగుమతులపై ఆధారపడుతోంది. 2020 నాటికి ఈ దిగుమతులు 92 శాతానికి చేరతాయని అంచనా. ఇది దేశ ఆర్థికవ్యవస్థపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ మిషన్‌ ప్లాన్‌ - 2020 (ఎన్‌ఈఎంఎంపీ)ని సిద్ధం చేసింది. జాతీయ ఇంధన భద్రతతోపాటు దేశీయంగా విద్యుత్తు ఆధారిత వాహనాల ఉత్పత్తి టెక్నాలజీని పెంచడం ఈ ప్లాన్‌ లక్ష్యాల్లో ప్రధానమైనది. భారత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో కీలకమైన రవాణా రంగం వల్ల శక్తి వినియోగం ఎక్కువైంది. గత పదేళ్లలో ఈ వినియోగం 70 శాతం పెరిగిందని తేలింది. దీంతో పర్యావరణానికి అనుకూలమైన శక్తివనరుల అన్వేషణ ప్రారంభమైంది. రవాణాకు ఉపయోగించే వాహనాల కోసం విద్యుత్తును వినియోగించే టెక్నాలజీని విస్తృతంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2020 నాటికి 70 లక్షల ఎలక్ట్రిక్‌ వాహనాలను రోడ్లపైకి తీసుకురావాలనే లక్ష్యాన్ని నిర్దేశించింది. 2030 నాటికి ఈ-మొబిలిటీని 30 శాతం పెంచాలని భావిస్తోంది. కేంద్రం ప్రకటించిన ఆటోమోటివ్‌ మిషన్‌ ప్లాన్‌ - 2026 ప్రకారం కూడా ఆటోమొబైల్‌ రంగంలో మరో 6.5 కోట్ల ఉద్యోగాలు రానున్నాయి.

పలు విభాగాల్లో..!
ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తి పెరగడం వల్ల డిజైన్‌, టెస్టింగ్‌, బ్యాటరీల ఉత్పత్తి-నిర్వహణ, సేల్స్‌, సర్వీసెస్‌, అడ్మినిస్ట్రేషన్‌, మేనేజ్‌మెంట్‌, కస్టమర్‌ సపోర్టు, మార్కెటింగ్‌ తదితర ఎన్నో రంగాల్లో శ్రామికశక్తి అవసరమవుతుంది. దీనికి సంబంధించి కేంద్ర మంత్రిత్వశాఖ ఒక బ్లూప్రింట్‌ విడుదల చేసింది. మొదట కోటి ఉద్యోగావకాశాలు ఏర్పడతాయని అంచనా వేసింది. బ్లూప్రింట్‌ ప్రకారం వివిధ రకాల విద్యార్హతలు ఉన్న విభిన్న రంగాల నిపుణులు అవసరమవుతారు. ఇంజినీరింగ్‌లో దాదాపు అన్ని బ్రాంచిల వారికి, డిప్లొమాల నుంచి సాధారణ డిగ్రీలు, పీజీల వరకు ఎంతోమందికి రకరకాల ఉద్యోగాలు లభిస్తాయి. ఎలక్ట్రిక్‌ వాహనాల టెక్నాలజీ పరిశోధన, ఉత్పత్తి కార్మికులు, రిపేర్లు చేసే టెక్నీషియన్లు తదితరుల అవసరాలు పెరుగుతాయి.

ఏయే సంస్థలు?
ప్రపంచవ్యాప్తంగా అన్ని ఆటోమొబైల్‌ కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తికి రంగం సిద్ధం చేస్తున్నాయి. వోక్స్‌ వ్యాగన్‌ 2030 విద్యుత్తు వాహనాలను మార్కెట్‌లోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇందుకోసం 2400 కోట్ల డాలర్లను కేటాయించింది. పోర్షా, లాంబార్గిని, బ్యుగాటీ, ఆడీ, స్కోడా తదితర కంపెనీలు 2025 నాటికి ఎలక్ట్రిక్‌ కార్లను, 2030 నాటికి అన్ని రకాల ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తికి సిద్ధమవుతున్నాయి. టొయోటా మోటార్స్‌, నిస్సాన్‌, వోల్వో వంటి కంపెనీలూ వీటిపై దృష్టిసారించాయి. టెల్సా అనే అమెరికన్‌ కంపెనీ 2017లో పదివేల ఎలక్ట్రిక్‌ కార్లను చైనాలో విక్రయించింది. హోండా, యమహా వంటి కంపెనీలు విద్యుత్తు ద్విచక్ర వాహనాల తయారీకి ప్లాన్‌ చేస్తున్నాయి. టాటా ఎవిజన్‌ 2019 సెప్టెంబరు నాటికి ఈవీలను మార్కెట్‌లోకి విడుదల చేయాలని భావిస్తోంది. వర్క్‌హార్స్‌, ఈ-ఫోర్స్‌ సంస్థలు ఎలక్ట్రిక్‌ ట్రక్‌ను ఉత్పత్తి చేయనున్నాయి. మైక్రోమాక్స్‌ వంటి మొబైల్‌ సంస్థలు కూడా ఈ వాహనాలకు అవసరమైన బ్యాటరీల ఉత్పత్తికి సిద్ధమవుతున్నాయి. దీంతో లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే విద్యుత్తు వాహనాల చార్జింగ్‌ కోసం స్టేషన్లను ఏర్పాటు చేస్తారు. వీటిలోనూ ఉపాధి లభిస్తుంది. మన దేశంలోని పలు నగరాల్లో ఎలక్ట్రిక్‌ కార్లను నడపాలని మహీంద్ర అండ్‌ మహీంద్ర కంపెనీ ఊబర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మొదట దిల్లీ, హైదరాబాద్‌ల్లోనే వీటిని ప్రారంభిస్తారు.

ఎలాంటి ఉద్యోగాలు?
కెమికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఇండస్ట్రియల్‌, మెటీరియల్స్‌, మెకానికల్‌ ఇంజినీర్లు, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ టెక్నీషియన్‌, మెకానికల్‌ డ్రాఫ్టర్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, కమర్షియల్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ ఇంజినీర్‌, థర్మల్‌ ఇంజినీర్‌, ఎంబెడెడ్‌ ఇంజినీర్‌, వెహికల్‌ స్టిమ్యులేషన్‌ ఇంజినీర్‌, డిజైన్‌ ఇంజినీర్‌, క్వాలిటీ కంట్రోల్‌, ప్రోటో డెవలప్‌మెంట్‌ ఇంజినీర్‌, ఆర్కిటెక్ట్‌ అండ్‌ ఇంటిగ్రేషన్‌ ఇంజినీర్‌, టెస్టింగ్‌ ఇంజినీర్‌ ఇలా పలు రకాల ఇంజినీర్లు ఎలక్ట్రికల్‌ వాహనాల ఉత్పత్తిలో అవసరమవుతారు. ఆయా బ్రాంచిలు చదివిన వారందరూ ఈ ఉద్యోగాలకు అర్హులే. వీటితోపాటు బ్యాటరీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ఇంజినీర్‌, బ్యాటరీ అల్గారిథమ్స్‌ ఇంజినీర్‌, బ్యాటరీ సేఫ్టీ ఇంజినీర్‌, పవర్‌ ట్రెయిన్‌ ఇంజినీర్‌, డేటా అనలిటిక్స్‌ ఇంజినీర్‌ మొదలైనవారు కూడా ఈ రంగంలో భాగస్వాములుగా ఉంటారు. వీటన్నింటికీ వివిధ బ్రాంచిల ఇంజినీరింగ్‌ విద్యార్థులు అర్హులవుతారు.
ఎలక్ట్రికల్‌ విద్యార్థులకు ఆన్‌బోర్డ్‌ చార్జర్‌, మోటర్‌ కంట్రోలర్‌ మోటర్‌ డిజైన్‌, సిమ్యులేషన్‌ రంగాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. బ్యాటరీ ప్యాక్‌, సెల్‌ డిజైన్‌కి సంబంధించిన వాటికి కెమికల్‌ ఇంజినీర్ల సేవలు అవసరం. కారులోని వివిధ భాగాల్లో ఉత్పత్తి అయ్యే ఉష్ణ నిర్వహణ, నియంత్రణలకు సంబంధించి థర్మల్‌ ఇంజినీర్లు (మెకానికల్‌లో ఒక స్పెషలైజేషన్‌), వివిధ విడిభాగాల తయారీలో మెకానికల్‌ ఇంజినీర్ల పాత్ర ఉంటుంది. హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌కి ఎంబెడెడ్‌ ఇంజినీర్లు అవసరమవుతారు. ఎలక్ట్రిక్‌ వెహికల్‌ లాంటి ఒక వస్తువు తయారీలో కంప్యూటర్‌ ఎయిడెడ్‌ ఇంజినీర్లు మొదలు ఇంతమంది నిపుణులు పనిచేయడం ఒక రకంగా రికార్డుగా చెప్పుకోవచ్చు.

ఏ కోర్సులు.. ఎక్కడ చేయాలి?
ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తికి సంబంధించిన ఇంజినీరింగ్‌ కోర్సులు చాలా వరకు ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర ప్రముఖ సంస్థలతోపాటు అన్ని ఇంజినీరింగ్‌ కాలేజీల్లో అందుబాటులో ఉన్నాయి. సేల్స్‌, మేనేజ్‌మెంట్‌, అకౌంటింగ్‌, అడ్మినిస్ట్రేషన్‌ తదితర విభాగాలకు అవసరమైన డిగ్రీలు, పీజీలు, డిప్లొమా కోర్సులు అంతటా అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు నేషనల్‌ ప్రోగ్రామ్‌ ఆన్‌ టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్‌ లర్నింగ్‌ (ఎన్‌పీటీఈఎల్‌), నీతిఆయోగ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ మొబిలిటీ విజన్‌ - 2030 స్కిల్‌ పార్టనర్‌ డిఐవైగురు (డూ ఇట్‌ యువర్‌సెల్ఫ్‌), అడ్వాన్స్‌డ్‌ ఎలక్ట్రికల్‌ డిజైన్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌, కాంపిటెన్సెస్‌ ఫ్యాక్టరీ, ఆటోబోట్‌ ఇండియా, యూడెమీ తదితర ఎన్నో సంస్థలు ఆన్‌లైన్‌లో పలు రకాల సర్టిఫికేషన్‌, ఇతర కోర్సులను అందిస్తున్నాయి. వీటిని చేసిన వారికి కూడా ఉద్యోగాలు లభిస్తాయి. ఫీజులు, కోర్సుల కాలవ్యవధి తదితర వివరాల కోసం ఆయా వెబ్‌సైట్లను చూడవచ్చు.
* https://nptel.ac.in/courses/108103009/
* https://www.diyguru.org/course/electric-vehicle/
* https://www.advanceelectricaldesign.com/Electric-vehicle(EV)-design-training
* http://www.competencesfactory.com/
* https://www.edu.autobotindia.com/workshop/electric-vehicle-development/
* https://www.udemy.com/electric-vehicletechnology-certificate-program-part-1/


Back..

Posted on 23-07-2019