Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
నవోదయల్లో తొమ్మిదిలోకి ఎంట్రీ

     ఉత్తమ పాఠశాల విద్యను ఉచితంగా అందించే విద్యాలయాలుగా జవహర్‌ నవోదయలు దేశవ్యాప్త ఖ్యాతి గడించాయి. వీటిలో ప్రవేశం లభిస్తే విద్యార్థులు నిశ్చింతగా చదువుకోవడమే కాకుండా వారిలోని ప్రతిభ, సృజనాత్మకతలకు మరింత మెరుగులద్దవచ్చు. సీబీఎస్‌ఈ సిలబస్‌లో బోధిస్తారు. వసతి, భోజనం మొదలైనవన్నీ ఉంటాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఖాళీ సీట్ల భర్తీకి నవోదయ విద్యాసమితి ప్రకటన విడుదల చేసింది. ఆ వివరాలు చూద్దాం...
దేశవ్యాప్తంగా (తమిళనాడు తప్ప) దాదాపు ప్రతి జిల్లాలోనూ ఈ విద్యాసంస్థలను నెలకొల్పారు. ఆరో తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఇక్కడ విద్య అందిస్తారు. నిధులన్నీ పూర్తిగా కేంద్రమే భరిస్తుంది. కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నవోదయ విద్యా సమితి పనిచేస్తుంది. ఆరో తరగతిలో చేరిన విద్యార్థులు మధ్యలో వైదొలిగితే ఆ ఖాళీలను తొమ్మిదో తరగతిలో భర్తీ చేస్తారు. ఇందుకోసం ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు లేటరల్‌ ఎంట్రీ విధానంలో ప్రవేశపరీక్ష రాసుకోవచ్చు.
నవోదయల్లో కో ఎడ్యుకేషన్‌ విధానం అమలులో ఉంది. ఒకే తరగతి గదిలో విద్యార్థులు చదువుకుంటారు. బాలబాలికలకు వేర్వేరుగా వసతి సౌకర్యాలు కల్పిస్తారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులతోపాటు దారిద్య్రరేఖకు దిగువున ఉన్న విద్యార్థినీవిద్యార్థులకు బోధనతోపాటు వసతి, భోజనం, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అన్నీ ఉచితంగానే అందిస్తారు. ప్రభుత్వోద్యోగుల పిల్లలైతే ఇందుకోసం ప్రతి నెలా రూ.1500 చొప్పున చెల్లించాలి. మిగిలినవారు ప్రతినెలా రూ.600 చెల్లిస్తే సరిపోతుంది.
నాణ్యమైన ఆధునిక విద్యను అందించడం నవోదయ విద్యాలయాల ప్రత్యేకత. చదువులకే పరిమితం కాకుండా విద్యార్థులకు పరిసరాలపై అవగాహన కల్పిస్తారు. సంస్కృతి, విలువలు పెంపొందేలా చేస్తారు. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌కు ప్రాధాన్యం ఉంటుంది. అలాగే ప్రతి విద్యార్థీ మూడు భాషల్లో రాణించేలా కృషి చేస్తారు. ఇందుకోసం హిందీ రాష్ట్రాల్లో చదువుతున్న విద్యార్థులను ఇతర రాష్ట్రాలకు అలాగే ఇతరులను హిందీ రాష్ట్రాలకు పంపుతారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 626 నవోదయలు ఉన్నాయి. వీటిలో చేరినవారు ప్లస్‌ 2 (ఇంటర్మీడియట్‌) వరకు చదువుకోవచ్చు.
ఖాళీల వివరాలు
* ఆంధ్రప్రదేశ్‌లో: చిత్తూరు-9, తూర్పు గోదావరి -11, పశ్చిమ గోదావరి- 8, గుంటూరు- 13, కడప-7, కృష్ణా-9, కర్నూలు-2, నెల్లూరు-6, ప్రకాశం-12, శ్రీకాకుళం-3, విశాఖపట్నం-4, విజయనగరం-5
* తెలంగాణలో: ఆదిలాబాద్‌- 2, కరీంనగర్‌- 7, ఖమ్మం-7, మహబూబ్‌ నగర్‌-7, మెదక్‌ -6, నల్గొండ- 6, నిజామాబాద్‌-9, రంగారెడ్డి-5, వరంగల్‌-2.
* ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్‌ 5
* పరీక్ష తేదీ: మే 19 (శనివారం). నవోదయ విద్యా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు.
* వెబ్‌సైట్‌: http://nvshq.org
ప్రశ్నపత్రం ఇలా...
వంద మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో ఇంగ్లిష్‌ నుంచి 15, హిందీ నుంచి 15, మ్యాథ్స్‌ నుంచి 35, సైన్స్‌ నుంచి 35 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలన్నీ ఎనిమిదో తరగతి స్థాయిలో ఉంటాయి. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌/ హిందీ మాధ్యమాల్లో ఉంటుంది.

posted on 12.03.2018