Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
మేటి చ‌దువుల‌కు న‌వోద‌య విద్యాల‌యాలు

ప్రభుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దువుతున్న గ్రామీణ ప్రాంత విద్యార్థుల‌కు జ‌వ‌హ‌ర్ న‌వోద‌యలు వ‌రంగా చెప్పుకోవ‌చ్చు. ఒక‌సారి ఎంపికైతే చాలు ప్లస్ 2 (ఇంట‌ర్‌) వ‌ర‌కు చ‌దువు, వ‌స‌తి, భోజ‌నం అంతా ఉచితమే. బోధ‌న‌లో ఉన్నత ప్రమాణాలు అనుస‌రించ‌డం న‌వోద‌య విద్యాల‌యాల ప్రత్యేక‌త‌. ప్రస్తుతం అయిదో త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థులు ప్రవేశ ప‌రీక్ష ద్వారా ఆరో త‌ర‌గ‌తి నుంచి న‌వోద‌య‌ల్లో చ‌దువుకోవ‌చ్చు. న‌వోద‌య ప్రక‌ట‌న‌కు సంబంధించి పూర్తి స‌మాచారం తెలుసుకుందాం.

ఒక్కో న‌వోద‌య విద్యాల‌యంలో గ‌రిష్ఠంగా 80 మంది వ‌ర‌కు ప్రవేశం ల‌భిస్తుంది. ఏపీలో 13, తెలంగాణ‌లో 9 న‌వోద‌య విద్యాల‌యాలు ఉన్నాయి. ఏపీకి కొత్తగా మ‌రో రెండు న‌వోద‌య‌ల‌ను కేటాయించారు. 2017-18 విద్యా సంవ‌త్సరంలో అయిదో త‌ర‌గ‌తి చ‌దువుతున్నవాళ్లే ఈ ప‌రీక్షకు అర్హులు. అభ్యర్థులు ప్రవేశం కోరే జిల్లాలో ప్రస్తుత విద్యా సంవ‌త్సరంలో చ‌దువున్నవారై ఉండాలి. విద్యార్థులు కేవ‌లం ఒక‌సారి మాత్రమే ప్రవేశ ప‌రీక్ష రాయ‌డానికి అర్హులు. గ్రామీణ ప్రాంత కోటాలో సీటు ఆశించే విద్యార్థులు 3,4,5 త‌ర‌గ‌తుల‌ను పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠ‌శాల‌లో చ‌ద‌వాలి. క‌నీసం 75 శాతం సీట్లను గ్రామీణ ప్రాంతంలో చ‌దివిన విద్యార్థుల‌కే కేటాయిస్తారు. తెలుగు మాధ్యమంలోనూ ప‌రీక్షను రాసుకోవ‌చ్చు.

ప‌రీక్ష విధానం:
మొత్తం 100 మార్కుల‌కు రాత‌ప‌రీక్ష నిర్వహిస్తారు. మూడు సెక్షన్లలో 100 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఉంటాయి. వీటిని 2 గంట‌ల్లో పూర్తిచేయాలి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. సెక్షన్‌-1 మెంట‌ల్ ఎబిలిటి 50 ప్రశ్నలు ఉంటాయి. వీటికి ఒక గంట స‌మ‌యం కేటాయించారు. సెక్షన్ -2 అరిథ్‌మెటిక్ 25 ప్రశ్నలు వ‌స్తాయి. వీటిని 30 నిమిషాల్లో పూర్తిచేయాలి. సెక్షన్‌-3 లాంగ్వేజ్ టెస్ట్‌ 25 ప్రశ్నలు ఉంటాయి వీటికి వ్యవ‌ధి అర గంట‌. స‌మాధానాలు గుర్తించ‌డానికి ప్రత్యేక ప‌త్రాన్ని ఇస్తారు. బ్లాక్ లేదా బ్లూ పెన్ను ఉప‌యోగించి స‌రైన ఆప్షన్ బాక్స్‌ను మార్కు చేయాలి.

ప్రశ్నలు ఇలా..
మెంట‌ల్ ఎబిలిటీ ప‌రీక్షలో చిత్రాలు, రేఖ‌లు, బొమ్మల‌పై ప్రశ్నలు వ‌స్తాయి. ఈ సెక్షన్‌ను ప‌ది పేరాల‌గా విభ‌జించారు. ఒక్కో పేరాలో అయిదేసి చొప్పున ప్రశ్నలు వ‌స్తాయి. ప్రశ్నల్లో కొన్ని బొమ్మలు ఇచ్చి వాటిలో భిన్నమైన‌ది గుర్తించ‌మ‌నడం, ఒక అసంపూర్ణ చిత్రం లేదా గ్రాఫ్ ఇచ్చి అది సంపూర్ణం కావ‌డానికి ఇచ్చిన ఆప్షన్లలో ఏది స‌రిపోతుందో పోల్చమ‌న‌డం, చిత్రాలు/ బొమ్మల క్రమాన్ని ఇచ్చి త‌ర్వాత వ‌చ్చే దాన్ని గుర్తించ‌మ‌న‌డం త‌ర‌హా ప్రశ్నలు వ‌స్తాయి. అరిథ్‌మెటిక్ ప‌రీక్షలో అంకెలు, క‌సాగు, గ‌సాభా, వ‌డ్డీలు, ద‌త్తాంశాలు, భిన్నాలు, లాభ‌న‌ష్టాలు, నాలుగంకెల్లో ఉండే కూడిక‌లు, తీసివేత‌లు, గుణ‌కారాలు, భాగాహారాలు...మొద‌లైన ప్రశ్నలు వ‌స్తాయి. లాంగ్వేజ్ టెస్టులో పాసేజ్ ఇచ్చి ప్రశ్నల‌కు స‌మాధానం రాయ‌మంటారు. విద్యార్థులు పాసేజ్ అర్థం చేసుకున్నారో లేదో తెలుసుకునేలా ఈ ప్రశ్నలు వ‌స్తాయి. ప్రతి పాసేజ్‌కూ అయిదేసి ప్రశ్నలు చొప్పున 5 పాసేజ్‌లు ఉంటాయి.

ఎంపికైతే...
ఆరో త‌ర‌గ‌తి నుంచి +2 వ‌ర‌కు ఉచితంగా చ‌దువుకోవ‌చ్చు. వ‌స‌తి, భోజ‌నం అన్నీ ఉచిత‌మే. ఉన్నత బోధ‌నా ప్రమాణాలు న‌వోద‌య విద్యాల‌యాల సొంతం. సీబీఎస్ఈ సిల‌బ‌స్ బోధిస్తారు. విద్యార్థులు స‌ర్వతోముఖాభివృద్ధికి అవ‌కాశం ఉంటుంది. వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యమిస్తారు. ఇక్కడ చ‌దువు పూర్తిచేసుకున్న విద్యార్థులు జాతీయ స్థాయి ప‌రీక్షల్లో రాణించ‌డానికి అవ‌కాశాలుంటాయి. ఆస‌క్తి ఉన్న విద్యార్థులు పై త‌ర‌గ‌తుల‌ను ఇత‌ర రాష్ట్రాల్లోని న‌వోద‌య విద్యాల‌యాల్లో చదువుకోవ‌చ్చు.

అర్హత‌: 2017-2018 విద్యా సంవత్సరానికి 5వ తరగతి చదువుతూ ఉండాలి.
వయసు: 01.05.2005 - 3.04.2009 మధ్య జన్మించిన వారు దరఖాస్తుకు అర్హులు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 25.11.2017.
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ విద్యార్థుల‌కు ప‌రీక్ష తేదీ: 10.02.2018

నోటిఫికేష‌న్‌ వెబ్‌సైట్‌

Back..

Posted on 26-09-2017