Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఉచితంగా బీటెక్‌తోపాటు నేవీలో స‌బ్ లెప్టినెంట్ ఉద్యోగం

10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీంతో అవ‌కాశం
ఇంట‌ర్ ఎంపీసీ విద్యార్థుల‌కు వ‌రం

10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ స్కీం ద్వారా ఇంట‌ర్ ఎంపీసీ విద్యార్థుల‌కు అద్భుత అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది ఇండియ‌న్ నేవీ. ఈ విధానంలో ఎంపికైన‌వారు కేర‌ళ‌లోని నేవ‌ల్ అకాడెమీ, ఎజిమాల‌లో ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్ లేదా మెకానిక‌ల్ బ్రాంచీల్లో నాలుగేళ్లపాటు ఇంజినీరింగ్ విద్యను ఉచితంగా చ‌దువుకోవ‌చ్చు. భోజ‌నం, వ‌స‌తి, పుస్తకాలు, దుస్తులు అన్నీ ఉచితమే. అనంత‌రం స‌బ్ లెప్టినెంట్ హోదాతో నెల‌కు సుమారు రూ.74 వేల వేత‌నంతో నేవీలోనే ఉద్యోగిగా కొన‌సాగ‌వ‌చ్చు. నోటిఫికేష‌న్‌కు సంబంధించి పూర్తి స‌మాచారం తెలుసుకుందాం.

ఎంపిక ఇలా:
ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్యర్థుల‌ను ఇంట‌ర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ మార్కులు లేదా జేఈఈ-2016 రాసిన‌ట్లైతే అందులో సాధించిన ర్యాంకు ద్వారా షార్ట్‌లిస్టు చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల‌ను స‌ర్వీసెస్ సెల‌క్షన్ బోర్డు (ఎస్ఎస్‌బీ)... బెంగ‌ళూరు, భోపాల్‌, కోయంబ‌తూర్‌, విశాఖ‌ప‌ట్నంల్లో ఏదోఒక చోట ఫిబ్రవ‌రి- ఏప్రిల్ మ‌ధ్య కాలంలో ఇంట‌ర్వ్యూలు నిర్వహిస్తుంది. వీటిని రెండు ద‌శ‌ల్లో చేప‌డ‌తారు. మొత్తం 5 రోజుల పాటు ఇంటర్వ్యూలు కొన‌సాగుతాయి. తొలిరోజు స్టేజ్-1 ప‌రీక్షను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఇంటెలిజెన్స్ టెస్టు, పిక్చ‌ర్ పెర్సెప్షన్‌ టెస్టు, గ్రూప్ డిస్కష‌న్ ఉంటాయి. ఇందులో అర్హత సాధించిన‌వారికి మిగిలిన 4 రోజుల పాటు స్టేజ్‌-2 ఇంట‌ర్వ్యూలు కొన‌సాగుతాయి.. దీనిలో భాగంగా సైక‌లాజిక‌ల్ ప‌రీక్షలు, గ్రూప్ ప‌రీక్షలు, ముఖాముఖి నిర్వహిస్తారు. ఇందులోనూ అర్హత సాధిస్తే ఫిజిక‌ల్ టెస్టు (ఎత్తు, బరువు), వైద్య ఆరోగ్య ప‌రీక్షలు నిర్వహించి తుదిద‌శ నియామ‌కాలు చేప‌డ‌తారు.

శిక్షణ‌..
జులై 2017 నుంచి ఎంపికైన‌వారికి శిక్షణ త‌ర‌గ‌తులు ప్రారంభ‌వుతాయి. అభ్యర్థులు ఇండియ‌న్ నేవ‌ల్ అకాడెమీ, ఎజిమాల (కేర‌ళ‌)లో బీటెక్ ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్ లేదా మెకానిక‌ల్ ఇంజినీరింగ్ విద్యను నాలుగేళ్లపాటు అభ్యసిస్తారు. విజ‌య‌వంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారికి జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ యూనివ‌ర్సిటీ (జేఎన్‌యూ)-న్యూదిల్లీ డిగ్రీని ప్రదానం చేస్తుంది. కోర్సు ఫీజు, భోజ‌నం, వ‌స‌తి, దుస్తులు..ఈ ఖ‌ర్చుల‌న్నీ నేవీ భ‌రిస్తుంది. కోర్సు అనంత‌రం స‌బ్ లెఫ్టినెంట్ హోదాతో అభ్యర్థులు నేవీలో విధుల్లోకి చేర‌తారు. ఈ స‌మ‌యంలో అన్నీ క‌లుపుకుని నెల‌కు రూ.74 వేల‌కు పైగా వేత‌నంగా పొంద‌వ‌చ్చు.

విద్యార్హత‌: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ల్లో 70 శాతం మార్కుల‌తో ఇంట‌ర్ ఉత్తీర్ణత‌. దీంతోపాటు ప‌దోత‌ర‌గ‌తి లేదా ఇంట‌ర్ ఇంగ్లిష్‌లో క‌నీసం 50 శాతం మార్కులు సాధించాలి.
వ‌యోప‌రిమితి: 17 - 19 1/2 ఏళ్ల మ‌ధ్యలో ఉండాలి. అంటే జ‌న‌వ‌రి 2, 1998 - జులై 1, 2000 మ‌ధ్య జ‌న్మించిన‌వారే అర్హులు.
ఇత‌ర అర్హత‌లు: ఈ పోస్టుల‌కు అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఎత్తు క‌నీసం 157 సెం.మీ. ఉండాలి. ఎత్తుకు త‌గ్గ బ‌రువు త‌ప్పనిస‌రి.

ద‌ర‌ఖాస్తులు
ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అనంత‌రం రెండు సెట్ల ప్రింట‌వుట్లు తీసుకోవాలి. ఒక సెట్ ప్రింట‌వుట్‌ను రిఫ‌రెన్స్ కోసం ఉంచుకోవాలి. మ‌రో సెట్ ప్రింట‌వుట్‌పై సంత‌కం చేయాలి. దీన్ని Post box no-4, Nirman Bhavan, New Delhi- 110011 చిరునామాకి పంపాలి.

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్‌కు చివ‌రి తేదీ: జ‌న‌వ‌రి 2
ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు చివ‌రి తేదీ: జ‌న‌వ‌రి 12

వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in

నోటిఫికేష‌న్‌


Back..

Posted on 20-12-2016