Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
నేవీలో యూనివ‌ర్సిటీ ఎంట్రీ స్కీం ఉద్యోగాలు

- బీటెక్ విద్యార్థుల‌కు అవ‌కాశం
- స‌బ్ లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగం
- రూ.72,000 ఆరంభ వేత‌నం

బీటెక్ చివ‌రి సంవ‌త్సరం, ఇంటిగ్రేటెడ్ బీటెక్ + ఎంటెక్ చివ‌రి ఏడాది కోర్సులు చ‌దువుతున్న విద్యార్థుల‌కు భార‌తీయ నౌకాద‌ళం ఆహ్వానం ప‌లుకుతోంది. వివిధ ఇంజినీరింగ్ బ్రాంచీల‌వారికి ఎగ్జిక్యూటివ్‌, టెక్నిక‌ల్ బ్రాంచ్‌ల్లో ప‌ర్మనెంట్‌, షార్ట్ స‌ర్వీస్ క‌మిషన్ విభాగాల్లో ఉద్యోగాలు క‌ల్పిస్తుంది. బీటెక్‌లో క‌నీసం 60 శాతం మార్కులు సాధించిన‌వాళ్లు ఈ పోస్టుల‌కు పోటీప‌డ‌వ‌చ్చు. బీటెక్ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల‌కు క్యాంప‌స్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన‌వారికి ఎస్ఎస్‌బీ ముఖాముఖి చేప‌డుతుంది. ఎంపికైతే శిక్షణ అనంత‌రం రూ.72 వేల‌కు పైగా వేత‌నంతో స‌బ్ లెఫ్టినెంట్ ఉద్యోగం సొంత‌మ‌వుతుంది. ఇండియ‌న్ నేవీ యూనివ‌ర్సిటీ ఎంట్రీ స్కీం (యూఈఎస్‌) గురించి వివ‌రంగా తెలుసుకుందాం...

ఎవ‌రు అర్హులు..
అభ్యర్థులు ఇంజినీరింగ్ (బీఈ/ బీటెక్‌) నాలుగో సంవ‌త్సరం లేదా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అయిదో సంవ‌త్సరం కోర్సు చ‌దువున్నవారై ఉండాలి. ఇప్పటి వ‌ర‌కు 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.

ఖాళీలు ఎక్కడ‌...
ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌, టెక్నిక‌ల్ బ్రాంచ్‌ల్లో అవ‌కాశాలు ఉంటాయి.

ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్:
ఇందులో జ‌న‌ర‌ల్ స‌ర్వీస్ (ఎక్స్‌), ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల‌ర్‌, ఐటీ అనే మూడు విభాగాలు ఉన్నాయి.

జ‌న‌ర‌ల్ స‌ర్వీస్ (ఎక్స్‌) : బీఈ/ బీటెక్ ఏ బ్రాంచీ విద్యార్థులైనా జ‌న‌ర‌ల్ సర్వీస్ (ఎక్స్‌) ఉద్యోగానికి అర్హులు. అయితే పురుషులు మాత్రమే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. పెర్మనెంట్ క‌మిష‌న్‌, షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ రెండు విభాగాల్లోనూ అవ‌కాశాలు ఉంటాయి.

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల‌ర్: బీఈ/ బీటెక్ ఏ బ్రాంచి విద్యార్థులైనా ఈ పోస్టుకు అర్హులే. మ‌హిళ‌లు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అయితే ఇంజినీరింగ్‌తోపాటు ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్‌లో కూడా క‌నీసం 60 శాతం మార్కులు సాధించడం త‌ప్పనిస‌రి. అలాగే ఇంట‌ర్ ఇంగ్లిష్‌లో 60 శాతం మార్కులు ఉండాలి. ఈ పోస్టుకు ఎంపికైన‌వారికి షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ విధానంలో ఉద్యోగాలు ఉంటాయి.

ఐటీ: క‌ంప్యూట‌ర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీ ఇంజినీరింగ్ చ‌దివిన‌వాళ్లు ఐటీ విభాగం పోస్టుల‌కు అర్హులు. మ‌హిళ‌ల‌కు అవ‌కాశం లేదు. షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ లో ఈ పోస్టులు భ‌ర్తీ చేస్తారు.

టెక్నిక‌ల్ బ్రాంచ్: ఇందులోనూ ఇంజినీరింగ్ బ్రాంచ్, ఎల‌క్ట్రిక‌ల్ బ్రాంచ్, నేవ‌ల్ ఆర్కిటెక్చర్ అనే మూడు విభాగాలు ఉన్నాయి. పోస్టుల‌ను షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ విధానంలో భ‌ర్తీ చేస్తారు.

ఇంజినీరింగ్ బ్రాంచ్: మెకానిక‌ల్‌, మెరైన్‌, ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌, ప్రొడ‌క్షన్‌, ఏరోనాటిక‌ల్‌, ఇండ‌స్ట్రియ‌ల్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్‌, కంట్రోల్ ఇంజినీరింగ్‌, ఏరోస్పేస్‌, ఆటోమొబైల్స్‌, మెట‌ల‌ర్జీ, మెక‌ట్రోనిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేష‌న్ అండ్ కంట్రోల్ వీటిలో ఏదైనా విభాగం విద్యార్థులు ఇంజినీరింగ్ బ్రాంచ్ పోస్టుల‌కు అర్హులు. ఈ పోస్టుల‌కు పురుషులు మాత్రమే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఎల‌క్ట్రిక‌ల్ బ్రాంచ్‌: ఎల‌క్ట్రిక‌ల్‌, ఎల‌క్ట్రానిక్స్‌, టెలీ క‌మ్యూనికేష‌న్స్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్‌, ప‌వ‌ర్ ఇంజినీరింగ్‌, కంట్రోల్ సిస్టమ్ ఇంజినీరింగ్‌, ప‌వ‌ర్ ఎల‌క్ట్రానిక్స్‌, ఏవియానిక్స్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌, ఇన్‌స్ట్రుమెంటేష‌న్ అండ్ కంట్రోల్ విభాగాల్లో ఎందులోనైనా ఇంజినీరింగ్ చ‌దివిన‌వాళ్లు అర్హులు. పురుషులు మాత్రమే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

నేవ‌ల్ ఆర్కిటెక్చ‌ర్ (ఎన్ఏ): మెకానిక‌ల్‌, సివిల్‌, ఏరోనాటిక‌ల్‌, ఏరోస్పేస్‌, మెట‌ల‌ర్జీ, నేవ‌ల్ ఆర్కిటెక్చర్‌, ఓషియ‌న్ ఇంజినీరింగ్‌, మెరైన్ ఇంజినీరింగ్‌, షిప్ టెక్నాల‌జీ, షిప్ బిల్డింగ్‌, షిప్ డిజైన్ ఈ విభాగాల్లో ఎందులోనైనా ఇంజినీరింగ్ చ‌దివిన‌వాళ్లు నేవల్ ఆర్కిటెక్చర్ పోస్టుల‌కు అర్హులు. మ‌హిళ‌లు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

వ‌యోప‌రిమితి: జులై 2, 1994 - జులై 1, 1997 మ‌ధ్య జ‌న్మించిన‌వాళ్లే అర్హులు.

ఎంపిక విధానం..
ముందుగా ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్యర్థుల‌ను బీటెక్ అయిదో సెమిస్టర్ / ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఏడో సెమిస్టర్ వ‌ర‌కు సాధించిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఇలా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల‌కు నేవ‌ల్ క్యాంపస్ సెల‌క్షన్ టీం ఇంట‌ర్వ్యూలు నిర్వహిస్తుంది. ఇందులో ఎంపికైన‌వారికి స‌ర్వీస్ సెల‌క్షన్ బోర్డు (ఎస్ఎస్‌బీ) ఇంట‌ర్వ్యూలు చేప‌డుతుంది. బెంగ‌ళూరు, భోపాల్‌, కోయంబ‌త్తూర్‌, విశాఖ‌ప‌ట్నంల్లో డిసెంబ‌రు - ఏప్రిల్ మ‌ధ్యలో ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూలు ఉంటాయి. ఈ కేంద్రాల్లో అభ్యర్థుల‌కు అయిదు రోజుల‌పాటు ఇంట‌ర్వ్యూలు కొన‌సాగుతాయి. వీటిని రెండు ద‌శ‌ల్లో చేప‌డ‌తారు. తొలిరోజు స్టేజ్-1 ప‌రీక్షను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఇంటెలిజెన్స్ టెస్టు, పిక్చర్ పెర్సెప్షన్‌ టెస్టు, గ్రూప్ డిస్కష‌న్ ఉంటాయి. ఇందులో అర్హత సాధించిన‌వారికి మిగిలిన 4 రోజుల పాటు స్టేజ్‌-2 ఇంట‌ర్వ్యూలు కొన‌సాగుతాయి. దీనిలో భాగంగా సైక‌లాజిక‌ల్ ప‌రీక్షలు, గ్రూప్ ప‌రీక్షలు, ముఖాముఖి నిర్వహిస్తారు. ఇందులోనూ అర్హత సాధిస్తే వైద్య ప‌రీక్షలు నిర్వహించి ఉద్యోగానికి ఎంపిక‌చేస్తారు.

ఎంపికైతే...
యూఈఎస్ విధానంలో ఎంపికైన అభ్యర్థుల‌కు ఇండియ‌న్ నేవ‌ల్ అకాడెమీ - ఎజిమాల‌లో వ‌చ్చే ఏడాది జూన్ నుంచి శిక్షణ మొద‌ల‌వుతుంది. అభ్యర్థులు శిక్షణ‌లో చేరేట‌ప్పటికి బీటెక్ లేదా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ 60 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణత సాధించ‌డం త‌ప్పనిస‌రి. అభ్యర్థుల‌కు 22 వారాల‌పాటు శిక్షణ కొన‌సాగుతుంది. జ‌న‌ర‌ల్ స‌ర్వీస్‌కు ఎంపికైన‌వారికి ఈ శిక్షణ వ్యవ‌ధి 44 వారాలు. శిక్షణ స‌మ‌యంలో అభ్యర్థుల‌కు స్టైపెండ్ చెల్లిస్తారు. విజ‌య‌వంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని స‌బ్ లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగంలోకి తీసుకుంటారు. ప‌ర్మనెంట్ క‌మిష‌న్ విదానంలో ఎంపికైన‌వాళ్లు ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు వ‌చ్చేంత వ‌ర‌కు ఉద్యోగంలో కొన‌సాగ‌వ‌చ్చు. అదే షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ విధానంలో ఎంపికైతే గ‌రిష్ఠంగా 14 ఏళ్లపాటు స‌ర్వీస్‌లో కొన‌సాగుతారు. అభ్యర్థులు ఎంచుకున్న విభాగాన్ని బ‌ట్టి ప్రతి నెల సీటీసీ రూపంలో రూ.72,000 నుంచి 81,000 వ‌ర‌కు వేత‌నం పొంద‌వ‌చ్చు. ఇత‌ర ప్రోత్సాహ‌కాలూ అందుకోవ‌చ్చు.

ద‌ర‌ఖాస్తులు: ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఒక‌టి కంటే ఎక్కువ పోస్టుల‌కు అర్హత‌లు ఉన్నవారు ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఎంచుకోవాలి.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: జులై 31, 2017
వెబ్‌సైట్‌:www.joinindiannavy.gov.in

నోటిఫికేష‌న్‌

అప్లై ఆన్‌లైన్‌:https://www.joinindiannavy.gov.in/en/account/login


Back..

Posted on 13-06-2017