Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఆతిథ్యరంగం... ఆకర్షణీయం!

ఉత్సాహం, సేవాభావం ఉన్న నవతరాన్ని ఆకర్షిస్తున్న కోర్సు... హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌.ఉత్తమశ్రేణి విద్యాసంస్థల్లో దీన్ని చదవటానికి వీలుకల్పించే ఉమ్మడి ప్రవేశపరీక్ష ప్రకటన వెలువడింది. జాతీయ స్థాయిలో జరిగే ఈ పరీక్షకు సమగ్రంగా సన్నద్ధమయ్యేందుకు నిపుణుల సూచనలు ఇవిగో...!
ఆధునిక జీవనశైలిలో సందర్శనలు, విహారాలు, పర్యటనలు భాగమైపోయాయి. దీంతో ఆతిథ్యరంగానికి విస్తృతమైన ఉపాధి అవకాశాలు పెరిగాయి. బీఎస్‌సీ హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సులో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశపరీక్ష (జేఈఈ) వచ్చే ఏడాది ఏప్రిల్లో జరగబోతోంది. దీనిలో కెరియర్‌ను తీర్చిదిద్దుకోదలచినవారు మెరుగైన ర్యాంకు తెచ్చుకోవాల్సివుంటుంది. భారత పర్యాటక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ క్యాటరింగ్‌ టెక్నాలజీ (NCHMCT) ఈ పరీక్షను నిర్వహిస్తోంది.
వచ్చే విద్యాసంవత్సరం కోసం ప్రవేశాల ప్రక్రియ ఇప్పటికే మొదలయింది. నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ జేఈఈ దరఖాస్తును ఆన్‌లైన్‌లో www.nchm.nic.in ద్వారా పొందవచ్చు.
సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులూ, తల్లిదండ్రుల్లో చాలామంది ఈ కోర్సు ప్రాధాన్యం గుర్తించరు. ఎంసెట్‌ అయిపోయాక దీని గురించి ఆలోచిస్తే సీట్లు దొరకవు కాబట్టి దానివల్ల ప్రయోజనం ఉండదు. ఇదివరకే ఇంటర్‌ ఉత్తీర్ణులైనవారూ, ఇంటర్‌ ఒకేషనల్‌ విద్యార్థులూ కూడా మూడేళ్ల కోర్సులో జేఈఈ రాయవచ్చు. ఏప్రిల్‌ 29న జరిగే పరీక్షలో ప్రతిభ చూపి ర్యాంకు ద్వారా ప్రవేశం పొందవచ్చు.
ఇంటర్‌ చదువుతున్న విద్యార్థులు ముందే ఈ కోర్సుకు సకాలంలో దరఖాస్తు చేసి, పరీక్షకు సిద్ధమైతే మంచి అవకాశాలను పొందే వీలుంటుంది. పరీక్ష ముగిసి, ఫలితాలు వచ్చాక మేలుకొని ఈ కోర్సుపై మొగ్గు చూపితే రాజీపడి ఏదో ఒక కళాశాలలో చేరాల్సివస్తుంది.
జేఈఈ ర్యాంకు ద్వారా బీఎస్‌సీ హాస్పిటాలిటీ కోర్సులో ప్రవేశం కల్పించే 21 కేంద్రప్రభుత్వ కళాశాలలు దేశంలో ఉన్నాయి. వాటిలో ఒకటి హైదరాబాద్‌ ఐహెచ్‌ఎం హైదరాబాద్‌లోని విద్యానగర్‌లో ఉంది. గచ్చిబౌలి లోని ఎన్‌ఐటీహెచ్‌ఎం, తిరుపతిలోని స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ ఈ కోర్సును అందిస్తున్నాయి.
పైన పేర్కొన్న కళాశాలల్లోనే కాకుండా మిగతా కేంద్ర ఐహెచ్‌ఎంలలో, 19 రాష్ట్ర ఐహెచ్‌ఎంలలో, 14 గుర్తింపు పొందిన ప్రైవేటు కళాశాలల్లో ఎక్కడైనా జేఈఈ ర్యాంకు ఆధారంగా సీట్ల కేటాయింపును పొందవచ్చు. అన్ని విద్యాసంస్థల్లో కలిపి మొత్తం 8124 సీట్లున్నాయి. హైదరాబాద్‌లోని ఐహెచ్‌ఎంలో సీటు రావాలంటే 2000 ర్యాంకు కన్నా తక్కువ తెచ్చుకోవాల్సివుంటుంది.

ఏ విభాగం ఎలా?
ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో జేఈఈ ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికీ 0.25 మార్కును తగ్గిస్తారు.
* ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌: పరీక్షలో ఎక్కువ మార్కులున్న పేపర్‌ ఇది. కాబట్టి సన్నద్ధతలో దీనికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఆతిథ్యరంగంలో రాణించాలంటే భాషానైపుణ్యం, భావ వ్యక్తీకరణ ముఖ్యం కాబట్టే దీనికింత మొగ్గు. పరీక్షలో వొకాబులరీ, సిననిమ్స్‌, యాంటనిమ్స్‌, ఇడియమ్స్‌ అండ్‌ ఫ్రేజెస్‌, ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్‌, స్పెలింగ్స్‌, కాంప్రహెన్షన్‌ లాంటివి పదో తరగతి స్థాయిలో ఉంటాయి. వ్యాకరణాంశాలపై క్లరికల్‌ పరీక్షకు చదివే ఇంగ్లిష్‌ పుస్తకాలను అధ్యయనం చేస్తే సరిపోతుంది.
* న్యూమరికల్‌ ఎబిలిటీ అండ్‌ ఎనలిటికల్‌ ఆప్టిట్యూడ్‌: దీనిలో బాగా మార్కులు స్కోరు చేయవచ్చు. 9, 10 తరగతుల అంకగణితం, ప్రాథమిక గణితం, నంబర్‌ సిస్టమ్‌, స్క్వేర్‌ రూట్‌, సింప్లిఫికేషన్‌, సగటు, కాలం-దూరం మొదలైనవి సాధన చేస్తే సులువుగా మార్కులు తెచ్చుకోవచ్చు. బ్యాంక్‌ క్లర్క్స్‌ పరీక్షకు చదివే పుస్తకాలను కూడా అభ్యాసానికి ఉపయోగించుకోవచ్చు.
* రీజనింగ్‌ అండ్‌ లాజికల్‌ డిడక్షన్‌: దీని ద్వారా అభ్యర్థి విశ్లేషణాత్మక సామర్థ్యం ఎంత ఉందో అంచనా వేస్తారు. రీజనింగ్‌, ఆడ్‌ మ్యాన్‌ అవుట్‌, సిరీస్‌ లాంటివి దీనిలో భాగం. ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఇవి గతంలో పరిచయం లేనివి కాబట్టి తగినంత అభ్యాసం చేయటం చాలా అవసరం. తర్కం ఉపయోగించి సాల్వ్‌ చేయాల్సివుంటుంది. ఈ మెలకువ గ్రహిస్తే ఈ విభాగం తేలికగానే ఉంటుంది.
* జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరంట్‌ అఫైర్స్‌: దీనికి సిలబస్‌ అంటూ ఏమీ నిర్దేశించలేదు. సమాజంలో జరిగే తాజా పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి. పాఠశాల స్థాయి సోషల్‌స్టడీస్‌, చారిత్రక ఘట్టాలు, విజ్ఞానశాస్త్రం, అన్నీ దీనిలో కలిసివుంటాయి. రోజూ ఇంగ్లిష్‌ దినపత్రిక చదువుతూ సొంత నోట్సు సిద్ధం చేసుకోవాలి. క్లరికల్‌ పరీక్షలకు సంబంధించిన జీకే సబ్జెక్టు చదువుకుంటే సులభంగా ఈ విభాగం రాయటానికి వీలుంటుంది.
* ఆప్టిట్యూడ్‌ ఫర్‌ సర్వీస్‌ సెక్టార్‌: హాస్పిటాలిటీ నిర్వహణలో బాగా రాణించాలంటే సేవాభావం ఎంతో అవసరం. ఇతరులను ఎంతవరకూ ఇష్టపడతారు, ఏఏ సందర్భాల్లో స్నేహపూర్వకంగా ఉండగలరు, వారిని అర్థం చేసుకోవడం, వారి అవసరాలను పసిగట్టే స్వభావం మొదలైన అంశాల మీద ప్రశ్నలు వస్తాయి. కరెక్ట్‌/మోస్ట్‌ కరెక్ట్‌ సమాధానాలకు పూర్తి మార్కులుంటాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి జవాబులకు మార్కులు తగ్గుతాయి.
ఈ కెరియర్‌లో రాణించాలంటే ప్రశాంతత, సహనం, ఇతరుల దృష్టికోణంలో ఆలోచించటం, చిరునవ్వుతో వ్యవహరించటం, కష్టపడే మనస్తత్వం ఇవన్నీ పెంచుకోవాలి. భిన్న మనస్తత్వాలుండే అతిథులను ఆహ్వానించి వారికి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలంటే, తక్షణం స్పందించే లక్షణం ఉండాలి. అప్రమత్తంగా ఉండాలి. వీటిని పెంపొందించే ప్రామాణిక శిక్షణ అభ్యర్థులకు అనివార్యం. జాతీయ, అంతర్జాతీయ ఆహారపు అలవాట్లు, పద్ధతుల అవగాహన ఉండాలి. జేఈఈ ద్వారా ప్రవేశాలు అందించే ఉత్తమశ్రేణి కళాశాలల్లో ఇలాంటి శిక్షణ లభిస్తుంది.

ప్రాంగణ నియామకాలు
దేశవిదేశాల్లో ఉపాధికి వీలు కల్పించే కోర్సు ఇది. పెద్ద పెద్ద స్టార్‌హోటళ్ళు, రిటైల్‌ కంపెనీలు, ఏర్‌లైన్స్‌లో ఎన్‌సీహెచ్‌ఎంసీటీ ఇచ్చే డిగ్రీకి ఎంతో పేరుంది. సుప్రసిద్ధ సంస్థలు మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలను తీసుకోవటానికి ఏటా ప్రాంగణ నియామకాల ద్వారా ఆఫర్‌ లెటర్లు ఇస్తుంటాయి.
ఫైనలియర్‌ విద్యార్థులకు ప్రాంగణ నియామకాల కోసం కళాశాలల్లో ప్రత్యేక శిక్షణ ఉంటుంది. వ్యక్తిత్వ వికాసం, బృంద చర్చ, ప్రసంగ కళ, మౌఖిక పరీక్ష నైపుణ్యాలు లాంటి అదనపు మెలకువలను నేర్పుతారు. విజయవంతంగా కోర్సు పూర్తిచేసేలోపు ఒక్కొక్కరికి కనీసం ఒక ఉద్యోగ ఆఫర్‌ చేతిలో ఉంటుంది. ఎంపిక చేసుకునే సంస్థల్లో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ, ఆపరేషన్స్‌ ట్రెయినీ, అసిస్టెంట్‌ మేనేజర్‌, కార్పొరేట్‌ మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ హోదాల్లో అవకాశాలు లభిస్తాయి.
ఆతిథ్యరంగంలో రాణించాలంటే భాషానైపుణ్యం, భావ వ్యక్తీకరణ ముఖ్యం. అందుకని ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈలో ఆంగ్ల విభాగానికి అత్యధిక మార్కులను కేటాయించారు. పదో తరగతి స్థాయి ఇంగ్లిష్‌ వ్యాకరణాంశాలపై అవగాహన పెంచుకోవాలి. క్లరికల్‌ పరీక్షకు చదివే ఇంగ్లిష్‌ పుస్తకాల అధ్యయనం సరిపోతుంది.


Back..

Posted on 20-12-2016