Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఆతిథ్యమే ఉద్యోగం!

* ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ - 2020

దేశంలో ఎక్కువ మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న వాటిలో ముందు వరసలో ఉండేవి.. ఆతిథ్య, సేవారంగాలు. కొన్నేళ్ల్లుగా ఈ విభాగాల్లో గణనీయమైన వృద్ధి నమోదవుతోంది. మానవ వనరుల కొరతను ఈ పరిశ్రమ ఎదుర్కొంటోంది. దీంతో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ వంటి మేటి సంస్థల్లో కోర్సులు పూర్తిచేసిన వారికి వెంటనే అవకాశాలు లభిస్తున్నాయి. బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సులో ప్రవేశానికి ప్రకటన వెలువడింది. రాత పరీక్షలో సాధించిన స్కోరు ఆధారంగా అడ్మిషన్లు ఇస్తారు.

కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ క్యాటరింగ్‌ టెక్నాలజీ (ఎన్‌సీహెచ్‌ఎం అండ్‌ సీటీ) ఏర్పాటైంది. ఈ సంస్థ ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో)తో కలిసి బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సును అందిస్తోంది. ఇందులో ప్రవేశాలకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌- జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (ఎన్‌సీహెచ్‌ఎం- జేఈఈ) పేరుతో పరీక్ష నిర్వహిస్తోంది. ఈ స్కోరుతో కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తోన్న 21 సంస్థలతోపాటు 25 రాష్ట్ర స్థాయి సంస్థలు, ఒక పబ్లిక్‌ సెక్టార్‌ అండర్‌ టేకింగ్‌, 24 ప్రైవేటు సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర సంస్థ అయిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ (ఐహెచ్‌ఎం) హైదరాబాద్‌, రాష్ట్రీయ సంస్థలైన డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ హైదరాబాద్‌, స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ తిరుపతి, తెలంగాణ స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ సంగారెడ్డి ఎన్‌సీహెచ్‌ఎం -జేఈఈతో ప్రవేశం కల్పిస్తున్నాయి. శ్రీశక్తి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ హైదరాబాద్‌, లియో అకాడమీ ఆఫ్‌ హాస్పిటాలిటీ టూరిజం అండ్‌ మేనేజ్‌మెంట్‌ హైదరాబాద్‌ల్లో ప్రవేశం ఈ స్కోరుతోనే లభిస్తుంది. ఐహెచ్‌ఎం హైదరాబాద్‌లో 285, వైఎస్‌ఆర్‌ నిథమ్‌లో 120, తిరుపతి, సంగారెడ్డి ఐహెచ్‌ఎంలు ఒక్కో దానిలో 60 చొప్పున సీట్లు ఉన్నాయి.

శాకాహారులకు ప్రత్యేకం
బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సు వ్యవధి మూడేళ్లు. ఈ కోర్సును జనరిక్‌ తోపాటు శాకాహారుల కోసమూ అందిస్తున్నారు. వెజిటేరియన్‌ కోర్సు ఎంచుకున్నవారికి శాకాహార అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. వీరు కోర్సులో భాగంగా మాంసాహార వంటలను నేర్చుకోవాల్సిన అవసరం లేదు.

మూడేళ్ల యూజీ కోర్సులో మొదటి ఏడాది ఆతిథ్య రంగంలోని అన్ని అంశాలపై అవగాహన కల్పిస్తారు. హౌస్‌ కీపింగ్‌, ఫ్రంట్‌ ఆఫీస్‌, ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్‌, ప్రొడక్షన్‌/సర్వీసెస్‌ తదితర విభాగాల్లో ప్రాథమికాంశాలపై పరిజ్ఞానాన్ని అందిస్తారు. కోర్సు రెండో సంవత్సరంలో క్షేత్ర స్థాయిలో శిక్షణ ఉంటుంది. అంటే విద్యార్థులు పనిచేస్తూ నేర్చుకుంటారు.దీనికోసం ఏదైనా హోటల్‌ లేదా క్యాటరింగ్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని శిక్షణ ఇస్తారు. మూడో సంవత్సరంలో ఫైనాన్స్‌, బిజినెస్‌ ఎన్విరాన్‌మెంట్‌, స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌ అంశాల గురించి అభ్యర్థులు చదువుకుంటారు. హోటల్‌ అకౌంటెన్సీ, ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ క్వాలిటీ, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, ఫెసిలిటీ ప్లానింగ్‌, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌, టూరిజం మార్కెటింగ్‌ అండ్‌ టూరిజం మేనేజ్‌మెంట్‌ అంశాలనూ పూర్తిస్థాయిలో బోధిస్తారు.

ఉపాధి అవకాశాలు
ఈ కోర్సులో చేరిన అభ్యర్థులకు ఉద్యోగావకాశాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పవచ్చు. సంస్థలన్నీ జాతీయ స్థాయిలో పేరున్నవి కావడం, ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా సమగ్ర శిక్షణ లభించడమే ఇందుకు కారణం. ఆతిథ్య, సేవారంగంలోని సంస్థలు ప్రాంగణ నియామకాల్లో దాదాపు విద్యార్థులందరికీ అవకాశం కల్పిస్తున్నాయి.

చదువుకున్న కోర్సును బట్టి కిచెన్‌ మేనేజ్‌మెంట్‌, హౌస్‌ కీపింగ్‌ మేనేజ్‌మెంట్‌, ఫ్లైట్‌ కిచెన్స్‌/ఆన్‌బోర్డ్‌ ఫ్లైట్‌ సర్వీసెస్‌, వివిధ సేవా పరిశ్రమల్లో గెస్ట్‌/ కస్టమర్‌ రిలేషన్‌ ఎగ్జిక్యూటివ్‌, ఫాస్ట్‌ఫుడ్‌ చెయిన్స్‌లో ఎగ్జిక్యూటివ్‌, క్యాటరింగ్‌ సంస్థలు, షిప్పుల్లో సప్లై, కిచెన్‌ సెక్షన్‌ ఉద్యోగాలు; పర్యాటక సంస్థలు, కేంద్రాల్లో వివిధ రకాల సేవలు, బహుళజాతి కంపెనీల క్యాంటీన్లు, హౌస్‌ కీపింగ్‌ నిర్వహణ, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాలల్లో ఫ్యాకల్టీ, సొంతంగా ఫుడ్‌ చెయిన్‌ ప్రారంభించడం...తదితర అవకాశాలు దక్కుతాయి. లీలా, ఒబేరాయ్‌, తాజ్‌, పార్క్‌, స్టార్‌ వుడ్‌, మారియట్‌...ఇలా ప్రముఖ సంస్థల్లో ఉద్యోగావకాశాలను అందుకోవచ్చు. ఫుడ్‌ చైన్‌ సంస్థలైన కేఎఫ్‌సీ, మెక్‌ డొనాల్డ్స్‌...మొదలైనవి ప్రాంగణ నియామకాల్లో ఎక్కువ మందిని తీసుకుంటున్నాయి. బీఎస్సీ తర్వాత ఆసక్తి ఉంటే రెండేళ్ల వ్యవధితో ఎమ్మెస్సీ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు పూర్తి చేసుకోవచ్చు. ఆతిథ్య రంగంలోని నచ్చిన స్పెషలైజేషన్‌తో పీజీ పూర్తిచేసుకునే అవకాశం ఉంది.

పరీక్ష సన్నద్ధత ఎలా?
పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. మొత్తం 200 ప్రశ్నలుంటాయి. ఇందులో న్యూమరికల్‌ ఎబిలిటీ అండ్‌ ఎనలిటికల్‌ ఆప్టిట్యూడ్‌ 30, రీజనింగ్‌ అండ్‌ లాజికల్‌ డిడక్షన్‌ 30, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌ 30, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 60, సర్వీస్‌ సెక్టార్‌ ఆప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు. ప్రతి సరైన సమాధానానికీ 4 మార్కులుంటాయి. తప్పుగా గుర్తించిన జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు. ప్రశ్నలు ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఇస్తారు.
* న్యూమరికల్‌ ఎబిలిటీ అండ్‌ ఎనలిటికల్‌ ఆప్టిట్యూడ్‌ విభాగంలోని ప్రశ్నలకు 9, 10 తరగతుల గణిత పుస్తకాలు చదువుకుంటే సరిపోతుంది. ఏజ్‌, వర్క్‌ అండ్‌ వేజెస్‌, చైన్‌ రూల్‌, టైమ్‌ అండ్‌ వర్క్‌ విభాగాల్లో ప్రశ్నలు వస్తున్నాయి. గుణింతాలు, కూడికలు, తీసివేతలు, భాగహారం, కసాగు, గసాభా, సగటు, నిష్పత్తి, భిన్నాలు మొదలైనవాటిపై దృష్టి పెట్టాలి.
* రీజనింగ్‌ అండ్‌ లాజికల్‌ డిడక్షన్‌ విభాగంలోని ప్రశ్నలు తర్కంతో ముడిపడి తేలికగానే ఉంటాయి. బ్లడ్‌ రిలేషన్లు, సిరీస్‌, స్టేట్‌మెంట్‌ అండ్‌ అజంప్షన్స్‌, వెర్బల్‌ రీజనింగ్‌ విభాగాలను శ్రద్ధతో చదవాలి.
* జీకే అండ్‌ కరంట్‌ అఫైర్స్‌ విభాగంలో ఎక్కువ ప్రశ్నలు జీకే నుంచే అడుగుతున్నారు. హిస్టరీ, పాలిటీ, జనరల్‌ సైన్స్‌ ల్లోని ప్రాథమికాంశాల ప్రశ్నలు వస్తాయి. అందువల్ల 8, 9, 10 తరగతుల సైన్స్‌, సోషల్‌ పుస్తకాల్లోని ముఖ్యాంశాలు చదువుకుంటే సరిపోతుంది. రాజధానులు, కరెన్సీ, పార్లమెంట్లు, క్రీడలు..ఇలాంటివి చదవాలి.
* ఆంగ్ల విభాగంలోని ప్రశ్నలూ ప్రాథమిక స్థాయిలోనే ఉంటాయి.సిననిమ్స్‌, ఆంటనిమ్స్‌, కంజంక్షన్స్‌, ప్రిపొజిషన్స్‌, ప్యాసేజ్‌ మొదలైన విభాగాల్లో తేలిక ప్రశ్నలే వస్తాయి. 9, 10 తరగతుల్లోని వ్యాకరణాంశాలను బాగా చదవాలి.
* సర్వీస్‌ సెక్టార్‌ ఆప్టిట్యూడ్‌ విభాగంలోని ప్రశ్నలు ఆతిథ్య, సేవారంగాలకు చెందినవిగా ఉంటాయి. ప్రశ్నను చదివి, ఆలోచించి, విచక్షణతో సమాధానం గుర్తించాలి. హోటల్‌ పరిశ్రమ, సేవా రంగాలపై కనీస అవగాహన పెంచుకుంటే ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాయవచ్చు.

ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 20, 2020
పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 25, 2020
అర్హత: ఇంటర్మీడియట్‌ /ప్లస్‌-2 ఉత్తీర్ణత.
వయసు: జులై 1, 2020 నాటికి గరిష్ఠంగా 25 ఏళ్లలోపు ఉండాలి. 1995 జులై 1 తర్వాత జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు గరిష్ఠ వయసులో మూడేళ్ల సడలింపు వర్తిస్తుంది.
పరీక్ష కేంద్రాలు:
* ఏపీలో - గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.
* తెలంగాణలో - హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, రంగారెడ్డి, కరీంనగర్‌.
వెబ్‌సైట్‌: https://nchmjee.nta.nic.in

Back..

Posted on 08-01-2020