Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
నీట్‌గా...నిబ్బరంగా!

‘నీట్‌’కు సంబంధించిన తాజా పరిణామాలు మన విద్యార్థుల్లో ఆందోళన సృష్టించాయి. ఈ సందర్భంగా ఎంసెట్‌కూ, నీట్‌కూ సిలబస్‌లో ఉన్న పోలికలూ తేడాలపై స్పష్టత ఏర్పరచుకుంటే ఏ పరిస్థితిలోనైనా నిబ్బరంగా పరీక్షకు సిద్ధం కావొచ్చు!
జులై 24న జాతీయ అర్హత, ప్రవేశపరీక్ష (నీట్‌-2) జరగబోతోంది. ఇప్పటి నుంచి 83 రోజులు ఉన్నాయి. ఈ వ్యవధికి తగిన ప్రణాళిక వేసుకుని పాటిస్తే.. మంచి స్కోరు సాధించవచ్చు.
ఎంసెట్‌లో 3 గంటల సమయంలో 160 ప్రశ్నలకు (బోటనీ 40, జువాలజీ 40, భౌతికశాస్త్రం 40, రసాయన శాస్త్రం 40) జవాబులు గుర్తించాల్సివుంటుందని తెలిసిందే. తప్పు సమాధానాలకు రుణాత్మక (మైనస్‌) మార్కులు లేవు.
నీట్‌లో 3 గంటల సమయంలో 180 ప్రశ్నలకు (బయాలజీ 90, భౌతికశాస్త్రం 45, రసాయనశాస్త్రం 45) జవాబులు రాయాల్సివుంటుంది. ప్రతి సరైన జవాబుకూ 4 మార్కులు. తప్పు జవాబుకు 1 మైనస్‌ మార్కు. అంటే నీట్‌ మొత్తం 720 మార్కులకు జరుగుతుంది.
ఎంసెట్‌, నీట్‌ల కాలవ్యవధి ఒకటే అయినప్పటికీ నీట్‌లో ప్రశ్నల సంఖ్య ఎక్కువ. విద్యార్థి పరీక్ష రాసే వేగం పెంచుకోవాలి. దాంతోపాటు రుణాత్మక మార్కులున్నాయి కాబట్టి కచ్చితత్వం పెరగాలి. వేగం, కచ్చితత్వాలు సాధించాలంటే అభ్యాసంతో పాటు ఎక్కువసార్లు పునశ్చరణ జరగాలి.
మన తెలుగు రాష్ట్రాల మెడికల్‌ విభాగపు విద్యార్థులకు రుణాత్మక మార్కులపై అవగాహన తక్కువ. ర్యాంకు నిర్థారణలో ఈ మార్కులే కీలకమై విద్యార్థి భవితను నిర్ణయిస్తాయని మర్చిపోకూడదు.
జీవశాస్త్రం (బయాలజీ): ఈ సిలబస్‌లో తేడా ఏమీ లేదు. 2012లోనే కేంద్రప్రభుత్వం దాదాపు అన్ని రాష్ట్రాలకూ ఉమ్మడి సిలబస్‌ను ప్రతిపాదించింది. అప్పటినుంచీ బయాలజీలో ఎంసెట్‌ సిలబస్‌, నీట్‌ సిలబస్‌ దాదాపు సమానం కాబట్టి అదనంగా చదవాల్సిన పని లేదని విద్యార్థులు భావించవచ్చు. ఇది సరి కాదు. బయాలజీ విభాగంలో ఎక్కువ ప్రశ్నలు వాటి నామాలు, ఉపయోగాలపై ఉంటున్నాయి. సిలబస్‌ ఒకటే అయినప్పటికీ ఉత్తర, దక్షిణ భారతదేశ రాష్ట్రాల్లో దొరికే మొక్కలు వేర్వేరు. అందుకని సీబీఎస్‌సీ పుస్తకాల్లో ఇచ్చిన ఉదాహరణలు, మనవద్ద ఎంసెట్‌లో ఇచ్చే ఉదాహరణలూ, వాటి నామాలూ వేర్వేరుగా ఉంటాయి. అందుకని బయాలజీకి అధిక ప్రాధాన్యం ఇచ్చి ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లోని ఉదాహరణలనూ, వాటి శాస్త్రీయ నామాలనూ కచ్చితంగా గుర్తుంచుకునేలా వీలైనన్నిసార్లు చదవాలి. సిలబస్‌లో తేడా లేదని అలసత్వం ప్రదర్శించకుండా రెండు సంవత్సరాల పాఠ్యభాగాల్లోని ప్రతి అభ్యాసాన్నీ మళ్ళీ నీట్‌ దృష్ట్యా అభ్యసించాలి. మొదట ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలను సరిగా చదివి, ఎగ్జంప్లర్‌లోని బహుళైచ్ఛిక ప్రశ్నలను సాధన చేయాలి. సమయం తక్కువ ఉన్నందున పక్కా ప్రణాళిక వేసుకోవాలి. ఈ రెండు పుస్తకాలనూ సంపూర్ణంగా అభ్యసించగిలిగితే నీట్‌ను సమర్థంగా రాసే అవకాశం ఉంటుంది.
మరో అతిముఖ్యమైన అంశం- 8, 9, 10 తరగతుల సీబీఎస్‌ఈ పుస్తకాల్లోని కొన్ని ప్రశ్నలు ఇస్తున్నారు. ప్రాతిపదిక 2015, 2014, 2013లలో జరిగిన ఏఐపీఎంటీ అని చెప్పవచ్చు. గత సంవత్సరాల్లోని ఏఐపీఎంటీ పేపర్లలో బయాలజీలో 3 నుంచి 4 ప్రశ్నలు పదో తరగతిలోపు సిలబస్‌ల నుంచి వస్తున్నాయి. మెడికల్‌ ప్రవేశపరీక్షల్లో బయాలజీలో ప్రతి మార్కుకీ చాలా ప్రాధాన్యం ఉంది. అందుకని వాటిపై తయారు కావాలి.
మరో అంశం... ప్రాక్టికల్స్‌ నుంచి కనీసం 3-4 ప్రశ్నలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఇక్కడ కూడా ఇబ్బంది ఎదురవుతోంది. ఎంసెట్‌లో ప్రాక్టికల్స్‌ ప్రాధాన్య ప్రశ్నలే ఉండటం లేదు. నీట్‌ కోసం ఈ అంశాలపై కూడా బోధన, అభ్యాసం అవసరం.
భౌతిక శాస్త్రం: భౌతికశాస్త్రం విషయంలో సిలబస్‌ పూర్తిగా ఒకటే. ఎంసెట్‌ కంటే సులభమైన ప్రశ్నలే వస్తున్నాయి. ప్రశ్నల సంఖ్య పెరిగింది కాబట్టి సమయపు ఒత్తిడి పెరుగుతుంది. మన విద్యార్థులు లెక్క చేయడం ఎలా అనే పద్ధతికి కాకుండా ఫార్ములాకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలా ఫార్ములాలను కంఠస్థం చేసి చదివేవారు ఈ నూతన ప్రవేశపరీక్ష విధానంలో ఇబ్బంది పడతారు.
ఈ సమయంలో సిద్ధాంతపరమైన ప్రశ్నలకు ప్రాధాన్యం ఇచ్చి లెక్కలు కూడా సులువుగా చేసే విధానాలను అభ్యసించాలి. అప్పుడు ప్రశ్నల సంఖ్య పెరిగినప్పటికీ సులువుగా చేయవచ్చు. దీనికి కూడా ఎన్‌సీఈఆర్‌టీ, ఎగ్జంప్లర్‌ పుస్తకం సరిపోతుంది. ప్రశ్నలు విశ్లేషణాత్మకంగా ఉంటాయి గానీ కష్టంగా ఉండవు. సీబీఎస్‌ఈ సిలబస్‌లో చదివిన విద్యార్థులకూ, తెలంగాణలో సీసీఈ విధానంలో చదివిన విద్యార్థులకూ ఫిజిక్స్‌ తేలిగ్గానే ఉంటుంది.
రసాయనశాస్త్రం: దీనిలో కూడా సిలబస్‌ పరంగా వ్యత్యాసాలు లేవు. ప్రశ్నల విధానంలో కూడా తేడా లేనందున తయారీలో విద్యార్థికి సమయాన్ని మిగిల్చేది రసాయనశాస్త్రం మాత్రమే. వీలైనంత త్వరగా కెమిస్ట్రీ పూర్తిచేసుకుని ఆ సమయాన్ని బయాలజీ తయారీకి వినియోగించగలిగితే మంచి మార్కులు వస్తాయి. కర్బన, అకర్బన, భౌతిక రసాయన శాస్త్రాలకు సమ ప్రాధాన్యం కల్పిస్తున్నారు. అందుకని విద్యార్థి తనకు పట్టున్న విభాగానికి ప్రాధాన్యం ఇస్తే ఎక్కువ మార్కులు సాధించుకోవచ్చు. కెమిస్ట్రీకి కూడా ఎన్‌సీఈఆర్‌టీ వారి 11, 12 తరగతి పుస్తకాలూ, ఎన్‌సీఈఆర్‌టీ రెండేళ్ళ ఎగ్జంప్లర్‌ పుస్తకాలూ చదవాలి.
వెబ్‌సైట్లో పాఠ్యపుస్తకాలు
బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ అన్నిటికీ సీబీఎస్‌ఈ బోర్డు నిర్దేశిత పుస్తకాలు... ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలే. అవి ncert.nic.in వెబ్‌సైట్లో లభిస్తాయి. వీటిని ఉచితంగానే తీసుకునే అవకాశం ఏర్పరిచారు.
నీట్‌ రాసే విద్యార్థి చేయాల్సిన మొదటి పని- అన్ని సబ్జెక్టుల్లో ఈ పుస్తకాలను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. కంప్యూటర్‌పై చదివే అలవాటుంటే డెస్క్‌టాప్‌పై ఉంచుకోవాలి. లేదా వాటిని ప్రింట్‌ రూపంలో తీసుకుని ప్రాధాన్యం ఇచ్చి చదవాలి. ఈ తక్కువ సమయంలో వేర్వేరు పుస్తకాలు చదవటం మానేసి కేవలం ఈ పుస్తకాలకే పరిమితమైతే మంచి ర్యాంకుకు ఆస్కారం ఉంటుంది.
రుణాత్మక మార్కుల ప్రభావం ఏవిధంగా ఉంటుందో అవగాహన ఏర్పరచుకోవాలి. దీనికోసం, సమయ నిర్వహణ కోసం 3 గంటల వ్యవధిలోనే 180 ప్రశ్నలు రాయాలి. ఈ నమూనా పరీక్షలు వీలైనన్ని రాయటం మేలు.
పరీక్షా విధానంపై అవగాహన కోసం... రెండు సంవత్సరాల సిలబస్‌ను 6 భాగాలు చేసుకోవాలి. వాటిలో 180 ప్రశ్నలతో వారానికొకటి చొప్పున ఆరు పరీక్షలు అభ్యాసం చేసి, తర్వాత 2 వారాలు సిలబస్‌ పెంచుకుంటూ నమూనా పరీక్షలు రాయాలి.
చివరి రెండు వారాలూ రోజు మార్చి రోజు పూర్తి సిలబస్‌తో గ్రాండ్‌ టెస్ట్‌ రాయాలి. ఆ పరీక్షలో రుణాత్మక మార్కులు ఎలా వచ్చాయో విశ్లేషించుకోవాలి. ప్రతి పరీక్ష పూర్తయిన తర్వాత తప్పు సమాధానాలను విశ్లేషించుకుంటూ పోతే తుది పరీక్ష సమయానికి పొరపాట్లు తగ్గుతాయి. కనీసం 6 నుంచి 8 వరకూ గ్రాండ్‌టెస్టులు రాయాలి. అప్పుడు మాత్రమే సమయ నిర్వహణ అర్థమవుతుంది.
తుది పరీక్షలో 600 మార్కుల వరకూ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తే సీటు సాధించుకోవచ్చు. అంటే 180 ప్రశ్నల్లో 150 వరకూ జవాబులు సరిగా గుర్తించేలా సన్నద్ధత ఉండాలి. వీటిలో బయాలజీ 90 ప్రశ్నల్లో 85పైన సరైన జవాబులు గుర్తించగలిగితే విజయం సాధించినట్లే!
కనీస మార్కులు ఎన్ని?
నీట్‌లో కనీస అర్హత మార్కులు ఉన్నాయి. ఎంసెట్‌లో 25 శాతం తెచ్చుకుంటే ర్యాంకు కేటాయిస్తారు. ఎస్‌సీ, ఎస్‌టీ విద్యార్థులకు ఈ నిబంధన లేదు. అంటే ఎంసెట్‌లో సున్నా మార్కులు వచ్చినా వారికి ర్యాంకు కేటాయిస్తారు. నీట్‌లో జనరల్‌ కేటగిరీ విద్యార్థులకు 50వ పర్సంటైల్‌ను కటాఫ్‌ మార్కుగా తీసుకుంటారు. అంటే మొత్తం పరీక్ష రాసిన విద్యార్థుల్లో నీట్‌ మార్కులను అవరోహణ క్రమంలో ఏర్పరిచి విద్యార్థుల సంఖ్యలో 50వ శాతపు విద్యార్థి మార్కును ఓసీ కటాఫ్‌ మార్కుగా నిర్ణయిస్తారు. పేపర్‌ సులభంగా ఉంటే ఈ మార్కు ఎక్కువగా, కష్టంగా ఉంటే తక్కువగా ఉంటుంది. ఇది ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ విద్యార్థులకు 40వ పర్సంటైల్‌, వికలాంగుల జనరల్‌కేటగిరీలో 45వ పర్సంటైల్‌ మార్కులను కటాఫ్‌గా నిర్ణయిస్తారు. సీట్ల కేటాయింపులో ఆ రాష్ట్ర రిజర్వేషన్‌ ప్రాతిపదిక ప్రకారం ఆ విధానం కొనసాగిస్తారు.


Back..

Posted on 02-05-2016