Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
‘నెస్ట్‌’లో నెగ్గితే భవితకు భరోసా
ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఇంటిగ్రేటెడ్‌ సైన్స్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందటానికి ఉపకరించే పరీక్ష ‘నెస్ట్‌’ (నేషనల్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌). ఈ పరీక్ష ముఖ్యాంశాలు, సమగ్రంగా సిద్ధమవ్వాల్సిన తీరుతెన్నులను తెలుసుకుందాం!
జాతీయ ప్రవేశపరీక్ష ‘నెస్ట్‌’లో మంచి స్కోరు తెచ్చుకుంటే నైసర్‌ (భువనేశ్వర్‌), ముంబయి యూనివర్సిటీ- ఎటామిక్‌ ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ బేసిక్‌ సైన్స్‌- సీఈబీఎస్‌ (ముంబయి) సంస్థల్లో ఎంఎస్సీ కోర్సుల్లో చేరవచ్చు. ఈ రెండు సంస్థల్లో అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన ప్రయోగశాలలు, ఆధునిక కంప్యూటేషనల్‌ సౌకర్యాలు ఉంటాయి. ప్రముఖ శాస్త్రవేత్తలతో బోధన జరగటం చెప్పుకోదగ్గ ప్రత్యేకత.
 
నెస్ట్‌...ఇంటిగ్రేటెడ్ సైన్స్‌ కోర్సుల‌కు బెస్ట్‌

- ఇంట‌ర్ విద్యార్థుల‌కు ఉన్నత అవ‌కాశం
- ప్రసిద్ధ సంస్థల్లో అయిదేళ్ల ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశం
- ఎంపికైన ప్రతి విద్యార్థికీ నెల‌కు రూ.5000 ఉప‌కార వేత‌నం

ప‌రిశోధ‌నా రంగంలో రాణించాల‌నుకునే ఇంట‌ర్ సైన్స్ విద్యార్థుల‌కు నేష‌న‌ల్ ఎంట్ర‌న్స్ స్క్రీనింగ్ టెస్ట్ (నెస్ట్‌)ని మించిన అవ‌కాశం లేద‌నే చెప్పుకోవ‌చ్చు. ఈ ప‌రీక్ష ద్వారా నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ సైన్స్ ఎడ్యుకేష‌న్ అండ్ రీసెర్చ్‌, భువ‌నేశ్వర్‌; యూనివ‌ర్సిటీ ఆఫ్ ముంబై, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎన‌ర్జీ విభాగానికి చెందిన సెంట‌ర్ ఫ‌ర్ ఎక్స్‌లెన్స్ ఇన్ బేసిక్ సైన్సెస్ (సీబీఎస్‌)ల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశం క‌ల్పిస్తారు. బ‌యాల‌జీ, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ స‌బ్జెక్టుల్లో కోర్సులు నిర్వహిస్తున్నారు. బోధ‌న‌, ప‌రిశోధ‌న రంగాల్లో సుదీర్ఘ అనుభ‌వం ఉన్న ఫ్యాక‌ల్టీ, అధునాత‌న ల్యాబ్ సౌక‌ర్యాలు, ఉన్నత ప్రమాణాలు..ఈ రెండు సంస్థల ప్రత్యేక‌త‌గా చెప్పుకోవ‌చ్చు. దేశం నుంచే కాకుండా విదేశీ శాస్త్రవేత్తలు సైతం ఇక్కడికొచ్చి పాఠాలు చెప్తుంటారు. ఈ సంస్థల్లో ప్రవేశం ల‌భించిన‌వారు ఇన్‌స్పైర్ స్కాల‌ర్‌షిప్‌కి అర్హులు. అంటే ఐదేళ్ల పాటు నెల‌కు రూ.5000 చొప్పున ఉప‌కార వేత‌నం పొందొచ్చు. అలాగే వేస‌వి ప్రాజెక్టు కోసం ఏడాదికి రూ.20,000 చొప్పున చెల్లిస్తారు. అన్ని సెమిస్టర్లలోనూ మంచి ప్రతిభ క‌న‌బ‌ర్చిన విద్యార్థుల‌కు భాభా అటామిక్ రీసెర్చ్ సెంట‌ర్ (బార్క్‌) ట్రైనింగ్ స్కూల్‌లో ప‌రీక్ష లేకుండా ఇంట‌ర్వ్యూ ద్వారా ప్రవేశం క‌ల్పిస్తారు.

ప్రశ్నప‌త్రం ఇలా...
ఇందులో మొత్తం 5 సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్‌కు 60 మార్కులు కేటాయించారు. అన్నీ మ‌ల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలే. సెక్షన్ 1 విద్యార్థులంద‌రికీ కామ‌న్. ఈ సెక్షన్ ప్రశ్నల‌కు రుణాత్మక మార్కులు ఉండ‌వు. సెక్షన్ 2 నుంచి 5 వ‌ర‌కు బ‌యాల‌జీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, ఫిజిక్స్ స‌బ్జెక్టుల్లో ప్రశ్నల‌డుగుతారు. అభ్యర్థులు ఈ స‌బ్జెక్టుల నుంచి వీలైన‌న్ని ప్రశ్నల‌కు స‌మాధానాలు గుర్తించుకోవ‌చ్చు. అయితే ఈ నాలుగు సెక్షన్లలో ఎక్కువ మార్కులు సాధించిన‌ మూడు సెక్షన్ల నుంచి పొందిన మార్కులు, సెక్షన్ 1 స్కోర్ రెండూ క‌లిపి మెరిట్ లిస్ట్ త‌యారుచేస్తారు. అభ్యర్థికి ఆయా స‌బ్జెక్టుల్లో ఉన్న ప‌రిజ్ఞానం, విశ్లేష‌ణ సామ‌ర్థ్యాన్ని ప‌రీక్షిస్తారు. స‌బ్జెక్టు ప్రశ్నల‌కు అంటే సెక్షన్ 2 నుంచి సెక్షన్ 5 వ‌ర‌కు అడిగే ప్రశ్నల‌కు నెగెటివ్ మార్కులు ఉంటాయి. అలాగే కొన్ని ప్రశ్నల‌కు ఒక‌టి కంటే ఎక్కువ ఆప్షన్లు స‌రైన స‌మాధానాలుగా ఉండొచ్చు. ఇలాంటివాటికి ఆ ఆప్షన్లంటినీ షేడ్ చేయాలి. ప్రశ్నప‌త్రం ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుంది.

ఇదీ సిల‌బ‌స్‌...
సీబీఎస్ఈ 11, 12 త‌ర‌గ‌తుల్లోని బ‌యాల‌జీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, మ్యాథ్స్ అంశాల నుంచే ప్రశ్నలొస్తాయి. సెక్షన్- 1లోని ప్రశ్నల‌కు మాత్రం ప్రత్యేక‌మైన సిల‌బ‌స్ ఉండదు. ఆస్ట్రాన‌మీ, బ‌యాల‌జీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, ఫిజిక్స్, కంప్యూట‌ర్ సైన్స్, ఎన్విరాన్‌మెంట‌ల్ సైన్స్ స‌బ్జెక్టుల నుంచి ప్రాథ‌మికాంశాల‌ను సెక్షన్ -1లో ప్రశ్నల‌గా అడుగుతారు. ఆయా స‌బ్జెక్టుల్లో అభ్యర్థి కనీస అవ‌గాహ‌న స్థాయిని ప‌రీక్షిస్తారు. ఎన‌లిటిక‌ల్ ఎబిలిటీ నుంచీ ప్రశ్నలుంటాయి. వీటికోసం ప‌దో త‌ర‌గ‌తి మ్యాథ్స్‌పై కొంత అవ‌గాహ‌న త‌ప్పనిసరి. సైంటిఫిక్ పాసేజ్‌లపైనా ప్రశ్నలుంటాయి.

ప్రిప‌రేష‌న్ ఇలా...
* సిల‌బ‌స్‌కు అనుగుణంగా చ‌దువుకోవాలి. సీబీఎస్ఈ 11, 12 త‌ర‌గ‌తుల్లోని బ‌యాల‌జీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, ఫిజిక్స్ అంశాల నుంచి ప్రశ్నల‌డుగుతారు. కాబ‌ట్టి సంబంధిత స‌బ్జెక్టుల్లో ఆయా త‌ర‌గ‌తుల సీబీఎస్ఈ పుస్తకాలు క్షుణ్నంగా చ‌ద‌వాలి.
* సెక్షన్ 2 నుంచి 5 వ‌ర‌కు ఉన్న నాలుగు సెక్షన్లలో ఎక్కువ మార్కులు సాధించిన 3 సెక్షన్ల మార్కుల‌నే ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు. అందువ‌ల్ల బైపీసీ విద్యార్థులు మ్యాథ్స్ అలాగే ఎంపీసీ విద్యార్థులు బ‌యాల‌జీ సెక్షన్లను ప్రిప‌రేష‌న్ నుంచి మిన‌హాయించుకోవ‌చ్చు.
* సెక్షన్ 1 అంద‌రికీ ఉమ్మడిగా ఉంటుంది కాబ‌ట్టి అన్ని స‌బ్జెక్టుల్లోనూ ప్రాథ‌మిక ప‌రిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఆయా స‌బ్జెక్టుల‌కు సంబంధించి కీల‌కాంశాలు, ముఖ్య ఘ‌ట్టాల‌ను మ‌న‌నం చేసుకోవాలి.
* ఎంసెట్‌, ఐఐటీ-జేఈఈ ప‌రీక్షల‌కు స‌న్నద్ధమ‌వుతున్న విద్యార్థులు నెస్ట్‌ని ఎదుర్కోవ‌డం సులువే. దీనికోసం నెస్ట్ పాత ప్రశ్నప‌త్రాల‌ను సునిశితంగా ప‌రిశీలించాలి. ప్రతి స‌బ్జెక్టులోనూ ఏయే చాప్టర్ల నుంచి ఎలాంటి ప్రశ్నలు, ఎన్నేసి చొప్పున వ‌స్తున్నాయో చూసుకుని దానికి అనుగుణంగా స‌న్నద్ధత‌ను మెరుగుప‌ర్చుకోవాలి.
* సెక్షన్- 1కు త‌ప్ప మిగిలిన అన్ని సెక్షన్లలోని ప్రశ్నల‌కూ రుణాత్మక మార్కులు ఉన్నాయి కాబ‌ట్టి తెలియ‌ని ప్రశ్నల‌కు జ‌వాబు గుర్తించ‌కుండా వ‌దిలేయ‌డ‌మే మంచిది.
* పాత ప్రశ్నప‌త్రాల‌ను నెస్ట్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.
* ఎంసెట్‌, ఐఐటీల‌తో పాటు జాతీయ స్థాయిలో నిర్వహించిన ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ పాత ప్రశ్నప‌త్రాల‌ను సాధ‌న చేయ‌డమూ మంచిదే.
* ప్రతి స‌బ్జెక్టు నుంచీ ప్రాథ‌మికాంశాల‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అందువ‌ల్ల వాటిని క్షుణ్నంగా చ‌దువుకోవాలి.

ముఖ్య స‌మాచారం...
అర్హత‌: సైన్స్ గ్రూప్‌ల‌తో 2015, 2016లో ఇంట‌ర్ ఉత్తీర్ణులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. 2017లో ద్వితీయ సంవ‌త్సరం ప‌రీక్షలు రాయ‌నున్నవాళ్లూ అర్హులే. క‌నీసం 60 శాతం మార్కులు త‌ప్పనిస‌రి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 55 శాతం.
వయసు: జ‌న‌ర‌ల్‌, ఓబీసీ అభ్యర్థులైతే ఆగ‌స్టు 1, 1997 త‌ర్వాత జ‌న్మించిన‌వాళ్లే అర్హులు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల‌కు అయిదేళ్లు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపు వ‌ర్తిస్తుంది.
ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
ఫీజు: జ‌న‌ర‌ల్‌, ఓబీసీ పురుష అభ్యర్థుల‌కు రూ.700. అన్ని వ‌ర్గాల మ‌హిళ‌లు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు, దివ్యాంగుల‌కు రూ.350.
రిజిస్ట్రేషన్ ప్రారంభం: జనవరి 2
చివరితేది: మార్చి 6
అడ్మిట్ కార్డులు: ఏప్రిల్ 14 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.
నెస్ట్ తేది: మే 27
తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్ష కేంద్రాలు: హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం.
ఫ‌లితాలు: జూన్ 16న ప్రక‌టిస్తారు.

వెబ్‌సైట్‌

Notification and Online Registration


Back..

Posted on 02-01-2017