Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
నాణ్యమైన పీజీకి.. నెస్ట్‌!

* 2020 ప్రకటన విడుదల

* ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీలోకి ప్రవేశం

బోధన, పరిశోధన రంగాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఫ్యాకల్టీ, విదేశీ శాస్త్రవేత్తల బోధన, అధునాతన ప్రయోగశాల సౌకర్యాలు, ఉన్నత ప్రమాణాలు... ఇవన్నీ ఉన్నచోట విద్యాభ్యాసమంటే బంగారు భవితకు పునాదులు వేసుకున్నట్లే కదా! ఈ తరహా ప్రామాణిక సంస్థలైన నైసర్‌, సీఈబీఎస్‌లలో బయాలజీ, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సులు అందిస్తున్నారు. ప్రవేశాలకు ప్రకటన వెలువడింది.

మ్యాథ్స్‌, సైన్స్‌ విభాగాల్లో పరిశోధనల దిశగా అడుగులేయాలనుకునే ఇంటర్మీడియట్‌ అభ్యర్థుల కోసం నేషనల్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ (నెస్ట్‌) నోటిఫికేషన్‌ విడుదలైంది. పరీక్షలో ప్రదర్శించిన ప్రతిభ ఆధారంగా ప్రవేశం లభిస్తుంది. ఎంపికైనవారికి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (నైసర్‌), భువనేశ్వర్‌; యూనివర్సిటీ ఆఫ్‌ ముంబయి, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ విభాగానికి చెందిన సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ బేసిక్‌ సైన్సెస్‌ (సీఈబీఎస్‌)ల్లో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్‌సీ కోర్సుల్లోకి ప్రవేశం లభిస్తుంది. వీటిలో చేరిన విద్యార్థులకు ప్రతి నెలా రూ.5000 చొప్పున అయిదేళ్లపాటు ఉపకార వేతనాలు చెల్లిస్తారు. నైసర్‌లో 200, సీఈబీఎస్‌లో 57 సీట్లు ఉన్నాయి. వేసవిలో ప్రాజెక్టు కోసం ఏడాదికి రూ.20,000 చొప్పున కంటింజెన్సీ అందిస్తారు. అన్ని సెమిస్టర్లలోనూ ప్రతిభ చూపిన విద్యార్థులకు బాబా అటామిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌ (బార్క్‌) ట్రెయినింగ్‌ స్కూల్‌లో పరీక్ష రాయకుండానే ఇంటర్వ్యూలో పాల్గొనడానికి అనుమతి లభిస్తుంది. ఎంపికైనవారిని శిక్షణ అనంతరం బార్క్‌లో విధుల్లోకి తీసుకునే అవకాశం ఉంది.

ప్రశ్నపత్రం తీరు
నెస్ట్‌ను ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నలు ఆంగ్ల మాధ్యమంలో ఉంటాయి. అయిదు సెక్షన్లలో ప్రశ్నలు ఇస్తారు. అభ్యర్థికి ఆయా సబ్జెక్టుల్లో ఉన్న పరిజ్ఞానం, విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. ప్రతి సెక్షన్‌లోనూ కనీస మార్కులు పొందాలి. సెక్షన్‌-1 అందరికీ ఉమ్మడిగా ఉంటుంది. దీనికి 30 మార్కులు కేటాయించారు.రుణాత్మక మార్కులు లేవు. సెక్షన్‌-2 నుంచి సెక్షన్‌-5 వరకు బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో ప్రశ్నలుంటాయి. వీటికి రుణాత్మక మార్కులున్నాయి. ఒక్కో దానికి 50 మార్కులు. ఈ నాలుగింటిలో ఎక్కువ మార్కులు సాధించిన మూడు సెక్షన్లు, సెక్షన్‌-1 స్కోర్‌ కలిపి మెరిట్‌ లిస్ట్‌ తయారుచేస్తారు. దీని ప్రకారం మొత్తం 180 మార్కుల్లో అభ్యర్థులు సాధించిన స్కోర్‌ను పర్సంటైల్‌ విధానంలో లెక్కిస్తారు. జనరల్‌ అభ్యర్థులు 95, ఓబీసీలు 90, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 75 పర్సంటైల్‌ సాధించడం తప్పనిసరి.

సన్నద్ధత ఎలా?
సీబీఎస్‌ఈ 11, 12 తరగతుల్లోని బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ పుస్తకాలను క్షుణ్ణంగా చదవాలి. ప్రాథమికాంశాలు, భావనలపై పట్టు సాధించాలి. ముఖ్యాంశాలను నోట్సుగా రాసుకోవాలి. బయాలజీ విద్యార్థులు మ్యాథ్స్‌ను, మ్యాథ్స్‌ విద్యార్థులు బయాలజీని మినహాయించుకోవచ్చు. పాత ప్రశ్నపత్రాలను అధ్యయనం చేయాలి. ఇందుకోసం వెబ్‌సైట్‌లో 2007 నుంచి 2019 వరకు నెస్ట్‌ ప్రశ్నపత్రాలు, సమాధానాలను అందుబాటులో ఉంచారు. ప్రతి సబ్జెక్టులోనూ ఏయే చాప్టర్ల నుంచి ఎలాంటి ప్రశ్నలు, ఎన్నేసి చొప్పున వస్తున్నాయో గమనించి, అందుకు తగిన విధంగా సన్నద్ధం కావాలి. ఎంసెట్‌, జేఈఈ మెయిన్స్‌, నీట్‌ పాత ప్రశ్నపత్రాలు, మోడల్‌ పేపర్లు సాధన చేయాలి.

ముఖ్యాంశాలు
అర్హత: సైన్స్‌ గ్రూప్‌లతో 2018, 2019లో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాయబోతున్నవారూ అర్హులే. కనీసం 60 శాతం మార్కులు తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 55 శాతం చాలు.
వయసు: జనరల్‌, ఓబీసీ అభ్యర్థులు ఆగస్టు 1, 2000 తర్వాత జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు గరిష్ఠ వయసులో అయిదేళ్ల సడలింపు ఉంటుంది.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 3, 2020.
ఫీజు: జనరల్‌, ఓబీసీ పురుష అభ్యర్థులకు రూ.1200. అన్ని వర్గాల మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.600.
పరీక్ష తేదీ: జూన్‌ 6.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
వెబ్‌సైట్‌:https://www.nestexam.in/

NEST Question papers/Answers

2007‌ 2008 2009
2010 2011‌ 2012‌
2013 2014 2015‌
2016 2017‌ 2018
2019 Session-1 2019 Session-2

Back..

Posted on 22-01-2020