Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఐదేళ్ళ పీజీ.. ఐదువేల స్టైపెండ్‌

బేసిక్‌ సైన్స్‌ సబ్జెక్టుల్లో కెరియర్‌ను ఎంచుకోవాలనుకునేవారు ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్‌సీ చదవటం ప్రయోజనకరం. ఈ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశపరీక్ష- నేషనల్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ (నెస్ట్‌) ప్రకటన ఇటీవలే విడుదలైంది. దీనిలో అర్హత సాధిస్తే ప్రతిష్ఠాత్మకమైన నైసర్‌, ముంబయి యూనివర్సిటీల్లో కోర్సులను అభ్యసించే అవకాశం కలుగుతుంది. అంతే కాదు, విద్యాభ్యాసంతో పాటు నెలనెలా స్టైపెండ్‌ అందుకునే వీలూ ఉంటుంది!

ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ పూర్తిచేసినవారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. మాస్టర్స్‌ డిగ్రీ, ఆపై పీహెచ్‌డీ పూర్తిచేస్తే జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో శాస్త్రవేత్తలుగా స్థిరపడవచ్చు. విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌లుగా అర్హత సాధించవచ్చు. బేసిక్‌ సైన్సెస్‌లో మాస్టర్స్‌ చేస్తే అధ్యాపకులుగా స్థిరపడవచ్చు. భువనేశ్వర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చి (నైసర్‌)లోనూ, ముంబయి యూనివర్సిటీ- అటామిక్‌ ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌ సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ బేసిక్‌ సైన్స్‌లోనూ అత్యాధునిక పరిశోధక ప్రయోగశాలలు, కంప్యుటేషనల్‌ సౌకర్యాలున్నాయి. ప్రముఖ శాస్త్రవేత్తలతో విద్యాబోధన నిర్వహిస్తారు. ఈ సంస్థలు బయాలజీ, కెమిస్ట్రీ, మేథమేటిక్స్‌, ఫిజిక్స్‌ మొదలైన సబ్జెక్టుల్లో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్‌సీ కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సుల్లో అర్హత సాధించినవారు భారత ప్రభుత్వం నెలకు రూ.5000 చొప్పున అందించే ఇన్‌స్పైర్‌ స్కాలర్‌షిప్‌, సమ్మర్‌ ప్రాజెక్టు కోసం ఏడాదికి అందించే రూ.20,000 పొందటానికి అర్హులు.

నెస్ట్‌- ప్రవేశపరీక్షకు మన తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్‌ లేదా 10+2ను 2017 లేదా 2018లో పూర్తిచేసిన ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ విద్యార్థులు, 2019 పరీక్షలు రాస్తున్న ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ విద్యార్థులు అర్హులు. జనరల్‌ కేటగిరీ, ఓబీసీ విద్యార్థులకు ఇంటర్మీడియట్‌లో 60% మార్కులుండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, పీడీ విద్యార్థులు 55% మార్కులు సాధించివుండాలి.

ఏ సబ్జెక్టులో ఏవి ముఖ్యం?
గత ప్రశ్నపత్రాలను బట్టి సంబంధిత సబ్జెక్టులో ఎక్కువ దృష్టిసారించాల్సినవి-
బయాలజీ: జనరల్‌ బయాలజీ, సెల్‌ బయాలజీ, జెనెటిక్స్‌, ఎకాలజీ అండ్‌ ఇవల్యూషన్‌, బయోటెక్నాలజీ, యానిమల్‌ ఫిజియాలజీ, ప్లాంట్‌ ఫిజియాలజీ, డీఎన్‌ఏ ధర్మాలు, ఆర్‌డీఎన్‌ఏ టెక్నాలజీ, ట్రాన్స్‌లేషన్‌, ట్రాన్‌స్క్రిప్షన్‌ మొదలైనవి.
కెమిస్ట్రీ: ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో జనరల్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, రియాక్షన్‌ మెకానిజం, స్టీరియో కెమిస్ట్రీ, నేమ్‌డ్‌ రియాక్షన్స్‌, ఏరోమ్యాటిసిటీ, కార్బోహైడ్రేట్స్‌, అమైనో యాసిడ్స్‌, పాలిమర్స్‌, ఫిజికల్‌ కెమిస్ట్రీలో మోల్‌ కాన్సెప్ట్‌, సొల్యూషన్స్‌, సాలిడ్‌ స్టేట్‌, ఎలక్ట్రో కెమిస్ట్రీ, కెమికల్‌ కైనటిక్స్‌, థర్మోడైనమిక్స్‌ సంబంధిత అంశాలు.ఇనార్గానిక్‌ కెమిస్ట్రీలో సంశ్లిష్ట సమ్మేళనాలు, ఎస్‌, పి బ్లాక్‌ మూలకాలు, డి, ఎఫ్‌ బ్లాక్‌ మూలకాలు, మెటలర్జీ మొదలైనవి.
ఫిజిక్స్‌: జనరల్‌ ఫిజిక్స్‌, ఆప్టిక్స్‌, మోడరన్‌ ఫిజిక్స్‌, ఎలక్ట్రిసిటీ, మాగ్నటిజమ్‌, మెకానిక్స్‌.
మేథమేటిక్స్‌: కాల్‌క్యులస్‌, త్రికోణమితి, కోర్డానేట్‌ జామెట్రీ, ఆల్జీబ్రా, వెక్టర్స్‌.
అభ్యర్థులు బట్టీ ధోరణిలో కాకుండా సబ్జెక్టును అవగాహన చేసుకుని విభిన్న అంశాలను అన్వయించగలిగితే నెస్ట్‌లో స్కోరు సాధ్యమవుతుంది. గత ప్రశ్నపత్రాలు (2007-18) వెబ్‌సైట్‌ (www.nestexam.in) లో ఉన్నాయి.

ప్రవేశపరీక్ష ఎలా?
ఇది ఆబ్జెక్టివ్‌ విధానంలో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష. ప్రశ్నలన్నీ ఆంగ్లమాధ్యమంలో ఉంటాయి. సమయం 3.30 గంటలు.
సెక్షన్‌-1: జనరల్‌ సెక్షన్‌. ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ అందరికీ ఉంటుంది. నెగెటివ్‌ మార్కులుండవు. 30 మార్కుల వెయిటేజీ.
సెక్షన్‌-2 నుంచి సెక్షన్‌-5: వీటిలో బయాలజీ, కెమిస్ట్రీ, మేథమేటిక్స్‌, ఫిజిక్స్‌ విభాగాలకు సంబంధించి ప్రశ్నలుంటాయి. అన్ని సెక్షన్లలోని ప్రశ్నలకు సమాధానం రాసే వీలు విద్యార్థులకు ఉంటుంది. ప్రతి సెక్షన్‌కూ 50 మార్కుల వెయిటేజీ. ఈ సెక్షన్లలో ఎక్కువ మార్కులు సాధించిన మూడింటిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఈ విభాగాలకు నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంది. కొన్ని ప్రశ్నలకు ఒకటికన్నా ఎక్కువ సమాధానాలుంటాయి.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ స్థాయిలో...
ప్రవేశపరీక్ష నైసర్‌ స్థాయిలో విద్యార్థుల విశ్లేషణ, తార్కిక సామర్థ్యాలను పరీక్షించేలా ఉంటుంది. ప్రశ్నలు ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ స్థాయిలో ఉంటాయి. అందుకని మొదట సిలబస్‌, పరీక్ష విధానాలపై పూర్తి అవగాహన తెచ్చుకోవాలి. ప్రాథమిక అంశాలతో సన్నద్ధత ప్రారంభించాలి. అందుకు తెలుగు అకాడమీ, సీబీఎస్‌ఈ, ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు మేలు. ఆపై టాపిక్‌లవారీగా రిఫరెన్స్‌ పుస్తకాల ద్వారా అధ్యయనం చేయాలి. ప్రవేశపరీక్షకు ఇంకా 5 నెలల సమయం ఉంది. కాబట్టి, ఇంటర్‌ రెండో ఏడాది చదువుతున్నవారు ఇప్పటినుంచే ప్రతిరోజూ 5-6 గంటలు కష్టపడి చదవాలి. వీలైనన్నిసార్లు సిలబస్‌ను పునశ్చరణ (రివిజన్‌) చేయాలి. మాదిరి ప్రశ్నల సాధన, కంప్యూటర్‌ ఆధారిత నమూనా ప్రశ్నపత్రాలను ప్రయత్నించాలి.
వెబ్‌సైట్‌: www.nestexam.in

బ్రోచర్ & సిలబస్

- ఎస్‌. కిరణ్‌కుమార్‌
డైరెక్టర్‌, కెమ్‌బయోసిస్‌ కోచింగ్‌ సెంటర్‌


Back..

Posted on 07-01-2019