Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
పరీక్షలు మూడు..ప్రిపరేషన్‌ ఒకటే!

     డిగ్రీ కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాల అర్హత పరీక్ష కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో సెట్‌ ప్రకటనలు వెలువడ్డాయి. ఇప్పటికే జాతీయస్థాయి అర్హత పరీక్ష (నెట్‌) దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఇదే సమయంలో ఈ సెట్‌ ప్రకటనలు రావటం వల్ల ఒకే సన్నద్ధతతో మూడు పరీక్షలు రాసుకొనే అవకాశం వచ్చింది. పి.జి. పూర్తిచేసిన, ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలు రాస్తున్న తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఇది సంతోషదాయకం!
మాతృభాషలో పరీక్ష రాసుకునే బృహత్తర అవకాశం స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (సెట్‌ ) ద్వారా కలుగుతోంది. యూజీసీ- సీఎస్‌ఐఆర్‌, యూజీసీ-నెట్‌ ఆంగ్లం, హిందీ మాధ్యమాల్లో మాత్రమే రాసుకునే అవకాశం (భాషా పేపర్లు తప్ప) ఉంటుంది. కానీ సెట్‌లో చాలా పేపర్లు ఆంగ్ల మాధ్యమంతోపాటు తెలుగు మాధ్యమంలోనూ ప్రశ్నపత్రాలుంటాయి. అందువల్ల యూజీసీ-సీఎస్‌ఐఆర్‌, యూజీసీ-నెట్‌ పరీక్షల్లోని భాషా అవరోధాలను అధిగమించి మంచి ఫలితాలు పొందే అవకాశముంది.
ఏ పరీక్ష ఎప్పుడు? ఎలా?
టీఎస్‌ సెట్‌- 2018
తెలంగాణలో టీఎస్‌ సెట్‌ను ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. అర్హతగల అభ్యర్థులు తమ సన్నధ్ధతను వెంటనే ప్రారంభించడం శ్రేయస్కరం.
* దరఖాస్తు స్వీకరణ ఆన్‌లైన్‌లో: 14.3.2018 నుంచి 14.4.2018 వరకు.
* పరీక్ష తేది: 15.07.2018
* గమనిక: రూ.3000 ఆలస్య రుసుముతో 15.5.2018 లోపు దరఖాస్తు చేసుకొనేవారు హైదరాబాద్‌ కేంద్రాల్లో మాత్రమే పరీక్ష రాయాల్సి ఉంటుంది.
ఏపీసెట్‌- 2018
ఆంధ్రప్రదేశ్‌లో ఏపీసెట్‌- 2018ను ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. పూర్తిస్థాయి ప్రకటన మార్చిలో విడుదలవుతుంది. ప్రాథమిక సమాచారం మేరకు...
* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ: 26.03.18 నుంచి 02.05.18 వరకు.
* పరీక్ష తేది: 01.07.2018
అర్హతలు
* సంబంధిత సబ్జెక్టులో పోస్టుగ్రాడ్యుయేషన్‌ లేదా తత్సమాన అర్హత కల్గిన డిగ్రీ ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సరం పీజీ పరీక్షలు రాసేవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే పరీక్ష ఫలితాల అనంతరం పీజీ ఉత్తీర్ణత సర్టిఫికెట్‌ను సెట్‌ కార్యాలయంలో సమర్పించి, ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది.
* జనరల్‌ అభ్యర్థులకు పీజీ డిగ్రీలో సంబంధిత సబ్జెక్టులో 55%, ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, దివ్యాంగులకు (పీడబ్ల్యూడీ)-50% మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి.
* గరిష్ఠ వయఃపరిమితి లేదు.
* ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయవలసి ఉంటుంది.
* పూర్తి సమాచారానికి.. టీఎస్‌ సెట్‌: www.telanganaset.org లేదా www.osmania.ac.in
* ఏపీ సెట్‌: apset.net.in లేదా andhrauniversity.edu.in వెబ్‌సైట్లు చూడొచ్చు.
సిలబస్‌
పేపర్‌-1 అందరికీ ఒకేలా ఉంటుంది. ఇందులో ప్రధానంగా అభ్యర్థుల బోధనా, పరిశోధనాంశాల్లో జ్ఞానం, అవగాహన సామర్థ్యాలను మదింపు చేస్తారు. జ్ఞానాత్మక సామర్థ్యాలు, అవగాహన, విశ్లేషణ, మూల్యాంకనం, ఆగమన, నిగమన, తార్కిక వివేచనలు, సహజ వనరులు, పర్యావరణ అంశాలపై సాధారణ పరిజ్ఞానం, ఆధునిక జీవన విధానంపై వీటి ప్రభావం మొదలైన అంశాలపై లోతైన అవగాహన అవసరం.
* పేపర్‌-1లో ముఖ్యమైన ప్రతి అంశం నుంచీ ప్రశ్నలు అడిగే అవకాశముంది. ప్రధానంగా 10 విభాగాలున్నాయి. ప్రతి విభాగం నుంచి ప్రశ్నలు అడిగే ఆస్కారమున్న కాన్సెప్టులను ఎంచుకుని సన్నద్ధమవటం మేలు.
1) బోధనాభిరుచి (టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌) 2) పరిశోధనాభిరుచి (రిసెర్చ్‌ ఆప్టిట్యూడ్‌) 3) పఠనావగాహన (రీడింగ్‌ కాంప్రహెన్షన్‌) 4) సంభాషణ (కమ్యూనికేషన్‌) 5) గణిత వివేచన (మేథమేటికల్‌ రీజనింగ్‌) 6) తార్కిక వివేచన (లాజికల్‌ రీజనింగ్‌) 7) దత్తాంశ వ్యాఖ్యానం (డేటా ఇంటర్‌ప్రిటేషన్‌) 8) ఐ.సి.టి. (ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ) 9) ప్రజలు - పర్యావరణం (పీపుల్‌-ఎన్విరాన్‌మెంట్‌) 10) ఉన్నత విద్యావ్యవస్థలో సుపరిపాలన (హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌- గవర్నెన్స్‌).
పై విభాగాల్లో బోధనా స్వభావం, లక్ష్యాలు, లక్షణాలు, బోధనా పద్ధతులు, మూల్యాంకనం, పరిశోధన-స్వభావం, సోపానాలు, పద్ధతులు, విలువలు, పరిశోధన వ్యాసం-లక్షణాలు, కమ్యూనికేషన్‌ లక్షణాలు, రకాలు, అవరోధాలు, తార్కిక వివేచనలు, ఇంటర్నెట్‌, ఈ-మెయిల్‌, ఐసీటీ లాభాలు, నష్టాలు; పర్యావరణం, కాలుష్యం, మానవ జీవనంపై వాటి ప్రభావం, ఉన్నత విద్యాసంస్థల నిర్మాణం, నియత, దూరవిద్య, వృత్తి, సాంకేతిక విద్య, సాధారణ విద్య, విలువల విద్య, పరిపాలన మొదలైన అంశాలను విస్తృతంగా అధ్యయనం చేయవలసి ఉంటుంది.
* సెట్‌ ఉత్తీర్ణత పొంది, అర్హులైనవారు ఆయా రాష్ట్రాల్లో మాత్రమే డిగ్రీ కళాశాలలు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలకు అర్హులు.
* యూజీసీ సీఎస్‌ఐఆర్‌, యూజీసీ నెట్‌ ఉత్తీర్ణత పొంది, క్వాలిఫై అయినవారు దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలకు అర్హులు.
* ఒకటి కంటే ఎక్కువ పీజీ కోర్సుల్లో ఉత్తీర్ణత పొందినవారు, తమకు ఎక్కువ ప్రతిభ ఉన్నదాంట్లో నెట్‌/సెట్‌ రాయడం మంచిది. ఒకే నెలలో (జులై) పరీక్షలు ఉన్నందున ఇష్టపడి కృషి చేస్తే .. విజయం తథ్యం!
ఎలా చదవాలి?
గతంలో 3 పేపర్లు ఉండేవి. యూజీసీ నెట్‌లో మారిన పరీక్ష విధానంలా, సెట్‌లోనూ ప్రస్తుతం 2 పేపర్లు మాత్రమే ఉంటాయి. పేపర్‌-1 అభ్యర్థులందరికీ ఒకేలా, పేపర్‌-2 వారు ఎంచుకున్న సబ్జెక్టులో ఉంటుంది. పరీక్ష సమయాన్ని చాలా తగ్గించారు. సబ్జెక్టులోని కాన్సెప్టుల్లో సామర్థ్యాన్ని పెంచుకునేలా కృషిచేస్తూనే నిర్ణీత సమయంలో అన్ని ప్రశ్నలకూ సరైన సమాధానాలు రాయాలి. ఈ ప్రకారం అభ్యర్థులు అభ్యాసం, ఆచరణ చేపట్టాలి.
సన్నద్ధతకు కింది అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
* నిర్దేశించిన సిలబస్‌ను పూర్తిగా అభ్యసించాలి.
* గత సంవత్సరాల నెట్‌, సెట్‌ ప్రశ్నపత్రాలను విశ్లేషణ చేయాలి. ముఖ్యమైన అంశాలను ప్రాధాన్య క్రమంలో గుర్తించి స్టడీ మెటీరియల్‌/నోట్స్‌ తయారు చేసుకోవాలి.
* వీలైనంతవరకు షార్ట్‌కట్‌లను తయారు చేసుకోవాలి.
* ప్రామాణిక పుస్తకాలు, మెటీరియల్‌ ఆధారంగా సొంతంగా నోట్స్‌ తయారు చేసుకోవాలి.
* ప్రతిరోజూ అంశాలను అభ్యాసం చేయడంతోపాటు, పునశ్చరణనూ చేయాలి.
* స్వీయ విశ్లేషణ చేసుకొని, పొరపాట్లు సరిదిద్దుకోవాలి.
* కఠినమైన అంశాల అవగాహనకు స్నేహితులనూ, అధ్యాపకులనూ సంప్రదించాలి.
* సమయపాలన చాలా ప్రధానం. నిర్ణీత సమయంలో అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాసేలా సాధన చేయాలి.
* ఆత్మవిశ్వాసం, ప్రేరణ తుదివరకూ కొనసాగించాలి.
* పరీక్షలో సహజంగానే కొంత ఆందోళన, ఒత్తిడి వుంటుంది. సరైన ప్రణాళిక, అభ్యాసం, ఆచరణతో ఉత్తమ ఫలితాలు సొంతమవుతాయి.
ఎన్ని పేపర్లు?
స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌లో పేపర్‌-1, పేపర్‌-2 అనే రెండు పేపర్లను అభ్యర్థులు రాయాల్సి ఉంటుంది.
* పేపర్‌-1: జనరల్‌ పేపర్‌ (టీచింగ్‌ ఖీ రిసెర్చ్‌ ఆప్టిట్యూడ్‌) 50 ప్రశ్నలు 100 మార్కులు
* పేపర్‌-2: పీజీ స్థాయిలో అభ్యర్థులు ఎంచుకొన్న సబ్జెక్టు 100 ప్రశ్నలు 200 మార్కులు

డాక్ట‌ర్ వి.బ్ర‌హ్మం

posted on 12.03.2018