Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
కామర్స్‌లో అర్హత ఖాయం!

     అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు, పరిశోధన రంగంలో ప్రవేశించేందుకు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది. ఒకే రకమైన సిలబస్‌తో వరుసగా మూడు వారాల్లో మూడు పరీక్షలు రాసేందుకు వీలు కలిగింది. కచ్చితంగా అర్హత పొందేందుకు కాలం కలిసి వచ్చింది. ఇక సరైన ప్రణాళికతో సిద్ధం కావడమే మిగిలి ఉంది.
జాతీయ స్థాయిలో యూజీసీ-నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (యూజీసీ-నెట్‌), మరోవైపు తెలంగాణ రాష్ట్ర స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టీఎస్‌-సెట్‌), ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఏపీ సెట్‌లకు ఇటీవల నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. యూజీసీ ఇటీవల ప్రకటించిన నిబంధనల ప్రకారం కొత్త పద్ధతిలో మొదటిసారిగా పరీక్షలను జులైలో వరుసగా మూడు వారాలు నిర్వహించనున్నారు. ఒక ప్రిపరేషన్‌తో మూడు పరీక్షలు రాసే సువర్ణావకాశం అభ్యర్థులకు దక్కింది.
ఈ మూడు పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు పరిశోధనతోపాటు యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నియామకాలకు అర్హత పొందుతారు. ఏపీ-సెట్‌ జులై 1న, యూజీసీ-నెట్‌ జులై 8న, టీఎస్‌-సెట్‌ జులై 15న జరగనున్నాయి. 3 నుంచి 4 నెలల సమయం ఉంది.
సిలబస్‌ విశ్లేషణ
మొదటి పేపర్‌ అందరికీ కామన్‌గా ఉంటుంది. అందులో అభ్యర్థుల టీచింగ్‌, పరిశోధన సామర్థ్యాలను పరిశీలిస్తారు. ఇప్పుడు పేపర్‌-2 మాత్రమే ఉంది. ఇది కూడా అభ్యర్థులకు కలిసి వచ్చే అంశం. కామర్స్‌ సిలబస్‌ పరిశీలిస్తే...
యూనిట్-1 బిజినెస్ ఎన్విరాన్‌మెంట్
ఈ సబ్జెక్టులో బిజినెస్ ఎన్విరాన్‌మెంట్ అంశాలు, ఆర్థిక పర్యావరణం, ఆర్థిక పాలసీలు, ఆర్థిక ప్లానింగ్; భారతదేశంలో వ్యాపార, న్యాయ పర్యావరణం, కాంపిటీషన్ పాలసీ, వినియోగదారుల పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, సెకండ్ జనరేషన్ సంస్కరణలు, పారిశ్రామిక విధానం, పారిశ్రామిక అభివృద్ధి, పరిమాణాత్మక మార్పులు లాంటి అంశాలను నిర్దేశించారు. దీనిలోని వివిధ భావనలు, సంవత్సరాలు, ఇతర అంశాలను వర్తమాన వివరాలతో కలిపి చదవాలి.
యూనిట్ - 2 ఆర్థిక, నిర్వహణ అకౌంటింగ్
దీనిలో ప్రాథమిక అకౌంటింగ్ భావనలు, మూలధనం, రాబడి అంశాలు, ఆర్థిక నివేదికలు, భాగస్వామ్య ఖాతాలు - ప్రవేశం, విరమణ, మరణం, రద్దు, నగదు పంపిణీ, కంపెనీ ఖాతాలు - వాటాల జారీ, జప్తు, వ్యాపార కొనుగోలు, లిక్విడేషన్, వాటాల మూల్యాంకనం, సంయోగం, సంలీనం, పునర్నిర్మాణం, హోల్డింగ్ కంపెనీ ఖాతాలు ఉంటాయి.
కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటింగ్ - నిష్పత్తి విశ్లేషణ, నిధులు, నగదు ప్రవాహ నివేదికలు, ఉపాంత వ్యయం, బ్రేక్ ఈవెన్ విశ్లేషణ, ప్రామాణిక కాస్టింగ్, బడ్జెటరీ నియంత్రణ, బాధ్యతయుత అకౌంటింగ్ లాంటి అంశాలను నిర్దేశించారు. దీనిలో ముఖ్యంగా ప్రాథమిక భావనలు, సూత్రాలు చదవాలి. చిన్నచిన్న సమస్యలను ఎక్కువగా సాధన చేయాలి.
యూనిట్-3 వ్యాపార అర్థశాస్త్రం
దీనిలో ప్రధానంగా వ్యాపార అర్థశాస్త్రం స్వభావం, ఉపయోగాలు; లాభం, సంపద గరిష్ఠీకరణ, డిమాండ్ విశ్లేషణ, సమోపాంత రేఖల విశ్లేషణ, ప్రయోజన విశ్లేషణ, రాబడి సూత్రాలు, వ్యయం, రాబడి, వివిధ మార్కెట్లలో ధరల నిర్ణయం, పరిపూర్ణ మార్కెట్, ఏకస్వామ్య పోటీ, ఏకస్వామ్యం, ధర విచక్షణ, పరిమిత స్వామ్యం, ధర వ్యూహాలు లాంటివి చేర్చారు. అభ్యర్థులు వివిధ సిద్ధాంతాల నిర్వచనాలు, ప్రమేయాలు, సంవత్సరాలు, భిన్న పటాలను ఉదాహరణలతో విశ్లేషిస్తూ లోతుగా చదవాలి.
యూనిట్-4 వ్యాపార గణాంకశాస్త్రం - దత్తాంశ విశ్లేషణ
దీనిలో దత్తాంశ రకాలు, దత్తాంశ సేకరణ, విశ్లేషణ, ప్రతిచయనం - ఆవశ్యకత, దోషాలు, ప్రతిచయన పద్ధతులు, సాధారణ డిస్ట్రిబ్యూషన్, పరికల్పనలను పరీక్షించడం, దత్తాంశ విశ్లేషణ, సహ సంబంధం, ప్రతిగమన విశ్లేషణ, స్మాల్ శాంప్లింగ్, టెస్టుల్లో T - టెస్ట్, F - టెస్ట్, ఖైస్క్వేర్ టెస్ట్; డేటా ప్రాసెసింగ్ అంశాలు, దత్తాంశ ప్రవేశం, దత్తాంశ ప్రాసెసింగ్, కంప్యూటర్, అప్లికేషన్ ఇన్ అకౌంటింగ్, ఇన్వెంటరీ కంట్రోల్, మార్కెటింగ్ లాంటి అంశాలను చేర్చారు. దీనిలో ముఖ్యంగా వివిధ పద్ధతుల సూత్రాలు, వాటి వినియోగం తెలుసుకోవాలి. తగినన్ని సమస్యలను సాధన చేయాలి. సూత్రాలను నోట్ చేసుకుంటూ చదివితే మంచి స్కోరు సాధించవచ్చు.
యూనిట్-5 వ్యాపార నిర్వహణ
దీనిలో నిర్వహణ సూత్రాలు, ప్రణాళికా ధ్యేయాలు, వ్యూహాలు; ప్రణాళికా ప్రక్రియ, నిర్ణయాలు తీసుకోవడం, వ్యవస్థీకరణ, వ్యవస్థ స్వరూపం, అధికార, అనధికార వ్యవస్థలు; వ్యవస్థ సంప్రదాయం, సిబ్బందీకరణ, నాయకత్వం, ప్రేరణ, కమిటీ, సమాచార వ్యవస్థ, నియంత్రణ, కార్పోరేట్ పరిపాలన, వ్యాపార నియమాలు లాంటి అంశాలను నిర్దేశించారు. ఈ విభాగంలోని శాస్త్రవేత్తల పేర్లు, వివిధ సంవత్సరాలు, గ్రంథాల పేర్లు, వివిధ పద్ధతులపై పట్టు సాధించాలి.
యూనిట్-6 మార్కెటింగ్ మేనేజ్‌మెంట్
ఇది ముఖ్యమైన విభాగం. దీని నుంచి దాదాపు 12 లేదా 14 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. దీనిలో మార్కెటింగ్ ఆవిర్భావం, మార్కెటింగ్ భావన, మార్కెటింగ్ మిశ్రమం, మార్కెటింగ్ పర్యావరణం, వినియోగదారుడి ప్రవర్తన, మార్కెటింగ్ విభాగీకరణ, వస్తువుల, ధరల, పంపిణీ, ప్రమోషన్ నిర్ణయాలు; మార్కెటింగ్ ప్రణాళిక వ్యవస్థీకరణ, నియంత్రణ, పరిశోధనలు; ఆన్‌లైన్ మార్కెటింగ్, డైరెక్ట్ మార్కెటింగ్, భారతదేశ మార్కెటింగ్‌కు సంబంధించిన సామాజిక, ఎథికల్, న్యాయపరమైన అంశాలు లాంటివి చేర్చారు. వీటికి సంబంధించి ప్రతిభావనను లోతుగా, వర్తమాన విశేషాలతో కలిపి అధ్యయనం చేయాలి. ముఖ్యమైన వాటిని నోట్ చేసుకుంటూ చదివితే చివరలో త్వరగా రివిజన్ చేసుకోవచ్చు.
యూనిట్-7 ఆర్థిక నిర్వహణ శాస్త్రం
దీనిలో మూలధన నిర్మాణం, ఫైనాన్షియల్, ఆపరేటింగ్ లీవరేజ్, మూలధన వ్యయం, బడ్జెటింగ్, నిర్వహణ; డివిడెండు విధానం అంశాలు చేర్చారు. అభ్యర్థులు వివిధ భావనలు, సూత్రాలపై అవగాహన పెంచుకుంటూ చిన్నచిన్న సమస్యలను సాధన చేయాలి.
యూనిట్-8 మానవ వనరుల నిర్వహణ
అభ్యర్థులు అర్హత సాధించడంలో ఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది. దీని నుంచి 12 లేదా 14 ప్రశ్నలు రావచ్చు. ఈ సబ్జెక్టులో మానవ వనరుల నిర్వహణ, భావనలు, పాత్ర - విధులు, మానవ వనరుల ప్రణాళికీకరణ, నియామకం, ఎంపిక, శిక్షణ, అభివృద్ధి, విజయవంతమైన ప్రణాళికీకరణ, పరిహారం, వేతనం, జీతం, ప్రోత్సాహకాలు, ఫ్రింజ్ బెన్‌ఫిట్స్, ఉత్పాదకత, పనితీరును అంచనావేయడం, పారిశ్రామిక సంబంధాలు, ఆరోగ్యం, భద్రత, సంక్షేమ - సామాజిక పరిరక్షణ, నిర్వహణలో కార్మికుల పాత్ర లాంటి అంశాలు చేర్చారు. అభ్యర్థులు అన్ని అంశాలను క్షుణ్ణంగా, లోతుగా విశ్లేషిస్తూ చదవాలి. దీనిపై ఎక్కువగా దృష్టి పెడితే మంచి స్కోరు సాధించవచ్చు.
యూనిట్- 9 బ్యాంకింగ్, విత్తసంస్థలు
వ్యాపారంలో బ్యాంకింగ్ ప్రాముఖ్యత, బ్యాంకుల రకాలు, వాటి విధులు; భారతీయ రిజర్వు బ్యాంకు, నాబార్డు, గ్రామీణ బ్యాంకులు, భారతదేశంలో బ్యాంకింగ్ రంగ సంస్కరణలు, నిరర్ధక ఆస్తులు, క్యాపిటల్ అడెక్వసీ పద్ధతలు, ఈ - బ్యాంకింగ్, డెవలప్‌మెంట్, బ్యాంకింగ్, ఐడీబీఐ, ఐఎఫ్‌సీఐ, యూటీఐ, సిడ్బీ లాంటి అంశాలను దీనిలో నిర్దేశించారు. ఈ సెక్షన్‌ను చదివేటప్పుడు అభ్యర్థులు ముఖ్యంగా బ్యాంకులను స్థాపించిన సంవత్సరాలు, ప్రధాన కార్యాలయాలు, ఛైర్మన్‌ల పేర్లు, విధులు, బ్యాంకుల్లో జరిగే మోసాలు, ఇంకా బ్యాంకింగ్ రంగానికి సంబంధించి వర్తమాన అంశాలను చదవాలి.
యూనిట్-10 అంతర్జాతీయ వ్యాపారం
ఇది అభ్యర్థులు ఎక్కువ శ్రద్ధ చూపాల్సిన సబ్జెక్టు. దీని నుంచి కూడా 12 లేదా 14 ప్రశ్నలు అడగవచ్చు. దీనిలో అంతర్జాతీయ వ్యాపార సిద్ధాంతాలు, చెల్లింపుల సమానత, అంతర్జాతీయ ద్రవ్యత్వం, అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు - ఐఎమ్ఎఫ్, ప్రపంచ బ్యాంకు, ఐఎఫ్‌సీ, ఐడీఏ, ఏడీబీ; ప్రపంచ వాణిజ్య సంస్థ విధులు, విధానాలు; భారతదేశ విదేశీ వర్తక నిర్మాణం - కూర్పు, నిర్దేశనం; ఎక్సిమ్ బ్యాంకు, విధానం, విదేశీ వర్తక అభివృద్ధి, నియంత్రణ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ), బహుళ జాతీయ సంస్థలు, జాయింట్ వెంచర్స్, ప్రాంతీయ ఆర్థిక సమగ్రత, SAARC, ASEAN, EC, NAFTA, డబ్ల్యూటీవో, మేధో సంపద హక్కులు, విదేశీ ఎక్స్ఛేంజ్ రేటు పద్ధతి, రిస్క్ నిర్వహణ, అంతర్జాతీయ చెల్లింపులు, బదిలీ, రూపాయి కన్వర్టిబిలిటీ, కరెంట్, కాపిటల్ అకౌంట్స్; సమస్యలు, పరిజ్ఞానం, డెరివేటివ్స్, ఫ్యూచర్స్, విదేశీ మదింపు సంస్థలు, పత్రాలు, GDRs, ADRs, FIIల పాత్ర లాంటి అంశాలు ఉన్నాయి. ఇందులో అభ్యర్థులు వివిధ సంస్థలను స్థాపించిన సంవత్సరాలు, ప్రధాన కార్యాలయాలు, వాటి అధిపతులు, వివిధ భావనలు, రేట్లు తదితరాలను వర్తమాన విశేషాలతో జోడించి చదవాలి.
యూనిట్-11 అకౌంటింగ్, ఫైనాన్స్
భారతదేశంలో అకౌంటింగ్ ప్రమాణాలు, ద్రవ్యోల్బణ అకౌంటింగ్, మానవ వనరుల అకౌంటింగ్, బాధ్యతాయుత అకౌంటింగ్, సామాజిక అకౌంటింగ్, ద్రవ్య - మూలధన మార్కెట్, భారతదేశంలో స్టాక్ ఎక్స్ఛేంజీల పనితీరు, NSE, OTCEI, NASDAQ, డెరివేటివ్స్, ఆప్షన్ వ్యవహారాలు, నియంత్రణ సంస్థలు - సెబీ, రేటింగ్ ఏజెన్సీలు, నూతన ఇన్‌స్ట్రుమెంట్స్, GDRs, ADRs, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్, సంయోగం, కొనుగోలు, మ్యూచువల్ ఫండ్స్, లీజ్ ఫైనాన్సింగ్, ఫ్యాక్టరింగ్, సెక్యూరిటీలు, పోర్టుఫోలియో, రిస్క్, దాన్ని అంచనా వేయడం; అకౌంటింగ్, ఫైనాన్స్‌లో కంప్యూటర్ వినియోగం లాంటి అంశాలను నిర్దేశించారు. అభ్యర్థులు అకౌంటింగ్ ప్రమాణాలు, ఐఎఫ్ఆర్ఎస్, వివిధ స్టాక్ ఎక్స్ఛేంజీల పని తీరు, వస్తున్న మార్పులను, భావనలను వర్తమాన వివరాలతో అనుసంధానం చేసి అధ్యయనం చేయాలి.
యూనిట్-12 ఆదాయపు పన్ను చట్టం, పన్ను ప్రణాళిక
ఈ సబ్జెక్టులో ఆదాయపు పన్ను, ప్రాథమిక భావనలు, నివాస స్థితి, పన్ను విధింపు, మినహాయింపు ఆదాయం, వివిధ శీర్షికల్లో పన్ను విధించే ఆదాయ గణన, వ్యక్తులు, సంస్థ విధించే ఆదాయ పన్ను గణన; పన్ను తగ్గింపు, రిటర్న్‌లు దాఖలు చేయడం, వివిధ రకాల మదింపు, డిఫాల్ట్స్, జరిమాణాలు, పన్ను ప్రణాళికీకరణ, భావన, ప్రాముఖ్యత, పన్ను ప్రణాళికీకరణలో సమస్యలు, పన్ను ఎగవేత; పన్ను ప్రణాళికీకరణ పద్ధతులు, ప్రత్యేక వ్యాపార నిర్ణయాల్లో పన్నును పరిగణించడం, కొనుగోలు స్వామ్యం లేదా లీజు; తిరిగి భర్తీ చేయడం, ఎగుమతులు లేదా స్వదేశి అమ్మకాలు నిలిపివేయడం లేదా మూసివేయడం, విస్తరణ లేదా ఒప్పందం, పెట్టుబడులు లేదా ఉపసంహరణ, ఆదాయపు పన్ను, పన్ను ప్రణాళికల్లో కంప్యూటర్ వినియోగం లాంటి అంశాలను పేర్కొన్నారు.ఈ విభాగంలో ప్రాథమిక భావనలు, వివిధ సెక్షన్లు, పన్ను రేట్లు, పన్ను గణన తదితరాలను చదవాలి. వీలైనన్ని ఎక్కువ సమస్యలను ప్రాక్టీస్ చేయాలి.

- డాక్ట‌ర్ ఎం.మ‌ల్లారెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌చ, ఎస్ఆర్ఆర్ ప్ర‌భుత్వ క‌ళాశాల‌, క‌రీంన‌గ‌ర్‌

posted on 21.03.2018