Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
కలిసుంటే కలదు కొలువు!

ఉద్యోగం సంపాదించుకోవడం ఎలా? అప్లికేషన్‌ పెట్టేస్తే అయిపోదు..! మంచి మార్కులు ఉంటే చాలదు..! ర్యాంకు వచ్చిందని కాలర్‌ ఎగరేస్తే కుదరదు..! ఇంకేం చేయాలి? సన్నిహితులు కావాలి. పరిచయాలు పెంచాలి.. కుదిరినప్పుడల్లా కలవాలి. మాటలు కలపాలి.. మార్గాలు వెతకాలి. అనుబంధాల వలను అల్లుకోవాలి. అదే నెట్‌వర్కింగ్‌. ప్రాజెక్ట్‌ వర్క్‌ల నుంచి కోరుకున్న కొలువుల వరకు అన్నింటినీ అందించే ఆధునిక మంత్రం.
కళాశాలలో ప్రాంగణ నియామకాలు జరుగుతున్నాయి. అందరూ నానా హైరానా పడుతున్నారు. సిద్ధార్థ్‌ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. చాలా నెమ్మదిగా, సంతోషంగా ఉన్నాడు. కారణం- అంతకు ముందే అతని చేతిలో ఆఫర్‌ లెటర్‌ ఉంది. అదెలా సాధ్యమైందో మిగతా స్నేహితులకు అర్థం కాలేదు. ఇంటర్న్‌షిప్‌ సమయంలోనూ అంతే! అందరికంటే ముందు అతనే చేరాడు. ఒకటి దొరకడానికే మిగిలినవారు కష్టపడుతుంటే.. అతను మూడేసి ఇంటర్న్‌షిప్‌లు చేశాడు. పోనీ తరగతిలో టాప్‌ ర్యాంకరా అంటే అదీ కాదు. సగటు విద్యార్థే! అయినా ఇవన్నీ ఎలా సాధ్యమంటే.. కారణం- నెట్‌వర్కింగ్‌.
ఉదాహరణకు- ఒక విద్యార్థి ఇంటర్న్‌షిప్‌ కోసం చూస్తున్నాడనుకుందాం. తనకు ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు ఎక్కడున్నాయో ఎలా తెలుస్తుంది? కళాశాల అధ్యాపకులు, సీనియర్లు, లేదా తెలిసిన పెద్దవాళ్ల ద్వారా తెలుసుకోవచ్చు. వారిని అడిగి తెలుసుకోవాలన్నా, లేదా వారే వీరికి సమాచారం తెలపాలన్నా పరిచయం, అడిగే చనువు ఉండాలి కదా! అదే నెట్‌వర్కింగ్‌. కొన్నిసార్లు అడగడం ద్వారానో లేదా మనమీదున్న మంచి అభిప్రాయం వల్ల వాళ్లే చెప్పడం ద్వారానో ఈ అవకాశాల గురించి తెలుస్తాయి. ఒక్క ఇంటర్న్‌షిప్‌ అనే కాదు.. ప్రాజెక్టు వర్క్‌, ఉద్యోగాలు, వ్యాపారం ఇలా ఏ విషయంలోనైనా ఈ నెట్‌వర్కింగ్‌ తోడ్పడుతుంది.

సర్వేలు ఏం చెబుతున్నాయి?
గత సంవత్సరం ఓ ప్రముఖ సంస్థ దేశంలో జరిగిన వివిధ నియామకాలపై పరిశోధన చేసింది. దాని ప్రకారం 76% కొలువుల భర్తీ నెట్‌వర్కింగ్‌ ద్వారానే జరిగింది. మిగతా 24% క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు, జాబ్‌డ్రైవ్‌లు మొదలైనవాటి ద్వారా! మరో సంస్థ సర్వే ప్రకారం 40% ఉద్యోగాలకు మాత్రమే ప్రకటనలు విడుదలవుతున్నాయి. మిగతావన్నీ నెట్‌వర్కింగ్‌ ద్వారానే నిండుతున్నాయి. ఆశ్చర్యానికి గురిచేసినా.. ఇదే నిజం. ఉద్యోగ ప్రకటనల వ్యయం తగ్గించుకుని, సమయం ఆదా చేసుకునే వీలుంటుండటంతో సంస్థలూ దీనికే ఓటువేస్తున్నాయి. కాబట్టి మంచి నెట్‌వర్కింగ్‌ నైపుణ్యాలుంటే అందరికంటే భిన్నంగానే కాదు, ముందుగానూ నిలవొచ్చు. నేడు కళాశాల నుంచి బిజినెస్‌ వరకూ నెట్‌వర్క్‌ అవసరం చాలా ఉంది. ఒక్కోసారి తప్పనిసరి కూడా. ఇది కళాశాల విద్యార్థులకు మెరుగైన అవకాశాలను అందిపుచ్చుకోవడంలో తోడ్పడుతుంది. ప్రొఫెషనల్‌ నెట్‌వర్క్స్‌ మంచి వ్యాపార అవకాశాలు, ఉద్యోగపరంగా హోదాను పెంచుకోవడంలో చాలా సాయపడతాయి.

సంబంధ బాంధవ్యాలు
కళాశాలల్లో ఫ్రెండ్స్‌తో, తమ పరిశ్రమకు చెందినవారితో, చుట్టుపక్కలవారితో పరిచయాలను పెంచుకోవడం, వారితో సంబంధ బాంధవ్యాలను కొనసాగించడమే నెట్‌వర్కింగ్‌. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే.. అవకాశాలను మెరుగుపరచుకోవడానికి ఉన్న మార్గాలను వెతుక్కోవడం, సృష్టించుకోవడం, దాన్ని కొనసాగించడం అన్నమాట. నిజానికి ప్రతి ఒక్కరికీ తెలియకుండానే తమదైన నెట్‌వర్క్‌ ఉంటుంది. కుటుంబం, స్నేహితులు, తోటి విద్యార్థులు, లెక్చరర్లు, సహచర పూర్వ విద్యార్థులతో కాంటాక్ట్‌లో ఉండటం వంటివన్నీ ఆ కోవ కిందకే వస్తాయి.

మార్గాలెన్నో!
పూర్వవిద్యార్థులు, అధ్యాపకులు: పూర్వవిద్యార్థులందరితో ముఖ పరిచయం ఉండాలనేం లేదు. కాలేజ్‌ ఫోరాల్లో ఉన్నవారి వివరాల ఆధారంగా పరిచయం పెంచుకోవచ్చు. పైగా ఒకే కళాశాల కాబట్టి, వీలైనంత సాయం చేయాలనే అనుకుంటారు. కాబట్టి, సందేహాలను నిర్భయంగా అడగొచ్చు. సలహాలనూ కోరొచ్చు. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు, వారు పనిచేస్తున్న సంస్థల గురించి వివరాలను తెలుసుకోవచ్చు. కొత్తగా సంస్థలు ఆసక్తి చూపుతున్న సాఫ్ట్‌వేర్లు మొదలైనవన్నీ వారికే బాగా తెలుస్తాయి. వీలుంటే మార్కెట్‌లోకి అడుగుపెట్టడానికి ముందే వాటినీ నేర్చుకోవచ్చు. అలాగే అధ్యాపకులంటే మీకు బోధించేవారే అవ్వాల్సిన అవసరం లేదు. ఆసక్తి ఉన్న వేరే సబ్జెక్టులను బోధించేవారైనా, గౌరవించేవారైనా పరిచయం పెంచుకోవచ్చు. వారి పని గురించి తెలుసుకోవచ్చు. కెరియర్‌ సలహాలనూ కోరొచ్చు.
ఈ-మెయిల్‌: మీరు ఆరాధించే వ్యక్తికి మీ వివరాలతో ఈ-మెయిల్‌ పంపండి. ఉదాహరణకు- మీకు ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తో, సత్యం నాదెళ్లనో ఆరాధ్య వ్యక్తులనుకోండి. వారికి మీ వివరాలతో ఈ-మెయిల్‌ చేయండి. దానిలో మీ ఆసక్తినీ, వారు ఏ విధంగా మీకు రోల్‌ మోడలో తెలియజేయవచ్చు. ఇలా ఆరాధించేవారే అవ్వాలని లేదు. పరిచయం ఉండి, కలవడం కుదరనివారికీ చేయొచ్చు.
ఈవెంట్లు, జాబ్‌ ఫెయిర్లు: చాలా కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఈవెంట్లు, ఫెయిర్లు నిర్వహిస్తుంటాయి. వాటికి వివిధ కళాశాలల విద్యార్థులతోపాటు పెద్ద పెద్ద సంస్థల రికూట్రర్లూ హాజరవుతుంటారు. వాటిల్లో పాల్గొని విద్యార్థులు, మెంటర్లతో పరిచయాలను పెంచుకోవచ్చు. కొంతమంది విద్యార్థులు నిర్వహించే సంస్థలు, సబ్జెక్టు గ్రూపులూ ఉంటాయి. ఆసక్తి ఉంటే వాటిలో చేరొచ్చు. రిక్రూటర్లతో మాట్లాడి అవకాశాల గురించీ, సంస్థల అవసరాలనూ తెలుసుకోవచ్చు.
ఇంటర్న్‌షిప్‌లు: ఇప్పుడు ప్రతి ప్రొఫెషనల్‌ కోర్సు చదివేవారికి ఇంటర్న్‌షిప్‌ దాదాపుగా తప్పనిసరి అయింది. సంస్థలు కూడా ఒకటికి మించి ఇంటర్న్‌షిప్‌లు చేసినవారికి ప్రాధాన్యాన్నిస్తున్నాయి. కాబట్టి, ఏదైనా సంస్థలో ఇంటర్న్‌గా చేరి అక్కడి ఉద్యోగులతో, తోటి ఇంటర్న్స్‌తో పరిచయాలను పెంచుకోవచ్చు. అక్కడ మీదైన ముద్రను చూపి, మంచి పేరు తెచ్చుకోగలిగితే సెలవుల్లో పార్ట్‌టైం ఉద్యోగాన్ని ఆఫర్‌ చేయొచ్చు. లేదంటే చదువు పూర్తయ్యాక ఫుల్‌ టైం ఉద్యోగాన్నీ ఇచ్చే అవకాశం ఉంటుంది.
స్టూడెంట్‌ సొసైటీలు, క్లబ్‌లు: యూనివర్సిటీ సొసైటీలు, స్టూడెంట్‌ క్లబ్‌లు కూడా నెట్‌వర్కింగ్‌కు తోడ్పడే సాధనాలే. వీటిల్లో చేరడం కేవలం కాలక్షేపానికే కాదు.. మంచి పరిచయాలను ఏర్పరచుకోవడానికి కూడా. ఈ సొసైటీలు, క్లబ్‌లకు వివిధ రకాల సంస్థలతో సంబంధాలుంటాయి. ఏవైనా ప్రోగ్రామ్‌లను నిర్వహించేటపుడు ఆర్థికసాయం కూడా చేస్తుంటాయి. ఆ సమయంలో వారితో మాట్లాడటం, కార్యక్రమాన్ని గురించి వివరించడం వంటివి చేయడం ద్వారా వ్యక్తిగత సంబంధాలను ఏర్పరచుకోవచ్చు. వివిధ ఎన్‌జీవోల్లో చేరడం, వాలంటీరింగ్‌ గ్రూపుల్లో చేరడం కూడా ఉపయోగపడుతుంది.
సోషల్‌ మీడియా: నెట్‌వర్కింగ్‌కు తోడ్పడే లింక్‌డిన్‌ వంటి సైట్లు కూడా ఉన్నాయి. ఉద్యోగులను ఎంచుకోవడంలో వీటి పాత్ర దాదాపుగా పెరుగుతోంది. కాలేజ్‌లో ఉన్నపుడే వీటిల్లో మంచి ప్రొఫైల్‌ను రూపొందించుకోండి. పూర్వవిద్యార్థులు, అధ్యాపకులను జోడించుకోవడం ద్వారా నెట్‌వర్క్‌ ప్రారంభించవచ్చు. ఆపై మీ పరిశ్రమకు చెందిన వారెందరో ఇక్కడ తారసపడుతుంటారు. వారిలో నచ్చినవారికి మెసేజ్‌ల రూపంలో వారితో స్నేహానికి మీ ఆసక్తిని తెలియపరచవచ్చు. వారు మీకు సానుకూలంగా స్పందిస్తే కెరియర్‌ పరంగా ఎలా ముందుకు సాగొచ్చో వారి నుంచి సలహాలు పొందొచ్చు. అయితే మీ ప్రొఫైల్‌లో ఎప్పటికపుడు తాజా అంశాలను జోడిస్తూ, కచ్చితమైన వివరాలతో ఉండేలా చూసుకోవడం ప్రధానం. ఒక్కోసారి నేరుగా కొలువుల సమాచారమే తెలియకపోయినా పరిశ్రమలో వస్తున్న మార్పులపై అవగాహన ఏర్పడుతుంది. అలాగే ప్రొఫెషనల్‌ గ్రూపుల్లోనూ చేరాలి. వారి మధ్య జరిగే చర్చల్లో తరచూ పాల్గొంటుండాలి.

రెండు వైపులా...
నెట్‌వర్క్‌ను రూపొందించుకోవడమే కాదు, దానిని కొనసాగించడమూ ప్రధానమే. కొన్ని గ్రూపులు అప్పుడప్పుడు వాటికి సంబంధించి కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. ముఖ్యంగా సంస్థలు, ఒకే పరిశ్రమకు చెందిన గ్రూపుల వాటికి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకుని ఉండాలి. ఇందుకు వివిధ సంస్థల వెబ్‌సైట్లు, ఆ గ్రూపుల పోస్టులు వంటి వాటిని చదివుండాలి.
* నెట్‌వర్కింగ్‌ అంటే.. రెండువైపులా ఉండాలి. మీ తోటివారితో మంచి పరిచయం ఏర్పడితే, మీతోపాటు వారికీ తోడ్పడే అవకాశమున్నవారి వివరాలు, గ్రూపుల గురించి పంచుకోవచ్చు. వారి దగ్గర్నుంచి విలువైన సమాచారాన్ని తీసుకోవచ్చు. ఈ విధానాన్ని కొనసాగిస్తుండొచ్చు కూడా. ్స విలువైన సలహాలిచ్చిన వారికి ఈమెయిల్‌/ లెటర్‌ ద్వారా థాంక్స్‌ నోట్‌ పంపించాలి. ఈ బంధాన్ని ఒక్క మీటింగ్‌కో, అవసరం తీరేంతవరకో పరిమితం చేయకుండా.. అప్పుడప్పుడూ పలకరింపుల రూపంలో కొనసాగిస్తుండాలి.

తరచూ మాట్లాడుతుండాలి
ఉద్యోగ వేటలో విజయం సాధించాలంటే పరిచయాలు తప్పనిసరి అవుతాయి. కాబట్టి కాలేజీలో ఉన్నప్పటినుంచే స్నేహితులు, సీనియర్లతో నెట్‌వర్క్‌ ఏర్పరచుకోవాలి. చేసే కోర్సుకు సంబంధించిన రంగంలో ఎవరెవరు ఉన్నారో గమనించాలి. వారి ద్వారా ఇంకా ఏ స్కిల్స్‌ అవసరమవుతాయో తెలుసుకుంటే వాటిని ముందుగానే నేర్చుకోవచ్చు. తరచూ వారితో మాట్లాడుతుంటే వారి సంస్థల్లో ఏవైనా ఖాళీలుంటే మనల్ని రిఫర్‌ చేసే వీలుంటుంది. అయితే కేవలం అవసరమున్నపుడే మాట్లాడుతున్నట్టుగా ఉండకూడదు. తరచూ పలకరించడం, సలహాలు అడగడం లాంటివి చేస్తుండాలి. స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా కొలువుల సమాచారం తెలిసినా ఉపయోగకరమే కదా! నా వరకూ నేను నా కజిన్‌ ద్వారా మొదటి ఉద్యోగం పొందాను. ఎక్కడైనా ఖాళీలున్నపుడు తను నాకు చెబుతుండేది. ఉద్యోగం సాధించడానికి మన స్కిల్సే కారణమైనా, అసలు ఖాళీలు ఎక్కడున్నాయో తెలిస్తేనే కదా వాటిని నిరూపించుకోగలిగేది! నెట్‌వర్క్‌లో ఒక్కొకరు ఒక్కోలా ఉంటారు. వారందరితో ఒకేలా సాగాలంటే.. వాదనలు, వ్యతిరేక భావాలు ఉన్నవారితో ఆ విషయాల గురించి ప్రస్తావన తేకుండా ఉండటమే మేలు. ఒకవేళ వచ్చినా పట్టించుకోకుండా ఉండగలగాలి. వయసులోనో, స్థాయిలోనో పెద్దవారైనపుడు పలకరించే విధానంలోనూ, మాట్లాడే విధానంలోనూ మర్యాద పాటించడం తప్పనిసరి. అలాగే వారిని మెసేజ్‌ల రూపంలో కంటే ఫోన్‌ ద్వారానో, నేరుగానో అప్పుడప్పుడు పలకరించడం, కలుస్తుండటం చేస్తే మంచిది.
- శ్రావిక వాసిరెడ్డి, ఎంఎన్‌సీ ఉద్యోగిని

స్నేహితులు సాయపడ్డారు
మొదట నౌక్రీ, మాన్‌స్టర్‌ లాంటి జాబ్‌సైట్లలో నా రెజ్యూమెను అప్‌లోడ్‌ చేశాను. అలా నాకు ఓ సంస్థలో ఖాళీలున్నట్లు తెలిశాయి. అదెంతవరకూ నిజమో, ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియలేదు. అపుడు లింక్‌డిన్‌లో నా వివరాలతో నమోదు చేసుకున్నాను. అక్కడ దాదాపుగా అన్ని సంస్థలు, పరిశ్రమలోని వ్యక్తుల వివరాలుంటాయి. అలా ఆ సంస్థకు చెందిన ఒకరితో మాట్లాడాను. నిజానికి అప్పుడు సంస్థలో ఖాళీలు లేవు. కానీ కొంచెం స్నేహం ఏర్పడింది. అప్పుడప్పుడూ పలకరిస్తుండేదాన్ని. ఒకసారి ఖాళీలున్నపుడు తన ద్వారా సమాచారం తెలిసింది. సంస్థ ఒక అభ్యర్థిలో ఏమేం చూస్తుంది? ఏ సబ్జెక్టులు చూసుకోవాలి వంటి అంశాలు గ్రహించాను.
అలా ఆ సంస్థలో ఉద్యోగానికి ఎంపికయ్యాను. కానీ, కన్ఫర్మేషన్‌ ఆలస్యమైంది. ఈలోపు నేను వేరే సంస్థకు ప్రయత్నించాను. అప్పుడూ అందులో ఉన్న నా స్నేహితురాలి సాయం ఉపయోగపడింది. ఈ రెండు సందర్భాల్లోనూ.. పరిచయాలే తోడ్పడ్డాయి. చాలావరకూ ఖాళీలకు సంబంధించి సమాచారమంతా వాస్తమే అవ్వాలనేం లేదు. కొన్ని అవాస్తవాలూ ఉంటాయి. ఇలాంటప్పుడు తెలిసినవారు ఉంటే సాయపడతారు. కాబట్టి ఎప్పటికప్పుడు పరిచయాలు చేసుకుంటూ ఉండాలి. సోషల్‌ వెబ్‌సైట్లలో పరిశ్రమలకు సంబంధించిన గ్రూపుల్లో చేరుతుండాలి.
- దీప్తి గుప్తా, గ్లోబల్‌ డేటా

 

Back..

Posted on 11-8-2018