Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
కాంతులీనే కొత్త కెరియర్లు!

ఉద్యోగం కావాలంటే ఏం చేయాలి? పాత దారుల్లో వెళితే ఉద్యోగాన్వేషణ ప్రయాణం సుదీర్ఘంగా సాగవచ్చు. ఒక్కోసారి ఎంతకూ గమ్యం చేరలేకపోవచ్చు. అదే కొత్త మార్గంలో వెళితే నాలుగు అడుగులు వేయకముందే ఉద్యోగ వరమాల మీ మెడలో పడవచ్చు. ఉద్యోగం కావాలంటే మంచి కంపెనీలో చేరడం పాత పద్ధతి. ఆ మంచి కంపెనీ సరైన మార్గంలో లేకపోతే కొంతకాలానికే కనుమరుగై పోవచ్చు. అందుకే పదికాలాలపాటు నిలబడే ఉద్యోగం కావాలంటే కొత్త దృష్టి అవసరం. అలాంటి అంతర్నేత్రంతో చూస్తే సంక్షోభం, నియంత్రణ, విస్తరణ, భద్రత వంటివి కూడా ఉద్యోగాన్నిచ్చే అమృత కలశాలే! వీటిలో నిమగ్నమైన వేలాది కంపెనీలు లక్షల ఉద్యోగావకాశాలతో ఎదురు చూస్తున్నాయి. నూతన సంవత్సరంలో వీటిని అందుకునేందుకు మరి మీరు సిద్ధమవుతారా..!

కొత్త సంవత్సరంలో కొన్ని రంగాలు ఉరకలెత్తనున్నాయి. ఆ రంగాలేవో తెలుసుకోవడం ద్వారా ముందు నుంచే తగిన మార్గాలు వేసుకోవచ్చు. ఆర్థికాభివృద్ధికీ ఉద్యోగావకాశాలకూ అవినాభావ సంబంధం ఉందని అందరికీ తెలిసిందే. ఆర్థికవ్యవస్థ వృద్ధిరేటు 7% దాటితేనే ప్రతినెలా ఉద్యోగాల కోసం మార్కెట్‌లోకి దూసుకువచ్చే 10 లక్షల మంది యువతకు విభిన్న రంగాలు తలుపులు తెరుస్తాయని ఆర్థికవేత్త రఘురాం రాజన్‌ పదే పదే చెబుతుంటారు.
2019 నుంచి రాబోయే సంవత్సరాల్లో ఆర్థికవృద్ధి పరుగులెడుతుందని ఆర్థిక రంగ నిపుణుల అంచనా. దేశంలో 100 కోట్ల మంది వినియోగదారులు నిత్యం వివిధ ఉత్పత్తులు, సేవలు వినియోగించుకుంటారు. తలసరి ఆదాయం కూడా బాగా పెరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. సరిగ్గా ఇక్కడే లక్షల ఉద్యోగావకాశాలు ఉద్భవిస్తాయి. వాటిని ఒడిసి పట్టుకోవడమే మన పని. దీనికితోడు అమెరికా, చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్యం మనకి కలసి వస్తోంది. మొత్తమ్మీద మన ఆర్థిక వ్యవస్థ బలం పుంజుకుంటూ వివిధ రంగాలు కొత్త రంగులు అద్దుకుంటున్నాయి. వాటికి సరికొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తున్నాయి. అవే యువతకు కొత్త ఉద్యోగ బాటలు వేస్తున్నాయి.

ఆతిథ్యం, ఈ-కామర్స్‌, ఆన్‌లైన్‌ షాపింగ్‌, ఆహార సరఫరా
గడిచిన ఏడాదిలో ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నా కొన్ని రంగాలు భేషుగ్గా ఉన్నాయి. ఆతిథ్య రంగంలో ఓయో రూమ్స్‌, ఈ-కామర్స్‌, ఆన్‌లైన్‌ షాపింగ్‌ రంగంలో ఫ్లిప్‌కార్ట్‌, ఉడాన్‌, ఆహార సరఫరాకు స్విగ్గీ సంస్థలు వందల కోట్ల రూపాయల వ్యాపారాన్ని సృష్టించి లక్షల ఉద్యోగావకాశాలను కల్పించాయి. ఇదే తరహాలో 2019లో కొన్ని రంగాల ద్వారా సంబంధిత ఉద్యోగాలకు గిరాకీ రానుంది. వాటిని గ్రహిస్తే కెరియర్‌పరంగా సన్నద్ధం కావొచ్చు.
దేశ మార్కెట్‌పై భరోసాతో, ముందుచూపుతో పెట్టుబడులకు సాహసించే వెంచర్‌ కేపటలిస్టులు వందల కోట్ల డాలర్లను వివిధ రంగాల్లో గుమ్మరిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం విభిన్న రంగాల్లో ఉత్పత్తులు, సేవలు అందిస్తున్న కంపెనీలు, అంకుర సంస్థలు కొత్త ఆదాయ మార్గాలను వెతుక్కుంటున్నాయి. వాటికి అటువంటి నవీన మార్కెట్లు కనిపెట్టడానికి, వాటిలోకి ప్రవేశించడానికి, అదనపు ఆదాయాలను ఆర్జించి పెట్టేందుకు ఉపకరించేవారే ఎదుగుదల నిపుణులు (గ్రోత్‌ ఎక్స్‌పర్ట్స్‌). వీరినే బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఎక్స్‌పర్ట్స్‌ అంటున్నారు. ప్రస్తుతం తామున్న మార్కెట్లలో ఆదాయాల్లో ఎదుగుదల మందగించినపుడు వీటికి కొత్తగా సిరులు కురిపించే మార్కెట్లు అవసరం. అలాగే నవీన ఆలోచనలతో ఉత్పత్తులు, సేవలు అందిస్తున్న అంకురాలకు వాటిని, సరైన చోటు గుర్తించి అందించడం ద్వారా ఆదాయాలను కురిపించగలిగే నిపుణులు అవసరం.

ఈ ఉద్యోగాలు ఉజ్వలం
వందకోట్ల వినియోగదారులున్న భారత విపణిలో వినియోగదారుల అభిరుచులు, ఆలోచనలు, జీవనశైలిలో వస్తున్న మార్పుల వల్ల కొత్త ఉద్యోగావకాశాలు కెరటాల్లా తన్నుకు వస్తున్నాయి. వీటిని గుర్తించి ఎంత త్వరగా ఆవైపు వెళ్లగలిగితే అవకాశాలను చేజిక్కించుకోవచ్చు.
* డిజిటల్‌ నిపుణులు
డిజటల్‌ జగత్తు ఈ విశ్వాన్ని కమ్మేస్తోంది. ఇప్పటి తరం వినియోగదారులు ఒక వస్తువు కొనేందుకు బైకులు వేసుకుని రోడ్ల వెంట తిరగడం లేదు. అరచేతిలోని బుల్లి మొబైల్‌ తెరపై ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారు. కొనాలనుకుంటున్న వస్తువును నఖశిఖ పర్యంతం పరిశీలిస్తున్నారు. ఆ వస్తువు లభ్యమయ్యే వివిధ విపణులను డిజిటల్‌ జగత్తులో విహరిస్తూ పరిశీలిస్తున్నారు. ఎక్కడ చవకో తెలుసుకుని, ఆపై నిర్ణయం తీసుకుంటున్నారు. ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేసి, ఇంటికి వస్తువును రప్పించుకుంటున్నారు. డిజిటల్‌ మార్కెట్‌లో లేని సంస్థల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోంది.
ఇక్కడే ఐటీ నిపుణులకు ఉజ్వల ఉద్యోగావకాశాలున్నాయి. కేవలం కోర్సుల ద్వారానే ఉద్యోగాలు రావు. సంప్రదాయ మార్కెట్లపై లోతైన అవగాహన, వినియోగదారుల ఆలోచనలకు అనుగుణంగా ఆన్‌లైన్‌ షాపింగ్‌ మలచగలిగే వెబ్‌ అనలిస్టులు, సెర్చ్‌ ఇంజిన్‌ నిపుణులు, కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ సాఫ్ట్‌వేర్‌ నిపుణులకు సంస్థలు ద్వారాలు తెరచివున్నాయి.
* సైబర్‌ భద్రత సామర్థ్యాలు
వినియోగదారుల సమాచార భద్రత సంస్థలను పీడకలలా వెంటాడుతున్న తరుణంలో సైబర్‌ సెక్యూరిటీ నిపుణుల కోసం సంస్థలు వలవేసి గాలిస్తున్నాయి. తమ సర్వర్‌లో నిక్షిప్తమైన వినియోగదారుల సమాచారాన్ని హ్యాకింగ్‌ గద్దలు ఎగరేసుకుపోకుండా కాపలా కాయగల సైబర్‌ భద్రతా వ్యవస్థ నిర్మాణంలో పనిచేయగల నిపుణులు భారతీయ సంస్థలకు వేల సంఖ్యలో అవసరం ఉంది.
ఈ విభాగంలోకి ప్రవేశించాలంటే కేవలం ఐటీ కోర్సు చేసి ఉంటే చాలదు. గంటలకొద్దీ సమయం కంప్యూటర్‌ ముందు ఒంటరిగా కూర్చుని తమ సంస్థ ఆన్‌లైన్‌ వ్యవస్థల్లోకి అక్రమంగా చొరబాటు చేయగల (హ్యాకింగ్‌) సాంకేతిక మార్గాలను నిరంతరం వేయి కళ్లతో వెదుకుతూ గుట్టుమట్టులను పట్టుకోగలగాలి. ఆపై ఆ మార్గాన్ని మానివేయడం, వ్యవస్థను పటిష్ఠం చేయడం మరో విభాగం చేపడుతుంది. ఐటీ కోర్సులతోపాటు ఎథికల్‌ హ్యాకింగ్‌పై పట్టు కోసం స్వల్పకాల సర్టిఫికెట్‌ కోర్సులను చేయడం అభిలషణీయం.
* డిజిటల్‌ బదలాయింపులోనూ..
సాంప్రదాయిక మార్కెట్‌లో మాత్రమే ఉంటే మనుగడ సాధించలేని తరుణమిది. వేలాది సంస్థలు తమ సాంప్రదాయిక మార్కెట్‌ నుంచి డిజిటల్‌ విపణికి వారధులు వేసుకుంటున్నాయి. ఈ సందర్భంగా డిజిటల్‌ బదలాయింపు నిపుణుల అవసరం ఉంది.
ఐటీ విద్యార్హతతోపాటు సేల్స్‌, మార్కెటింగ్‌లో లోతైన అవగాహన గలవారిని అవకాశాలు వెంటనే దరిచేరతాయి. వినియోగదారుల అవసరాలు గుర్తించి ఆన్‌లైన్‌లో వారి షాపింగ్‌ను థ్రిల్లింగ్‌గా మార్చగల నిపుణులకు మంచి భవిష్యత్తు ఉంది.
* డేటా సైంటిస్టులు
ప్రయోగశాలలో విభిన్న పరీక్షలు నిర్వహించి కొత్త విషయాలను వెలుగులోకి తీసుకువచ్చే వారిని శాస్త్రవేత్తలంటున్నారు. నేటి ఐటీ యుగంలో సమాచార సేకరణ అత్యంత సులభమైంది. ఐఓటీ సెన్సార్ల ద్వారా లక్షలాది వినియోగదారుల డేటా నిక్షిప్తమై ఉంటోంది.
ఆ సమాచారాన్ని విశ్లేషించి, వాటిలో దాగి ఉన్న వినియోగదారుల అభిరుచులు, కొనుగోలు ఆసక్తులు, వారి భవిష్యత్‌ అవసరాలను విశ్లేషించి కొత్త వ్యాపార అవకాశాలకు ఊపు ఇవ్వగలిగే డేటా సైంటిస్టులు ఇప్పుడు ఈ-కామర్స్‌ రంగానికి అవసరం. డేటాసైన్స్‌లో డిగ్రీతోపాటు స్టాటిస్టిక్స్‌ సబ్జెక్టు తెలిసిన యువతీయువకులు డేటా సైంటిస్టులుగా రాణిస్తారు.

సమాచార ఉద్యోగ గుప్తనిధి
ఒక సంస్థ నుంచి సేవలు పొందడానికి సాధారణ వినియోగదారుడు తన వ్యక్తిగత సమాచారం ఇవ్వాల్సి వస్తోంది. పేరు, వయసు, చిరునామా, ఆధార్‌ నంబరు (అవసరమైనచోట), బ్యాంకు ఖాతా వివరాలు తదితర సమాచారం సదరు సంస్థ వద్ద ఎప్పటికీ నిల్వ ఉంటాయి. అయితే ఇలాంటి వ్యక్తిగత సమాచారాన్ని సదరు సంస్థ ఇతరత్రా ప్రయోజనాలకు మళ్లించినా, సదరు సంస్థ నుంచి మరొకరు చౌర్యం చేసినా అది కంపెనీ మెడకు చుట్టుకుంటోంది. సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌, ఇంకా కొన్ని సంస్థలు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటూ ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థల ముందు దోషిలా నిలబడుతున్నాయి. ఇలాంటి విశ్వాస ఘాతుకాన్ని నివారించి వినియోగదారుల హక్కుల పరిరక్షణకు వివిధ దేశాలు జీడీపీఆర్‌- జనరల్‌ డేటా ప్రొటెక్షన్‌ రెగ్యులేషన్‌ లాస్‌ (సాధారణ సమాచార పరిరక్షణ, నియంత్రణ చట్టాలు) తీసుకువస్తున్నాయి. ముఖ్యంగా యూరప్‌ దేశాలు దీనివైపు వడివడిగా అడుగులు వేస్తున్నాయి.
మరోపక్క ఎన్నో భారత కంపెనీలు ఐరోపా దేశాల మార్కెట్లలోకి ప్రవేశించాలని ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే ఇలా ప్రవేశించే సంస్థలు తాము ఆయా దేశాల పౌరులకు వినియోగసేవలు అందించే క్రమంలో సమాచార సేకరణ, నిల్వ, వినియోగం విషయాల్లో అక్కడి చట్టాలకు అనుగుణంగా పనిచేయకపోతే భారీ జరిమానాలు చెల్లించాల్సి రావొచ్చు. దీనివల్ల కొత్తగా లాభాల మాట అటుంచి, అసలు సంస్థల భవిష్యత్తే బోల్తా కొట్టవచ్చు. అందువల్ల జీడీపీఆర్‌ నిబంధనలు అమలు చేసే ప్రాజెక్టు మేనేజర్లు, ఇతర నిపుణుల కోసం ఆసియా దేశాల్లో సంస్థలు జల్లెడ పట్టి వెతుకుతున్నాయి. ఎంత వేతనమైనా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాయి.
* మనదేశంలో లా కోర్సులను అందించే విద్యాసంస్థలు ప్రస్తుతం జీడీపీఆర్‌పై దృష్టిపెట్టాయి.
* అంతర్జాతీయ గుర్తింపు పొందిన జీడీపీఆర్‌ స్వల్పకాల సర్టిఫికెట్‌ కోర్సులను కొన్ని సంస్థలు అందిస్తున్నాయి.
లా లేదా, సి.ఎ. చేసినవారు సైతం ఈ కోర్సుల పట్టాలను తమ రెజ్యూమెలో చేర్చుకోవడం ద్వారా వేగంగా ఆకర్షణీయమైన ఆఫర్లను పొందవచ్చు.
వేలాది సంస్థలు డిజిటల్‌ విపణికి వారధులు వేసుకుంటున్నాయి. ఈ సందర్భంగా ఐటీ విద్యార్హతతోపాటు సేల్స్‌, మార్కెటింగ్‌లో అవగాహన పెంచుకుంటే మేలు!

అంకుర సంస్థల హవా!
గత సంవత్సరం ఐటీ, ఇతర రంగాల్లో ఆరు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. వీటిలో లక్షన్నర మందిని అంకుర సంస్థలే అక్కున చేర్చుకున్నాయి. దేశంలో ప్రస్తుతం 39 వేల స్టార్టప్స్‌ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటికితోడు ఏటా 5 వేల అంకుర సంస్థలు వచ్చి చేరుతున్నాయి. 2019లో ఒక స్టార్టప్‌ సంస్థలే అయిదు లక్షల వరకూ ఉద్యోగావకాశాలు కల్పించవచ్చని ఇన్ఫోసిస్‌ మాజీ సీఎఫ్‌ఓ మానవ వనరుల నిపుణుడు టీవీఎం పాయ్‌ అంచనా వేశారు.
దశాబ్దాల నుంచి నడుస్తున్న కంపెనీలు గానీ, కొత్తగా అంకురించిన సంస్థలు గానీ గ్రోత్‌ ఎక్స్‌పర్ట్స్‌ కోసం ఎదురుచూస్తున్నాయి. సేల్స్‌, ఛానెల్‌ డెవలప్‌మెంట్‌, కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌ సబ్జెక్టులో గతంలో మంచి అనుభవం గలవారుగానీ లేదా ఈ విషయాలతో తగిన అవగాహనతో వచ్చిన ఫ్రెషర్లను సంస్థలు ఎగరేసుకుపోతున్నాయి. ముఖ్యంగా వేగంగా అమ్ముడయ్యే వినియోగ ఉత్పత్తుల (ఎఫ్‌ఎంజీ) రంగం, ఈ-కామర్స్‌ రంగంలో నిమగ్నమైన సంస్థలకు ప్రస్తుతం ఈ అంశాల్లో అవగాహనతో పనిచేసే అభ్యర్థుల కొరత వెంటాడుతోంది.
* బీకాం, బీఏ ఆర్ట్స్‌ సబ్జెక్టుల్లో పట్టభద్రులైనవారు ఈ-కామర్స్‌లో వివిధ విద్యాసంస్థలు అందిస్తున్న ఏడాది కాలవ్యవధి కోర్సు చేయడం ద్వారా ఉద్యోగావకాశాలు అందుకోవచ్చు.
* కస్టమర్‌ రిలేషన్‌పైనా ఎంబీఏలో భాగంగానో లేదా విడిగా ప్రత్యేక కోర్సుగా డిగ్రీ పూర్తిచేసినవారికి వివిధ సంస్థలు కోర్సులను అందిస్తున్నాయి.
* ఇప్పటికే ఉత్పత్తులు, సేవల రంగాల్లో నాలుగైదేళ్ల నుంచి వేర్వేరు విభాగాల్లో పనిచేస్తున్న ముప్ఫై, ఆపై వయసు ఉన్నవారు సేల్స్‌, ఈకామర్స్‌, వినియోగదారుల సంబంధాల విభాగాల్లోకి మారడం వల్ల మంచి భవిష్యత్తు ఉంటుంది.
డేటాను విశ్లేషించి, వినియోగదారుల అభిరుచులు, అవసరాలను అంచనావేసి కొత్త వ్యాపార అవకాశాలకు ఊపు ఇవ్వగలిగే డేటా సైంటిస్టులు ఇప్పుడు ఈ-కామర్స్‌ రంగానికి అవసరం.

Back..

Posted on 01-01-2019