Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
కొత్త కొలువుల లోకం!

ఏమమ్మాయ్‌.. నువ్వేం చేస్తున్నావ్‌? ‘బీఈ’
తర్వాత..? ‘ఐతే ఐటీ.. కాకపోతే గ్రూప్స్‌!’

మన నుంచి ఇలాంటి సమాధానం రాగానే ‘అద్భుతం! చక్కటి ఆలోచన ఉంది నీకు..’ అనేస్తారు ప్రశ్నలడిగే పెద్దవాళ్లెవరైనా. అదే మనం ఏ బీఏనో, ఫ్యాషన్‌ డిజైనింగో అని చెబితే చాలావరకూ ముఖం చిట్లించేస్తారు. ‘అయ్యో..పాపం!’ అని జాలి చూపెడతారేమో కూడా. కానీ వాటినే ఇప్పుడు ‘ఆహా’ అనే రోజులు వస్తున్నాయి. ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలే కాదు.. స్టార్టప్‌ల దిశగానూ దశ తిరుగుతోంది! అమ్మాయిలకు అనువైన పనివేళలూ, సృజనకీ, శ్రమకీ తగ్గ నజరానాలు ఇందులో ఎక్కువగా ఉన్నాయి. మీరే చూడండి..
ఒకప్పుడు చదువుకున్న అమ్మాయిలు అని పిలిపించుకోవడమే గొప్ప! ఆమె ఉద్యోగం చేస్తోంది అనే గుర్తింపే ఆడవాళ్లకు గర్వంగా ఉండేది. ఆ మాత్రం పొగడ్తలకే పొంగిపోతే ఈతరం అమ్మాయిల ప్రత్యేకత ఏముంటుంది. ఇంతవరకూ ఒదిగిపోయిన సంప్రదాయ వృత్తులనూ, ఉద్యోగాలని కాదని.. వైవిధ్యమైన రంగాల్లో దూసుకుపోతున్నారు. అసలు ఎలాంటి రంగాలు అమ్మాయిలను ఆకట్టుకుంటున్నాయి.

విభిన్న ఉద్యోగాలంటే అభిమానం...
ఉదయం తొమ్మిదింటికల్లా కార్యాలయానికి వెళ్లి సాయంత్రం ఐదింటికి ముగిసే ఉద్యోగాల పట్ల మహిళలకు ఆసక్తి ఇప్పుడు క్రమంగా తగ్గుతోంది. దానికి కారణం లేకపోలేదు. ఓ వైపు కుటుంబం మరో వైపు ఉద్యోగం. ఈ రెండింటి సమన్వయంలో ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తోంది. దాంతో పనివేళలు కాస్త అనుకూలంగా ఉండే విభిన్న ఉద్యోగాలన్నా, వ్యాపారాలన్నా ఇప్పుడు మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు! దానికితోడు ఈ - కామర్స్‌ తరహా వ్యాపారాలు జోరందుకోవడం కూడా మహిళలు నయా తరహా కొలువులు అందిపుచ్చుకోవడానికి అవకాశమిచ్చాయి. అర్పితా సోమ ఇందుకు ఉదాహరణ. చదువు పూర్తయిన తర్వాత ఆమె ఏదో ఒక కార్పొరేట్‌ కొలువుతో సంతృప్తి పడాలనుకోలేదు. అందులో పడితే యాంత్రికతలోకి వెళ్లిపోతామనే ఆందోళన ఎక్కడో మనసు మూలల్లో ఉండేది. దాంతో కొత్తగా ఏదయినా చేయాలనుకున్నారు. యో గ్రేడ్‌ పేరుతో విద్యార్థులకు వివిధ రకాల ఇంటర్న్‌షిప్‌ అవకాశాలూ, ఉద్యోగావకాశాలు తెలియచెప్పే స్టార్టప్‌ని ప్రారంభించారు. ‘అమ్మాయిలైతే ఓపిగ్గా పని చేస్తారు. అంతకుమించి అంకిత భావంతో పనిచేస్తారు కాబట్టి స్టార్టప్‌ బృందాల్లో అమ్మాయిలకు చక్కని అవకాశాలు వరిస్తున్నాయి..’ అంటున్నారామె. కేవలం స్టార్టప్‌ల నిర్వహణ మాత్రమే కాదు ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాల చుట్టూ తిరిగే అనేక కొలువులు అమ్మాయిలకు సౌకర్యవంతమైన పనివేళలతో పాటూ మంచి ఆదాయాన్ని అందిస్తున్నాయి. బిగ్‌ డేటా అనలటిక్స్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌ రంగాల్లో డేటా విశ్లేషకులుగా, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నిపుణులుగానూ, ఇమేజ్‌ కన్సల్టెంట్లుగానూ, కమ్యునిటీ మేనేజర్లుగానూ ఎక్కువగా రాణిస్తున్నారు. ఒక వేళ మధ్యలో పెళ్లీ, పిల్లలూ అంటూ విరామం తీసుకున్నా ఈ ఉద్యోగాలని ఫ్రీలాన్సింగ్‌ పద్ధతిలో కూడా చేయొచ్చు. అనుభవానికి ఆత్మవిశ్వాసం తోడైతే సొంతంగా సంస్థనే పెట్టుకోవచ్చు కాబట్టి అమ్మాయిలు ఈ రంగాలని ఎంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ‘కంటెంట్‌ రైటింగ్‌ అనగానే గతంలో ఒక్క ఆంగ్లం తెలిసిన వారికి మాత్రమే అవకాశాలు అనుకునేవారు. కానీ ఇప్పుడు స్థానిక భాషల్లోనూ బోలెడు అవకాశాలు ఉంటున్నాయి..’ అంటారు కంటెంట్‌ మార్కెటర్‌గా వ్యవహరిస్తున్న నిశ్చల. ఇలా పనిచేసేవాళ్లకూ జీతాలు తక్కువని అనుకుంటున్నారేమో. ఆసక్తీ, ప్రతిభా ఉండాలే కానీ పాతిక వేల రూపాయల నుంచి యాభైవేలవరకూ అందుకోవచ్చు.

విజువల్‌ మర్చండైజింగ్‌పై ఆసక్తి..
ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ని చదువుతున్నంత సీరియస్‌గానే ఫ్యాషన్‌ డిజైనింగ్‌నీ ఉపాధి మార్గంగా ఎంచుకుంటున్నారు ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు. ఫ్యాషన్‌ ప్రపంచం చుట్టూ అపారమైన మార్కెట్‌ ఉంది. దానికి తోడు నగరీకరణ, కొత్తకొత్త బ్రాండ్‌ల రాకతో అమ్మాయిలు కేవలం డిజైనర్‌ వృత్తికే పరిమితం కావాల్సిన అవసరంలేదు. ఫ్యాషన్‌పై ఆసక్తి ఉండాలే కానీ.. ఇప్పుడు అందులోనూ రకరకాల ఉద్యోగాలు వస్తున్నాయి. వాటిల్లో ఒకటి విజువల్‌ మర్చండైజింగ్‌. మనం ఒక దుకాణంలోకి అడుగుపెట్టాలంటే ముందుగా ఏం చూస్తాం? ఆ దుకాణం తీరు తెన్నులు. ఆ దుకాణం ఎంత అందంగా, ఆకట్టుకునేలా కనిపిస్తోందనే కదా! విజువల్‌ మర్చండైజర్లు చేసే పని అదే. స్టోర్‌ని అందంగా తీర్చిదిద్దడం. అది కూడా చిన్న ఉద్యోగమేమీ కాదు. దానికీ ప్రత్యేక శిక్షణ అంటూ తీసుకోవాలి. ఆ రంగంలో స్థిరపడితే గనుక.. ఆదాయం లక్షల్లోనే ఉంటుంది. అందుకే ఆ రంగాన్ని ఎంపిక చేసుకున్నానంటోంది ముంబయిలో విజువల్‌ మర్చండైజింగ్‌లో శిక్షణ తీసుకుంటున్న లాస్య. ‘ఫ్యాషన్‌ రంగంలో అదొక్కటే కాదు ఫ్యాషన్‌ కమ్యునికేషన్స్‌ చదివిన అమ్మాయిలు ఫ్యాషన్‌ జర్నలిస్టులుగా, ఫ్యాషన్‌ ఫొటోగ్రాఫర్లుగా, టెక్స్‌టైల్‌ గ్రాఫిక్‌ డిజైనర్లుగానూ రాణించే ప్రయత్నం చేయొచ్చు...’ అంటుందామె. ప్రస్తుతం తను మార్క్స్‌ అండ్‌ స్పెన్సర్‌లో ఇంటర్న్‌షిప్‌ని పూర్తిచేసి సినిమాటోగ్రఫీని అధ్యయనం చేస్తోంది. కాస్త సృజన, మారుతున్న ఫ్యాషన్‌పై పట్టు ఉన్న అమ్మాయిలయితే ఆన్‌లైన్‌ వ్యాపారాల్లో దూసుకుపోతున్నారు. వాటివల్ల ఆదాయంతోపాటూ అపారమైన గుర్తింపూ సొంతమవుతుంది. 23 ఏళ్ల నిధి అగర్వాల్‌ ‘కార్య’ పేరుతో పెట్టిన ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌ స్టోర్‌కి రతన్‌టాటా పెట్టుబడులు పెట్టడమే ఇందుకు నిదర్శనం.

ఆర్థిక ప్రణాళికాదారుగా..
స్త్రీలు బ్యాంకు ఉద్యోగాలు, అకౌంటెంట్లుగా పనిచేయడం తెలిసిందే. కానీ ఆర్థికరంగంలో మహిళలు ఇంకొంచెం ముందడుగేస్తున్నారు. ఒకప్పుడు ఆర్థిక రంగం అనగానే అది అబ్బాయిలకు మాత్రమే పరిమితం అనే అభిప్రాయం ఉండేది. ఆ తీరు ఇప్పుడు మారింది. ఆర్థిక ప్రణాళికా సలహాదారుగా, వ్యక్తిగత ఆర్థిక సలహాదారుగా కొత్త బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో పోర్ట్‌ఫోలియో నిర్వహణ అంటే వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలు చూసే వారి సంఖ్యా పెరుగుతోంది. అది కూడా అమ్మాయిలకు నప్పే ఉద్యోగమే. ఒకప్పుడు ఐఐఎమ్‌లో అబ్బాయిల సంఖ్యే ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.. అందుకు నిదర్శనమే.. ఆర్థికరంగంలో మహిళల కోసం కొత్తగా వస్తోన్న కొలువులు..’ అంటోంది సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌గా రాణిస్తున్న శరణ్య.

పర్యావరణవేత్తలుగా..
‘జనతా గ్యారేజ్‌ సినిమా చూశారా? అందులో హీరో ఎప్పుడూ మొక్కలూ, పర్యావరణం అంటూ ఉంటాడు. తెలుసుగా! ఆ మాటకొస్తే ఈ మధ్య చాలా సినిమాల్లో కథానాయికలు కూడా పర్యావరణ ప్రేమికుల పాత్ర పోషించడం చూశాం కూడా. అవి సినిమా పాత్రలే కదా అని కొట్టిపారేయకండి. పర్యావరణం, వ్యవసాయ సంబంధిత రంగాలని చాలామంది అమ్మాయిలు తమ కెరీర్లుగా మలుచుకుంటున్నారు. గమనించారో లేదో... గత పాతికేళ్లలో లిబరల్‌ ఆర్ట్స్‌ రంగాల పట్ల విద్యార్థులకు అంతగా ఆసక్తి లేదు. కానీ ఈ మధ్యకాలంలో అనూహ్యంగా కొత్తరకం భాషలు నేర్చుకోవడానికీ, సోషియాలజీ, ఆంత్రోపాలజీ, పొలిటికల్‌ సైన్స్‌, పర్యావరణం, వ్యవసాయ రంగాల పట్ల అమ్మాయిల ఆసక్తి పెరుగుతోంది. తెలుగు సాహిత్యంతోపాటూ మానసిక శాస్త్రానికీ ఆదరణ పెరగడం విశేషం. ముంబయిలో ఒక కాలేజీలో లిబరల్‌ ఆర్ట్స్‌లో చేరడానికి మూడేళ్లకి 50 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీనిని బట్టి సంప్రదాయానికి భిన్నంగా ఉండే కోర్సులని చేయడానికి విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారని అర్థమవుతోందిగా! - డా॥ కవిత గూడపాటి, ఆర్గనైజేషనల్‌ సైకాలజిస్ట్‌

Back..

Posted on 24-09-2016