Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
పనికొచ్చే నెట్‌వర్కింగ్

స్థిరమైన ఉద్యోగం సాధించడానికి అవసరమైన పునాది కళాశాల జీవితంలోనే ఏర్పడుతుంది. చాలామంది విద్యార్థులు తరగతిలో నేర్చుకున్న విజ్ఞానానికే పరిమితం అవుతుంటారు. కానీ.. చదువులో రాణించడంతోపాటు నలుగురితో పరిచయాలు (నెట్‌వర్కింగ్) పెంచుకోవడం కూడా చాలా అవసరం. చదువు పూర్తయి బయటికి వచ్చాక మంచి ఉద్యోగం వెతుక్కోవడానికి, ఏదైనా వ్యాపారంలో రాణించడానికి ఈ పరిచయాలు బాగా ఉపయోగపడతాయి.
దాదాపు 70 నుంచి 80 శాతం ఉద్యోగాలు ఎలాంటి ప్రకటనలు లేకుండానే భర్తీ అవుతుంటాయని సర్వేలు పేర్కొంటున్నాయి. చాలా సంస్థలు తమ ఉద్యోగుల పరిచయస్తులు, బంధువులకు అవకాశం కల్పిస్తున్నాయి. అందుకే మీరు ఎంచుకున్న రంగంలో మంచి ఉద్యోగం సాధించాలంటే పరిచయాలు పెంచుకోవాలి.
* స్నేహితుల్లో నిపుణులు...
కళాశాలలో మీ సీనియర్లు, సహాధ్యాయులు, పూర్వ విద్యార్థులతో స్నేహాన్ని కొనసాగించండి. విద్యార్థి దశలో కెరియర్ గురించి చర్చించుకోవడానికి, అవగాహన ఏర్పడటానికి ఈ స్నేహితులు చాలా అవసరం. మీకు ఆసక్తి ఉన్న రంగంలో మీ స్నేహితులే నిపుణులు కావచ్చు. మీకు వారితో పరిచయం ఉంటే వారు పని చేస్తున్న సంస్థలో ఏవైనా ఇంటర్వ్యూలు జరిగితే మీకు తెలుస్తుంది.
* ఆన్‌లైన్ అనుసంధానం...
సామాజిక మాధ్యమాల ద్వారా ఉన్నతస్థాయి ఉద్యోగులతో అనుసంధానం కావచ్చు. ఫేస్‌బుక్, ట్విటర్, లింక్డ్ఇన్, గూగుల్ ప్లస్ మొదలైన సామాజిక మాధ్యమాలు ఈ విషయంలో తోడ్పడతాయి. సంస్థల యజమానులు, వివిధ రంగాల నిపుణులు, రిక్రూటింగ్ ఏజెన్సీలతో పరిచయం పెంచుకుని, దాన్ని కొనసాగించండి. కొన్నేళ్లుగా ఆయా రంగాల్లో వారికున్న పరిచయాలు మంచి ఉద్యోగాన్ని పొందడంలో మీకు ఉపయోగపడతాయి.
* సినిమా బదులు సెమినార్...
మీ రంగానికి సంబంధించి ఎక్కడైనా సదస్సులు జరుగుతుంటే వాటికి హాజరవ్వండి. మీరు దాచుకున్న డబ్బుతో విహారయాత్రకో సినిమాకో వెళ్లే బదులు ఛాంబర్ ఆఫ్ కామర్స్ లేదా ఇతర ఫెడరేషన్స్‌లో జరిగే సెమినార్లు, సదస్సులకు హాజరవడం మీ కెరియర్‌కు బాటలు వేస్తుంది. ఏదైనా సెమినార్ ఉన్నప్పుడు సోషల్ మీడియా ద్వారా దానికి ఎవరెవరు హాజరవుతున్నారో తెలుసుకోండి. ఇప్పుడు దాదాపు అన్ని కళాశాలలు గ్రూపులు, క్లబ్‌లు, అసోసియేషన్లు నిర్వహిస్తున్నాయి. గొప్ప వ్యక్తులను కలుసుకోవడానికి, పరిచయం పెంచుకోవడానికి ఇది మంచి అవకాశం. ఒకవేళ మీ కాలేజీలో అలాంటివి లేకపోతే మీరే ఒకటి ప్రారంభించండి.
* ప్రొఫెసర్లతో మాట్లాడితే...
కళాశాల స్థాయిలో తమ తమ రంగాల్లో నిష్ణాతులైన ప్రొఫెసర్లు మీకు తారసపడుతుంటారు. వాళ్లు మీకు బోధించేవారైనా కాకపోయినా వారితో పరిచయం పెంచుకోండి. మీకు ఆసక్తి ఉన్న సబ్జెక్టుకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోండి. నేర్చుకోవాలనే మీ తపనను చూసి వారూ మీకు ఈ విషయంలో తోడ్పడతారు. ఈ పరిచయం మీ భవిష్యత్ ఉద్యోగ సాధనలో సాయపడొచ్చు.
* ఇంటర్న్ నుంచే ఉద్యోగానికి...
నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి, పరిచయాలు పెంచుకోవడానికి ఇంటర్న్‌షిప్ మంచి అవకాశం. కొన్ని సంస్థలు ఇంటర్న్‌షిప్ విభాగం నుంచి శాశ్వత ఉద్యోగులను ఎంపిక చేసుకుంటాయి. దీనివల్ల ఉద్యోగ సాధనలో ఇతరుల కంటే మీరు ముందంజలో ఉండొచ్చు. మీ రెజ్యూమెలో ఇంటర్న్‌షిప్ ప్రస్తావన ఉంటే మీకు కొంత అనుభవం ఉంది కాబట్టి సమర్థంగా బాధ్యతలు నిర్వహించగలరని ఆయా సంస్థలు భావించవచ్చు. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా మీతోపాటు పనిచేసిన వారు కూడా ఏదైనా ఉద్యోగ అవకాశం ఉంటే మీకు సమాచారం అందిస్తారు.
* 30 సెకన్ల ప్రణాళిక:
నెట్‌వర్కింగ్ ఈవెంట్లు జరుగుతున్నప్పుడు వాటి నిర్వాహకులు తమతో మాట్లాడటానికి వచ్చిన వారితో తీరిక లేకుండా ఉంటారు. అలాంటి సమయాల్లో ఒక విద్యార్థిగా మీ గురించి మీరెవరు? ఏం చదువుతున్నారు? డిగ్రీ తర్వాత ఏం చేయాలనుకుంటున్నారో క్లుప్తంగా 30 సెకన్లలో చెప్పగలిగేలా సిద్ధమై ఉండాలి. ఆ నిపుణుడికి సంబంధించిన రంగంపై ఒకటి రెండు ప్రశ్నలు అడిగే పరిజ్ఞానం మీకుండాలి.
* ఎవరైనా ప్రముఖులను కలిసే ముందు వారికి సంబంధించిన ప్రాథమిక వివరాలను తెలుసుకోండి. పని చేస్తున్న సంస్థ, పుట్టిన ఊరు, చదువుకున్న పాఠశాల లాంటివేవైనా సరే. ఈ అంశాలు ఆ వ్యక్తితో మీ పరిచయం పెంచుకోవడానికి, అవతలి వారికి మీతో మాట్లాడాలనే ఆసక్తి కలిగించడానికి ఉపయోగపడతాయి.
ఇలా చేయకండి...
* మీ విజిటింగ్ కార్డు సిద్ధంగా ఉంచుకోవడం మంచిదే. కానీ అడగకుండా ఎవరికీ ఇవ్వకండి. మీ గురించి ఆసక్తి ఉన్నవారు తప్పకుండా మిమ్మల్ని అడుగుతారనే సంగతి గుర్తుంచుకోండి.
* నెట్‌వర్కింగ్ ఈవెంట్లలో కొందరు చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. నలుగురిలో ఉన్నామని మరిచిపోతుంటారు. ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు 'నాకు ఉద్యోగం కావాలి' అని నేరుగా అనకండి. ఇతరులు మాట్లాడుతుంటే అడ్డుకోకండి.
* మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవడం చాలా ముఖ్యం. సంభాషణ మొత్తం పూర్తయ్యాక 'మీ గురించి తెలుసుకోవచ్చా?' అని అవతలి వారు అడగాల్సిన పరిస్థితి కల్పించకండి.
సోషల్ మీడియా...
* విద్యార్థి దశలో లింక్డ్ఇన్, ఇతర సామాజిక మాధ్యమాలను ఉపయోగించాల్సిన అవసరం లేదని భావించకండి. మీ పరిచయాలను బలపరచుకోవడానికి సామాజిక మాధ్యమాలే తోడ్పడతాయి. లింక్డ్ఇన్ ఇటీవలే విద్యార్థుల కోసం కొత్త ఆప్షన్లను ప్రవేశపెట్టింది.
* ఉద్యోగ అవకాశాల గురించి తెలుసుకోవడానికి లింక్డ్ఇన్, ట్విటర్ మంచి సాధనాలు. లింక్డ్ఇన్ ద్వారా మీరు ఎంచుకున్న రంగంలో నిపుణుల గురించి తేలికగా తెలుసుకోవచ్చు. తద్వారా ఏవైనా ఉద్యోగ అవకాశాలు ఉంటే మీ దృష్టికి వస్తాయి.
- పి.వి.ఎస్. రవీంద్ర వర్మ, సీఈఓ - ఫార్ములా హెచ్ఆర్‌సీ, కెరీర్ పండిట్స్

Back..

Posted on 27-10-2016