Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఆహార సాంకేతిక నిపుణులకు ఆహ్వానం!

కొత్త దారిలో కెరియర్‌ వెతుక్కోవాలనుకునే అభ్యర్థులకు ఫుడ్‌ టెక్నాలజీ మంచి ఎంపిక. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో రోజు రోజుకూ పరిధిని పెంచుకుంటున్న ఈ రంగం నిపుణుల కోసం ఎదురు చూస్తోంది. నిఫ్టెమ్‌ లాంటి కొన్ని ప్రముఖ సంస్థలు అందిస్తున్న యూజీ, పీజీ స్థాయి కోర్సులు చేస్తే ఆ ఉద్యోగావకాశాలను అందుకోవచ్చు.

ఆహారం వృథాకాకుండా నిల్వ చేసుకునే టెక్నాలజీ మన దేశంలోనూ వేగంగా వృద్ధి చెందుతోంది. దాదాపు 30 శాతం మంది మనవాళ్లు ప్రాసెస్‌ చేసిన ఆహారాన్ని తీసుకుంటున్నారని ఒక అంచనా. దీంతో సంబంధిత పరిశ్రమలు విస్తరిస్తున్నాయి. వ్యవసాయ క్షేత్రం నుంచి వచ్చే పంటలను శుద్ధి చేయడం, తినేందుకు సిద్ధం చేయడం, నిల్వ, ప్యాకింగ్‌తో పాటు వాటిని మార్కెట్‌ చేయడంలాంటి విధులను అనేకమంది నిర్వహిస్తున్నారు. దీంతో ఆ నైపుణ్యాలను నేర్పించేందుకు కొన్ని సంస్థలు ప్రత్యేకంగా కోర్సులను అందిస్తున్నాయి. అలాంటి యూజీ, పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రాముల్లోకి 2019 - 20 సంవత్సరానికి ప్రవేశాలకు నిఫ్టెమ్‌ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ టెక్నాలజీ ఆంత్రప్రిన్యూర్‌షిప్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మన దేశంలోని ఫుడ్‌ టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌ రంగంలో సమస్యలను పరిష్కరించేందుకు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ టెక్నాలజీ ఆంత్రప్రిన్యూర్‌షిప్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (నిఫ్టెమ్‌)ను హరియాణాలో ఏర్పాటు చేసింది. ఈ సంస్థ సరికొత్త పరిజ్ఞానం, విద్యా విషయాలను విస్తరించేందుకు కృషి చేస్తుంది. నిఫ్టెమ్‌ ఆహార ప్రాసెసింగ్‌ టెక్నాలజీలో దేశంలోనే అగ్రగామిగా ఉంది. దేశ, ప్రపంచ వ్యాప్తంగా ఈ రంగంలోని ప్రముఖ సంస్థలతో నిర్వహణ, సాంకేతిక సంబంధాలను నిఫ్టెమ్‌ కలిగి ఉంది. ఇక్కడ ప్రణాళికబద్ధంగా విద్యాబోధన జరుగుతుంది. బోధన, పరిశోధన, కన్సల్టెన్సీ, నైపుణ్యాల అభివృద్ధి, ఇంజినీరింగ్‌, వ్యాపార అభివృద్ధి అంశాలపై అత్యాధునికమైన విద్యాబోధనను అందిస్తుంది.

అందిస్తున్న కోర్సులు
అండర్‌ గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ (బీటెక్‌): ఫుడ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో 199 సీట్లు ఉన్నాయి. నాలుగేళ్ల ఈ కోర్సులో చేరేందుకు ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణతతో పాటు జేఈఈ మెయిన్స్‌ అర్హత సాధించి ఉండాలి. మెయిన్స్‌లోని ర్యాంకుల ఆధారంగా మెరిట్‌ లిస్ట్‌ ప్రకారం కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు.
పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ (ఎంటెక్‌): రెండేళ్ల కాల వ్యవధి ఉన్న ఈ కోర్సులో ఫుడ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌, ఫుడ్‌ ప్రాసెస్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌, ఫుడ్‌ సప్లయ్‌ చైన్‌ మేనేజ్‌మెంట్‌, ఫుడ్‌ ప్లాంట్‌ ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌లోని విభాగాల్లో ఒక్కో దానిలో 21 సీట్ల చొప్పున మొత్తంగా 105 సీట్లలో గేట్‌/ నిఫ్టెమ్‌ ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలను కల్పిస్తుంది.
ఎంబీఏ: ఫుడ్‌ అండ్‌ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌తో పాటు మార్కెటింగ్‌/ ఫైనాన్స్‌/ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌లో ఒకదాన్ని స్పెషలైజేషన్‌గా ఎంచుకోవాల్సి ఉంటుంది. రెండేళ్ల వ్యవధి ఉన్న ఈ కోర్సులో 33 సీట్లకు ప్రవేశాలను కల్పిస్తుంది. సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు క్యాట్‌/ మ్యాట్‌ స్కోరు లేదా నిఫ్టెమ్‌ ప్రవేశ పరీక్ష, గ్రూప్‌ డిష్కషన్‌, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
పీహెచ్‌డీ: అగ్రికల్చర్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్‌, బేసిక్‌ అండ్‌ అప్లయిడ్‌ సైన్స్‌, ఫుడ్‌ ఇంజినీరింగ్‌, ఫుడ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఆంత్రప్రిన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌, ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీల్లో కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్‌ ఉత్తీర్ణతతో పాటు రిసెర్చ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా మొత్తం 20 సీట్లకు ప్రవేశాలు కల్పిస్తుంది. జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (జేఆర్‌ఎఫ్‌) అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష నుంచి మినహాయింపు ఉంది.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ గడువు: 25.05.2019

మరికొన్ని సంస్థలు:
* ఐసీటీ (ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ), బెనారస్‌ హిందూ యూనివర్సిటీ ఉత్తర్‌ ప్రదేశ్‌;
* కాలేజ్‌ ఆఫ్‌ ఫుడ్‌ టెక్నాలజీ, పర్బానీ, మహారాష్ట్ర;
* సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నలాజికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, మైసూర్‌;
* ఐఐటీ - ఖరగ్‌పూర్‌;
* ఐఐటీ దిల్లీ; ఎన్‌ఐటీ రూర్కెలా వంటి ఎన్నో సంస్థలు ఫుడ్‌ టెక్నాలజీకి సంబంధించిన కోర్సులను అందిస్తున్నాయి.


Back..

Posted on 29-04-2019