Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
నిట్‌ల్లో ఎంసీఏకు నిమ్‌సెట్‌

ఐటీ రంగంలోకి ప్రవేశించాలనుకునే వారికి ఇంజినీరింగ్‌కు ప్రత్యామ్నాయంగా ఉన్న ఇంకో కోర్సు ఎంసీఏ. ప్రోగ్రామింగ్‌ వృత్తిలో స్థిరపడాలన్నా, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ లేదా డిజైన్‌లో భాగస్వాములు కావాలన్నా ఈ డిగ్రీ చేయవచ్చు. ఐటీ నిపుణులు కావాలన్న తమ కలను సాకారం చేసుకోవచ్చు.

రోజురోజుకీ అభివృద్ధి చెందుతున్న ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలోకి అడుగు పెట్టాలనుకునే అభ్యర్థులకు ఇంజినీరింగ్‌ కాకుండా ఉన్న మరో చక్కటి మార్గం ఎంసీఏ (మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌). దేశంలోని ప్రఖ్యాత సంస్థల్లోని ఎంసీఏ కోర్సుల్లో చేరడానికి అర్హత కల్పించేందుకు ఏటా నిమ్‌సెట్‌ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఎంసీఏ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌) నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష ద్వారా 11 నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌)ల్లో ప్రవేశం లభిస్తుంది. వీటిలో వరంగల్‌ ఒకటి. దేశవ్యాప్తంగా 31 జాతీయ సాంకేతిక విద్యా శిక్షణ సంస్థ (నిట్‌)లు ఉన్నాయి. అయితే వీటిలో 11 మాత్రమే ఎంసీఏ కోర్సును అందిస్తున్నాయి. ఈ 11 సంస్థలూ ఉమ్మడి పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేసి ఎంసీఏ కోర్సులోకి ప్రవేశం కల్పిస్తున్నాయి. ఈ ఏడాది పరీక్షను నిట్‌ సూరత్కల్‌ నిర్వహిస్తోంది.
ఎంసీఏ అందిస్తోన్న నిట్‌లు: అగర్తలా, అలహాబాద్‌, భోపాల్‌, కాలికట్‌, దుర్గాపూర్‌, జంషెడ్‌పూర్‌, కురుక్షేత్ర, రాయ్‌పూర్‌, సూరత్కల్‌, తిరుచిరాపల్లి (ట్రిచీ), వరంగల్‌.
ఐటీ సంస్థల అవసరాల ప్రకారం ఇక్కడి ఎంసీఏ సిలబస్‌ను రూపొందిస్తారు. ఈ 11 సంస్థలూ ఒకే సిలబస్‌ను అనుసరిస్తాయి.
అర్హత: బీఎస్సీ, బీసీఏ, బీఐటీ, బీటెక్‌/ బీఈ వీటిలో ఏదైనా డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులతో (ఎస్సీ, ఎస్టీలైతే 55 శాతం) ఉత్తీర్ణత సాధించాలి. ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
సీట్ల సంఖ్య: ఎంసీఏ కోర్సు అందిస్తోన్న 11 ఎన్‌ఐటీల్లోనూ మొత్తం 805 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సీట్లన్నీ రాత పరీక్షలో చూపిన ప్రతిభ, రిజర్వేషన్ల ప్రాతిపదికన అఖిల భారత స్థాయిలో భర్తీ చేస్తారు. ఆయా నిట్‌లవారీ రాష్ట్రాల కోటా లేదు. మొత్తం 805 సీట్లలో 387 సీట్లు ఓపెన్‌ కేటగిరీ ద్వారా భర్తీ చేస్తారు. ఈ సీట్ల కోసం దేశవ్యాప్తంగా పరీక్షకు హాజరైన అభ్యర్థులంతా పోటీ పడవచ్చు. 209 సీట్లు ఓబీసీలకు, 114 ఎస్సీ విద్యార్థులకు, 54 సీట్లు ఎస్టీ అభ్యర్థులకు కేటాయించారు. దివ్యాంగుల కోసం 41 సీట్లు ఉన్నాయి (వీటిలో 18 సీట్లు కోసం దివ్యాంగులు అందరూ పోటీ పడవచ్చు. 9 సీట్లు ఓబీసీ, 9 సీట్లు ఎస్సీ, 5 సీట్లు ఎస్టీ దివ్యాంగులకు కేటాయించారు).
సంస్థలవారీ సీట్ల వివరాలు: అగర్తలా- 40, అలహాబాద్‌ - 93, భోపాల్‌ - 92, కాలికట్‌ - 46, దుర్గాపూర్‌ - 30, జంషెడ్‌పూర్‌ - 92, కురుక్షేత్ర - 60, రాయ్‌పూర్‌ - 92, సూరత్కల్‌ - 92, తిరుచురాపల్లి - 92, వరంగల్‌ - 46, కురుక్షేత్ర - 30.
పరీక్ష తేదీ: 27.05.2018 (ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు)
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రం: వరంగల్‌.
ఫలితాలు: జూన్‌ 6న ప్రకటిస్తారు.
దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.2200; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1100.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: 31.03.2018 (సాయంత్రం 5 వరకు)
వెబ్‌సైట్‌: https://nimcet.in
ప్రశ్నపత్రం
మొత్తం 120 ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు. అంటే ప్రతి ప్రశ్నకు నిమిషం సమయం కేటాయించుకోవచ్చు. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. సబ్జెక్టుల వారీ మ్యాథమేటిక్స్‌ 50 ప్రశ్నలు, అనలిటికల్‌ ఎబిలిటీ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ 40, కంప్యూటర్‌ అవేర్‌నెస్‌ 10, జనరల్‌ ఇంగ్లిష్‌ నుంచి 20 ప్రశ్నలడుగుతారు. ప్రతి సరైన జవాబుకు 4 మార్కులు. రుణాత్మక మార్కులు ఉన్నాయి. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికీ ఒక మార్కు తగ్గిస్తారు.
మార్కుల వెయిటేజీ: మొత్తం మార్కులను 1000గా పరిగణిస్తారు. అంటే మ్యాథ్స్‌లో మొత్తం మార్కులకు 3 రెట్లు, అనలిటికల్‌ ఎబిలిటీ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ మార్కులకు ఒకటిన్నర రెట్లు, కంప్యూటర్‌ అవేర్‌నెస్‌ విభాగంలోని మార్కులకు 2 రెట్లు, ఇంగ్లిష్‌ మార్కులను యథావిధిగా ఉంచి లెక్కిస్తారు. ఈ లెక్కన మ్యాథ్స్‌ విభాగానికి 600 మార్కులన్నమాట. (50 ప్రశ్నలు, ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు కాబట్టి మొత్తం 200 మార్కులు. వీటికి 3 రెట్లు అంటే 600 మార్కులు) అలాగే అనలిటికల్‌ ఎబిలిటీ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ 240 (మొత్తం 40 ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకు 4 మార్కులు కాబట్టి 160 మార్కులు. వీటికి ఒకటిన్నర రెట్లు అంటే 160+80=240 మార్కులు), కంప్యూటర్‌ అవేర్‌నెస్‌ 80 (10 ప్రశ్నలకు 40 మార్కులు దానికి రెట్టింపు 80), ఇంగ్లిష్‌ విభాగానికి 80 (20 ప్రశ్నలు. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు కాబట్టి 80) మార్కులు కేటాయించారు.

Back..

Posted on 14-02-2018