Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
శాస్త్రవేత్తలకు నైపర్‌ స్వాగతం!

తరచూ అంతు తెలియని వ్యాధి ఏదోÅ ప్రబలుతోంది అప్రమత్తంగా ఉండమని ప్రపంచ వ్యాప్తంగా ప్రకటనలు వస్తుంటాయి. మరి ఆ వ్యాధులను అరికట్టడం ఎలా.. తగిన ఔషధాలను కనిపెట్టి అందరినీ రక్షించేది ఎవరు? ఈ ప్రశ్నలను ఫార్మాస్యుటికల్‌ పరిశోధన సంస్థల్లో సమాధానం లభిస్తుంది. అక్కడి శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమిస్తూ మానవాళి సంరక్షణకు ఔషధాలను తయారు చేస్తున్నారు. ఇలాంటి ఉన్నతమైన విధుల్లో భాగస్వాములు కావాలనుకుంటే నైపర్‌ అందించే కొన్ని కోర్సులను చేయాల్సి ఉంటుంది.

ప్రపంచ వ్యాప్తంగా ఫార్మా రంగంలో పరిశోధనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నిరంతరం పుట్టుకొచ్చే కొత్త వ్యాధులు సవాళ్లు విసురుతుంటే...వాటిని అరికట్టే దిశగా ఔషధాల తయారీలో శాస్త్రవేత్తలు నిత్యం శ్రమిస్తూనే ఉన్నారు. అందుకే కొత్త ఫార్మా పరిశ్రమలు వస్తూనే ఉన్నాయి. దానికి తగ్గట్టే ఈ రంగంలో నిపుణుల డిమాండు కూడా ఎక్కువైంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా జాతీయ ఫార్మాస్యూటికల్‌ విద్యా, పరిశోధన(నైపర్‌) కేంద్రాలను నెలకొల్పి వివిధ రకాల కోర్సులు అందిస్తోంది.
2018 ఆర్థిక సంవత్సరం ప్రకారం భారత ఫార్మా రంగం విలువ రూ.రెండు లక్షల కోట్లు. ఈ రంగంలో పెరుగుతున్న ఉద్యోగ అవకాశాల్ని అందిపుచ్చుకోవడానికి అవసరమైన పీజీ, పీహెచ్‌డీ కోర్సులు అందిస్తున్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (నైపర్‌) 2019 సంవత్సరానికి ప్రవేశాలకు నైపర్‌జేఈఈ-2019 నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
కేంద్ర కెమికల్స్‌ అండ్‌ ఫర్టిలైజర్స్‌ మంత్రిత్వ శాఖ ఆధీనంలో నైపర్‌ ఉంటుంది. ఔషధ తయారీ రంగంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, పరిశోధనాత్మక నైపుణ్యాలను మెరుగుపరచడమే దీని లక్ష్యం. నైపర్‌ వివిధ విభాగాల్లో మాస్టర్‌ డిగ్రీతో పాటు పీహెచ్‌డీ కోర్సులను అందిస్తోంది. దేశంలో మొహాలీ, అహ్మదాబాద్, గువాహటి, హాజీపూర్, హైదరాబాద్, కోల్‌కతా, రాయ్‌బరేలీల్లో మొత్తం ఏడు కేంద్రాలున్నాయి. మరో నాలుగుచోట్ల వీటి ఏర్పాటుకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది.

కోర్సులు - అర్హత
* ఎంఎస్‌(ఫార్మా) - బయోటెక్నాలజీ, మెడిసినల్‌ కెమిస్ట్రీ, మెడిసినల్‌ డివైజెస్, నేచురల్‌ ప్రొడక్ట్స్, ఫార్మాస్యూటికల్‌ అనాలసిస్, ఫార్మాస్యూటిక్స్, ఫార్మాకోఇన్ఫార్మాటిక్స్, ఫార్మకాలజీ అండ్‌ టాక్సికాలజీ, రెగ్యులేటరీ టాక్సికాలజీ, ట్రెడిషనల్‌ మెడిసిన్‌.
అర్హత: బీఫార్మసీ, బీటెక్‌ (బయోఇన్‌ఫర్‌మాటిక్స్‌), ఎంఎస్సీ (బయోలాజికల్‌ సైన్సెస్‌/ ఆర్గానిక్‌/ ఫిజికల్‌/ ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ/ అనలైటికల్‌ కెమిస్ట్రీ/ బయోకెమిస్ట్రీ/ బయో టెక్నాలజీ/ మాలిక్యులర్‌ బయాలజీ/ మైక్రోబయాలజీ/ ఫార్మకాలజీ/ టాక్సికాలజీ/ లైఫ్‌సైన్సెస్‌/ మెడికల్‌ బయోటెక్నాలజీ/ జువాలజీ/ బోటనీ), బీవీఎస్సీ, బీఏఎంఎస్, ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత.
* ఎంఫార్మసీ - క్లినికల్‌ రిసెర్చ్, ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీ (ఫార్ములేషన్స్‌), ఫార్మసీ ప్రాక్టిస్‌
అర్హత: బీఫార్మసీ ఉత్తీర్ణత.
* ఎంటెక్‌ (ఫార్మా) - ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీ (బయోటెక్నాలజీ, ప్రాసెస్‌ కెమిస్ట్రీ)
అర్హత: బీఫార్మసీ, బీటెక్‌ (కెమికల్‌ ఇంజినీరింగ్‌), ఎంఎస్సీ (లైఫ్‌సైన్సెస్‌/ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ) ఉత్తీర్ణత.
* ఎంబీఏ(ఫార్మా) - ఫార్మాస్యూటికల్‌ మేనేజ్‌మెంట్‌
అర్హత: బీఫార్మసీ, బీటెక్‌ (కెమికల్‌ ఇంజినీరింగ్‌), ఎంఎస్సీ (కెమికల్‌/ లైఫ్‌ సైన్సెస్‌) ఉత్తీర్ణత.
గమనిక: ఎంబీబీఎస్‌/ బీవీఎస్సీ/ బీఏఎంఎస్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు మినహా మిగిలిన వారు జీప్యాట్‌/ గేట్‌/ నెట్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.
* పీహెచ్‌డీ - కెమికల్‌ సైన్సెస్, బయోలాజికల్‌ సైన్సెస్, ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌ విభాగాల్లో ప్రవేశాలను అందిస్తోంది.
అర్హత: ఎంఎస్‌(ఫార్మా)/ ఎంటెక్‌(ఫార్మా)/ ఎంఎస్సీ/ ఎండీ/ ఎంవీఎస్సీ/ ఎంసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
గమనిక: ఎండీ/ ఎంవీఎస్సీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు మినహా మిగిలిన వారు జీప్యాట్‌/ గేట్‌/ నెట్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం
దేశ వ్యాప్తంగా ఉన్న ఏడు నైపర్‌ ప్రాంగణాల్లో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ)ని నిర్వహిస్తారు. దేశంలో ఉన్న మూడువేలకుపైగా ఫార్మసీ కాలేజీల నుంచి లక్షల సంఖ్యలో విద్యార్థులు ఈ టెస్టుకు హాజరవుతారు. పీజీ, పీహెచ్‌డీ అభ్యర్థులకు రెండు స్టేజీల్లో ఎంపిక జరుగుతుంది. ప్రిలిమినరీ స్టేజీలో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఉంటుంది. పీజీ పరీక్షకు 200, పీహెచ్‌డీకి 170 ప్రశ్నలతో 85 మార్కులకు ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నపత్రం ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణులైన వారు తదుపరి పరీక్షకు ఎంపికవుతారు. రెండో దశలో కౌన్సిలింగ్‌ లేదా బృంద చర్చలు, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ర్యాంకుల వారీగా అభ్యర్థులు ఎంచుకున్న ప్రాంతాల్లో సీటు కేటాయించడానికి కౌన్సిలింగ్‌ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నిర్దేశాల మేరకు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్‌ ఉంటుంది.

నైపర్‌ హైదరాబాద్‌ అందిస్తున్న కోర్సులు
నైపర్‌ హైదరాబాద్‌ బాలానగర్‌లో ఉంది. ప్రత్యేకంగా ఇందులో ఎంబీఏ (ఫార్మసీ) కోర్సు అందుబాటులో ఉంది. మొత్తం 135 పీజీ, 16 పీహెచ్‌డీ సీట్లు ఉన్నాయి. కోర్సుల వారీగా సీట్ల వివరాలు ఇలా.... మెడికల్‌ కెమిస్ట్రీలో-20, ఫార్మాస్యూటికల్‌ అనాలసిస్‌-20, ఫార్మకాలజీ అండ్‌ టాక్సికాలజీ-15, ఫార్మాస్యూటికల్‌-20, రెగ్యులేటరీ టాక్సికాలజీ-15, ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీ (ప్రాసెస్‌ కెమిస్ట్రీ)-15, ఎంబీఏ(ఫార్మా)-30 సీట్లు పీజీలో ఉన్నాయి. మెడికల్‌ కెమిస్ట్రీలో-05, ఫార్మాస్యూటికల్‌ అనాలసిస్‌-03, ఫార్మకాలజీ అండ్‌ టాక్సికాలజీ-05, ఫార్మాస్యూటికల్‌-03 పీహెచ్‌డీ సీట్లను అందిస్తోంది. గతేడాది ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ఫార్మా కళాశాలలకు ప్రకటించిన ర్యాంకుల్లో దేశంలోనే నైపర్‌ హైదరాబార్‌ ఆరో స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఫార్మారంగంలో గుర్తింపు పొందిన ప్రముఖులు ఇందులో అతిథి ఉపన్యాసాలు ఇస్తుంటారు. విశాలమైన లైబ్రరీ, ప్రాక్టికల్స్‌కు అనువైన ల్యాబ్‌ సౌకర్యంతో పాటు హాస్టల్‌ వసతి ఉన్నాయి. మొత్తం కోర్సుల్లో అరవై శాతం థియరీ, నలభై శాతం ప్రాక్టికల్స్‌కి కేటాయించారు.

ఫెలోషిప్‌ ప్రత్యేకం
నైపర్‌లో సీటు పొందిన ప్రతి ఒక్కరికీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఫెలోషిప్‌ అందుతుంది. ఎంబీఏ (ఫార్మసీ) మినహా, పీజీ కోర్సుల్లో చేరేవారికి రెండేళ్లపాటు నెలకు రూ.12,400, పీహెచ్‌డీ విద్యార్థులకు మొదటి రెండేళ్లు రూ.25,000, తర్వాతి నుంచి రూ.28,000 అందిస్తారు. విద్యార్థులు సెమిస్టర్ల వారీగా ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. వాటి చెల్లింపులో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్‌ సౌకర్యం ఉంది. ఆర్థిక స్తోమత లేని వారు బ్యాంకు రుణాలు పొందే వీలుంది.

ఉద్యోగ అవకాశాలు
నైపర్‌లో పీజీ, పీహెచ్‌డీ వూర్తి చేసినవారికి ప్రపంచ వ్యాప్తంగా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కోర్సు పూర్తి చేసినవారు అమెరికా, న్యూజిలాండ్, స్పెయిన్, లండన్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో సైంటిస్టులుగా పనిచేస్తున్నారు. ప్రాంగణ నియామకాలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్, నొవార్టీస్, అబాట్‌ ఇండియా, సన్‌ఫార్మా, జీఎస్‌కే, బయోకాన్, అరబిందో వంటి అనేక సంస్థలు ఇక్కడి నుంచి విద్యార్థులను భారీ వేతనాలతో తమ కంపెనీల్లోకి ఆహ్వానిస్తున్నాయి. హైదరాబాద్‌ క్యాంపస్‌కు సంబంధించి గత ఎనిమిదేళ్ల నుంచి ఏటా 85 శాతం మంది ఉద్యోగ నియామకాల్లో ఎంపికవుతున్నారు. మిగిలిన వారు పరిశోధనల వైపు వెళ్తున్నారు.

పూర్తి సమాచారం కోసం...
మరిన్ని వివరాలకు...
నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మా స్యూటికల్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (నైపర్‌), బాలానగర్, హైదరాబాద్‌-500037, తెలంగాణ. ఫోన్‌- 040-23073741, 23073740
ఈ-మెయిల్‌: projectdirector@niperhyd.ac.in
వెబ్‌సైట్‌: www.niperhyd.ac.in


Back..

Posted on 01-04-2019