Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
భవితకు మలుపు... నైపర్‌ సీటు

ఫార్మసీలో నాణ్యమైన విద్య, ప్రమాణాలతో కూడిన పరిశోధన అందించే నైపర్‌లలో ప్రవేశానికి జరిగే పరీక్ష... నైపర్‌-జేఈఈ. దీనిలో ప్రతిభ ఆధారంగా నైపర్‌ క్యాంపస్‌లలో పీజీ స్థాయి కోర్సులు, పీహెచ్‌డీల్లో ప్రవేశం లభిస్తుంది. ఇక్కడ చదివేవారు ఉపకారవేతనంతో పాటు ప్రాంగణ నియామకాలూ పొందగలుగుతున్నారు!
మనదేశంలో దినదినాభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఔషధ రంగం ఒకటి. ఈ రంగానికి ప్రోత్సాహాన్ని అందించి, బలోపేతం చేయటానికి దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వం స్థాపించినవే నైపర్‌లు (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసర్చ్‌). ఫార్మసీ రంగంలో నిపుణులైన మానవ వనరులను ఇవి తీర్చిదిద్దుతున్నాయి.
మొట్టమొదటి నైపర్‌ను పంజాబ్‌లోని మొహాలీలో 1991లో స్థాపించారు. మిగతా ఆరు నైపర్‌లు హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, గౌహతి, హాజాపూర్‌, కోల్‌కత, రాయ్‌బరేలీలో 2007లో ఏర్పాటయ్యాయి.
ఈ ఏడు నైపర్స్‌లో 4 విభాగాల్లో 16 పీజీ కోర్సులు, పీహెచ్‌డీకి అవకాశముంది. #
ఎం.ఎస్‌. (ఫార్మసీ)
* మెడిసినల్‌ కెమిస్ట్రీ * నేచురల్‌ ప్రొడక్ట్స్‌ * ట్రెడిషనల్‌ మెడిసిన్‌ * ఫార్మాస్యూటికల్‌ అనాలిసిస్‌ * ఫార్మకాలజీ అండ్‌ టాక్సికాలజీ * రెగ్యులేటరీ టాక్సికాలజీ * ఫార్మాస్యూటిక్స్‌ * బయోటెక్నాలజీ * ఫార్మకో ఇన్‌ఫర్మాటిక్స్‌ * మెడికల్‌ డివైజెస్‌
ఎం. ఫార్మసీ
* ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీ (ఫార్ములేషన్స్‌) * ఫార్మసీ ప్రాక్టీస్‌ * క్లినికల్‌ రిసర్చ్‌
ఎంటెక్‌ (ఫార్మసీ)
* ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీ (ప్రాసెస్‌ కెమిస్ట్రీ) * ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీ (బయో టెక్నాలజీ)
ఎంబీఏ:
* ఫార్మాస్యూటికల్‌ మేనేజ్‌మెంట్‌
పీహెచ్‌డీ:
* పై వాటిలో చాలావరకూ కోర్సుల్లో.
ఉపకార వేతనం: నైపర్‌లో ప్రవేశం పొందిన ప్రతి విద్యార్థికీ (ఎంబీఏ ఫార్మా; ప్రభుత్వ/ప్రైవేటు స్పాన్సర్డ్‌ విద్యార్థులకు తప్ప) నెలకు రూ.12,400 ఉపకార వేతనం (స్కాలర్‌షిప్‌) వస్తుంది. పీహెచ్‌డీ విద్యార్థులకు మొదటి రెండు సంవత్సరాలు నెలకు రూ.25,000 ఫెలోషిప్‌, తర్వాత మూడు సంవత్సరాలకు నెలకు రూ.28,000 ఫెలోషిప్‌ను ఇస్తారు.
ఎంబీఏ ఫార్మాలో ఎంపిక చేసిన ముగ్గురు విద్యార్థులకు నైపర్‌ నెలకు రూ.12,400 ఉపకారవేతనంగా అందిస్తుంది.
విద్యార్హతలు: సంబంధిత డిగ్రీలో 60 శాతం మార్కులు లేదా సీజీపీఏ 6.75 ఉండాలి. రిజర్వేషన్‌ విద్యార్థులకు మినహాయింపులుంటాయి. ప్రతి విద్యార్థికీ కౌన్సెలింగ్‌ సమయానికి జీప్యాట్‌/గేట్‌/నెట్‌లో అర్హత కార్డు తప్పనిసరిగా ఉండాలి. అయితే ఈ నిబంధన బీవీఎస్‌సీ, ఎంబీబీఎస్‌, బీఏఎంఎస్‌/ఎండీ, ఎంవీఎస్‌సీ విద్యార్థులకు వర్తించదు.
ప్రవేశపరీక్ష: నైపర్‌-జేఈఈ 2016 రాతపరీక్షా కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌ ఉంది. ఒక కేంద్రంలో రాతపరీక్షకు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే పరీక్ష కేంద్రాన్ని మారుస్తారు.
ప్రశ్నపత్రం 200 మార్కులకు ఉంటుంది. పూర్తిగా ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఉండే ఈ పరీక్ష సమయం రెండు గంటలు. ప్రశ్నలు బీఫార్మసీ, ఎమ్మెస్సీ స్థాయిలో ఉంటాయి. కొన్ని ప్రశ్నలు జనరల్‌ ఆప్టిట్యూడ్‌కు సంబంధించినవి ఉంటాయి.
పీహెచ్‌డీ ప్రవేశపరీక్ష కూడా ఆబ్జెక్టివ్‌ పద్ధతిలోనే నిర్వహిస్తారు. 85 మార్కులకు 170 ప్రశ్నలు. కెమికల్‌, బయలాజికల్‌, ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌ విభాగాల్లో ప్రశ్నలుంటాయి. ప్రశ్నలు పీజీ స్థాయిలో ఉంటాయి. ప్రతి విభాగంలో జనరల్‌ ఫార్మాస్యూటికల్స్‌, ఆప్టిట్యూడ్‌కు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం రెండు గంటలు.
ఏమిటి ప్రత్యేకతలు?
ఫార్మసీ రంగంలో నిపుణులైన మానవ వనరులను తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా నైపర్‌లను ఏర్పాటు చేశారు. ఆర్థిక వనరులను కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుంది. నైపర్‌ మొహాలీ ఈ ఏడాది రజతోత్సవం జరుపుకుంటోంది. నైపర్‌-హైదరాబాద్‌కు సీఎస్‌ఐఆర్‌-ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ మెంటర్‌గా వ్యవహరిస్తోంది. అంటే పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. ఇదే తరహాలో మిగిలిన నైపర్స్‌కూ మెంటర్‌ ఇన్‌స్టిట్యూట్లు ఉన్నాయి. దీంతో నైపర్‌లు అతి తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించగలిగాయి.
రెండు సంవత్సరాల పూర్తికాలపు పీజీ కోర్సును అందించడంతో పాటు నాణ్యమైన ప్రమాణాలతో కూడిన పీహెచ్‌డీ చేయడానికి తగిన అవకాశాలను నైపర్‌లు కలగజేస్తున్నాయి.
వీటికి దేశ విదేశీ విశ్వవిద్యాలయాలతో, ప్రముఖ రిసర్చ్‌ ఇన్‌స్టిట్యూట్లతో, ప్రైవేటు ఫార్మాస్యూటికల్‌ సంస్థలతో సత్సంబంధాలు ఉండటం వల్ల విద్యార్థుల పరిశోధనలకూ, ప్రాంగణ నియామకాలకూ మంచి అవకాశాలున్నాయి.
అంతే కాకుండా ప్రభుత్వం నైపర్‌లలో ప్రత్యేక ఇంక్యుబేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. మొహాలీ క్యాంపస్‌లో టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ కేంద్రం ఉంది. అహ్మదాబాద్‌ క్యాంపస్‌లో మెడికల్‌ డివైజెస్‌ పార్కు ఉంది.
హైదరాబాద్‌ నైపర్‌ క్యాంపస్‌లో ‘నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ రిసర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌ బల్క్‌డ్రగ్స్‌’ను ఏర్పాటు చేస్తున్నారు. ఔత్సాహికులైన విద్యార్థులకు ఇవి ఎంతగానో ఉపయోగపడి అంకుర సంస్థల ఏర్పాటుకూ, తద్వారా పారిశ్రామిక వేత్తలుగా ఎదగడానికీ దోహదపడతాయి.
సన్నద్ధత ఏ విధంగా?
ఈ పరీక్షల్లో రాణించాలంటే కోర్‌ సబ్జెక్టుల్లో మంచి అవగాహన, పట్టు అవసరం. ఆచితూచి సమాధానాలు గుర్తించాలి. నాలుగు ఆప్షన్లనూ శ్రద్ధగా గమనించి, తగిన సమాధానాన్ని ఎంచుకోవాలి.
జనరల్‌ నాలెడ్జ్‌ ప్రశ్నల కోసం రోజువారీ వార్తాపత్రికలు చదవాలి. ప్రామాణిక పుస్తకాలు అధ్యయనం చేయాలి. రుణాత్మక మార్కులు (0.25) ఉంటాయి కాబట్టి సరైన సమాధానం తెలిసిన ప్రశ్నలకు మాత్రమే జవాబులు రాసేలా నియంత్రణ ఎంతైనా అవసరం.
హైదరాబాద్‌, మొహాలీలో ఉన్న నైపర్‌ ఎంబీఏ ఫార్మాస్యూటికల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులో ప్రవేశానికి జేఈఈ రాతపరీక్షతో పాటు బృంద చర్చ, ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తారు. వీటికి 15 శాతం వెయిటేజి ఇస్తారు.
మంచి ర్యాంకు సాధించాలంటే పుస్తక పరిజ్ఞానంతో పాటు ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌, అనలిటికల్‌ రీజనింగ్‌ నైపుణ్యాలు ఉండటం చాలా అవసరం. ప్రతి పాఠ్యాంశాన్నీ క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకున్నపుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది.
గుర్తుంచుకోవాల్సినవి
* ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చివరి తేదీ: మే 13, 2016
* ఆన్‌లైన్‌ ద్వారా ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: మే 18, 2016
* నైపర్‌-జేఈఈ తేదీ: జూన్‌ 12, 2016
* వెబ్‌సైట్‌: www.niperhyd.ac.in


Back..

Posted on 14-05-2016