Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
నైపర్‌ సీటు నెగ్గుదామిలా!

ఫార్మసీలో నాణ్యమైన విద్య, ప్రమాణాలతో కూడిన పరిశోధనలను అందించేవి నైపర్‌లు (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌). నైపర్‌-జేఈఈ ర్యాంకు ఆధారంగా నైపర్‌ క్యాంపస్‌లలో పీజీ కోర్సులు, పీహెచ్‌డీల్లో ప్రవేశం లభిస్తుంది. ఇక్కడ చదివే విద్యార్థులకు ఉపకార వేతనంతోపాటు ప్రాంగణ నియామకాలు లభిస్తాయి!

మందుల తయారీలో భారతీయ ఫార్మాస్యూటికల్‌ పరిశ్రమ ప్రముఖ పాత్రను పోషిస్తోంది. ప్రపంచానికి కావాల్సిన వాటిల్లో 20 శాతం మందులు అందుబాటు ధరల్లో మనదేశం నుంచే ఎగుమతి అవుతున్నాయి. వీటిలో ముఖ్యంగా చెప్పకోదగ్గవి జెనరిక్‌ మందులు. పరిమాణం ఆధారంగా ప్రపంచంలో 3వ స్థానంలో, విలువ ఆధారంగా 13వ స్థానంలో ఉండి, వార్షిక అభివృద్ధి 15.1%తో ముందుకు సాగుతోంది.
ఈ అభివృద్ధిని మరింత పెంచడం, ప్రపంచానికి నాణ్యమైన మందులను అందుబాటు ధరల్లో అందించడంలో భారత్‌ మొదటిస్థానంలో ఉండాలనే ఉద్దేశంతో మినిస్ట్రీ ఆఫ్‌ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌కు సంబంధించిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్స్‌ అనేక చర్యలు చేపట్టింది. ఔషధ రంగానికి కావాల్సిన పరిశోధన, మానవ వనరుల అభివృద్ధిని పెంచడానికి దేశవ్యాప్తంగా 7 నైపర్‌లను స్థాపించారు. మరో నాలుగింటిని తమిళనాడు, చత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌ల్లో ఏర్పాటు చేస్తున్నారు.

కోర్సుల వివరాలు
దేశవ్యాప్తంగా ఉన్న ఏడు నైపర్‌లలో మొత్తం నాలుగు విభాగాల్లో 16 పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
* ఎం.ఎస్‌ (ఫార్మసీ): మెడిసినల్‌ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటిక్స్‌, ఫార్మాస్యూటికల్‌ అనాలిసిస్‌, ఫార్మకాలజీ అండ్‌ టాక్సికాలజీ, నేచురల్‌ ప్రొడక్ట్స్‌, ట్రెడిషనల్‌ మెడిసిన్‌, బయోటెక్నాలజీ, రెగ్యులేటరీ టాక్సికాలజీ, ఫార్మాకో ఇన్‌ఫర్మాటిక్స్‌, మెడికల్‌ డివైజెస్‌, క్లినికల్‌ రిసెర్చ్‌
* ఎం. ఫార్మసీ: ఫార్మసీ ప్రాక్టీస్‌, ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీ (ఫార్ములేషన్స్‌)
* ఎం.టెక్‌ (ఫార్మసీ): ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీ (ప్రాసెస్‌ కెమిస్ట్రీ), ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీ (బయోటెక్నాలజీ)
* ఎంబీఏ (ఫార్మసీ): ఫార్మాస్యూటికల్‌ మేనేజ్‌మెంట్‌
* పీహెచ్‌డీ: పై వాటిలో చాలావరకు కోర్సుల్లో...

ఉపకార వేతనం
నైపర్‌లో ప్రవేశం పొందిన ప్రతి విద్యార్థికీ నెలకు రూ.12,400 చొప్పున స్కాలర్‌షిప్‌ లభిస్తుంది (ఎంబీఏ (ఫార్మా), ప్రభుత్వ/ప్రైవేటు స్పాన్సర్డ్‌ విద్యార్థులకు తప్ప). పీహెచ్‌డీ విద్యార్థులకు మొదటి రెండు సంవత్సరాలు నెలకు రూ.25,000 ఫెలోషిప్‌, తర్వాతి మూడు సంవత్సరాలు నెలకు రూ.28,000 ఫెలోషిప్‌ లభిస్తుంది.
ఎంబీఏ ఫార్మాలో ఎంపిక చేసిన ముగ్గురు విద్యార్థులకు నైపర్‌ నెలకు రూ.12,400 ఉపకారవేతనంగా అందిస్తుంది.

విద్యార్హతలు
సంబంధిత డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులు లేదా సీజీపీఏ 6.75 ఉండాలి. రిజర్వేషన్‌ విద్యార్థులకు మినహాయింపులు ఉంటాయి. ప్రతీ విద్యార్థికి కౌన్సిలింగ్‌ సమయానికి జీప్యాట్‌/ గేట్‌/ నెట్‌లో అర్హత కార్డు తప్పనిసరిగా ఉండాలి. అయితే ఈ నిబంధన బీవీఎస్‌సీ, ఎంబీబీఎస్‌/ ఎండీ, ఎంవీఎస్‌సీ విద్యార్థులకు వర్తించదు.

ప్రవేశ పరీక్ష
నైపర్‌- జేఈఈ 2017 కంప్యూటర్‌ ఆధారిత ఆన్‌లైన్‌ పరీక్ష. దేశవ్యాప్తంగా జూన్‌ 25న 16 కేంద్రాల్లో జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో నిర్వహిస్తారు.
పీజీ కోర్సులన్నింటికీ కలిపి, ఎంబీఏ ఫార్మాస్యూటికల్‌ మేనేజ్‌మెంట్‌తోసహా ఒకే పరీక్ష ఉంటుంది. ప్రశ్నపత్రం 200 మార్కులకు ఉంటుంది. పూర్తిగా ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఉండే ఈ పరీక్ష సమయం రెండు గంటలు. ప్రశ్నలు బీ- ఫార్మసీ, ఎంఎస్‌సీ స్థాయిలో ఉంటాయి. కొన్ని ప్రశ్నలు జనరల్‌ ఆప్టిట్యూడ్‌కు సంబంధించినవి ఉంటాయి.
పీహెచ్‌డీ ప్రవేశపరీక్షను కూడా ఆబ్జెక్టివ్‌ పద్ధతిలోనే నిర్వహిస్తారు. 170 ప్రశ్నలు ఉంటాయి. 85 మార్కులు. కెమికల్‌, బయోలాజికల్‌, ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌ విభాగాల్లో ప్రశ్నలుంటాయి. ప్రశ్నలు పీజీ స్థాయిలో ఉంటాయి. ప్రతి విభాగంలో జనరల్‌ ఫార్మాస్యూటికల్స్‌, ఆప్టిట్యూడ్‌కు సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు. పరీక్ష ఫలితాలను జూన్‌ 30న వెల్లడిస్తారు.

నైపర్‌ ప్రత్యేకతలు
* నైపర్‌లకు కావాల్సిన ఆర్థిక వనరులను కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుంది. నైపర్‌-హైదరాబాద్‌కు సీఎస్‌ఐఆర్‌- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ మెంటర్‌గా వ్యవహరిస్తోంది.
* నైపర్‌-హాజీపూర్‌కు రాజేంద్ర మెమోరియల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌స్‌ మెంటర్‌ ఇన్‌స్టిట్యూట్‌గా ఉంది. మిగతా నైపర్‌లు సొంత నిర్వహణలో ఉన్నాయి. అన్ని నైపర్‌లకు దేశ, విదేశీ విశ్వవిద్యాలయాలు, ప్రముఖ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లు, ప్రైవేటు ఫార్మాస్యూటికల్‌ సంస్థలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఫలితంగా విద్యార్థుల పరిశోధనలకూ, ప్రాంగణ నియామకాలకూ మంచి అవకాశాలున్నాయి.
* ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MHRD)ఇటీవల విడుదల చేసిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేం వర్క్‌లో (NIRF),ఫార్మసీ విభాగంలో నైపర్‌-మొహాలీ రెండో స్థానాన్నీ, నైపర్‌-హైదరాబాద్‌ అయిదో స్థానాన్నీ పొందాయి.

సన్నద్ధత ఎలా?
ఈ సంవత్సరం జేఈఈ ఆన్‌లైన్‌ పద్ధతిలో జరుగుతుంది. పరీక్షలో రాణించాలంటే ముఖ్యంగా కోర్‌ సబ్జెక్టుల్లో మంచి అవగాహన, పట్టు అవసరం. ముఖ్యంగా కెమిస్ట్రీ, మెడిసినల్‌ కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఫార్మాస్యూటికల్‌ అనాలిసిస్‌, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, నేచురల్‌ ప్రొడక్ట్స్‌ విభాగాలపై ఎక్కువ దృష్టిపెట్టాలి. నాలుగు ఆప్షన్లనూ శ్రద్ధగా గమనించి, ఆచితూచి సరైన సమాధానాలు ఎన్నుకోవాలి. రుణాత్మక మార్కుల (0.25) దృష్ట్యా సరైన సమాధానం తెలిసిన ప్రశ్నలకు మాత్రమే జవాబులు ఎంచుకోవాలి.
కెమిస్ట్రీ, మెడిసినల్‌ కెమిస్ట్రీకి సంబంధించి స్టీరియో కెమిస్ట్రీ అండ్‌ డ్రగ్‌ యాక్షన్‌, ఎంజైమ్‌ కైనటిక్స్‌ డ్రగ్‌ యాక్షన్‌ అండ్‌ మెటబాలిజం, కెమిస్ట్రీ ఆఫ్‌ ఏడీఎంఈ ఆఫ్‌ డ్రగ్స్‌, నేమ్డ్‌ రియాక్షన్స్‌, డ్రగ్‌ డిస్కవరీకి చెందిన అంశాలు ముఖ్యం. ఫార్మాస్యూటికల్‌ అనాలిసిస్‌లో స్పెక్ట్రల్‌ అనాలిసిస్‌, సెపరేషన్‌ విధానాలు, ఫార్మకాలజీలో డ్రగ్‌ రిసీప్టర్స్‌, వాటి మెకానిజం ఆఫ్‌ యాక్షన్‌, స్ట్రక్చర్‌ ఏక్టివిటీ సంబంధాలు, ప్రీ క్లినికల్‌ అండ్‌ క్లినికల్‌ ట్రయల్స్‌పై అవగాహన, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ విభాగాల్లో ముఖ్యంగా ఎంజైమ్స్‌, వాటి విధులు, మందుల తయారీలో వాటి పాత్ర, ప్రొటీన్స్‌, ఆర్‌ఎన్‌ఏ, డీఎన్‌ఏ టెక్నాలజీలపై అవగాహన ఉండాలి.
మొహాలీ, హైదరాబాద్‌ల్లో ఉన్న ఎంబీఏ ఫార్మాస్యూటికల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులో ప్రవేశానికి జేఈఈ పరీక్ష మార్కులతోపాటు మలిదశలో బృందచర్చ, ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తారు. వీటికి 15 శాతం వెయిటేజి మార్కులు ఇస్తారు.

నైపర్‌ జేఈఈ: ముఖ్య తేదీలు
* ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చివరితేదీ: మే 27, 2017
* ఆన్‌లైన్‌ ద్వారా హాల్‌టికెట్లు: జూన్‌ 15, 2017
* జేఈఈ ఆన్‌లైన్‌ పరీక్ష: జూన్‌ 25, 2017
* ఫలితాల వెల్లడి: జూన్‌ 30, 2017
* వెబ్‌సైట్‌: www.niper.gov.in


Back..

Posted on 22-05-2017