Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఆరోగ్యరంగానికి అడుగడుగునా అండగా..!

* ఫార్మాలో పీజీ, పీహెచ్‌డీ కోర్సులకు నైపర్‌ ప్రకటన విడుదల

కొవిడ్‌-19 లాంటి కొత్త కొత్త వైరస్‌లు, వ్యాధులతో ప్రపంచ ఆరోగ్యరంగం ఎప్పటికప్పుడు సరికొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది. వాటి నివారణకు, నిరోధానికి ఔషధాలను కనిపెట్టడం తప్పనిసరిగా మారింది. అందుకే ఫార్మాసంస్థలు వేగంగా విస్తరిస్తున్నాయి. దేశ, విదేశాల్లో పరిశోధనలు విస్తృతంగా జరుగుతున్నాయి. దీంతో ఆరోగ్య పరిశ్రమకి అండగా ఉండే నిపుణులకు డిమాండ్‌ పెరుగుతోంది. అలాంటి నైపుణ్యాలను పెంపొందించే విద్యకు మన దేశంలో నైపర్‌లు ప్రఖ్యాతి చెందాయి. ఇవి ఏడు కేంద్రాల్లో పలు రకాల పీజీలు, పీహెచ్‌డీ కోర్సులను అందిస్తున్నాయి. వాటిల్లో ప్రవేశాలకు ప్రస్తుతం ప్రకటన వెలువడింది.

ఫార్మసీలో పీజీ, పీహెచ్‌డీ కోర్సులకు దేశంలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మసీ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (నైపర్‌)లు ప్రసిద్ధ సంస్థలు. ఇవి వివిధ స్పెషలైజేషన్లతో కోర్సులను అందిస్తున్నాయి. రాత పరీక్షలో చూపిన ప్రతిభతో ప్రవేశాలుంటాయి.

ఫార్మసీలో మేటి చదువులకు చిరునామాగా ఈ సంస్థలు నిలవడంతో వీటిల్లో కోర్సులు పూర్తిచేసుకున్నవారు పెద్ద మొత్తంలో వేతనంతో ప్రముఖ ఫార్మా సంస్థల్లో అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. ఫార్మాకు సంబంధించి బోధన, పరిశోధన రంగాల్లోనూ రాణిస్తున్నారు.

కోర్సులు, స్పెషలైజేషన్లు
పీజీలు: ఎంఫార్మసీ, ఎంటెక్‌ (ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీ), ఎంఎస్‌ (ఫార్మసీ), ఎంబీఏ (ఫార్మాస్యూటికల్‌ మేనేజ్‌మెంట్‌).
ఎంఎస్‌ ఫార్మసీలో బయో టెక్నాలజీ, మెడిసినల్‌ కెమిస్ట్రీ, మెడికల్‌ డివైజ్‌లు, నేచురల్‌ ప్రొడక్ట్స్‌, ఫార్మా స్యూటికల్‌ అనాలిసిస్‌, ఫార్మకాలజీ అండ్‌ టాక్సికాలజీ, ఫార్మాస్యూటిక్స్‌, ఫార్మకో ఇన్‌ఫర్మాటిక్స్‌ తదితర స్పెషలైజేషన్లు ఉన్నాయి. ఎంఫార్మసీలో ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీ (ఫార్ములేషన్స్‌), ఫార్మసీ ప్రాక్టీస్‌ స్పెషలైజేషన్లను కొన్ని సంస్థలు అందిస్తున్నాయి.
అర్హత: బీఫార్మసీ. కొన్ని కోర్సులకు బీవీఎస్సీ, ఎంబీబీఎస్‌, నిర్దేశిత విభాగాల్లో ఎమ్మెస్సీ, బీటెక్‌ వారికీ అవకాశం ఉంది. సంబంధిత కోర్సుల్లో 60 శాతం మార్కులు తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీలకు 55 శాతం, దివ్యాంగులైతే 50 శాతం ఉండాలి. ప్రస్తుతం ఆఖరి సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్ఛు నైపర్‌కు దరఖాస్తు చేసుకున్నవారు జీప్యాట్‌ /గేట్‌ /నెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి.
పీహెచ్‌డీలు: బయోటెక్నాలజీ, మెడిసినల్‌ కెమిస్ట్రీ, మెడికల్‌ డివైజెస్‌, నేచురల్‌ ప్రొడక్ట్స్‌, ఫార్మాస్యూటికల్‌ అనాలిసిస్‌, ఫార్మకాలజీ అండ్‌ టాక్సికాలజీ, ఫార్మాస్యూటిక్స్‌, ఫార్మసీ ప్రాక్టీస్‌, ఫార్మాస్యూటికల్‌ మేనేజ్‌మెంట్‌, రెగ్యులేటరీ టాక్సికాలజీ, ఫార్మకొఇన్‌ఫర్మాటిక్స్‌, ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీ (ప్రాసెస్‌ కెమిస్ట్రీ),.
అర్హత: ఈ విభాగాలను మూడు రకాలుగా విభజించారు. అవి కెమికల్‌ సైన్సెస్‌, బయోలాజికల్‌ సైన్సెస్‌, ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌. సంబంధిత విభాగాల్లో ఎంఎస్‌, ఎంటెక్‌, ఎంఎస్సీ తదితర పీజీలు చేసిన వారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్ఛు నెట్‌-జేఆర్‌ఎఫ్‌ అర్హత సాధించినవారు, ఆ పరీక్షకు హాజరవుతున్నవారూ అప్లై చేసుకోవచ్ఛు ఇంటర్వ్యూనాటికి ఫైనల్‌ ఫలితాలను సమర్పించాలి.

పరీక్ష విధానం
అన్ని పీజీ కోర్సులకు ఒకటే పరీక్ష. దీన్ని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఇందులో 200 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. రుణాత్మక మార్కులు ఉన్నాయి. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికీ పావు శాతం మార్కు తగ్గిస్తారు. ప్రశ్నలను బీఫార్మసీ, సంబంధిత విభాగాల్లో ఎమ్మెస్సీ సబ్జెక్టుల నుంచి అడుగుతారు. జనరల్‌ ఆప్టిట్యూడ్‌ నుంచీ కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఇందులో ప్రతిభ చూపిన వారికి మెరిట్‌, రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయిస్తారు. ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి మాత్రం బృందచర్చలు, ముఖాముఖి నిర్వహిస్తారు. అహ్మదాబాద్‌, హైదరాబాద్‌, ఎస్‌ఎఎస్‌ నగర్‌ (మొహాలీ) క్యాంపస్‌ల్లోనే ఈ కోర్సు ఉంది. బీఫార్మసీ పుస్తకాల్లోని ముఖ్యాంశాలను బాగా చదవాలి. జీప్యాట్‌, నైపర్‌ జేఈఈ పాత ప్రశ్నపత్రాలను అధ్యయనం చేయడం ద్వారా పరీక్షలో ఎక్కువ మార్కులు పొందవచ్చు.
పీహెచ్‌డీకి రాత పరీక్ష ఆన్‌లైన్‌లో జరుగుతుంది. మొత్తం 170 ప్రశ్నలు ఉంటాయి. కెమికల్‌ సైన్సెస్‌, బయోలాజికల్‌ సైన్సెస్‌, ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌ నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఎంఎస్‌ (ఫార్మా), ఎంఫార్మా, ఎంటెక్‌ (ఫార్మా), ఎంవీఎస్‌సీ, ఎండీ, ఎంఎస్సీ స్థాయుల్లో ప్రశ్నలు ఉంటాయి. జనరల్‌ ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌, జనరల్‌ ఆప్టిట్యూడ్‌ విభాగాల నుంచీ ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష కాలవ్యవధి రెండు గంటలు. నెగెటివ్‌ మార్కులు ఉన్నాయి. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి పావు శాతం మార్కు కోత ఉంటుంది. రాత పరీక్షలో క్వాలిఫై అయిన వారు ఇంటర్వ్యూకి హాజరుకావాలి. దీనికి 15 మార్కులు కేటాయించారు.

ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు
మన దేశంలోని ఏడు నైపర్‌ కేంద్రాలకూ ప్రపంచస్థాయిలో మంచి గుర్తింపు ఉంది. ఇక్కడ పీజీ, పీహెచ్‌డీ కోర్సులను పూర్తిచేసిన వారికి దేశ, విదేశాల్లో మంచి ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఫార్మారంగాల్లో పరిశోధకులుగా, సైంటిస్టులుగా చేయవచ్ఛు అరబిందో, బయోకాన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌, జీఎస్‌కే, సన్‌ ఫార్మా, అబాట్‌ ఇండియా, నొవార్టీస్‌ వంటి ప్రముఖ సంస్థలు మంచి ప్యాకేజీలతో ఈ అభ్యర్థులను నియమించుకుంటున్నాయి. హైదరాబాద్‌ క్యాంపస్‌ నుంచీ ఏటా ప్రాంగణ నియామకాలు జరుగుతున్నాయి. కొత్త ఔషధాల పరిశోధన, ఫార్ములా అభివృద్ధికి సంబంధించి పేటెంట్‌ హక్కులను పొందడంలో హైదరాబాద్‌ కేంద్రం ముందంజలో ఉంది. జాతీయ, అంతర్జాతీయ, ఫార్మా పరిశోధన సంస్థలు, ఫార్మా కంపెనీలతో నైపర్‌కు పలు ఒప్పందాలు ఉన్నాయి. అధునాత పరికరాలతో కూడిన ల్యాబ్‌, గ్రంథాలయాలు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్‌ క్యాంపస్‌లో అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరుగా హాస్టల్‌ సదుపాయం ఉంది. నైపర్‌లో కోర్సులు పూర్తి చేసిన వారు అమెరికా, న్యూజిలాండ్‌, స్పెయిన్‌, లండన్‌, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఫార్మారంగంలో కీలకమైన ఉద్యోగాల్లో ఉన్నారు.

కేంద్రాలు ఎక్కడెక్కడ?
* అహ్మదాబాద్‌
* గువాహటి
* హాజీపూర్‌
* హైదరాబాద్‌
* కోల్‌కతా
* రాయ్‌బరేలీ
* మొహాలీ

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: మే 15 వరకు స్వీకరిస్తారు
పరీక్ష: పీజీ, పీహెచ్‌డీలు రెండింటికీ వేర్వేరుగా జూన్‌ 14న నిర్వహిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విజయవాడ.
వెబ్‌సైట్‌: http://www.niper.nic.in/

పూర్తి వివరాలకు...
నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (నైపర్‌), బాలానగర్‌, హైదరాబాద్‌-500037, తెలంగాణ. ఫోన్‌- 040-23073741, 23073740, ఫ్యాక్స్‌-040-23073751.
వెబ్‌సైట్‌: http://www.niperhyd.ac.in/

Back..

Posted on 05-04-2020