Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
నాణ్యమైన ఫార్మా కోర్సులకు నైపర్‌

సైన్స్‌ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో అంతే స్పీడుతో కొత్త కొత్త వ్యాధులూ పుట్టుకొస్తున్నాయి. వాటి నివారణకు ఔషధాలను కనిపెట్టడం ఎప్పటికప్పుడు సవాలుగా మారుతోంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఫార్మా పరిశ్రమ రోజురోజుకీ విస్తరిస్తూనే ఉంది. మనదేశంలో కూడా ఈ పరిశోధనలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఇందుకు కావాల్సిన నిపుణుల అవసరాలూ పెరుగుతున్నాయి. ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జాతీయ ఫార్మాస్యూటికల్‌ విద్య, పరిశోధన సంస్థలను నెలకొల్పింది. అవి పలు రకాల కోర్సులను అందిస్తున్నాయి. వాటిని పూర్తి చేసినవారి కోసం ఎన్నో ఉద్యోగావకాశాలు ఎదురుచూస్తున్నాయి.
మనదేశం ఫార్మా పరిశోధనలకు పెద్ద పీట వేసింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ రిసెర్చ్‌లు ఎక్కువగానే జరుగుతున్నాయి. హైదరాబాద్‌ చుట్టుపక్కల దాదాపు 200కు పైగా ఫార్మా కంపెనీలు ఉన్నాయి. బల్క్‌డ్రగ్‌కు భాగ్యనగరం కీలక కేంద్రం. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లలో సుమారు 33 శాతం ఒక్క హైదరాబాద్‌లోనే తయారవుతున్నాయి. ఆఫ్రికా దేశాలకు తక్కువ ధరకే వ్యాక్సిన్లను అందిస్తున్న ఘనత కూడా మనదే. ఈ నేపథ్యంలో ఫార్మారంగంలో పెరుగుతున్న ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోడానికి అవసరమైన పలు పీజీ, పీహెచ్‌డీ కోర్సులను ఆఫర్‌ చేస్తున్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (నైపర్‌) గురించి తెలుసుకుందాం.
జాతీయ ప్రాధాన్య సంస్థగా గుర్తింపు పొందిన నైపర్‌ వివిధ విభాగాల్లో మాస్టర్స్‌ డిగ్రీతోపాటు, పీహెచ్‌డీలను కూడా అందిస్తోంది. దీని మొదటి కేంద్రాన్ని పంజాబ్‌లోని మొహాలీలో ఏర్పాటు చేశారు. తర్వాత అహ్మదాబాద్‌, కోల్‌కతా, గువాహటి, రాయ్‌బరేలీ, హాజీపూర్‌, హైదరాబాద్‌లలో కూడా ఈ కేంద్రాలను నెలకొల్పారు.
పీజీలు, పీహెచ్‌డీలు
బయోటెక్నాలజీ, క్లినికల్‌ రిసెర్చ్‌, మెడిసినల్‌ కెమిస్ట్రీ, మెడికల్‌ డివైజెస్‌, నేచురల్‌ ప్రోడక్ట్స్‌, ఫార్మాస్యూటికల్‌ అనాలిసిస్‌, ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీ (బయోటెక్నాలజీ, ఫార్ములేషన్స్‌, ప్రాసెస్‌ కెమిస్ట్రీలలో), ఫార్మాస్యూటిక్స్‌, ఫార్మాకోఇన్‌ఫర్మేటిక్స్‌, ఫార్మకాలజీ అండ్‌ టాక్సికాలజీ, ఫార్మసీ ప్రాక్టీస్‌, రెగ్యులేటరీ టాక్సికాలజీ, ట్రెడిషనల్‌ మెడిసిన్‌లలో ఎంఎస్‌ (ఫార్మా), ఎంఫార్మా, ఎంటెక్‌ (ఫార్మా) డిగ్రీలతో పాటు ఎంబీఏ (ఫార్మా) కూడా అందిస్తోంది. కెమికల్‌ సైన్సెస్‌, బయోలాజికల్‌ సైన్సెస్‌, ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌ల నుంచి పది విభాగాల్లో పీహెచ్‌డీలను నైపర్‌ ఆఫర్‌ చేస్తోంది.
పీజీలో మెడికల్‌ కెమిస్ట్రీ కోర్సుకు మాత్రం ఎమ్మెస్సీ (ఆర్గానిక్‌ కెమిస్ట్రీ) చేసి సీఎస్‌ఐఆర్‌ నెట్‌ లేదా యూజీసీ నెట్‌ ఉత్తీర్ణత సాధించాలి. ఫార్మా టెక్నాలజీ పీజీ కోర్సుకు కెమికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసి గేట్‌లో క్వాలిఫై కావాలి. మిగతా అన్ని పీజీలకు బీఫార్మసీ ఉత్తీర్ణులైనవారు అర్హులు.
రెండు స్థాయుల్లో వడపోత
దేశవ్యాప్తంగా ఉన్న ఏడు నైపర్‌ల్లోకి ప్రవేశం కోసం సాధారణంగా ఏటా ఏప్రిల్‌లో నోటిఫికేషన్‌ వెలువడుతుంది. జూన్‌లో ఉమ్మడి ప్రవేశపరీక్ష (జేఈఈ)ను నిర్వహిస్తారు. తర్వాత ర్యాంకుల వారీగా అభ్యర్థులు ఎంచుకున్న ప్రాంతంలో సీటు కేటాయించడానికి కౌన్సెలింగ్‌ జరుగుతుంది. పీహెచ్‌డీ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు ఎం-ఫార్మసీ ఉత్తీర్ణత పొంది నైపర్‌-జేఈఈలో అర్హత సాధించాలి. అన్ని ప్రోగ్రామ్‌ల అభ్యర్థులు జీప్యాట్‌, గేట్‌, నెట్‌ల్లో ఏదో ఒకదానిలో క్వాలిఫై అయి ఉండటం తప్పనిసరి.
అన్ని సంస్థల్లో కలిపి వివిధ కోర్సుల్లో దాదాపు 750 సీట్లు ఉన్నాయి. వాటిలో 134 సీట్లు హైదరాబాద్‌ క్యాంపస్‌లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా మూడు వేల ఫార్మా విద్యాసంస్థల నుంచి సుమారు లక్షల మంది అభ్యర్థులు జేఈఈకి హాజరవుతారు. రాతపరీక్ష తర్వాత గ్రూప్‌ డిస్కషన్‌ లేదా ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ రెండు స్థాయుల్లో వడపోసి చివరికి 750 మందికి పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. కేంద్ర ప్రభుత్వ కోటా ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్‌ ఉంటుంది. మొత్తం అభ్యర్థుల్లో 50-60 శాతం వరకు అమ్మాయిలే ఉండటం విశేషం.
ప్రతి విద్యార్థికీ ఫెలోషిప్‌
నైపర్‌లో సీటు పొందిన ప్రతి విద్యార్థికీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఫెలోషిప్‌ అందుతుంది. పీజీ కోర్సుల్లో చేరేవారికి రెండేళ్లపాటు నెలకు రూ. 12,400, పీహెచ్‌డీ అభ్యర్థులకు అయిదేళ్లపాటు నెలకు రూ. 28,500 అందిస్తారు. ఎంబీఏ (ఫార్మా) కోర్సుల్లో చేరే విద్యార్థులకు ఎలాంటి ఫెలోషిప్‌ ఉండదు.
విద్యార్థులు సెమిస్టర్లవారీగా కోర్సు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. వివిధ పీజీ కోర్సులకు సంబంధించి నాలుగు సెమిస్టర్లకు రూ. 1,08,088 (ఎస్సీ, ఎస్టీలకు రూ. 44,200); ఎంబీఏ (ఫార్మా) కోర్సుకు రూ. 3,10,400 (ఎస్సీ, ఎస్టీలకు రూ. 45,700) ఫీజుగా నిర్ణయించారు. పీహెచ్‌డీ కోర్సుల్లో చేరే వారు నాలుగు సెమిస్టర్‌లకు రూ. 1,09,588 (ఎస్సీ, ఎస్టీలకు రూ. 48,700) చెల్లించాలి. అయిదేళ్ల వరకు పరిశోధన సాగించవచ్చు. విడతలవారీగా కోర్సు ఫీజులు చెల్లించే అవకాశం ఉంది. ఆర్థిక స్థోమతలేని అభ్యర్థులు బ్యాంకు రుణాలు పొందే వీలుంది. అయిదారేళ్లుగా తెలుగు రాష్ట్రాల నుంచి ఈ కోర్సుల్లో చేరేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొహాలీ, హైదరాబాద్‌ క్యాంపస్‌ల్లో మాత్రమే ఎంబీఏ (ఫార్మా) అందుబాటులో ఉంది. మొత్తం కోర్సులో 40 శాతం థియరీకి, మిగతా 60 శాతం ప్రాక్టికల్స్‌, ఇంటర్న్‌షిప్‌లకు కేటాయించారు.

అవకాశాలు అపారం
నైపర్‌లో పీజీ, పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఉద్యోగావకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే కోర్సులు పూర్తి చేసినవారు అమెరికా, న్యూజిలాండ్‌, స్పెయిన్‌, లండన్‌, ఆస్ట్రేలియా తదితర దేశాల్లోని ఫార్మా రంగాల్లో పరిశోధకులుగా, సైంటిస్టులుగా చేస్తున్నారు. ప్రాంగణ నియామకాలు కూడా పెద్దఎత్తున జరుగుతున్నాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌, నొవార్టీస్‌, అబాట్‌ ఇండియా, సన్‌ ఫార్మా, జీఎస్‌కే, బయోకాన్‌, అరబిందో తదితర అనేక ప్రముఖ ఫార్మా కంపెనీలు భారీ ప్యాకేజీలతో ఆఫర్‌ లెటర్లు అందిస్తున్నాయి. హైదరాబాద్‌ క్యాంపస్‌కి సంబంధించి గత ఏడేళ్ల నుంచి ఏటా దాదాపు 85 శాతం పైనే ప్రాంగణ నియామకాలకు ఎంపికవుతున్నారు. మిగిలిన వాళ్లు పరిశోధనల వైపు వెళుతున్నారు. ఫార్మసీ విద్యలో హైదరాబాద్‌ క్యాంపస్‌కు దేశంలోనే తొలి స్థానం దక్కడం విశేషం. కొత్త ఔషధాల పరిశోధనలో ఫార్ములా అభివృద్ధికి సంబంధించి 14 పేటెంట్‌ హక్కులను హైదరాబాద్‌ నైపర్‌ దక్కించుకోవడం విశేషం. వివిధ ఫార్మా కంపెనీలు, జాతీయ, అంతర్జాతీయ ఫార్మా పరిశోధన సంస్థలతో ఈ నైపర్‌కు అవగాహన ఒప్పందాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా విశేష గుర్తింపు ఉన్న ప్రముఖ వ్యక్తులతో అతిథి ఉపన్యాసాలు ఇప్పిస్తుంటారు. 20,773 పుస్తకాలతో కూడిన విశాలమైన గ్రంథాలయం, ఫార్మా పరిశోధనలకు సంబంధించిన రూ. కోట్ల విలువైన అధునాతన పరికరాలతో కూడిన ల్యాబ్‌, అమ్మాయిలు, అబ్బాయిలకు ప్రత్యేక హాస్టల్‌ సదుపాయం హైదరాబాద్‌ క్యాంపస్‌లో అందుబాటులో ఉన్నాయి.
మరిన్ని వివరాలకు...
నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మా స్యూటికల్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (నైపర్‌), బాలానగర్‌, హైదరాబాద్‌-500037, తెలంగాణ. ఫోన్‌- 040-23073741, 23073740, ఫ్యాక్స్‌-040-23073751,
* ఈ-మెయిల్‌: projectdirector@niperhyd.ac.in
* వెబ్‌సైట్‌: ‌www.niperhyd.ac.in

- గొర్లె బాలకృష్ణ, ఈనాడు, హైదరాబాద్‌‌

Back..

Posted on 08-03-2018