Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
మద్రాస్‌ ఐఐటీ.. ఎందుకని మేటి?

ఇంజినీరింగ్‌ విభాగంలో ఒక ఐఐటీ సంస్థ ప్రథమ స్థానం పొందడం గొప్ప విషయం కాకపోవచ్చు. కానీ ఓవరాల్‌ విద్యాసంస్థల జాబితాలో ఎన్నో ప్రతిష్ఠాత్మక సంస్థలను వెనక్కు నెట్టేసి, శిఖరాగ్రంలో నిలవడం అంత సులువేమీ కాదు. ఐఐటీ మద్రాస్‌ ఈ ఘనత సాధించింది. అన్ని విభాగాల్లోనూ మెరుగైన ప్రతిభ చూపింది. 2019, 2020 ర్యాంకుల్లో ఓవరాల్‌ విభాగంలో మేటి సంస్థగా నిలిచింది. జర్మనీ సాంకేతిక, ఆర్థిక సహకారంతో 1959లో ప్రారంభమైన ఈ సంస్థ అంచెలంచెలుగా ఎదిగి, మరే సంస్థా అందుకోలేని స్థానాన్ని చేరుకుంది!

కేంద్ర మానవవనరుల శాఖ ఆధ్వర్యంలో ఏటా దేశవ్యాప్తంగా విద్యాసంస్థలను మదింపు చేసి వాటికి ర్యాంకులు కేటాయిస్తున్నారు. కేటగిరీల వారీ ప్రముఖ సంస్థల జాబితాను నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) వెలువరిస్తుంది. తాజాగా వెలువడిన ర్యాంకుల ప్రకారం ఓవరాల్‌ కేటగిరీలో ఐఐటీ మద్రాస్‌ ప్రథమంగా నిలిచింది. ఈ సంస్థ ఇలా నిలవడం వరుసగా ఇది రెండో సారి.

ఓవరాల్‌ విభాగంలో టాప్‌ టెన్‌: ఐఐటీ మద్రాస్, ఐఐఎస్సీ-బెంగళూరు, ఐఐటీ- దిల్లీ, బాంబే, ఖరగ్‌పూర్, కాన్పూర్, గువాహటి, జేఎన్‌యూ- న్యూదిల్లీ, ఐఐటీ- రూర్కీ, బీహెచ్‌యూ-వారణాసి.

తెలుగు రాష్ట్రాల్లో: హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం 15, ఐఐటీ-హైదరాబాద్‌ 17, ఆంధ్రావర్సిటీ 36, ఎన్‌ఐటీ వరంగల్‌ 46, ఉస్మానియా యూనివర్సిటీ 53, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం 68, కేఎల్‌ యూనివర్సిటీ 70 స్థానాల్లో నిలిచాయి.

ఐఐటీ - ఎంలో ఏ కోర్సులు, ఎలా చేరాలి?
బీటెక్, డ్యూయల్‌ డిగ్రీ, ఎంటెక్, ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ పీహెచ్‌డీ కోర్సుల్లో ఇక్కడ చేరవచ్చు. ఈ విద్యాసంస్థలో మొత్తం 16 డిపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఇవి వివిధ విభాగాల్లో కోర్సులు అందిస్తున్నాయి.
* బీటెక్‌ కోర్సులు ఐఐటీ-జేఈఈతో, ఎంటెక్‌ కోర్సులు గేట్‌ స్కోరుతో ఇక్కడ చదువుకోవచ్చు. బీటెక్‌లో రెగ్యులర్‌ కోర్సులతోపాటు నేవల్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఓషన్‌ ఇంజినీరింగ్, ఆటోమోటివ్‌ ఇంజినీరింగ్, బయోమెడికల్‌ డిజైన్‌లో డ్యూయల్‌ డిగ్రీలను ఈ సంస్థ అందిస్తోంది.
* హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా ఇంటర్‌ విద్యార్హతతో అయిదేళ్ల ఎంఏ డెవలప్‌మెంట్‌ స్టడీస్, ఇంగ్లిష్‌ స్టడీస్‌ అందిస్తున్నారు. హయ్యర్‌ సెకండరీ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (హెచ్‌ఎస్‌ఈఈ) పేరుతో నిర్వహించే పరీక్షతో ఈ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది.
* ఈ సంస్థ ఎమ్మెస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కోర్సులనూ అందిస్తోంది. వీటిలో ప్రవేశం ఐఐటీలు సంయుక్తంగా నిర్వహించే జాయింట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ఫర్‌ ఎమ్మెస్సీ (జామ్‌) ద్వారా లభిస్తాయి. ఈ సబ్జెక్టుల్లో పీహెచ్‌డీలూ ఉన్నాయి. నెట్‌ స్కోరుతో చేయవచ్చు.
* ఇక్కడ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌లో భాగంగా ఎంబీఏ కోర్సు అందిస్తున్నారు. క్యాట్‌ స్కోరుతో ప్రవేశం లభిస్తుంది.
సుమారు 8000 మంది విద్యార్థులు వివిధ కోర్సులు చదువుతున్నారు. 550 మంది ఫ్యాకల్టీ సభ్యులు అందుబాటులో ఉన్నారు. మొత్తం వంద ల్యాబొరేటరీలు ఉన్నాయి. ప్రాంగణ విస్తీర్ణం 250 హెక్టార్లు.

విశిష్ట కోర్సు... టెక్‌ ఎంబీఏ
ఈ సంస్థ 2019 విద్యా సంవత్సరం నుంచి టెక్‌ ఎంబీఏ కోర్సును ఇక్కడ చదువుతోన్న బీటెక్‌ విద్యార్థుల కోసం అందిస్తోంది. దీనిని అయిదేళ్ల ఇంటర్‌ డిసిప్లినరీ డ్యూయల్‌ డిగ్రీ పేరుతో నడుపుతున్నారు. ఇందులో చేరినవారికి బీటెక్‌ తోపాటు ఎంబీఏ పట్టా కూడా అందిస్తారు. ఇక్కడ చదువుతోన్న ఇంజినీరింగ్‌ అన్ని బ్రాంచీల విద్యార్థులూ ఇందులో చేరవచ్చు. ఈ విధానంపై ఆసక్తి చూపినవారికి మూడు, నాలుగు సంవత్సరాల బీటెక్‌ చదువుల్లో భాగంగా టెక్‌ ఎంబీఏ కోర్సులు పరిచయం చేస్తారు. అయిదో సంవత్సరం కోర్సులో చేరడానికి సీజీపీఏ, ఆప్టిట్యూడ్‌ టెస్టు, ఇంటర్వ్యూల ద్వారా అవకాశం కల్పిస్తారు. ఈ అయిదో సంవత్సరం టెక్నాలజీ, మేనేజ్‌మెంట్‌ అంశాలు మేళవించి తర్ఫీదునిస్తారు.

అగ్రస్థానం ఎలా వచ్చింది?
విద్యాసంస్థల శ్రేష్ఠతను నిర్ధారించే కీలకమైన అంశాలను మదింపు చేసి, ఇతర సంస్థలతో పోల్చిచూస్తే ప్రథమ ర్యాంకుకు అర్హమైనది ఐఐటీ మద్రాసేనని తేలింది.
* బోధన, అభ్యాసం, వనరులు: మొత్తం విద్యార్థులు, వారిలో డాక్టొరల్‌ కోర్సులు చదువుతున్నవారు; ఆచార్యులు, విద్యార్థుల నిష్పత్తి; శిక్షకుల్లో పీహెచ్‌డీ పూర్తిచేసుకున్నవారు, ఆర్థిక వనరులు, వాటిని ఉపయోగించిన విధానం
* పరిశోధన, వృత్తి అభ్యాసం: మొత్తం ఎన్ని పుస్తకాలు/ పరిశోధన పత్రాలు ప్రచురించారు. వాటి నాణ్యత ఎలా ఉంది. మేధా సంపత్తి హక్కులు (ఐపీఆర్‌), పేటెంట్లు ఎన్నింటికి దక్కాయి, చేపడుతోన్న ప్రాజెక్టులు చూపుతోన్న ముద్ర
* పట్టాలు పుచ్చుకున్నవారు: మొత్తం ఎంతమంది విద్యార్థులు చేరారు, వారిలో పట్టాలతో విజయవంతంగా కోర్సు పూర్తిచేసినవారు ఎందరు, ఎంతమందికి పీహెచ్‌డీ దక్కింది..
* వైవిధ్యం: ఇతర రాష్ట్రాలు, దేశాల విద్యార్థులు ఎంతమంది చేరుతున్నారు, మహిళలు, ఆర్థికంగా వెనుకబడినవారు, దివ్యాంగులు ఎంతమంది చొప్పున ఉన్నారు, వారికి కల్పిస్తోన్న సౌకర్యాలు..
* లోకనాడి: ఉద్యోగులు, ప్రతిష్ఠాత్మక సంస్థల్లో పని చేస్తున్న నిపుణులు ఏ విద్యాసంస్థ పట్ల ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు.
ఈ విషయాలకు నిర్దిష్టంగా కొన్ని పాయింట్లు కేటాయించారు. ఈ ప్రామాణికాల ప్రకారం అన్ని వివరాలూ మదించి, తుది ఫలితం ప్రకటించారు.

Back..

Posted on 16-06-2020