Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
జీఆర్ఈ లేకుండానే విదేశాల్లో పీజీ కోర్సులు

కుదిరితే యూఎస్ లేదంటే యూకే... ఇలా విదేశాల్లో పీజీ కోర్సులు చ‌దవాల‌ని ఆశించే విద్యార్థులెంద‌రో. అయితే వీరిలో చాలా మంది ఆర్థిక ప‌రిస్థితులు అనుకూలించ‌క వెనుక‌డుగేస్తారు. మ‌రి కొంత‌మంది విష‌యంలో జేబునిండా డ‌బ్బులు ఉన్నప్పటికీ జీఆర్ఈ స్కోర్ ప్రతిబంధ‌క‌మ‌వుతుంది. ఎందుకంటే ప్రముఖ విశ్వవిద్యాల‌యాల్లో ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ స్కోరే కీల‌కం. అయితే జీఆర్ఈ స్కోర్ అవ‌స‌రం లేకుండానే బ్యాచిలర్ డిగ్రీలో చూపిన అక‌డ‌మిక్ ప్రతిభతో పీజీ కోర్సుల్లో ప్రవేశం క‌ల్పించే విశ్వవిద్యాల‌యాలెన్నోఉన్నాయి. అలాగ‌ని చెప్పి ఇవేవో అట్టడుగు యూనివ‌ర్సిటీలేమోన‌ని సందేహం అవ‌స‌రం లేదు. ఇలా ప్రవేశం క‌ల్పించే సంస్థల జాబితాలో ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన యూనివ‌ర్సిటీలు సైతం ఉన్నాయి.. ఆ వివ‌రాలు తెలుసుకుందాం.

కొన్ని విద్యా సంస్థలు అక‌డ‌మిక్‌లో మంచి ప్రతిభ ఉన్నవారికి, మ‌రికొన్ని ప‌ని అనుభ‌వం ఉన్నవారికి జీఆర్ఈతో సంబంధం లేకుండా నేరుగానే ప్రవేశాలు క‌ల్పిస్తున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు బెర్క్‌లీ యూనివ‌ర్సిటీలో ఎన్విరాన్‌మెంట‌ల్ డిజైన్ కోర్సులో జీఆర్ఈ లేదా మ‌రెలాంటి ప‌రీక్షనూ రాయ‌కుండానే విదేశీ విద్యార్థులు సైతం చేరిపోవ‌చ్చు. అలాగే కొలంబియా విశ్వవిద్యాల‌యంలో స్ట్రాట‌జిక్ క‌మ్యూనికేష‌న్‌లో ఎగ్జిక్యూటివ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ కోర్సులో ప్రవేశానికి జీఆర్ఈ త‌ప్పనిస‌రి కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే ప‌లు విశ్వవిద్యాల‌యాలు వివిధ కోర్సుల్లో ప‌రీక్షలేమీ అవ‌స‌రం లేకుండానే ప్రవేశం క‌ల్పిస్తున్నాయి. కోర్సుల వారీ అవ‌కాశం క‌ల్పిస్తోన్న యూనివ‌ర్సిటీల వివ‌రాలు ఇలా ఉన్నాయి...

కంప్యూట‌ర్ సైన్స్‌
ఆక్స్‌ఫోర్డ్ యూనివ‌ర్సిటీ ఎమ్మెస్సీ కంప్యూట‌ర్ సైన్స్ కోర్సులో ప్రవేశానికి యూజీ డిగ్రీలో సాధించిన మార్కుల‌నే ప్రామాణికంగా తీసుకుంటుంది. అంటే యూజీలో మంచి మార్కుల‌తో ఉత్తీర్ణులైతే ఆక్స్‌ఫోర్డ్‌లో అవ‌కాశం ద‌క్కించుకున్నట్లే.

మ‌సాచ్యుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఎంఐటీ) ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్ అండ్ కంప్యూట‌ర్ సైన్స్ కోర్సులో పూర్వవిద్యలో స‌బ్జెక్టుల‌వారీ పొందిన మార్కులు, 3 రెక‌మండేష‌న్ ఉత్తరాలు, ఒక స్టేట్ మెంట్ ఆఫ్ ప‌ర్పస్(ఎస్ఓపీ) ఆధారంగా ప్రవేశం క‌ల్పిస్తుంది.

టొరంటో యూనివ‌ర్సిటీ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ అప్లైడ్ కంప్యూటింగ్ కోర్సులో... కంప్యూట‌ర్ సైన్స్‌లో బ్యాచిల‌ర్ డిగ్రీలో సాధించిన మార్కుల ద్వారా ప్రవేశం క‌ల్పిస్తుంది. అలాగే జాన్ హాప్కిన్స్ యూనివ‌ర్సిటీ కంప్యూట‌ర్ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీతోపాటు ప‌లు ఇత‌ర కోర్సుల్లో.. బ్యాచిల‌ర్ డిగ్రీ స్కోరు, ప‌ని అనుభ‌వం ద్వారా ప్రవేశం క‌ల్పిస్తుంది.

మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్‌
ఆక్స్ ఫోర్డ్ యూనివ‌ర్సిటీ ఎమ్మెస్సీ మ్యాథ్స్‌లో ప‌లు కోర్సులు అందిస్తోంది. వీటిలో ప్రవేశానికి యూజీ డిగ్రీలో సాధించిన మార్కులే కీల‌కం.
కేంబ్రిడ్జి యూనివ‌ర్సిటీ పీజీ స్థాయిలో మ్యాథ‌మెటిక‌ల్ స్టాటిస్టిక్స్‌, ప్యూర్ మ్యాథ్స్‌, అప్లైడ్ మ్యాథ్స్ కోర్సుల్లో యూజీ డిగ్రీలో సాధించిన మార్కుల ద్వారా ప్రవేశం క‌ల్పిస్తుంది. అలాగే ఇంపీరియ‌ల్ కాలేజ్ ఆఫ్ లండ‌న్‌, యూనివ‌ర్సిటీ ఆఫ్ టొరంటో, లండ‌న్ స్కూల్ ఆఫ్ ఎక‌నామిక్స్ అండ్ పొలిటిక‌ల్ సైన్స్ విశ్వవిద్యాల‌యాలు కూడా యూజీలో సాధించిన మార్కుల ద్వారా మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌ల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశం క‌ల్పిస్తున్నాయి.

సివిల్ ఇంజినీరింగ్‌
మెల్‌బోర్న్ యూనివ‌ర్సిటీ, బ్రిటిష్ కొలంబియా యూనివ‌ర్సిటీ, సింగ‌పూర్ నేష‌న‌ల్ యూనివ‌ర్సిటీ, హాంగ్‌కాంగ్ యూనివ‌ర్సిటీలు సివిల్ ఇంజినీరింగ్‌ మాస్టర్ డిగ్రీలో జీఆర్ఈ స్కోర్ అవ‌స‌రం లేకుండానే ప్రవేశం క‌ల్పిస్తున్నాయి. బీటెక్ సివిల్‌లో సాధించిన మార్కులే ప్రవేశానికి ముఖ్య ప్రాతిప‌దిక‌.

ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్‌
సింగ‌పూర్ నేష‌న‌ల్ యూనివ‌ర్సిటీ, మెల్‌బోర్న్ యూనివ‌ర్సిటీ, మోనాష్ యూనివ‌ర్సిటీ, హాంకాంగ్ యూనివ‌ర్సిటీ, మాంచెస్టర్ యూనివ‌ర్సిటీలు బీటెక్ ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్‌లో సాధించిన మార్కులే ప్రామాణికంగా ఎంఎస్ ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్‌లో ప్రవేశం క‌ల్పిస్తున్నాయి. కొన్ని సంస్థల్లో ప‌ని అనుభ‌వానికి ప్రాధాన్యం ల‌భిస్తుంది.

మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌
టొరంటో యూనివ‌ర్సిటీ, మెల్‌బోర్న్ యూనివ‌ర్సిటీ, బ్రిటిష్ కొలంబియా యూనివ‌ర్సిటీ, హాంకాంగ్ యూనివ‌ర్సిటీ, మాంచెస్టర్ యూనివ‌ర్సిటీలు సంబంధిత స‌బ్జెక్టులో బ్యాచిల‌ర్ డిగ్రీలో సాధించిన మార్కుల ద్వారా పీజీ మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌లో ప్రవేశం క‌ల్పిస్తున్నాయి.

జీఆర్ఈ అవ‌స‌రం లేదుకాబ‌ట్టి ఈ కోర్సుల్లో ప్రవేశాలు పొంద‌డం సులువే అనుకుంటే పొర‌పాటే. ఎందుకంటే వీటిలో విశ్వవిఖ్యాత విశ్వవిద్యాల‌యాలెన్నో ఉన్నాయి. మిగిలిన యూనివ‌ర్సిటీల‌కూ క్యూఎస్ వ‌ర‌ల్డ్ ర్యాంకింగ్‌లో చోటు ద‌క్కింది. కాబ‌ట్టి పోటీ ఎక్కువే. బ్యాచిల‌ర్ డిగ్రీలో ఎక్కువ శాతం మార్కులు (జీపీఏ) సాధించిన‌వాళ్లే ప్రవేశం పొంద‌గ‌ల‌రు. వీటిలో కొన్ని యూనివ‌ర్సిటీలు మాత్రం ఆంగ్లభాషా నైపుణ్యం తెలుసుకోవ‌డానికి టోఫెల్ లేదా ఐఈఎల్‌టీఎస్ స్కోర్ లేదా మ‌రేదైనా ఆంగ్ల నైపుణ్యం తెలిపే ప్రామాణిక ప‌రీక్ష స్కోర్ అడుగుతున్నాయి.


Back..

Posted on 02-11-2016