Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
సేవకూ ఉపాధికీ ‘నర్సింగ్‌’

2016-17 విద్యా సంవత్సరానికి తెలుగు రాష్ట్రాల్లో బీఎస్సీ నర్సింగ్‌ కోర్సు ప్రవేశానికి ప్రకటన వెలువడింది. డా. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ, కౌన్సెలింగ్‌ పద్ధతిన ప్రవేశాలు కల్పిస్తారు. ఈ సందర్భంగా నర్సింగ్‌ కోర్సుల వివరాలు, వాటి ఉపాధి అవకాశాలను పరిశీలిద్దాం.సేవా గుణానికి మారుపేరు నర్సింగ్‌. దీన్ని వృత్తిగానే కాకుండా సేవ, సహనం, మానవతా దృక్పథం జోడిస్తే మెరుగ్గా రాణిస్తూ మెరుగైన అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.
పెరుగుతున్న జనాభాకు సరిపడా నర్సుల సంఖ్య మనదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగానూ పెరగడం లేదు. అందుకనే వివిధ రంగాల్లో శిక్షణ పొందిన వారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుంటే, నర్సింగ్‌ శిక్షణ పొందినవారి కోసం ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయని చెప్పవచ్చు. వాస్తవానికి నర్సింగ్‌ సేవలందిస్తున్నవారిలో కేవలం మూడో వంతు మందే సుశిక్షితులుగా ఉన్నారనేది అంచనా.
ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ శకానికి ముందు నర్సింగ్‌ సేవలు మాతా శిశు సంరక్షణ కోసం నర్సులుగా, మంత్రసానులుగా మాత్రమే అందేవి. 1854లో జరిగిన యుద్ధంలో గాయపడిన సైనికులకు సేవలందించడం, వారి ఆరోగ్య పరిరక్షణకు బ్రిటిష్‌ ప్రభుత్వం స్వీయ శిక్షణ పొందిన ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ను నియమించింది. ఆమెకు సహాయకులుగా కొంతమందిని నియమించుకోవడంతో నర్సింగ్‌ సేవలకు అంకురార్పణ జరిగింది.
మనదేశంలో 1917 సం॥లో రెండు శిక్షణ కేంద్రాలు మాత్రమే నర్సింగ్‌ విద్యను అందించేవి. ప్రస్తుతం వీటి సంఖ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు మూడొందల వరకు ఉన్నాయి. ఇవి నర్సింగ్‌ కోర్సుల్లో వివిధ స్పెషలైజేషన్లలో శిక్షణ అందిస్తున్నాయి.
ఈ కోర్సులు చేస్తున్నవారిలో వృత్తి నైపుణ్యంతో పాటు ఎటువంటి అత్యవసరస్థితిలోనైనా నిబ్బరంగా వుండే శక్తి, మానవత్వం, తదనుగుణమైన జీవనశైలి అప్రయత్నంగా ఏర్పడతాయి.

స్పెషలైజేషన్లు
ప్రధానంగా డిప్లొమా (GNM) , బ్యాచిలర్స్‌ డిగ్రీ (B.Sc, Nur), పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ (M.Sc, Nur), ఎం.ఫిల్‌, పీహెచ్‌డీ కోర్సులను ప్రభుత్వ- ప్రైవేట్‌ విద్యాసంస్థలు అందిస్తున్నాయి. కేవలం రోగి, మాతా శిశు సంరక్షణకు నిర్దేశించిన అంశాలతో పాటు వివిధ విభాగాల్లో స్పెషలైజేషన్లు బోధిస్తున్నారు.
మానవశరీర భాగాల్లో ప్రధానమైన గుండె, నరాలు, మూత్రపిండాలు, చెవి, ముక్కు, కన్ను ఇలా... కార్డియో థొరాసిక్‌ నర్సింగ్‌, న్యూరొలాజికల్‌, థియేటర్‌, జిరియాట్రిక్‌, ఎనస్తీషియా, సైకియాట్రిక్‌, పిడియాట్రిక్‌, ఆంకలాజికల్‌, ఆర్తోపెడిక్‌ నర్సింగ్‌ తదితర విభాగాలలో శిక్షణ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
ఈ కోర్సులు పూర్తిచేసినవారికి దేశ విదేశాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఇతర దేశాల్లో వీరికి వైద్యులతో సమాన హోదాతో కూడిన జీతం అందుతుంది. ముఖ్యంగా మనదేశంలో నర్సింగ్‌ శిక్షణ పొందినవారికి అక్కడ మంచి గిరాకీ కూడా వుంది. దీనిలో ఉండే ఉపాధి అవకాశాలు తెలుసుకుంటే అనువైన విభాగపు ఎంపిక సులభమవుతుంది.

స్పెషాలిటీలు
* చైల్డ్‌హెల్త్‌ నర్సింగ్‌ (పీడియాట్రీ నర్సింగ్‌)
* మెడికల్‌ సర్జికల్‌ నర్సింగ్‌
* కమ్యూనిటీ హెల్త్‌ నర్సింగ్‌
* సైకియాట్రిక్‌ నర్సింగ్‌
* గైనకాలజీ అండ్‌ అబ్‌స్టిసైట్రిక్స్‌ నర్సింగ్‌
ఈ విభాగాల్లో ప్రత్యేక శిక్షణ పొందితే పెద్ద పెద్ద కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఉపాధినీ, మంచి జీతంతో కూడిన హోదానూ పొందే వీలుంటుంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రైవేటు కాలేజీలతో పాటు, హైదరాబాద్‌లోని ఉస్మానియా ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీ, నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌), తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (స్విమ్స్‌)లు ఎంఎస్సీ నర్సింగ్‌ కోర్సులు అందిస్తున్నాయి. (పద్మావతమ్మ నర్సింగ్‌ కాలేజీ తిరుపతి)

జాతీయ స్థాయిలో..
జాతీయస్థాయిలో ప్రఖ్యాతి చెందిన విద్యాసంస్థల్లో బీఎస్‌సీ, ఎంఎస్‌సీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ప్రముఖమైనవి...
* ‘ఎయిమ్స్‌’- ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌.
* ‘జిప్‌మర్‌’- జవహర్‌ లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌- పుదిచ్చేరి.
* ‘రాజ్‌కుమారి అమృత్‌ కౌర్‌ కాలేజీ ఆఫ్‌ నర్సింగ్‌’- న్యూదిల్లీ
* ‘రిమ్స్‌’- రాజీవ్‌ గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, బెంగళూరు.
* ‘నిమ్‌హాన్స్‌’- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ & న్యూరో సైన్సెస్‌ బెంగళూరు.
ఇందులో నిమ్‌హాన్స్‌, రాజకుమారి అమృతకౌర్‌ కాలేజీ ఆఫ్‌ నర్సింగ్‌లలో పి.హెచ్‌.డి. రీసెర్చ్‌ ఇన్‌ నర్సింగ్‌- డిగ్రీ కోర్సులు అందిస్తున్నాయి. దేశంలోని ఆర్మీ నర్సింగ్‌ కాలేజీల్లో నాలుగేళ్ల బి.ఎస్సీ. నర్సింగ్‌, మూడున్నర సం॥రాల జి.ఎన్‌.ఎమ్‌. నర్సింగ్‌ కోర్సులు ఉన్నాయి. వీరికి మిలటరీ సర్వీసుల్లో నియామకాలు అందజేస్తున్నారు. మెరుగైన జీతంతో మిలటరీ కేడర్‌లను అందిస్తున్నారు.
గతంలో ‘నర్సింగ్‌’ వృత్తిపట్ల ఉన్న అపోహల వల్ల నర్సింగ్‌ కోర్సుల శిక్షణ ఎంచుకునేవారి సంఖ్య తక్కువగా ఉండేది. ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గత రెండేళ్ల నుంచి మహిళలతోపాటు పురుషులు కూడా ఆ వృత్తిపట్ల ఆసక్తి చూపుతున్నారు.
ఈ శిక్షణ కోర్సుల్లో దేశవ్యాప్తంగా ఒకే సిలబస్‌ అనుసరించటం వల్ల దేశవ్యాప్తంగా మెరుగైన అవకాశాలున్నాయి. కార్పొరేట్‌ ఆసుపత్రులు అందిస్తున్న వైద్యసేవల్లో నర్సింగ్‌ సేవలు ప్రధానమైనవి. ఇప్పుడు నర్సింగ్‌ హోమ్‌లు, ఆసుపత్రులతో పాటుగా రిహాబిలిటేషన్‌, హోమ్‌ నర్సింగ్‌, ఓల్డ్‌ యేజ్‌ హోమ్స్‌, సేవా కేంద్రాలలో నర్సింగ్‌ ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడుతున్నాయి.
మంచి మౌలిక వసతులు, బోధన సిబ్బంది, అనుబంధ ఆస్పత్రి ఉన్న నర్సింగ్‌ కళాశాలలను ఎంచుకొని చదివితే భవిష్యత్తు మెరుగ్గా ఉంటుంది.

ఆన్‌లైన్లో దరఖాస్తులు
బీఎస్సీ నర్సింగ్‌ కోర్సు చదవడానికి డా॥ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రవేశ ప్రకటనను విడుదల చేసింది. ప్రవేశంకోరే అభ్యర్థులు స్త్రీ/ పురుషులు దరఖాస్తులను http://ntruhs.ap.nic.in నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొని ఆన్‌లైన్లో దరఖాస్తులు పంపుకోవాలి.

ఈ కోర్సులు పూర్తిచేసినవారికి దేశ విదేశాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఇతర దేశాల్లో వీరికి వైద్యులతో సమాన హోదాతో కూడిన జీతం అందుతుంది. ముఖ్యంగా మనదేశంలో నర్సింగ్‌ శిక్షణ పొందినవారికి అక్కడ మంచి గిరాకీ ఉంది.

కోర్సుల వివరాలు
మల్టీపర్సన్‌ హెల్త్‌ వర్కర్‌ (ఎం.పి.హెచ్‌.డబ్లు్య): గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఆరోగ్య సేవలందించేందుకు ఈ కోర్సు చేసినవారు అర్హులు. ప్రతి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో 16 మంది మిడ్‌ వైఫరీ నర్స్‌లు (ఎ.ఎన్‌.ఎం.) అవసరమవుతున్నారు. ఈ కోర్సు అభ్యసించాలనుకునేవారు ఇంటర్‌లో ఏదైనా గ్రూప్‌ ద్వారా కనీసం 40% మార్కులు సాధించి వుండాలి. 17 సం॥రాల వయసు దాటినవారు అర్హులు. శిక్షణ కాలం 18 నెలల నుంచి 24 నెలలు.
డిప్లొమా ఇన్‌ జనరల్‌ నర్సింగ్‌- మిడ్‌ వైఫరీ (జీ.ఎన్‌.ఎం.): నర్సింగ్‌ స్కూళ్ళలో ఈ శిక్షణ అనంతరం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో స్టాఫ్‌ నర్స్‌గా ఉపాధి పొందే వీలుంది. ట్రెయిన్డ్‌ నర్సుగా విధులు నిర్వర్తించవచ్చు. ఇంటర్‌లో ఏదైనా గ్రూప్‌ ద్వారా కనీసం 45% మార్కులు సాధించి ఉండాలి. 17 సం॥రాల కనీస వయసు అవసరం. కోర్సుల కాల వ్యవధి 3 1/2 సం॥రాలు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే నర్సింగ్‌ స్కూళ్ళు: విజయవాడ, గుంటూరు, కాకినాడ, కర్నూలు, తిరుపతి, అనంతపురం, కడప, ఒంగోలు; హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌ జిల్లా ప్రధాన కేంద్రాలలో ఉన్నాయి. ఈ కోర్సు అనంతరం 2 సం॥ నర్సింగ్‌ సేవల్లో అనుభవం పొందినవారు రెండు సం॥రాల పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ చేసేందుకు అర్హులు.
బీఎస్సీ నర్సింగ్‌: ఇది నాలుగేళ్ళ కోర్సు. ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ కోర్సును అందిస్తున్న విద్యాసంస్థలు 221; 109 ఉన్నాయి. సుమారు 5000 సీట్లు అందుబాటులో ఉంటాయి. నర్సింగ్‌ కళాశాలలు తప్పనిసరిగా కేంద్రంలోని ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌, డా॥ ఎన్టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ల అనుమతి పత్రాలు పొందివుండాలి. ఈ కోర్సులు అభ్యసించేందుకు ఇంటర్‌లో బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీతోపాటు ఇంగ్లిషును సబ్జెక్టుగా చదివివుండాలి. కనీసం 17 సం॥రాలు నిండి ఉండాలి. ఇంటర్‌లో పొందిన మార్కుల ఆధారంగా ప్రతిభ ప్రాతిపదికన కౌన్సెలింగ్‌లో ప్రవేశాలు కల్పిస్తారు.
ప్రతి జిల్లా ప్రధాన కేంద్రంలో ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలలు నాలుగేళ్ళ బీఎస్సీ నర్సింగ్‌ అందిస్తున్నాయి. వీటికితోడు ప్రైవేటు నర్సింగ్‌ కళాశాలలున్నాయి. కోర్సు అనంతరం స్టేట్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అవ్వాలి. రిజిస్టర్‌ అయినవారు ఉపాధి అవకాశాలు పొందవచ్చు.
పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ డిగ్రీ: ఇది రెండు సం॥రాల కోర్సు. జీఎన్‌ఎం (జనరల్‌ నర్సింగ్‌ ఖీ మిడ్‌ వైఫరీ డిప్లొమా) కోర్సు పూర్తిచేసినవారు అర్హులు. రెండు సం॥ నర్సింగ్‌ వృత్తిలో అనుభవం ఉన్నవారు కోర్సు చదవడానికి అర్హులు. ఈ కోర్సు చదవడానికి స్టేట్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయివుండాలి.
ఎంఎస్సీ నర్సింగ్‌: బీఎస్సీ నర్సింగ్‌ తరువాత బోధన వృత్తిలో నైపుణ్యం కల్గిన, ఆసక్తి వున్న అభ్యర్థులు నర్సింగ్‌లో ఎంఎస్సీ చేయవచ్చు. ఈ కోర్సు రెండేళ్ళ కాల వ్యవధితో వివిధ స్పెషలైజేషన్లలో శిక్షణ ఉంటుంది.


Back..

Posted on 30-08-2016