Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
కడలి... ఉపాధి కూడలి!

భూమ్మీదున్న మానవాళికి సముద్రంతో విడదీయరాని సంబంధం! పెను తుపాన్లూ, సునామీలూ కలిగించే నష్టం నాణేనికి ఒక వైపే. అపారమైన చమురు, ఖనిజ, మత్స్యసంపదలకు నిలయమిది. అసంఖ్యాకమైన జీవులకు తన గర్భంలో చోటిస్తోంది. ఈ జలనిధిని శోధించి, దాని రహస్యాలను ఛేదించాలనే ఆసక్తి చాలామందికి ఉంటుంది. ఈ ఆసక్తినే ఆకర్షణీయమైన కెరియర్‌గా మలచుకోవచ్చు!

‘సముద్రంలో ఫలానా జీవుల సంఖ్య పెరిగింది’, ‘సాగర తీరం పరిధి పెరిగింది’ లాంటి విషయాలు వార్తల్లో చదువుతుంటాం. కడలిలో చమురు నిల్వల సంగతీ, వందల ఏళ్ల క్రితం మునిగిపోయిన నౌక కనుమరుగవటానికి సముద్ర జీవులు కారణమనీ వింటుంటాం. ఇలాంటి సమాచారమంతా అందించడంలో ప్రధాన పాత్ర- ఓషనోగ్రాఫర్లది!.

సాగరం గురించిన వివిధ అంశాలను అధ్యయనం చేసేవారే ఓషనోగ్రాఫర్లు. ఈ అధ్యయనాన్ని ఓషనోగ్రఫీ అంటారు. సముద్రాలు, వాటి కోస్తారేఖ, నదీముఖాలు, తీరసంబంధ అంశాలు, ఓషన్‌బెడ్‌ మొదలైన వాటిని అధ్యయనం చేసే దీన్ని వివిధ శాఖల సమ్మిళితంగా చెప్పొచ్చు. బయాలజీ, కెమిస్ట్రీ, జియాలజీ, మెటియోరాలజీ, ఫిజిక్స్‌ వంటివన్నీ దీనిలో భాగం. వివిధ రకాల శాస్త్రీయ అంశాలతోపాటు నిరంతరం నేర్చుకునే అవకాశాన్ని కలిగిస్తుందీ శాస్త్రం. ఓషనాలజీ/ మెరైన్‌ సైన్స్‌ అనే పేర్లతోనూ దీన్ని పిలుస్తారు.
ఈ విభాగంలోని అంశాలు చదివి, నైపుణ్యం సాధించినవారిని ఓషనోగ్రాఫర్‌/ మెరైన్‌ బయాలజిస్ట్‌లుగా పిలుస్తారు. ఖనిజాల విశ్లేషణ, షిప్పింగ్‌, ఫిషరీస్‌, తీరసంబంధ అంశాల పరిశీలన, వాతావరణ అంచనా, వాతావరణ మార్పుల విశ్లేషణ వంటివి వీరు చేస్తారు. వీరికి సైన్స్‌కు సంబంధించిన ప్రాథమిక జ్ఞానం అవసరమవుతుంది. దీనికి సంబంధించిన కోర్సులను చదివితే సంబంధిత పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంతోపాటు ఉద్యోగావకాశాలనూ చేజిక్కించుకోగలుగుతారు.

కోర్సులివిగో..!
సైన్స్‌ నేపథ్యం ఉన్నవారు ఈ కోర్సులను చేయడానికి అర్హులు. బయాలజీ, జువాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీలతోపాటు కొన్ని కోర్సులకు మేథ్స్‌ నేపథ్యమూ అవసరమే.
డిగ్రీస్థాయిలో..
బీటెక్‌ ఇన్‌ నేవల్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఓషన్‌ ఇంజినీరింగ్‌ మాత్రమే అందుబాటులో ఉంది. అంతకుముందు బీఎస్‌సీ మెరైన్‌ సైన్స్‌ అందుబాటులో ఉండేది. డిగ్రీ స్థాయి నుంచే కోర్సు చేయాలనుకునేవారు బీటెక్‌ను ఎంచుకోవచ్చు. తమిళనాడుకు చెందిన అన్నామలై యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్‌ కోర్సును అందిస్తోంది. దాన్నైనా ఎంచుకోవచ్చు. బీటెక్‌ చదవాలనుకునేవారు ఇంటర్‌లో ఫిజిక్స్‌, మేథమేటిక్స్‌, కెమిస్ట్రీలను సబ్జెక్టులుగా చదివుండాలి. జేఈఈ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
పీజీ స్థాయిలో..
ఎంఎస్‌సీ, ఎంటెక్‌, ఎంఫిల్‌, పీహెచ్‌డీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
* ఎంఎస్‌సీ ఓషనోగ్రఫీ, ఎంఎస్‌సీ మెరైన్‌ బయాలజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కోర్సు కాలవ్యవధి- రెండేళ్లు. ఈ కోర్సుల్లోకి ప్రవేశం పొందాలంటే డిగ్రీ స్థాయిలో జువాలజీ/ బోటనీ/ కెమిస్ట్రీ/ ఫిషరీస్‌ సైన్స్‌/ ఎర్త్‌ సైన్స్‌/ ఫిజిక్స్‌/ అగ్రికల్చర్‌/ మైక్రోబయాలజీ/ అప్లయిడ్‌ సైన్సెస్‌ లేదా తత్సమాన విభాగాల్లో కోర్సులు పూర్తిచేసుండాలి. సంబంధిత ప్రవేశపరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
* ఎంటెక్‌ ఇన్‌ నేవల్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఓషన్‌ ఇంజినీరింగ్‌, ఎంటెక్‌ ఇన్‌ ఓషన్‌ టెక్నాలజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కోర్సు కాలవ్యవధి- రెండేళ్లు. డిగ్రీ స్థాయిలో ఇంజినీరింగ్‌ చదివినవారు అర్హులు. గేట్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
* కెమికల్‌ ఓషనోగ్రఫీలో ఎంఫిల్‌ అందుబాటులో ఉంది. కోర్సు కాలవ్యవధి- ఒకటి లేదా రెండేళ్లు. పీజీ స్థాయిలో సంబంధిత సబ్జెక్టులు చదివినారు అర్హులు. మెరిట్‌ ఆధారంగా కానీ, ప్రవేశపరీక్షను నిర్వహించి కానీ ప్రవేశాలు కల్పిస్తారు.
* సైన్స్‌ విభాగంలో పీజీ చేసినవారు పీహెచ్‌డీకి అర్హులు. నెట్‌/ గేట్‌ ద్వారా అర్హత సాధించొచ్చు.
మనదేశంలో ఓషనోగ్రఫీకి సంబంధించి చాలావరకూ సంస్థలు/ విశ్వవిద్యాలయాలు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులను అందిస్తున్నాయి. చాలా కొన్ని సంస్థలు మాత్రమే ఎంఫిల్‌, పీహెచ్‌డీ కోర్సులను అందిస్తున్నాయి. కోర్సుల్లో భాగంగా థియరిటికల్‌ పరిజ్ఞానంతోపాటు ప్రాక్టికల్‌ జ్ఞానాన్నీ అందిపుచ్చుకుంటారు. శాంపిల్స్‌ను సేకరించడం, సర్వేలు నిర్వహించడం, తగిన పరికరాల సాయంతో గంటలకొద్దీ సముద్రంలో డేటాను విశ్లేషించడం వంటివి ప్రాక్టికల్‌ తరగతుల్లో భాగంగా ఉంటాయి.

కోర్సులు అందిస్తున్న ప్రముఖ సంస్థలు
* సీఎస్‌ఐఆర్‌- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ, గోవా
* ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం
* అన్నా యూనివర్సిటీ, చెన్నై
* అన్నామలై యూనివర్సిటీ, తమిళనాడు
* ఐఐటీ- దిల్లీ, ఖరగ్‌పుర్‌, మద్రాస్‌
* కర్ణాటక యూనివర్సిటీ
* కేరళ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ
* మంగళూరు యూనివర్సిటీ, కర్ణాటక
* డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ మరద్వాడా యూనివర్సిటీ, మహారాష్ట్ర
* బెర్హంపూర్‌ యూనివర్సిటీ, ఒడిశా
* కలకత్తా యూనివర్సిటీ
* సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ ఎడ్యుకేషన్‌, ముంబయి
* కొచ్చి యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
* గోవా యూనివర్సిటీ
* ఉత్కల్‌ యూనివర్సిటీ, భువనేశ్వర్‌ మొదలైనవి.
ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్లు జూన్‌, జులైల్లో విడుదలవుతాయి.

ఉద్యోగావకాశాలు
ఓషనోగ్రఫీకి సంబంధించి మనదేశంలోనూ, విదేశాల్లోనూ మంచి ఉద్యోగావకాశాలున్నాయి. ప్రభుత్వ, సంబంధిత సంస్థలతోపాటు ప్రైవేటు సంస్థల్లోనూ వీరిని ఎంచుకుంటున్నారు. 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా పరిశోధన రంగంలో ఉద్యోగావకాశాలు 16% పెరుగుతాయని అంచనా. మిగతా రంగాలతో పోలిస్తే దీనిలోనే ఎక్కువ అభివృద్ధి కనిపిస్తోంది. దీనిలోనూ ఓషనోగ్రఫీదే ప్రధాన పాత్ర. కాబట్టి, బలమైన సైంటిఫిక్‌ నేపథ్యంతోపాటు వాతావరణ అంశాలపై అవగాహన, మంచి కంప్యూటర్‌ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటే మంచి ఉద్యోగావకాశాలను చేజిక్కించుకోవచ్చు.
* మెరైన్‌ పాలసీ ఎక్స్‌పర్ట్స్‌
* మెరైన్‌ అండ్‌ ఓషన్‌ ఇంజినీర్స్‌
* మెరైన్‌ ఆర్కియాలజిస్ట్స్‌
* మెరైన్‌ బయాలజిస్ట్‌
* ఫిజికల్‌ ఓషనోగ్రాఫర్స్‌
* మెరైన్‌ ఎన్విరాన్‌మెంటలిస్ట్స్‌
* జియోలాజికల్‌ ఓషనోగ్రాఫర్స్‌ అండ్‌ జియోఫిజిసిస్ట్స్‌
* ఫిజికల్‌ ఓషనోగ్రాఫర్స్‌
* కెమికల్‌ ఓషనోగ్రాఫర్స్‌ అండ్‌ మెరైన్‌ జియోకెమిస్ట్స్‌
* బయలాజికల్‌ ఓషనోగ్రాఫర్స్‌, మెరైన్‌ బయాలజిస్ట్స్‌ అండ్‌ ఫిషరీస్‌ సైంటిస్ట్స్‌
* మెరైన్‌ అండ్‌ ఓషన్‌ ఇంజినీర్
* హైడ్రోగ్రాఫర్‌
* మెరైన్‌ టెక్నీషియన్‌ మొదలైన విధుల్లోకి వీరిని ఎంచుకుంటున్నారు.
ఉద్యోగాల్లోకి తీసుకుంటున్న సంస్థలు: ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌ లేెబొరేటరీలు, ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీలు, విద్యాసంస్థలు, నేవీ, వివిధ ఆయిల్‌, చమురు సంస్థలు, జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, మెటియోరాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, ఓషనోగ్రఫీ డిపార్ట్‌మెంట్లు, మెరైన్‌ వర్క్‌షాప్‌లు, కన్సల్టెన్సీలు, సేఫ్టీ ఆర్గనైజేషన్లు వీరిని ఎక్కువగా ఎంచుకుంటున్నాయి. వివిధ మెరైన్‌ పరిశ్రమలు కూడా వీరికి ఉద్యోగావకాశాలిస్తున్నాయి. ఆసక్తి ఉన్నవారు సంబంధిత విభాగంలో బోధనకూ ప్రాధాన్యమివ్వవచ్చు.
జీతభత్యాలు: మనదేశంలో ప్రారంభ వేతనం నెలకు రూ.20,000 నుంచి రూ.30,000 వరకూ పొందే వీలుంది. ఎంచుకున్న స్పెషలైజేషన్‌, అనుభవం ఆధారంగా జీతంలో పెరుగుదల ఉంటుంది. విదేశాల్లో 50,000 డాలర్ల నుంచి 80,000 డాలర్ల వరకూ పొందొచ్చు. అయితే విదేశాల్లో ఉద్యోగావకాశాలు పొందాలంటే డాక్టరేట్‌ పొందివుండటం తప్పనిసరి.

నాలుగు స్పెషలైజేషన్లు
సైన్స్‌ విభాగంలో వివిధ స్పెషలైజేషన్లు ఉన్నట్లే ఓషనోగ్రఫీలోనూ ప్రధానంగా నాలుగు ఉన్నాయి.
1. బయలాజికల్‌ ఓషనోగ్రఫీ: సముద్రంలో జీవించే మొక్కలు, జంతువులు, ఇతర జీవరాశుల గురించి అధ్యయనం చేస్తారు. జీవుల ప్రవర్తన, ఆహార అలవాట్లు, ఇతర జీవులతో సంబంధ బాంధవ్యాలు, సంతానోత్పత్తి, సముద్రంలోని పెద్ద జీవులపై జీవరాశులు చూపే ప్రభావం వంటివన్నీ దీనిలో భాగంగా ఉంటాయి. వాతావరణ, ఉష్ణోగ్రతల్లో మార్పులు, కాలుష్యం జీవులపై ఎలాంటి ప్రభావం చూపుతోందో పరిశీలిస్తారు. నిపుణులు పనిలో భాగంగా ఫీల్డ్‌ అబ్జర్వేషన్లు, కంప్యూటర్‌ మోడళ్లు, లేబొరేటరీలో ప్రయోగాలు వంటివి కూడా చేస్తుంటారు.
2. కెమికల్‌ ఓషనోగ్రఫీ: సముద్రపు నీటితో మిశ్రమమై ఉన్న రసాయనాల గురించి అధ్యయనం చేస్తారు. వాతావరణ పరంగా మార్పులు సంభవించినపుడు అది సముద్రపు నీటిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అంచనా వేస్తారు. ఈ ప్రభావం సముద్రంలో జీవించే జీవరాశిపై ఏ విధమైన ప్రభావం చూపుతోందో పరిశీలిస్తారు. కెమిస్ట్రీని ఉపయోగించి, సముద్ర అలల కరెంటు భూమి చుట్టూ నీటిని ఎటువైపు మళ్లిస్తున్నాయో, దీని కారణంగా ఎక్కడ ఎలాంటి వాతావరణం ఏర్పడుతుందో అంచనావేస్తారు. అలాగే సముద్ర గర్భంలో దొరికే సహజ వస్తువులను ఔషధ రంగంలో ఎంతవరకూ ఉపయోగించొచ్చో పరిశోధనలు చేస్తారు.
3. జియోలాజికల్‌ ఓషనోగ్రఫీ: సముద్ర భూభాగం, దాని నిర్మాణాల గురించి చదువుతారు. సముద్రంలో పర్వతాలు, లోయలు వంటి వాటిల్లో మార్పులకు గల కారణాలపై పరిశోధనలు జరుపుతారు. గత సర్వేల సాయంతో ఏ మేరకు మార్పు సంభవమైందో గుర్తిస్తారు. సముద్రంలో ఏర్పడే అల్పపీడనాలు, తుపానులకు గల కారణాలు, ఏర్పడే అవకాశాలను అంచనావేస్తారు.
4. ఫిజికల్‌ ఓషనోగ్రఫీ: దీనిలో సముద్ర అలలు, తరంగాలు, కరెంట్‌, సుడిగుండాలు, అవి ఏర్పడటానికి గల కారణాలు మొదలైనవాటిని అధ్యయనం చేస్తారు. తీరప్రాంతాలు జరగడం, వాతావరణానికి, సముద్రానికి మధ్య జరిగే చర్య, ప్రతిచర్యలు వంటి వాటిని గమనిస్తుంటారు. వీటి కారణంగా వాతావరణం, శీతోష్ణస్థితిపై పడే ప్రభావం, నీటి ద్వారా కాంతి, శబ్దాల ప్రయాణం వంటివాటిపై పరిశోధనలు జరుపుతారు.
ఈ విభాగాలన్నీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. ఈ సబ్జెక్టులన్నింటిపై అవగాహన తప్పనిసరి.

Back..

Posted on 19-12-2018