Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఆఫీస్‌ ట్వంటీ 20

* కెరియర్‌ ట్రెండ్స్‌ 2020

మార్పు సహజం. మారకుండా ఏదీ ఉండదు. కాలంతోపాటు ప్రపంచం మారిపోతోంది. ఆఫీసులూ అందుకు అతీతం కాదు. అవీ మారిపోతున్నాయి. ఇక్కడి పనులు ఇకనుంచి ఇంతకు ముందులాగా ఉండవు. టెక్నాలజీ ప్రతి దానిపైనా ప్రభావాన్ని చూపుతోంది. మిలేనియల్స్‌ మిసైల్స్‌లాగా దూసుకొస్తున్నారు. వీళ్లు పని ప్రదేశాలను మార్చేస్తారు. పనితీరు, పని విధానం, ప్రమోషన్‌.. ఇలా అన్నింటిలోనూ కొత్త లెక్కలు వచ్చేస్తాయి. నవతరం ఈ ధోరణులను గుర్తించి తగిన విధంగా సన్నద్ధమైతే రాబోయే దశాబ్దంలో చక్కగా రాణించవచ్చు.

ఏటా పని ప్రదేశంలో మార్పులు చోటు చేసుకోవడం సాధారణం. పూర్తిగా కాకపోయినా కొద్దిపాటి మార్పులైనా కనిపిస్తుంటాయి. కానీ కొత్త ఏడాది ఈ మార్పులు ఇంకా ఎక్కువ కాబోతున్నాయి. ముఖ్యంగా మిలేనియల్స్‌ వాటిని చూడబోతున్నారు. ఇదే ట్రెండ్‌ కొన్నేళ్లపాటు సాగుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ దశాబ్దపు మన వర్క్‌ఫోర్స్‌లో ఎక్కువమంది మిలేనియల్స్‌ ఉండటం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. 2025నాటికి నవతరమే కొత్త పని ప్రదేశాలను 75 శాతం ఆక్రమించేస్తారని అంచనా. ఈ నేపథ్యంలో ట్వంటీ ట్వంటీ పనిప్రదేశంలోనూ, పనితీరుల్లోనూ రానున్న మార్పులపై యువత అవగాహన ఏర్పరచుకోవడం అవసరం.

విరామం ఇబ్బందేం కాదు
సాధారణంగా రెజ్యూమెలో ఒక ఏడాది/ కొంత సమయం ఏ కారణంగానైనా ఖాళీ ఉండటం ఏ ఉద్యోగార్థికైనా పెద్ద సమస్యగా ఉండేది. ఇంటర్వ్యూ సమయంలో దీనికి సరైన సమాధానం చెప్పకపోతే ఒక్కోసారి కొలువునే చేజార్చుకునే పరిస్థితి. భవిష్యత్తులో అలాంటివి కనిపించకపోవచ్చు. చాలామందికి ఇది ఆనందకరమైన విషయమే. కానీ కాస్త ఆలోచిస్తే.. ఇంకో ప్రధాన కారణమూ కనిపిస్తుంది. ఇక్కడ సంస్థలు మార్కులు, మంచి పర్సంటేజీలపై ఆధారపడబోవడం లేదు. కావాల్సిన నైపుణ్యాలను మాత్రమే చూడనున్నాయి. అంటే.. సరైన ప్రతిభ, గట్టి పోటీ ఇవ్వగలిగితే చాలు! కొలువు అందుకున్నట్టే.

నిరూపించుకుంటేనే..
ఉద్యోగంలో చేరిన ప్రతి ఒక్కరూ పదోన్నతి గురించి ఆలోచిస్తుంటారు.ఎవరిని విజయం వరిస్తుందోనన్న ఉత్కంఠతో ఎదురు చూస్తుంటారు. ఫలితాలు వెల్లడయ్యేవరకూ అవకాశం ఎవరికి దక్కిందో తెలిసేది కాదు. అక్కడ అభ్యర్థి పనితీరును కొందరు గానీ, ఇంకొన్ని ప్రమాణాలు గానీ నిర్ణయించేవి. ఇప్పుడు సంస్థలు ఆ నిర్ణయాన్ని అభ్యర్థికే వదిలేస్తున్నాయి. నిర్దిష్టమైన పరీక్షలు నిర్వహించి, దానిలో ప్రతిభ చాటితేనే ప్రమోషన్లు ఇస్తున్నాయి. ప్రారంభ స్థాయి నుంచి సీనియర్‌ స్థాయి వరకు ఎవరైనా దీన్ని ఎదుర్కోవచ్చు. పైగా ఏడాది మొత్తం ఆ పరీక్షలు అందుబాటులో ఉండబోతున్నాయి. మన దగ్గర ఇప్పటికే కొన్ని సంస్థలు ఈ విధానంలో సాగుతున్నాయి. ఇకపై ఇంకొన్ని సంస్థలూ ఈ దారిలోకే రాబోతున్నాయి. అంటే భవిష్యత్తు సవాళ్లకు సిద్ధంగా ఉన్నామని నిరూపించుకుంటేనే అందలం అందుతుందన్నమాట.

వీలైన సమయం.. చోటు
ఉద్యోగం అనగానే ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల జీవితం గుర్తొస్తుంది. షిఫ్టుల్లో ఇతర వేళల్లోనూ పనిచేయాల్సి వస్తుంది. ఆఫీసులో నిర్ణీత గంటలపాటు కూర్చుని, సమయం పూర్తికాగానే వెళ్లడం కనిపిస్తుంటుంది.

ఈ తీరు మారబోతోంది. నచ్చిన వేళల్లో పనిచేయడం, ఇంటి నుంచే విధులు నిర్వర్తించడం వంటి అవకాశాలను కొన్ని సంస్థలు కల్పించబోతున్నాయి. ఇందుకు తగ్గట్టుగా సాంకేతికపరమైన ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటున్నాయి. దీనివల్ల సంస్థతోపాటు ఉద్యోగికీ ఖర్చులు తగ్గుతాయి.

వివిధ తరాలతో కలిసి..
కార్యాలయాల్లో వివిధ వయసులవారు కనిపిస్తారు. తరాల మధ్య కొద్దిపాటి మార్పు కనిపిస్తుంటుంది. సాధారణంగా సీనియర్ల నుంచి కొత్తగా వచ్చినవారు నేర్చుకుంటుంటారు. మిలేనియల్స్‌ విషయానికొచ్చేసరికి ఈ పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. టెక్నాలజీ వేగంగా దూసుకొస్తూ, పనిలో భాగమవుతోంది. దీన్ని అందుకోడానికి వెనుక తరాలకు కాస్త సమయం పడుతుంది. వారి అనుభవాన్నీ తక్కువ అంచనా వేయకూడదు. కాబట్టి, వేగంగా నేర్చుకుంటూనే, ఓపికతో వారితో కలిసి పనిచేయడం మిలేనియల్స్‌కు తప్పనిసరి అవసరం అవుతోంది.

ఏడాదికోసారి కాదు.. ఎప్పటికప్పుడే
సాధారణంగా సంస్థలు అభ్యర్థి అభివృద్ధిని ఏడాదికోసారి అంచనా వేస్తుంటాయి. దాని ఆధారంగా వారి పని విధానంలో లోపాలు, చేసుకోవాల్సిన మార్పులను సూచిస్తాయి. ఒక దశలో బాగా పనిచేసి, కొంత సమయం తక్కువ పనితో గడిపేసినప్పటికీ సమగ్రంగా చేసిన పనిని అంచనా వేసేవారు. ఈ విధానానికి కొత్త ఏడాది తెరదించనుందని నిపుణులు చెబుతున్నారు. ఇక నుంచి ఎప్పటికప్పుడు పనితీరును విశ్లేషిస్తారు. ఇది ఆరు నెలలు లేదా మూడు నెలలకే కుదించుకుపోనుంది. అంటే ఉద్యోగి పనితీరును నిరంతరం అంచనా వేస్తుంటారు. రేసులో నిలవాలంటే ఎప్పటికప్పుడు నైపుణ్యాలకు మెరుగులు పెట్టుకోవాల్సిందే.

Back..

Posted on 31-12-2019