Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
‘తెర’గతులు.. ఇక చకచక!

* అనివార్యమవుతున్న ఆన్‌లైన్‌ బోధన

ఒకప్పటి కంటే జోరుగా బోధన, శిక్షణ, ప్రవేశపరీక్షలు ఆన్‌లైన్‌ బాట పడుతున్నాయి. అంతర్జాలంతో అనుసంధానమైన కంప్యూటర్‌/ స్మార్ట్‌ఫోన్‌ల ‘తెర’లు విషయ బోధనకు వేదికలవుతున్నాయి. వర్తమాన స్థితే కాదు, విద్యారంగ భవిష్యత్‌ చిత్రం కూడా ఆన్‌లైన్‌ తరగతుల అనివార్యతనే స్పష్టం చేస్తోంది. అందుకే వీటి ప్రయోజనాలను గ్రహించి విద్యార్థులు అన్ని రకాలుగా సంసిద్ధం కావాలి. దానిలో భాగంగా... ఆన్‌లైన్‌ విద్యాభ్యాసంలో ఎదురయ్యే సవాళ్లూ, వాటిని అధిగమించి గరిష్ఠంగా ఆ తరగతులను సద్వినియోగం చేసుకోవటం గురించి నిపుణులు ఏమేం సూచిస్తున్నారో తెలుసుకుందాం!

ప్రతి సంక్షోభమూ ఓ అవకాశాన్ని ముందుకు తెస్తుంది. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ప్రభావం విద్యా ఉద్యోగ రంగాల్లో సమాచార సాంకేతికత వినియోగాన్ని అమాంతం పెంచేసింది. తమ విద్యార్థులకు అర్థాంతరంగా నిలిచిపోయిన తరగతులను వరంగల్‌ నిట్‌ ఆన్‌లైన్‌లో కొనసాగించింది. సెలవులు పొడిగిస్తే వచ్చే విద్యాసంవత్సరం ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు ప్రణాళిక వేసుకుంటోంది. లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన విద్యార్థులకు జేఎన్‌టీయూ (అనంతపురం, కాకినాడ); యోగివేమన వర్సిటీలు సంయుక్తంగా ఉచితంగా గేట్‌ కోచింగ్‌ను ఆన్‌లైన్‌లో అందించబోతున్నాయి. ఎన్నో ప్రైవేటు విద్యాసంస్థలూ, శిక్షణ సంస్థలూ హైస్కూలు, కళాశాలల విద్యార్థులకు ఆన్‌లైన్‌ లైవ్‌ తరగతులతో పాటు ఆన్‌లైన్‌ డిజిటల్‌ వీడియో తరగతులను అందిస్తున్నాయి. ఈ రకంగా బోధన రంగం తీరుతెన్నులు అపూర్వంగా మారబోతున్నాయి!

యూజీసీ నిపుణుల కమిటీ నివేదిక సూచనల ప్రకారం.. దేశంలోని విశ్వవిద్యాలయాలూ, కళాశాలలూ త్వరలో మొదలవనున్న విద్యాసంవత్సరం నుంచి 25 శాతం సిలబస్‌ను ఆన్‌లైన్‌లో బోధించాలి. వర్చువల్‌ క్లాస్‌రూమ్‌లూ, వీడియో కాన్ఫరెన్సింగ్‌ వసతుల అభివృద్ధి తప్పనిసరి. ఈ-కంటెంట్‌, ఈ-ల్యాబ్‌ ప్రయోగాల రూపకల్పన చేసి తమ వెబ్‌సైట్లలో అప్‌లోడ్‌ చేయాల్సివుంటుంది.

ఆన్‌లైన్‌ శిక్షణ తరగతులు పరిజ్ఞానాన్నీ, నైపుణ్యాలనూ పెంచుకోవటానికి అద్భుతమైన సాధనాలు. వీటి వినియోగం విషయంలో విద్యార్థులకు కొన్ని సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటికి పరిష్కారాలూ ఉన్నాయి. వరసగా పరిశీలిద్దాం.

సాంకేతిక సమస్యలు
ఆన్‌లైన్‌ అభ్యాసం విషయంలో తరచూ ఎదురయ్యే చిక్కులు సాంకేతికపరమైనవే.ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌, బ్రౌజర్‌ లేదా స్మార్ట్‌ ఫోన్లకు సంబంధించిన కంపాటబిలిటీ సమస్యలు ఎదురుకావొచ్ఛు ఫలితంగా ఇవి తీరేవరకూ నేర్చుకుంటున్న ప్రక్రియ నిలిచిపోతుంది. దాంతో ఆసక్తి తగ్గిపోవచ్ఛు ఎక్కువ ఇంటర్నల్‌ మెమరీ గానీ, హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ అవసరం గానీ లేని కోర్సుల్లో ఇలాంటి చిక్కులు తక్కువ. వివిధ స్మార్ట్‌ఫోన్లలోనూ, బహుళ బ్రౌజర్లూ, ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌లోనూ పనిచేసేలా (మల్టీ డివైజ్‌) ఉండటమూ ముఖ్యమే.

ప్రత్యక్ష బోధన లేమి
ఆన్‌లైన్‌ అభ్యాసంలో ఎన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ దీని పరిమితులనూ గ్రహించాలి. ఏళ్ల తరబడి ముఖాముఖి బోధనకు అలవాటు పడిన విద్యార్థులు ఈ కొత్త విధానానికి అలవాటు పడటానికి సమయం పడుతుంది. అధ్యాపకులతో ప్రత్యక్ష సంబంధం లోపించటం, సహచరులతో చర్చకు వీలు లేకపోవటం కొన్నిసార్లు నిరాశనూ, విసుగునూ తెప్పించవచ్ఛు ఆన్‌లైన్‌లోనే వ్యక్తిగత సత్సంబంధాలు ఏర్పరచుకోవటం దీనికో పరిష్కారం. విద్యార్థులు చర్చించటానికీ, ప్రశ్నలు వేయటానికీ వీలు కల్పించే వెబినార్లు, ఫోరమ్‌లను ఉపయోగించుకోవచ్ఛు ఇలాంటి ఆన్‌లైన్‌ చర్చల్లో చురుగ్గా పాల్గొనటం అవసరమే. స్కైప్‌ ద్వారా విద్యార్థులకు సమాధానాలు ఇవ్వగలిగే అధ్యాపకులుంటే మేలు. శిక్షణాంశాలకు లోబడి సోషల్‌ మీడియాను కూడా ఇందుకు ఉపయోగించుకుని, అభ్యాసాన్ని యాంత్రికం కాకుండా చేసుకోవచ్ఛు.

విసుగు తెప్పించే పాఠాలు
తరగతి గది బోధనలో సహజంగా ఏర్పడే విసుగుకు పరిష్కారంగా ఆన్‌లైన్‌ శిక్షణ పుట్టింది. నల్లబల్లను ఆధునికంగా మలిచిన లైట్‌బోర్డ్‌ టెక్నాలజీ లాంటివి ఆన్‌లైన్‌ వీడియో తరగతులను ఆసక్తికరంగా మలుస్తున్నాయి. అయితే.. అన్నీ కాదు కానీ కొన్నిచోట్ల సుదీర్ఘమైన టెక్స్‌ట్‌, ఆపై బహుళైచ్ఛిక ప్రశ్నలు కంప్యూటర్‌ తెరను నింపేస్తూ ఈ-లర్నింగ్‌ బదులు ఈ-రీడింగ్‌ను తలపిస్తుంటాయి. దీంతో విసుగు మొదలవటం సహజం. అందుకే కొంత వినోదం కలిపి, ప్రాక్టీసుకు అవకాశమిస్తూ ఇంటరాక్టివ్‌గా రూపొందించిన తరగతులు విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూసేలా చేస్తాయి. ఆన్‌లైన్‌ కోర్సులు ఎంపిక చేసుకునేటప్పుడు ఈ అంశాలను గమనించటం మేలు.

తక్షణ స్పందన లోపం
పాఠ్యాంశాలకు సంబంధించి మీకు ఏ సందేహమైనా వస్తే.. తరగతి గదిలో మాదిరి వెంటనే చేయి పైకెత్తి అడిగే అవకాశం ఉండదు. ‘సందేహాలను ఎప్పటికప్పుడు తీర్చుకుంటే సబ్జెక్టుపై అవగాహన పెరుగుతుంది కదా, దీనికి వీల్లేకుండా పోయిందే’ అని నిరాశపడనక్కర్లేదు. సబ్జెక్టులో వచ్చిన అనుమానాలను అధ్యాపకులకు ఈ-మెయిల్‌ చేసి తెలుసుకోవచ్ఛులైవ్‌ చాట్‌ సదుపాయం ఉంటే మాత్రం రియల్‌ టైమ్‌లో ఇన్‌స్ట్రక్టర్‌ నుంచి సబ్జెక్టు సందేహాలు తీర్చుకోవచ్ఛు

సమయ నిర్వహణ కష్టం
చదవటానికీ, కోర్సు వర్క్‌ పూర్తి చేయటానికీ సమయం చాలకపోవటం చాలామంది ఆన్‌లైన్‌ విద్యార్థుల అనుభవం. నిర్దిష్టంగా రోజువారీ లక్ష్యం పెట్టుకుంటే వాయిదాల అలవాటునుంచి బయటపడొచ్ఛు ప్రతిరోజూ తరగతుల తర్వాత అధ్యయనం, అసైన్‌మెంట్లు, సాధనలను ఒక టైమ్‌టేబుల్‌ ప్రకారం కొనసాగిస్తే చివర్లో ఒత్తిడి ఏర్పడకుండా ఉంటుంది. అవసరమైతే షెడ్యూలింగ్‌ యాప్స్‌ను ఉపయోగించవచ్ఛు వాటిలో ఉండే అసైన్‌మెంట్ల రిమైండర్లు సకాలంలో అప్రమత్తం చేస్తాయి.

కొన్ని కిటుకులు
కోర్సు వీడియోను చిన్న విండోలో కాకుండా దాన్ని మ్యాగ్జిమైజ్‌ చేస్తే దానిపైనే దృష్టి కేంద్రీకరించవచ్ఛు ఇతర విండోలన్నీ మూసివేయాలి. ‘అంత అవసరమా?’ అనుకోవద్ధు ఇది అవసరమే!
* తరచూ వచ్చే నోటిఫికేషన్లు దృష్టి మరల్చకుండా సోషల్‌ మీడియా, ఈ-మెయిల్‌లను లాగౌట్‌ చేసుకోవాలి. ఇంట్లో టీవీ స్విచాఫ్‌ చేసుకోవాలి. ఫోన్‌ను సైలంట్‌ మోడ్‌లో పెట్టుకోవటమో, మరో గదిలో ఉంచటమో చేయాలి.
* ఆన్‌లైన్‌ తరగతుల కోసం ఇంట్లో అంతరాయాలకు అవకాశం లేని.. సౌకర్యవంతమైన స్టడీ రూమ్‌ను కేటాయించుకోవాలి. నిర్దిష్ట ప్రదేశంలో మొదట నేర్చుకున్న పాఠ్యాంశాలు తేలిగ్గా గుర్తుండిపోతాయి.
* కోర్సులో స్టడీ గ్రూపు ఉంటే చేరటం, లేదా స్వయంగా ఆరంభించటం చేయాలి. దానిలో ఉత్సాహంగా పాల్గొంటూ ఉండాలి. క్లాస్‌మేట్లతో ఇలా ఉపయోగకరమైన చర్చలు చేస్తుంటే ఆన్‌లైన్‌లో నేర్చుకోవటానికి అవసరమైన ప్రేరణకు లోటుండదు.
* ఆన్‌లైన్‌ అభ్యాసంలోనూ ముఖ్యమైన పాయింట్లను నోట్‌ చేసుకోవచ్ఛు మరో విండోలో నోట్సును టైప్‌ చేయటం ఓ పద్ధతి. లేకపోతే దగ్గర్లో పేపర్‌, పెన్సిల్‌తోనైనా ముఖ్యాంశాలను రాసుకోవచ్ఛు డిజిటల్‌ యాప్‌నూ వినియోగించవచ్ఛు.Back..

Posted on 04-05-2020