Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
భలే..భలే... మార్గదర్శి

* ఆదరణ పెరుగుతున్న 'ఆన్‌లైన్‌ కెరీర్‌ కౌన్సెలింగ్‌'
* ఆసక్తులు, వ్యక్తిత్వాన్ని తెలుసుకుంటారు
* ఏ రంగం ఎంచుకుంటే మేలో సలహాలిస్తారు
* పరీక్షించాకే అడుగేయాలంటున్న నిపుణులు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌ పూర్తవ్వగానే డిగ్రీ చదవాలా.. ఎంబీబీఎస్‌ లేదా ఇంజినీరింగ్‌లో చేరాలా.. దేనికి భవిష్యత్తు ఉంటుందనే ప్రశ్నలు విద్యార్థులు, తల్లిదండ్రుల మెదళ్లను తొలి చేస్తుంటాయి. చేతిలో పట్టా ఉంది.. ఏ ఉద్యోగాన్ని ఎంచుకోవాలో తెలియక నవతరం సతమతమవుతోంది. ఇలాంటి తరుణంలో 'ఆన్‌లైన్‌ కెరీర్‌ కౌన్సెలింగ్‌' వేదికగా కౌన్సిలర్లు మార్గదర్శనం చేస్తున్నారు. ఆసక్తులు, వ్యక్తిత్వం, అభిరుచులను తెలుసుకొని ఏం చదవాలి.. ఏ రంగంలో ఉపాధిని ఎంచుకుంటే మేలో సూచిస్తున్నారు. ఈ కొంగొత్త ఆలోచనకు భాగ్యనగర యువత జై కొడుతోంది.
గతంలో కెరీర్‌ అవకాశాలు పరిమితంగా ఉండేవి. ఇప్పుడు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ఏది ఎంచుకోవాలన్నదే సవాలు. 'నీ ఆసక్తులకు తగ్గ కోర్సు లేదా ఉద్యోగం ఇది' అంటూ సలహాలు ఇచ్చేవారు అరుదే. నలుగురిలో ఒక్కరు మాత్రమే ఇలా కెరీర్‌కు సంబంధించి సలహాలు, సూచనలు పొందుతున్నట్లుగా ఇటీవల ఓ అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. అలాగే.. 80 శాతం మంది ఉద్యోగులు తమకు ఇష్టం లేని కొలువుల్లో నిత్యం ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లుగా గుర్తించారు. ఇలాంటి తరుణంలో 'ఆన్‌లైన్‌ కెరీర్‌ కౌన్సెలింగ్‌' సాంకేతిక పరిజ్ఞానం నవతరానికి అందించిన వరమనే చెప్పొచ్చు. రోజురోజుకీ ఈ విధానాన్ని వినియోగించుకుంటున్న భాగ్యనగర యువత సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నట్లుగా నిపుణులు చెబుతున్నారు.
ఇలా సలహా ఇస్తారు..!
'ఆన్‌లైన్‌ కెరీర్‌ కౌన్సెలింగ్‌'ను అందిస్తున్న సంస్థల సంఖ్య వందకు చేరువలో ఉంది. అభ్యర్థులు ముందుగా సదరు సంస్థ వెబ్‌సైట్‌లోకి రిజిస్టర్‌ అవ్వాలి. వెంటనే సలహాలు, సూచనలు ఇవ్వరు. ముందుగా పది నిమిషాల పాటు సైకోమెట్రిక్‌ పరీక్షను ఆన్‌లైన్‌లో రాయాలి. దీని వల్ల అభ్యర్థి వ్యక్తిత్వం, ఆసక్తులు, అభిరుచులు కౌన్సిలర్లకు తెలుస్తాయి. ఛాటింగ్‌, ఫోన్‌, స్కైప్‌, ఈమెయిల్‌ ద్వారా అభ్యర్థులతో సంభాషించిన అనంతరం ఏం చదివితే బాగుంటుంది.. మీకు ఏ ఉద్యోగం నప్పుతుందో సూచిస్తారు. ఇందుకోసం కొన్ని సంస్థలు నిర్ణీత రుసుంను వసూలు చేస్తుంటే.. మరికొన్ని ఉచితంగా సేవలు అందిస్తున్నాయి.
రుసుం వసూలు చేస్తే..!
ఉచితంగా సేవలు అందించే సంస్థలు కేవలం సలహా మాత్రమే ఇస్తాయి. అదే రుసుం వసూలు చేసేవి.. అభ్యర్థులకు మరింత సాయం చేస్తాయి. సదరు అభ్యర్థికి సూచించిన రంగంలో ఉన్న విభాగాలు.. జీతాలు.. మార్కెట్‌ పరిస్థితులు, ప్రముఖుల అభిప్రాయాలను కెరీర్‌ కౌన్సిలర్లు తెలియజేస్తారు. అభ్యర్థుల సందేహాలకు టెలిఫోన్‌, మెయిల్‌, ఛాట్‌, స్కైప్‌ ద్వారా సమాధానాలు ఇస్తారు. వ్యవసాయం, జర్నలిజం, ఆన్‌లైన్‌ అడ్వర్‌టైజింగ్‌.. ఇలా మొత్తం అయిదు వందల కెరీర్‌ ఆప్షన్లు ఉంటాయి. కౌన్సెలింగ్‌ పూర్తయిన తర్వాత కూడా పర్యవేక్షిస్తారు. సూచించిన రంగం ఎంచుకోవడం వల్ల వాళ్ల జీవితం ఎలా ఉందో గమనించి.. అవసరాన్ని బట్టి సూచనలు కూడా చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆ రంగంలో వస్తున్న మార్పులను తెలియజేస్తున్నారు. విపణిలో వస్తున్న కొత్త ఉద్యోగాలు, కోర్సుల వివరాలను అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక పరిశోధనా బృందాన్ని సైతం అన్ని సంస్థలు ఏర్పాటు చేసుకుంటున్నాయి.
నగర యువతకు ప్రయోజనం..
నగరంలో నైపుణ్యమున్న కెరీర్‌ కౌన్సిలర్ల సంఖ్య కొరత తీవ్రంగా ఉంది. అందుబాటులో ఉన్నవారిలోనూ నకిలీలు ఉన్నట్లుగా ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. వీరు తమ వద్దకు వచ్చిన అభ్యర్థి సమాచారాన్ని వివిధ సంస్థలు, కళాశాలలకు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కెరీర్‌ ఆప్షన్‌ను ఎంచుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్న నగర యువతకు 'ఆన్‌లైన్‌ కెరీర్‌ కౌన్సెలింగ్‌' వల్ల ప్రయోజనం కలుగుతుందంటున్నారు నిపుణులు.ఇంట్లోనే ఉండి దేశంలో ఎక్కడెక్కడో ఉన్న కౌన్సిలర్లను సంప్రదించి నిర్ణయం తీసుకోవచ్చు. సైక్రోమెట్రిక్‌ పరీక్షను ఇంటి దగ్గరే రాయవచ్చు.మనకు తగిన రంగం ఏదో ముందే తెలిసిపోతుంది కాబట్టి అందులో నైపుణ్యాలను మెరుగుపర్చుకోవచ్చు.తస్మాత్‌ జాగ్రత్త..!
అభ్యర్థులు అప్రమత్తంగా లేకుంటే అసలుకే ఎసరు వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సంస్థ గురించి వాకబు చేసిన తర్వాతే రుసుం చెల్లించాలి. కౌన్సిలర్ల అనుభవం, విద్యార్హతలను తెలుసుకోవాలి. ఒకే కౌన్సిలర్‌ను కాకుండా ఇద్దరు, ముగ్గురిని సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.కోర్సు లేదా ఉద్యోగం సూచించిన తర్వాత ఎలాంటి సేవలు అందిస్తారో తెలుసుకోవాలి. వీలైతే అంతకు ముందు సేవలు పొందిన వారితో మాట్లాడాలి.
సూక్షుణ్నంగా తెలుసుకున్నాకే..
- ప్రొఫెసర్‌ బి.రాజశేఖర్‌, కెరీర్‌ కౌన్సిలర్‌, హెచ్‌సీయూ
'ఆన్‌లైన్‌ కెరీర్‌ కౌన్సెలింగ్‌' వల్ల విద్యార్థులకు మేలు జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంట్లోనే కూర్చొని ఎక్కడో ఉన్న నిపుణుల సలహాలు, సూచనలు పొందొచ్చు. కానీ.. కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే అడుగు ముందుకేయడం ఉత్తమం. ముఖ్యంగా కెరీర్‌ కౌన్సిలర్ల గురించి తెలుసుకోవాలి. వాళ్లకున్న అర్హతలు, అనుభవం తదితర వివరాలను వాకబు చేయాలి. సంస్థ పూర్వాపరాలను ఒకటికి..రెండుసార్లు పరీక్షించుకోవాలి.
సలహాలు, సూచనలు అందుతున్నది: నలుగురిలో ఒకరికే
నచ్చని ఉద్యోగం చేస్తూ ఒత్తిడికి గురవుతున్నది: 80 శాతం మంది
'ఆన్‌లైన్‌ కెరీర్‌ కౌన్సెలింగ్‌'నుఅందిస్తున్న సంస్థలు:వందలోపు
వసూలు చేస్తున్న రుసుం: రూ.వేయి నుంచి..
ఉచిత సేవలు అందించే సంస్థలు: 20 నుంచి 30
ఓ సంస్థ వినియోగదారులు దేశవ్యాప్తంగా: నెలకు 6 మిలియన్ల మంది
నగరంలో ఆ సంఖ్య (రోజుకి సరాసరి): 50-100

posted on 31..07.2015