Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఆన్‌లైన్‌ కోర్సులతో పారాహుషార్‌

* పుంఖానుపుంఖాలుగా వెలుస్తున్న నకిలీ సంస్థలు
* వెనుక ముందు ఆలోచించకుండా చేరితే అసలుకే మోసం
* అన్నీ నిర్ధారించుకున్నాకే చేరడం ఉత్తమమంటున్న నిపుణులు

నాలుగేళ్ల నుంచి కిరణ్‌... హైటెక్‌సిటీలోని ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. కెరీర్‌ పరంగా మంచి అవకాశాలు లభిస్తాయనే ఉద్దేశంతో దూర విద్యా విధానం(ఆన్‌లైన్‌)లో రూ.70 వేలు ఖర్చు పెట్టి.. ఎంబీఏ పూర్తి చేశారు. అదనపు అర్హతతో వేరే సంస్థలో ఉద్యోగం వచ్చింది. అక్కడ చేరే ముందు విద్యార్హతకు సంబంధించిన అన్ని ధ్రువీకరణ పత్రాలను హెచ్‌ఆర్‌ విభాగంలో అందించారు. సిబ్బంది పరిశీలనలో ఎంబీఏ సర్టిఫికెట్‌ జారీ చేసిన విద్యా సంస్థకు గుర్తింపు లేదని తేలింది. ఇంకేముంది.. కిరణ్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు.
నరేందర్‌ది మెదక్‌లోని గజ్వేల్‌. నగరంలో మిత్రులతో ఉంటూ ఓ సంస్థలో ఆఫీస్‌బాయ్‌గా పని చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితి బాగా లేక పదో తరగతితోనే చదువును ఆపేశారు. తర్వాత పరిస్థితి మెరుగుపడటంతో.. మళ్లీ చదువుకోవాలనుకున్నారు. 'ఇంటర్‌.. వన్‌ సిట్టింగ్‌లో పూర్తి' అనే ప్రకటనను చూశారు. వెంటనే సంస్థను సంప్రదించి రూ.16 వేలు చెల్లించి.. ఒకే సారి అన్ని పరీక్షలు రాశారు. 66 శాతం మార్కులతో ఇంటర్‌ ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. డిగ్రీలో చేరేందుకు ఓ ప్రభుత్వ కళాశాలలో దరఖాస్తు చేసుకున్నారు. ఇంటర్‌ సర్టిఫికెట్‌ నకిలీదంటూ.. ప్రవేశం ఇచ్చేందుకు నిరాకరించడంతో నివ్వెరపోవడం నరేందర్‌ వంతైంది. వెంటనే సర్టిఫికెట్‌ ఇప్పించిన సంస్థను సంప్రదించగా.. నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఇలా మోసపోతున్న వారి సంఖ్య నగరంలో నానాటికీ పెరిగిపోతోంది.
ఈనాడు, హైదరాబాద్‌: 'వన్‌ సిట్టింగ్‌తో డిగ్రీ పట్టా.. మీ చేతుల్లో', 'ఇంట్లోనే హాయిగా కాలుపై కాలేసుకొని.. ఆన్‌లైన్‌లోనే పాఠాలు వినండి.. పరీక్షలు రాసేయండి' అంటూ ప్రకటనలు కనిపిస్తుంటాయి. ముందు వెనుక ఆలోచించకుండా... రూ.వేలకు వేలు పోసి కోర్సులో చేరితే.. అసలుకే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు విద్యావేత్తలు.
* పని చేస్తూనే..
చదువుకునే యువత సంఖ్య నగరంలో రోజురోజుకీ పెరుగుతోంది. మరోవైపు దూర విద్యా విధానంలో డిగ్రీ, పీజీతో పాటు పలు సర్టిఫికెట్‌ కోర్సులు అందించే సంస్థలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఇవే కాకుండా.. సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో 'ఆన్‌లైన్‌' కోర్సులను అందిస్తామంటూ మరికొన్ని సంస్థలు వెలిశాయి. ఇందులో అసలు కంటే నకిలీవే ఎక్కువ. ఇలాంటి నకిలీ స్టడీ సెంటర్లు, సంస్థల సంఖ్య నగరంలో వందకు పైగానే ఉంటుందని నిపుణుల అంచనా. తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, దిల్లీ, బిహార్‌ తదితర రాష్ట్రాలకు చెందిన విశ్వ విద్యాలయాల గుర్తింపు ఉంది.. కోర్సులో చేరితే చాలు అంతా మేమే చూసుకుంటాం... అంటూ హామీ ఇస్తుండటంతో విద్యార్థులు నకిలీ సంస్థలమాయలో పడి మోసపోతున్నారు.
* లేని కోర్సులు ఉన్నాయంటారు
ఆన్‌లైన్‌, దూర విద్యా విధానంలో కోర్సులు అందించే అన్ని సంస్థలూ బోగస్‌ కాదు. ఇందులో కొన్నింటికి విశ్వ విద్యాలయాల గుర్తింపు ఉంటుంది. మిగిలిన నకిలీ సంస్థల నిర్వాహకులు దళారుల అవతారం ఎత్తుతారు. అభ్యర్థి నుంచి భారీగా ఫీజులు వసూలు చేసి.. పక్కనే ఉన్న అసలు సెంటర్లలో కడతారు. ఆ విషయాన్ని అభ్యర్థులకు తెలియకుండా జాగ్రత్త పడతారు. ఇక్కడ కోర్సుల్లో చేరే వాళ్లు ఒక విషయాన్ని గుర్తించాలి. బోగస్‌ అని తేలితే ఎవరినీ నిందించడానికి వీల్లేదు. అందుకే అప్రమత్తంగా వ్యవహరించాలి. మనం చేరాలనుకున్న కోర్సు లేకున్నా ఉందని చెబుతారు. తీరా చేరాక విద్యార్థులు లేని కారణంగా ఎత్తేశామంటూ కబుర్లు చెబుతారు. డబ్బులు ఇవ్వమంటే ఇవ్వరు. వేరే దాంట్లో చేరమంటూ ఒత్తిడి చేస్తారు. ఆన్‌లైన్‌, దూర విద్యా విధానంలో అందించే డిగ్రీలను అన్ని సంస్థలు అంగీకరించవు. మీరు పనిచేస్తున్న సంస్థలు మీరు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలు సరైనవ కాదా అనే విషయాన్ని విశ్వ విద్యాలయాలను సంప్రదించి ధ్రువపరచుకుంటాయి. ప్రతి రోజూ తనిఖీలో 1 నుంచి 3 శాతం ధ్రువీకరణ పత్రాలు బోగస్‌గా తేలుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
* ఇలా చేయండి
> సింగిల్‌ సిట్టింగ్‌లో ఇంటర్‌, డిగ్రీ, మూడేళ్లలో ఇంజినీరింగ్‌ లాంటి కోర్సులను యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) పూర్తిగా నిషేధించింది. సాంకేతిక కోర్సులకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) అనుమతి తప్పనిసరి చేసింది.
> దేశంలో ఆన్‌లైన్‌, దూర విద్యా విధానంలో డిగ్రీ, పీజీ కోర్సులను అందించే విశ్వవిద్యాలయాలు, కళాశాలల జాబితాను యూజీసీ వెబ్‌సైట్‌లో ఉంచింది. టెక్నికల్‌ కోర్సులయితే... ఏఐసీటీఈ గుర్తింపు ఉందా లేదా అన్నది చూడాలి.
> ప్రతి విశ్వవిద్యాలయానికి ఓ అకడమిక్‌ కరిక్యులమ్‌ ఉంటుంది. దాని ప్రకారమే పరీక్షలు, బోధన జరుగుతుందా లేదా అనే వివరాలు తెలుసుకోవాలి.
> ఆన్‌లైన్‌ కోర్సులు చేసే వారు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇంటి దగ్గరే ఆన్‌లైన్‌లోనే పరీక్షలు రాస్తే... ఈ మెయిల్‌లో డిగ్రీ పట్టా పంపుతామని చెబుతారు. ఇదెంత వరకు నిజమో ఓసారి నిర్ధారించుకోవాలి.
> పరీక్షల విధానం, తరగతుల నిర్వహణ, స్టడీ మెటీరియల్‌.. ఇలా ప్రతి అంశాన్ని క్షుణ్నంగా పరిశీలించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోండి.
* వసూళ్లకు అడ్డుకట్ట
'మా డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌లో చేరితే వంద శాతం ఉత్తీర్ణత ఖాయం. వన్‌ సిట్టింగ్‌లోనే డిప్లొమా, డిగ్రీ, పీజీ కోర్సులను పూర్తి చేయొచ్చు' అంటూ ప్రకటనలు ఇచ్చారు. యూజీసీ నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే 'హైదరాబాద్‌ ఎడ్యుకేషనల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌' పేరుతో ఏకంగా నగరంలో ఆరు శాఖలు నిర్వహిస్తున్నారు. డిగ్రీకి రూ.18 వేలు, ఇంజినీరింగ్‌కు రూ.24,500, డిప్లొమాకు రూ.15వేల చొప్పున విద్యార్థుల నుంచి వసూలు చేశారు. సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు... పంజాగుట్ట, ఎర్రగడ్డ, మెహిదీపట్నం శాఖలపై దాడులు చేసి నిర్వాహకులను అరెస్ట్‌ చేశారు. ఇదొక్కటే కాదు.. ఇలాంటి నకిలీ సంస్థలు నగరంలో పెద్ద సంఖ్యలో ఉన్నాయన్నది నిపుణుల అంచనా.
* పూర్తిగా తెలుసుకున్నాకే - ప్రొఫెసర్‌ బి.రాజశేఖర్‌, కెరీర్‌ కౌన్సెలర్‌, హెచ్‌సీయూ

అవగాహన లేక చాలామంది నకిలీ విద్యా సంస్థల వలలో పడుతున్నారు. కోర్సులో చేరే ముందు యూజీసీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. ఫేక్‌ యూనివర్సిటీల జాబితా ఉంటుంది. అందులో మనకు డిగ్రీ ఇస్తున్న సంస్థ ఉందో లేదో చూడాలి. యూజీసీ అనుమతి ఉంటే.. దానికి సంబంధించిన పత్రాలను చూపించాలని నిర్వాహకులను అడగాలి. సింగిల్‌ సిట్టింగ్‌ విధానం గతంలో ఉండేది. ఇప్పుడు దాన్ని నిషేధించారనే విషయాన్ని గుర్తించాలి. విద్యార్థులను ఆకర్షించేందుకు విదేశీ విశ్వవిద్యాలయాలతో ఎంఓయూ కుదుర్చుకున్నట్లుగా నమ్మిస్తారు. అదెంత వరకు నిజమో కనుక్కోవాలి. చేరిన తర్వాత బాధపడటం కంటే చేరే ముందే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
* రేపే ఆఖరు తేదీ?
ప్రకటన చూసి.. ఓ సారి వివరాలు తెలుసుకుందామని సంస్థకు వెళ్తే చాలు... కచ్చితంగా ఇక్కడే చేరాలనే నిర్ణయానికి వచ్చేలా మాటల కోటలు కడతారు. రేపే ఆఖరు తేదీ.. ఇప్పుడు చేరకపోతే మళ్లీ వీలుండదంటూ తొందరపెడతారు. ఒక్కసారి చేరితే చాలూ.. ఇక అంతా మేమే చూసుకుంటామనే భరోసా ఇస్తారు. అసైన్‌మెంట్స్‌, ప్రాక్టికల్స్‌ అంటూ ఏమీ ఉండవు.. పరీక్షలకు హాజరయితే చాలు డిగ్రీ మీ చేతిలో ఉంటుందంటూ వూరిస్తారు. ఆలస్యం చేస్తే మంచి అవకాశాన్ని కోల్పోతారంటూ హెచ్చరిస్తారు. ఆలోచించుకునే సమయం ఇవ్వరు. ఒకవేళ మరుసటి రోజు వస్తామంటే చిరునామా, మొబైల్‌ నంబరు తీసుకుంటారు. ఇలా కోర్సులో చేరే వరకు వదిలిపెట్టరు. కొత్త రకమైన కోర్సులతో వల వేస్తారు. పరీక్షలు కూడా ఆన్‌లైన్‌లోనే మీ ఇంటి దగ్గరే కూర్చుని రాయొచ్చని చెబుతారు. ఇలా మొత్తంమీద కోర్సులో చేరే వరకు సదరు అభ్యర్థిని వదిలిపెట్టరు. భారీగా ఫీజులు వసూలు చేస్తారు. ఉదాహరణకు రెండేళ్ల ఎంబీఏ కోర్సుకు రూ.70 వేలు.. వన్‌ సిట్టింగ్‌ ఎంబీఏకు రూ.50 వేలు తీసుకుంటారు. బేరం ఆడితే.. కొంత తగ్గిస్తారు.
* ఓసారి ఆ కోర్సును పూర్తి చేసిన/ చదువుతున్న విద్యార్థులను కలిసే ప్రయత్నం చేయండి. అప్పుడే అన్ని విషయాలూ తెలిసే అవకాశం ఉంటుంది.
* మీరు చేరబోయే స్టడీ సెంటర్, సంస్థ గురించి చుట్టుపక్కల వారిని వాకబు చేయండి. అన్ని సంతృప్తి చెందాకే చేరండి.
* ఎట్టి పరిస్థితుల్లోనూ అంతకు ముందు విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్‌ ధ్రువీకరణ పత్రాలు నిర్వాహకులకు ఇవ్వకండి.
* ప్రకటన చూడగానే తొందర పడకుండా సంస్థకు ఏదైనా విశ్వ విద్యాలయం నుంచి గుర్తింపు ఉందా లేదో వాకబు చేయాలి.
* ఓ రెండు మూడు సంస్థలు తిరిగిన తర్వాతే కోర్సులో చేరాల వద్దా అనేది నిర్ణయించుకోండి.
* విశ్వ విద్యాలయం గుర్తింపు ఉంటే... అది జారీ చేసే ధ్రువీకరణ పత్రాలను అన్ని సంస్థలు పరిగణనలోకి తీసుకుంటాయా లేదా అన్నది పరిశీలించుకోవాలి.

 

Posted on 18..06.2015