Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
పుస్తకవేట.. ఆన్‌లైన్‌ బాట

* అంతర్జాలంలో దుకాణాలు
* తెరుస్తున్న విక్రయ కేంద్రాలు
* పెరుగుతున్న కొనుగోళ్లు
ఈనాడు, హైదరాబాద్‌: కూకట్‌పల్లికి చెందిన సత్యబాబు తన కుమార్తెకు అవసరమైన పాఠ్య పుస్తకాలకు ఈ-సంతను ఆశ్రయిస్తున్నాడు. అమీర్‌పేట్‌లోని ఓ వసతిగృహంలో ఉంటూ బీటెక్‌ చదువుతోన్న నరేష్‌ సెమిస్టర్‌ పుస్తకాలను అంతర్జాలంలోనే కొనుగోలు చేస్తున్నాడు. రద్దీ రోడ్లపై హరించుకుపోయే సమయం, సొంత వాహనాల్లో వెళ్తే పార్కింగ్‌ సమస్య ఎదురవడం వంటివి కారణంగా తెలిపారు. ఏళ్ల తరబడి పుస్తకాలు విక్రయించే ముద్రణ సంస్థలు సైతం పెరుగుతోన్న సాంకేతికత, ప్రజావసరాలు దృష్టిలో ఉంచుకొని అంతర్జాలంలోనూ దుకాణం తెరుస్తున్నాయి.
కోఠి, సుల్తాన్‌బజార్‌, అబిడ్స్‌, సికింద్రాబాద్‌లలో వివిధ పుస్తక విక్రయ కేంద్రాలు నేడు కొత్త పంథాలో పయనిస్తున్నాయి. యువత, సాంకేతికతల మధ్య పెరుగుతోన్న అవినాభావ సంబంధాన్ని అందిపుచ్చుకుంటూ ఆన్‌లైన్‌ ద్వారా విక్రయాలు జరిపేందుకు యజమానులు వెబ్‌సైట్లు ప్రారంభిస్తున్నారు. మరికొందరు ఫ్లిప్‌కార్డ్‌, షాప్‌క్లూస్‌, స్నాప్‌డీల్‌, అమేజాన్‌ వంటి ఈ-కామర్స్‌ వెబ్‌సైట్ల ద్వారా విక్రయిస్తున్నారు. అరిహంత్‌, వర్డ్స్‌వర్త్‌, జంగ్రన్‌జోష్‌, మెక్‌గ్రహిల్‌, మెక్‌మిలన్‌ వంటి సంస్థలతోపాటు.. తెలుగు అకాడమి, హిమాలయ, యూనివర్సల్‌, లా పబ్లికో, లా పబ్లిషర్స్‌ వంటివి కూడా నేడు సొంతంగా ఈ-విక్రయాలు జరుపుతున్నాయి. పాఠశాలలు, కళాశాలలకు అవసరమైన పుస్తకాలు, పరిశోధన గ్రంథాలు, పోటీ పరీక్షలు, ఆధ్యాత్మిక రచనలు, నాటికలు, కథలు, సినిమా కథాంశాలతో కూడిన గ్రంథాలకు ఆన్‌లైన్‌లో ఎక్కువగా ఆర్డర్లు వస్తుంటాయని కోఠీలోని పుస్తక విక్రయ కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. అయితే గతంతో పోలిస్తే కౌంటర్‌ సేల్స్‌లో 40శాతం వరకు కొనుగోళ్లు తగ్గాయని, కోఠి ప్రాంతానికి అతి సమీపంలోని ప్రాంతాల నుంచీ ఆర్డర్లు వస్తున్నాయని అంటున్నారు.
* ముఖ్యమైన పాఠ్యాంశాలతో..
బీటెక్‌, మేనేజ్‌మెంట్‌, పీహెచ్‌డీ, తదితర సాంకేతిక కోర్సుల విద్యార్థులు సాధ్యమైనంత వరకు ఆన్‌లైన్‌లోనే కావల్సిన సమాచారం సేకరించుకుంటున్నారు. ముఖ్యమైన అంశాలు, పాఠ్యాంశాలకు సంబంధించిన చిన్న చిన్న మాడ్యూల్స్‌కు ఇలా శోధించేవారు ఎక్కువగా ఉంటున్నట్లు నిపుణుల అభిప్రాయం. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా గత కొంతకాలం నుంచి ముద్రణా సంస్థలు కూడా ముఖ్యమైన పాఠ్యాంశాలతో చిన్న పుస్తకాలను అందిస్తున్నాయి. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పెరిగిన స్మార్ట్‌ఫోన్ల వినియోగం, అందుబాటులోకి వచ్చిన వైఫై జోన్లు వల్ల విద్యార్థులు, పెద్దలు వారికి అవసరమైన పుస్తకాలను సులభంగా ఆర్డర్‌ చేయగలుగుతున్నారని హిమాలయ బుక్‌హౌస్‌ ప్రతినిధి తెలిపారు. ఆన్‌లైన్లో విక్రయాల వల్ల ఇప్పటివరకు వెలుగులోకి రాని మంచి రచయితలకు గుర్తింపు కూడా వస్తుందన్నారు. ఒకప్పుడు ముద్రణకర్తలు ఎవరనే విషయాన్ని చూసే పాఠకులు నేడు రచయిత గురించి తెలుసుకొని కొనుగోలు చేసే మార్పు కనిపిస్తోందన్నది విక్రయదారుల అభిప్రాయం. అయితే ఒక్కోసారి అవసరమైన సమాచారం ఆర్డర్‌ ఇచ్చిన పుస్తకాల్లో లేకపోయే పరిస్థితీ నెలకొంటుంది. స్వతహాగా దుకాణానికి వెళ్లి పుస్తకం కొనడంతో పోల్చిచూస్తే ఆన్‌లైన్‌ ద్వారా కవర్‌పేజీ, రచయిత పేరు, ప్రచురణ తేదీ చూసి తీసుకోవడంలో ఒక్కోసారి కొన్ని ఇబ్బందులూ ఉంటాయని నిపుణులు అంటున్నారు.
* ఒకరికొకరు అందిపుచ్చుకుంటూ
సామాజిక వెబ్‌సైట్లను కేవలం తమ అభిప్రాయాలను వెల్లడించేందుకే ఉపయోగించే యువత, నేడు అదే వేదికను సాహిత్యాన్ని పంచుకునేందుకూ ఉపయోగిస్తోంది. నగరంలోని యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ విద్యార్థులు రీసెర్చ్‌ జర్నల్స్‌, ఆర్టికల్స్‌, ఇతర పుస్తకాలను స్నేహితులతో పంచుకునేందుకు 'షేర్‌ యువర్‌ బుక్‌' పేరుతో ఓ ఫేస్‌బుక్‌ పేజీ ప్రారంభించారు. ఇటీవల ప్రారంభమైన ఈ వేదికపై ఇప్పటికే దాదాపు 500కు పైబడి విద్యార్థులు సభ్యులుగా చేరారు. వ్యక్తిగతంగా వారి దగ్గరుండే పుస్తకాల గురించి ఆన్‌లైన్లో పంచుకుంటూ సాహితీ సంపదను అందిస్తున్నారు. యూనివర్సల్‌, హిమాలయ బుక్‌హౌస్‌ వంటి సంస్థలు 'బుక్‌ ఫర్‌ రెంట్‌' పేరుతో పుస్తకాలను ఇస్తున్నాయి. తాత్కాలికంగా అవసరమైన పుస్తకాలను అద్దెకు తీసుకుని వేగంగా చదివి తిరిగిచ్చే పాఠకులు ఆ సౌలభ్యాన్ని ఉపయోగించుకుంటున్నట్లు చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో పుస్తకాల కొనుగోళ్లపై ఇటీవల లౌడ్‌క్లౌడ్‌ సిస్టమ్స్‌ అధ్యయనం నిర్వహించింది. దేశంలో 2017నాటికి అంతర్జాలంలో జరిగే వీటి కొనుగోళ్లు 40బిలియన్‌ డాలర్లకు చేరుకుంటాయని తెలిపింది.
* వారికి మంచి సౌకర్యవంతం - వేణుగోపాల్‌, ఠాగూర్‌ పబ్లికేషన్స్‌ యజమాని
ఆర్డర్లు వచ్చిన 24గంటల్లోపే అన్ని ప్రాంతాలకు ఇవ్వడం జరుగుతుంటుంది. నగరానికి దూరంగా ఉన్న ప్రాంతాలవారికి ఆన్‌లైన్‌ కొనుగోళ్లు మంచి సౌకర్యవంతంగా ఉంటాయి. ఒకప్పుడు దుకాణాలకు వచ్చి పేజీలన్నీ తిప్పుతూ పలు రకాల పుస్తకాలను చూసే పాఠకులు నేడు రచయిత పేరు, ముద్రణ తేదీ చూసి ఆన్‌లైన్లో కొనేస్తున్నారు. అయితే ధర పరంగా మాత్రం నేరుగా వెళ్లి కొన్నప్పుడే తక్కువకు లభించే అవకాశాలుంటాయని మా అభిప్రాయం.

Posted on 18-10-.2015

BACK