Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఇంజినీరింగ్‌కు ఇంకో దారి!

* సాఫ్ట్‌స్కిల్స్‌, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ నైపుణ్యాలు

ఇంజినీరింగ్‌ విద్య అనగానే పదో తరగతి విద్యార్థులకు రెండు దారులు కనిపిస్తాయి. ఇంటర్‌లో ఎంపీసీ తీసుకుని ఎంసెట్‌ కానీ, జేఈఈ కానీ రాసి, సీటు పొందడం. ఇంకోటి.. పాలీసెట్‌ ర్యాంకుతో ఇంజినీరింగ్‌ డిప్లొమా చేశాక, లేటరల్‌ ఎంట్రీలో బీటెక్‌లో చేరడం. ఈ రెండూ కాకుండా ఇంకో మార్గం- పది పూర్తయ్యాక ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సులో చేరి, డిగ్రీ పట్టాతో బయటకు రావటం! ఆ వివరాలేంటో తెలుసుకుందామా?

యువతలో ముఖ్యంగా... తెలుగు రాష్ట్రాల్లో ఇంజినీరింగ్‌కు ఆదరణ ఎక్కువ. స్కూలు స్థాయి నుంచే ప్రవేశపరీక్షలకు పోటీ పడుతుండటమే ఇందుకు ఉదాహరణ. ఇంటర్‌లో ఎంపీసీ తీసుకున్నవారిలో చాలామంది దృష్టి దీనివైపే ఉంటుంది. అందుకే ఇంటర్‌లో చేరింది మొదలు ప్రవేశపరీక్షలు, వాటి శిక్షణలవైపు చూస్తుంటారు. ఎన్నో ప్రముఖ సంస్థలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పదో తరగతి తరువాత ఇంటిగ్రేటెడ్‌/ డ్యూయల్‌ బీటెక్‌ డిగ్రీని ప్రవేశపెట్టాయి. కోర్సు కాలవ్యవధి ఆరేళ్లు. ఇంజినీరింగ్‌ లక్ష్యంగా ఉన్న విద్యార్థులు వీటిని ప్రయత్నించవచ్చు. ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌లోనూ రెండు విధాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. రెండింటి కాలవ్యవధీ ఆరేళ్లే. అయితే ఒకటి 2+4 విధానమైతే, మరొకటి 3+3 విధానం.

2+4 తీరిది!
రెండేళ్లు ఒక తరహా బోధన, నాలుగేళ్లు వేరే అంశాల్లో బోధన ఉంటుంది. ఈ తరహా కోర్సు తెలుగు రాష్ట్రాల్లో.. ఏపీలో ఆర్‌జీయూకేటీలు- నూజివీడు, ఆర్‌కే వ్యాలీ (ఇడుపులపాయ), ఒంగోలులోనూ, తెలంగాణలో బాసరలోనూ అందుబాటులో ఉంది. బాసర ఆర్‌జీయూకేటీకి సంబంధించి ప్రకటన విడుదలవగా, ఏపీలో విడుదల కావాల్సి ఉంది. ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సు ఆరేళ్లలో.. రెండేళ్ల ప్రీ యూనివర్సిటీ కోర్సు, నాలుగేళ్ల ఇంజినీరింగ్‌ కోర్సు ఉంటాయి. ఏడాదికి మూడు చొప్పున సెమిస్టర్లు ఉంటాయి.
ప్రీ యూనివర్సిటీ కోర్సు: తెలంగాణ/ ఏపీ ఇంటర్మీడియట్‌తో సమానం. కోర్సులో భాగంగా విద్యార్థులు ఇంటర్‌ ఎంపీసీ, బైపీసీలతో సమానమైన మేథమేటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, కెమిస్ట్రీ, లైఫ్‌ సైన్సెస్‌లను చదువుతారు. నాణ్యమైన విద్యను అందించడంతోపాటు సాంకేతిక, ప్రొఫెషనల్‌ విభాగాల్లో బలమైన పునాది వేయడం ఈ విధానం ఉద్దేశం. విద్యార్థి ఈ రెండేళ్ల తరువాత ఇతర ప్రొఫెషనల్‌ ప్రోగ్రామ్‌ను మార్చుకోవాలనుకుంటే అనుమతి తీసుకుని వెళ్లొచ్చు. ప్రీ యూనివర్సిటీ ప్రోగ్రామ్‌లో హ్యూమానిటీస్‌, సోషల్‌ సైన్సెస్‌ల్లో షార్ట్‌టర్మ్‌ కోర్సులు కూడా అందుబాటులో ఉంటాయి.
ఇంజినీరింగ్‌ కోర్సు: కెమికల్‌, సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఈసీఈ, మెటీరియల్స్‌ సైన్స్‌ అండ్‌ మెటలర్జికల్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగాలుంటాయి. ఆరేళ్ల కోర్సు పూర్తి చేసుకున్నవారు వీటిలో ఏదో ఒక బీటెక్‌ డిగ్రీతో బయటకు వస్తారు. విద్యాపరంగా చూపిన ప్రతిభ, సాధించిన అదనపు క్రెడిట్స్‌ ఆధారంగా విద్యార్థికి రెండు మేజర్లలో బీటెక్‌ చేసే అవకాశమూ ఉంది. వాటిల్లో ఒకటి కంప్యూటర్‌ సైన్స్‌ కాగా, రెండోదాన్ని మిగిలిన వాటిల్లో దేన్నైనా ఎంచుకోవచ్చు. అలాగే ఒక మేజర్‌, 2 మైనర్లు లేదా ఒక మేజర్‌, ఒక మైనర్‌ అవకాశాన్నీ కల్పిస్తున్నారు. అయితే 2 మైనర్లు చేసేవారు ఒకదాన్ని మాత్రం బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, ఎకనామిక్‌ మేథమేటిక్స్‌, సోషల్‌ సైన్సెస్‌, స్టాటిస్టిక్స్‌ నుంచి ఎంచుకోవాలి. కోర్సుతోపాటు అదనంగా జాతీయస్థాయి పోటీపరీక్షలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలకు అవసరమైన మార్గదర్శకత్వాన్ని, అవగాహనను కల్పించే ప్రోగ్రామ్‌లు, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌, ఇతర నైపుణ్యాలను నేర్చుకునే అవకాశాన్నీ కల్పిస్తున్నారు.

ఈ కోర్సులకు ఈ ఏడాది పదో తరగతి పూర్తిచేసినవారు అర్హులు. ప్రవేశపరీక్ష ఏమీ ఉండదు. పదో తరగతిలో, ప్రతి సబ్జెక్టులో సాధించిన జీపీఏ ఆధారంగా ఎంపిక చేస్తారు. వివిధ వర్గాల వారికీ, లోకల్‌ అభ్యర్థులకూ రిజర్వేషన్‌ ఉంటుంది. ఏపీలోని ఆర్‌జేయూకేటీలన్నింటికీ ఒక దరఖాస్తు సరిపోతుంది. తెలంగాణ దానికి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు మొదటి రెండేళ్లు ఏడాదికి రూ.36,000, తరువాతి నాలుగేళ్లు ఏడాదికి రూ.40,000. అర్హులైన వారికి ఫీజు రియంబర్స్‌మెంట్‌ అవకాశముంది. బాసర ఆర్‌జీయూకేటీకి ప్రకటన విడుదలైంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు చివరితేదీ: 24.05.2019 వివరాలకు www.rgukt.ac.in ను సందర్శించవచ్చు.

3+3 విధానంలో..
ఇది నైపుణ్య ఆధారిత ప్రోగ్రామ్‌. ‘చేయడం ద్వారా నేర్చుకోవడం’ దీనిలో కనిపిస్తుంది. పరిశ్రమల అవసరాల మేరకు, నిపుణుల ఆధ్వర్యంలో ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు నేర్చుకునేలా కోర్సును రూపొందించారు. ఆరేళ్ల కోర్సులో మొదటి మూడేళ్లు డిప్లొమా సబ్జెక్టులనూ, మిగిలిన మూడేళ్లు ఇంజినీరింగ్‌ విద్యనూ చదువుతారు. మెరిట్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది. కొన్ని సంస్థలు ప్రవేశపరీక్ష ద్వారా ఎంచుకుంటున్నాయి.

కోర్సు కరిక్యులమ్‌ ఎంచుకున్న సంస్థను బట్టి మారుతుంది. సాధారణంగా ఏడాదికి రెండు చొప్పున మొత్తం 12 సెమిస్టర్లు ఉంటాయి. కొన్ని సంస్థలు- ఎన్‌ఎంఐఎంఎస్‌ వంటివి మాత్రం 10 సెమిస్టర్లు బోధనకూ, ఏడాది పారిశ్రామిక శిక్షణకూ కేటాయిస్తున్నాయి. మొదటి మూడేళ్లు పూర్తిచేసుకున్నాక డిప్లొమా సర్టిఫికెట్‌ అందజేస్తారు. ఆపై కొనసాగించలేం అనుకున్నవారు డిప్లొమాతో వెళ్లొచ్చు. కొనసాగించేవారికీ డిప్లొమాతోపాటు ఇంజినీరింగ్‌ పట్టానూ అందజేస్తారు.

అందిస్తున్న ప్రముఖ సంస్థలు:
* ఎల్‌పీయూ, పంజాబ్‌
* ముఖేష్‌ పటేల్‌ స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ (ఎన్‌ఎంఐఎంఎస్‌), హైదరాబాద్‌, ముంబయి, బెంగళూరు, శ్రీపుర్‌, ఇండోర్‌, నవీ ముంబయి
* టెక్నో ఇండియా యూనివర్సిటీ, కోల్‌కతా
* ఐటీఎం ఒకేషనల్‌ యూనివర్సిటీ, గుజరాత్‌
* గణ్‌పత్‌ యూనివర్సిటీ, గుజరాత్‌

Back..

Posted on 22-05-2019