Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
అందంగా.. భద్రంగా..!

* ఉపాధి అవకాశాల ప్యాకేజింగ్‌

అవసరానికి తగిన వస్తువు కొందామని మార్కెట్‌కి వెళ్లినా.. లేదా ఆన్‌లైన్‌లో వెతికినా.. అక్కడ ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. అన్నింటి నుంచి మొట్టమొదట మనల్ని ఆకర్షించేది మంచి ప్యాకింగ్‌ ఉన్నది మాత్రమే. అందమైన లేదా భద్రమైన ప్యాకింగ్‌ చూసిన తర్వాతే వస్తువు, దాన్ని తయారు చేసిన కంపెనీ తదితర వివరాల్లోకి వెళుతుంటాం. అలా వినియోగదారుడి తొలిచూపుని తనవైపు తిప్పుకునేలా చేసేదే ప్యాకేజింగ్‌. ఎన్నో రకాల నైపుణ్యాలతో ఎందరో నిపుణులు ఇందుకోసం పని చేస్తున్నారు. ఇంకా చాలామంది అవసరం ఉంది. ప్యాకేజింగ్‌ ఇప్పుడు ప్రత్యేకమైన కెరియర్‌గా మారింది.

మీకు ఎవరో ఏదో గిఫ్ట్‌ ఇచ్చారు. అది చాలా అందంగా ప్యాక్‌ చేసి ఉంది. దాంట్లో ఉన్నదేంటో తెలియకపోయినా ప్యాకింగ్‌ చూసి ముందుగా మురిసిపోతారు. ఆన్‌లైన్‌లో వస్తువులు ఆర్డర్‌ చేస్తారు. ఎలా వస్తుందో... ఏంటో అని ఆందోళన చెందుతుంటారు. కానీ ఆ వస్తువు ఎంతో దూరం నుంచి వచ్చినా చాలా భద్రంగా వస్తుంది. లోపలి వస్తువు పాడవకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఉంటారు. ఆ కేర్‌ చూస్తేనే మీకు సగం సంతోషం వచ్చేస్తుంది. మళ్లీ మళ్లీ ఆ కంపెనీ నుంచే వస్తువులు కొనాలని డిసైడ్‌ అయిపోతారు. అంతేకాదు మీకు తెలిసిన వాళ్లందరికీ రెకమెండ్‌ చేసేస్తారు. గమనించారా...ఈ మాయ అంతా ప్యాకేజింగ్‌దే. వస్తువు సంగతి కాసేపు వదిలేశాం. ప్యాకింగ్‌ దగ్గరే ఫిదా అయిపోయాం. ఇదోరకమైన కార్పోరేట్‌ టెక్నిక్‌. ఈ కంపెనీలు అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ప్రతి చిన్న అంశంలోనూ వినియోగదారుడి ఆనందమే పరమావధిగా పనిచేస్తున్నాయి. అందుకే ప్యాకేజింగ్‌ ఒక కెరియర్‌గా వేగంగా ఎదుగుతోంది.ప్యాకింగ్‌ భద్రంగా, అందంగా చేసి అందించడానికి కంపెనీలు పోటీ పడుతున్నాయి.

మొదటి చూపులోనే తమ సంస్థపై మంచి అభిప్రాయాన్ని కలిగించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతోపాటు నకిలీలను గుర్తించడానికి హోలోగ్రామ్‌లనూ పైనే ముద్రిస్తున్నాయి. ఆహార సంబంధమైన ఉత్పత్తులైతే పోషక విలువలనూ ప్రదర్శిస్తున్నాయి. వాటిని ముందుగానే చూసుకునే అవకాశాన్ని వినియోగదారుడికి ఇస్తున్నాయి. ప్రస్తుతం ఆన్‌లైన్‌ కొనుగోళ్లు పెరుగుతుండటంతో సంస్థలు ఆధునిక ప్యాకేజింగ్‌ టెక్నాలజీలపై దృష్టిసారిస్తున్నాయి. సమీప భవిష్యత్తులో ప్యాకేజింగ్‌ పరంగా భారత్‌ ప్రపంచంలోనే నాలుగో స్థానానికి చేరనుందని అంచనా! భారత ప్యాకేజింగ్‌ పరిశ్రమల సంఘం ప్రకారం రాబోయే 4-5 ఏళ్లలో ఈ పరిశ్రమ 13-15% వార్షికాభివృద్ధి చెందనుంది. ఆహార పానీయాలు, పండ్లు, కూరగాయలు, డ్రగ్స్‌, ఔషధాల దగ్గర్నుంచి ప్రమాదకర వస్తువుల వరకు దేన్ని రవాణా చేయాలన్నా ప్యాకేజింగ్‌ టెక్నాలజీ అవసరం ప్రముఖంగా కనిపిస్తోంది. అందుకే దేశంలో ఈ రంగానికి ఆదరణ రోజురోజుకీ పెరుగుతోంది.

అంతర్జాతీయ సంస్థల ప్రవేశం
పట్టణీకరణ, మధ్యతరగతి వినియోగదారుల పెరుగుదల, వినియోగదారులకు వస్తువుల పట్ల స్పృహ పెరగడం, ప్రాసెసింగ్‌ ఫుడ్‌కు ఆదరణ వంటివీ ప్యాకేజింగ్‌ రంగానికి ప్రాముఖ్యం పెరగడానికి దోహదపడుతున్నాయి. అంతర్జాతీయ సంస్థలు ఫుడ్‌, బెవరేజెస్‌, కాస్మొటిక్స్‌, టాయ్‌లెటరీస్‌, ఫార్మాస్యూటికల్స్‌ వైపు వేస్తున్న అడుగులు ఈ రంగం అభివృద్ధికి ప్రధాన కారణమవుతున్నాయి. దీంతో వివిధ పరిమాణాల్లో వస్తువులను ప్యాక్‌ చేసి, రవాణా చేయడానికి ప్రత్యేకమైన ప్యాకింగ్‌ అవసరమవుతోంది. రోజురోజుకూ ఎన్నోరకాల వస్తువులు మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఒక అంచనా ప్రకారం దేశవ్యాప్తంగా 35,000 ప్యాకేజింగ్‌ యూనిట్లున్నాయి. కానీ వాటికి మానవ వనరుల కొరత ఉంది. దీంతో ఏటా వేల మంది ప్యాకేజింగ్‌ నిపుణులు అవసరమవుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త కొత్త కోర్సుల రూపకల్పన జరుగుతోంది. కోర్సులో భాగంగా ఉత్పత్తుల నిల్వ, రాపింగ్‌, ప్రిజర్వింగ్‌, పంపిణీ, లేబులింగ్‌ మొదలైన అంశాల గురించి బోధిస్తారు. ప్యాకేజింగ్‌ అంటే వస్తువుల నాణ్యత, తాజా అంశాలకే పరిమితం కాదు. మార్కెటింగ్‌కూ సంబంధించినదే. ఈ కోర్సును అందించే సంస్థలు వస్తువుల భద్రత, కల్తీ అవకాశాలు, రవాణా చేయడానికి అనువైన సమయం, ప్రమోషన్‌ మొదలైన వాటినీ వివరిస్తాయి.

రకరకాల ఉద్యోగాలు
విజయవంతంగా కోర్సులు పూర్తిచేసినవారు వివిధ సంస్థల్లో ప్యాకేజింగ్‌ టెక్నాలజిస్ట్‌ (ప్యాకేజింగ్‌ డిజైన్‌, అభివృద్ధి, తయారీ), ప్యాకేజింగ్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌ (కొత్త ప్యాకేజింగ్‌ ప్రొడక్ట్‌లను రూపొందించడం, వివిధ డిజైన్లను, మెటీరియళ్లను పరీక్షించడం)లతోపాటు రిసెర్చర్‌, ప్యాకేజ్‌ స్పెషలిస్ట్‌, మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌, డెలివరీ ఏరియా మేనేజర్‌ మొదలైన స్థానాలకు అర్హులవుతారు. ప్రారంభ వేతనం ఏడాదికి రూ.3,00,000 నుంచి రూ.3,60,000 వరకు ఉంటుంది. అనుభవం పెరిగేకొద్దీ వేతనాల్లో పెరుగుదల ఉంటుంది.

నియామకాలు జరిపే ప్రముఖ సంస్థలు:
ఐటీసీ లిమిటెడ్‌, నెస్లే, జీఎస్‌కే, రాన్‌బాక్సీ, హిందుస్థాన్‌ యూనీలివర్‌ లిమిటెడ, డాబర్‌ ఇండియా, క్యాడ్‌బరీ ఇండియా లిమిటెడ్‌, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, కాస్ట్రాల్‌ ఇండియా, కోకా కోలా ఇండియా, యూఫ్లెక్స్‌, సన్‌ ఫార్మా, టాటా డోనెల్లి లిమిటెడ్‌, పాజిటివ్‌ ప్యాకింగ్‌, మల్టీ ఫ్లెక్స్‌ లమీ ప్రింట్‌, టెట్రా ప్యాక్‌ ఇండియా, ఆటోమొబైల్‌ సంస్థలు, టెక్స్‌టైల్‌ సంస్థలు మొదలైనవి.

ఏమేం కోర్సులు?
ప్యాకేజింగ్‌కి సంబంధించి వివిధ స్థాయుల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వివిధ సంస్థలు, విశ్వవిద్యాలయాలు బీఈ, బీటెక్‌, ఎంటెక్‌, డిప్లొమా, మేనేజ్‌మెంట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమాలు, స్వల్పకాలిక కోర్సులను అందిస్తున్నాయి.
బీటెక్‌ ఇన్‌ ప్యాకేజింగ్‌ టెక్నాలజీ: ఇది అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాం. కోర్సు కాలవ్యవధి- నాలుగేళ్లు. సైన్స్‌ విభాగంలో 60% మార్కులతో ఇంటర్మీడియట్‌/ తత్సమాన విద్య పూర్తిచేసినవారు అర్హులు. లేటరల్‌ ఎంట్రీ విధానంలో ప్రొడక్షన్‌ టెక్నాలజీలో డిప్లొమా చేసినవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి ఫిజిక్స్‌, కెమిస్ట్రీల్లో ప్రాథమిక అంశాలపై అవగాహన ఉండాలి. రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో నిర్వహించే ప్రవేశపరీక్షల ద్వారా ఈ కోర్సులోకి ప్రవేశం కల్పిస్తారు. కొన్ని సంస్థలు తమకంటూ ప్రత్యేకమైన ప్రవేశపరీక్షను నిర్వహించుకుంటున్నాయి. ఇది సాంప్రదాయిక డిగ్రీ కాకపోయినప్పటికీ ఈ కోర్సుకు ఎక్కువ గిరాకీ ఉంది. కోర్సులో భాగంగా విద్యార్థులు మెటీరియల్‌ సైన్స్‌, లాజిస్టిక్స్‌, ఇండస్ట్రియల్‌ డిజైన్‌ల గురించి తెలుసుకుంటారు.
డిప్లొమా ఇన్‌ ప్యాకేజింగ్‌ టెక్నాలజీ: దీనిలో ఏడాది, మూడేళ్ల వ్యవధి కోర్సులున్నాయి. ఏడాది డిప్లొమాకు ఇంటర్‌ పూర్తిచేసినవారు; మూడేళ్ల డిప్లొమాకు పదోతరగతి పూర్తిచేసినవారు అర్హులు. మూడేళ్ల డిప్లొమాకు రాష్ట్ర స్థాయిలో పాలిటెక్నిక్‌ ప్రవేశపరీక్షను రాయాల్సి ఉంటుంది. కోర్సులో భాగంగా పారిశ్రామిక శిక్షణ ఉంటుంది. ఇది ఆరు నెలలపాటు సాగుతుంది. డిప్లొమా తరువాత విద్యార్థి నేరుగా ఉద్యోగంలోకి చేరొచ్చు. చదువును కొనసాగించాలనుకునేవారు మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఇండస్ట్రియల్‌ ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌, ఆటోమొబైల్‌, ఏరోనాటికల్‌, మెరైన్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచిల్లోకి చేరొచ్చు.
అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా ఇన్‌ ప్యాకేజింగ్‌ మేనేజ్‌మెంట్‌: ఏడాది, మూడు నెలల వ్యవధి గల కోర్సులున్నాయి. వృత్తిపరంగా అభివృద్ధి చెందాలనుకునే విద్యార్థుల కోసం దీనిని రూపొందించారు. 10+2 లేదా తత్సమాన విద్య పూర్తిచేసినవారు అర్హులు. ఏ విభాగానికి చెందినవారైనా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా: కోర్సు కాలవ్యవధి- రెండేళ్లు. సైన్స్‌ ఖీ టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, సైన్స్‌ విభాగాల్లో డిగ్రీ చేసినవారెవరైనా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. 12+3 విధానంలో డిగ్రీ పూర్తిచేసుండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదివేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే కోర్సులో చేరేనాటికి సర్టిఫికెట్‌ సమర్పించాల్సి ఉంటుంది. అఖిల భారత స్థాయిలో నిర్వహించే ప్రవేశపరీక్ష ద్వారా ప్రవేశం కల్పిస్తారు. కొన్ని సంస్థలు ఇంటర్వ్యూను కూడా నిర్వహిస్తున్నాయి. కోర్సులో నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. మొదటి మూడు సెమిస్టర్లను విద్యార్థి క్యాంపస్‌లో గడుపుతాడు. నాలుగో సెమిస్టర్‌లో దేశవ్యాప్తంగా వివిధ సంస్థల్లో ప్రాజెక్టు చేయాల్సి ఉంటుంది.
సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ ప్యాకేజింగ్‌: కోర్సు కాలవ్యవధి- మూడు నెలలు. ప్యాకేజింగ్‌ రంగంలో ఆంత్రపెన్యూర్‌ నైపుణ్యాలు మెరుగుపరచుకోవాలనుకునేవారు దీనిని ఎంచుకోవచ్చు. ఇంజినీరింగ్‌, టెక్నాలజీ, కామర్స్‌, ఆర్ట్స్‌, సైన్స్‌ విభాగాల్లో డిగ్రీతోపాటు ఏడాది పని అనుభవం ఉన్నవారు అర్హులు. ఇంజినీరింగ్‌ డిప్లొమా, డిప్లొమా ఇన్‌ టెక్నాలజీ విద్యతోపాటు రెండేళ్ల అనుభవం ఉన్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.

అందిస్తున్న ప్రముఖ సంస్థలు
* ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌, ముంబయి, హైదరాబాద్‌, చెన్నై, కోల్‌కతా, న్యూదిల్లీ
* ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌, న్యూదిల్లీ
* ఐఐజీటీ- స్కూల్‌ ఆఫ్‌ ప్రింటింగ్‌ అండ్‌ ప్యాకేజింగ్‌- థానే, మహారాష్ట్ర
* ఎస్‌ఐఈఎస్‌ స్కూల్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌, నవీ ముంబయి
* అన్నా యూనివర్సిటీ, తమిళనాడు
* తేజ్‌పూర్‌ యూనివర్సిటీ, అసోం
* ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, రూర్కీ
* గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌, నాగ్‌పుర్‌
* జేఎన్‌ గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌, రామాంతపూర్‌, హైదరాబాద్‌
* కురుక్షేత్ర యూనివర్సిటీ, కురుక్షేత్ర.

ఐఐపీలో డిప్లొమా
కరెస్పాండెన్స్‌ కోర్సు ద్వారా డిప్లొమా ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు ముంబయిలోని ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌’ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మార్కెటింగ్‌, పర్చేజ్‌, డిజైన్‌, డెవలప్‌మెంట్‌, క్వాలిటీ అస్యూరెన్స్‌, ప్యాకేజింగ్‌ ప్రాసెసింగ్‌ వంటి విభాగాల్లో అవకాశాలు పొందాలనుకునేవారి కోసం సంస్థ ఈ కోర్సును రూపొందించింది.
కోర్సు కాలవ్యవధి- ఒకటిన్నర సంవత్సరాలు. కోర్సులో భాగంగా ఫుడ్‌, ఫార్మా, ఇంజినీరింగ్‌, ఇతర పరిశ్రమలు ఉపయోగించే ప్రాథమిక ప్యాకేజింగ్‌ మెటీరియల్స్‌- పేపర్‌, పేపర్‌బోర్డ్‌, గ్లాస్‌, మెటల్‌ కంటెయినర్లు, ప్లాస్టిక్‌, ఫిల్మ్స్‌, లామినేట్స్‌, కుషనింగ్‌ మెటీరియల్స్‌, ఇతర కన్వెన్షనల్‌, ఆధునిక ప్యాకేజింగ్‌ల గురించి నేర్చుకుంటారు. వీటితోపాటు ప్యాకేజింగ్‌ టెక్నిక్‌లు, విధానాలు, నాణ్యత మొదలైనవాటితోపాటు స్టాండర్డైజేషన్‌, ప్యాకేజింగ్‌ కాస్ట్‌, ఎకనామిక్స్‌ మొదలైన మేనేజ్‌మెంట్‌ అంశాలనూ తెలుసుకుంటారు.
యూజీసీ గుర్తింపు పొందిన సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్‌ (సైన్స్‌, ఇంజినీరింగ్‌, టెక్నాలజీ, కామర్స్‌, ఆర్ట్స్‌), డిప్లొమా (ఇంజినీరింగ్‌, టెక్నాలజీ) ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రొడక్షన్‌, పర్చేజ్‌, మార్కెటింగ్‌, క్వాలిటీ అస్యూరెన్స్‌ మొదలైన విభాగాల్లో కనీసం ఏడాది పారిశ్రామిక అనుభవం ఉండాలి. విజయవంతంగా కోర్సు పూర్తిచేసినవారికి ఏషియన్‌ ప్యాకేజింగ్‌ ఫెడరేషన్‌ (ఏపీఎఫ్‌) గుర్తింపు పొందిన గ్రాడ్యుయేట్‌ డిప్లొమా సర్టిఫికెట్‌ (డిప్లొమా ఇన్‌ ప్యాకింగ్‌) అందిస్తారు.
ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారాన్ని ఐఐపీ కేంద్రాల నుంచి పొందొచ్చు లేదా సంస్థ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.250 (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌, ముంబయి పేరు మీద డీడీ తీయాల్సి ఉంటుంది). దరఖాస్తు ఫారాలతో పాటుగా డీడీని జత చేసి నేరుగా సంస్థకు పంపాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫారాలను పంపాల్సిన చిరునామా: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌, ప్లాట్‌ ఈ-2, రోడ్‌ నంబరు.8, ఎంఐడీసీ ఏరియా, అంధేరి ఈస్ట్‌, పోస్ట్‌ బాక్స్‌ నం.9432, ముంబయి-400093.
కోర్సు ప్రారంభం: జనవరి 1, 2019
మరిన్ని వివరాలకు www.iip-in.com ను సందర్శించవచ్చు.

Back..

Posted on 06-11-2018