Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
తెలుసుకో.. 'పాసు' పోర్టు తీసుకో

* ఆన్‌లైన్‌తో అంతా సులువు
* సాధారణమైతే నెల రోజులు..
* తత్కాల్‌ వారం లోపే..

పాసుపోర్టు.. విదేశాలకు వెళ్లాలంటే తప్పనిసరి. ఎవరికి ఎప్పుడు విదేశీయానం అవకాశం వస్తుందో తెలియదు. అబ్బాయికి ఉద్యోగం వచ్చి అమెరికాలో స్థిరపడవచ్చు.. అమ్మాయి పెళ్లి చేసుకొని ఆస్ట్రేలియా వెళ్లొచ్చు.. వారిని చూసేందుకు మీరు వెళ్లొచ్చు.. ఇలా అవకాశం ఏదో ఒక రూపంలో తలుపు తడుతుంది. ఇందుకే చాలామంది ముందే పాసుపోర్టు కోసం ఉత్సుకత చూపుతుంటారు. ఏటేటా పెరుగుతున్న దరఖాస్తులే ఇందుకు నిదర్శనం. పాసుపోర్టు పొందటం, సందేహాలను తీర్చుకోవడం ఎలా..? నేడు పాసుపోర్టు సేవా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం...
దేశంలో మొత్తం 37 పాసుపోర్టు కార్యాలయాలుండగా అందులో 2014లో హైదరాబాద్‌ ప్రాంతీయ పాసుపోర్టు కార్యాలయం అత్యధిక పాసుపోర్టులను మంజూరు చేసి ప్రథమ స్థానంలో నిలిచింది. అత్యధికంగా మంజూరు చేయడమే కాదు... పోలీసు పరిశీలన సైతం వేగంగా జరగడంలో ఈ కార్యాలయం పరిధి జిల్లాలు దేశంలోనే ముందున్నాయి. 2012-13లో ఉత్తమ పాసుపోర్టు కార్యాలయంగా ఎంపికైంది. గత ఏడాది 6.95 లక్షలు(ఆ సమయానికి హైదరాబాద్‌ కార్యాలయం పరిధి 18 జిల్లాలు... ఇప్పుడు 16 జిల్లాలు) పాసుపోర్టులు జారీ చేసి ప్రథమ స్థానంలో ఉంది. అదే 2013లో 6.32 లక్షల పాసుపోర్టులే. అంటే 13 శాతం వృద్ధి నమోదైంది. విదేశాల్లో చదువుకునేందుకు జీ మ్యాట్‌ వంటి పరీక్షలు రాయాలి. దానికి దరఖాస్తు చేసుకోవాలంటే పాసుపోర్టు తప్పనిసరి. అందుకే దాన్ని తీసుకునే వారిలో విద్యార్థుల సంఖ్య భారీగా ఉంటోంది.
* దరఖాస్తు చేసుకునేదిలా...
పాస్‌పోర్టు కావాలనుకునే వారు రెండు రకాలుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవడం ఒకటయితే.. రెండోది ఈ-దరఖాస్తు డౌన్‌లోడ్‌ చేసుకొని కలంతో పూర్తి చేసి మళ్లీ దాన్ని అప్‌లోడ్‌ చేసి పంపించడం. ఇప్పుడు అధిక శాతం మంది ఆన్‌లైన్‌లోనే సమర్పిస్తున్నారు. ఇందుకు అధిక శాతం మంది ఇంటర్‌నెట్‌ కేంద్రాల నిర్వాహకులపై ఆధారపడతారు. వారు దరఖాస్తు పూర్తి చేసినందుకు కొంత రుసుం తీసుకుంటారు. అలా కాకుండా కంప్యూటర్‌పై కనీస పరిజ్ఞానం ఉంటే సొంతంగా దరఖాస్తు నింపి ఆన్‌లైన్‌లో పంపుకోవచ్చు.
* ఆన్‌లైన్‌లో దరఖాస్తు
దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు http://www.passportindia.gov.in/ లో లాగిన్‌ కావాలి. అందులోని హోం పేజీలో యూజర్‌ రిజిస్ట్రేషన్‌ వద్ద క్లిక్‌ చేసి అడిగిన సమాచారాన్ని నింపి సబ్మిట్‌ చేయాలి. కొత్తగా వచ్చే యూజర్‌ ఐడీతో కొత్త, రెన్యువల్‌ పాసుపోర్టుల్లో ఏదీ కావాలనుకుంటే ఆ దరఖాస్తును నింపాలి. అదే సమయంలో క్రెడిట్‌, డెబిట్‌ కార్డు, ఎస్‌బీఐ, దాని అనుబంధ బ్యాంకుల ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ లేదా ఎస్‌బీఐ చలానా ద్వారా ఫీజు చెల్లించి అందుబాటులో ఉన్న తేదీల్లో అపాయింట్‌మెంట్‌ తీసుకోవాలి. తర్వాత పరిశీలనకు తాము ఎంచుకున్న పాసుపోర్టు సేవా కేంద్రం వద్దకు ఒరిజినల్‌ ధ్రువపత్రాలు, ఆన్‌లైన్‌ ఫారం సమర్పించేప్పుడు ప్రింట్‌ తీసిన రసీదుతో హాజరు కావాలి. పోలీసు పరిశీలన నివేదిక(పీవీఆర్‌) తర్వాత పోస్టులో పాసుపోర్టు అందుతుంది. సాధారణమైనదైతే దరఖాస్తు చేసిన నెల రోజుల్లోపే అందేందుకు వీలుంది. తత్కాల్‌ అయితే వారం రోజులలోపే జారీ చేస్తారు.
* సేవా కేంద్రాల్లోనే పరిశీలన
పాసుపోర్టుకు దరఖాస్తు చేసిన వారే సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. ఒకరి తరఫున మరొకరు వెళ్లడానికి వీల్లేదు. దరఖాస్తుదారుడి వేలిముద్రలను తీసుకుంటారు. ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పించిన తర్వాత మీరు ఎంచుకున్న తేదీ, సమయంలో అసలు ధ్రువపత్రాలు, దరఖాస్తు సమర్పించిన తర్వాత వచ్చే రసీదు తీసుకొని హాజరుకావాలి.
హైదరాబాద్‌ ప్రాంతీయ, విశాఖపట్నం పాసుపోర్టు కేంద్రాలు కేవలం పాసుపోర్టులను ముద్రించడం, దరఖాస్తుదారులకు పంపించడం చేస్తాయి. దరఖాస్తుదారుల సమస్యలను పరిష్కరిస్తాయి. అక్కడ మాత్రం దరఖాస్తుదారుల ధ్రువపత్రాల పరిశీలన జరగదు. పరిశీలన సేవా కేంద్రాల్లోనే చేస్తారు.
విశాఖపట్నానికి చెందిన వ్యక్తి హైదరాబాద్‌లో చదువుకుంటుంటే విశాఖపట్నంలోనే తీసుకోవాలన్న నిబంధన లేదు. కళాశాల యాజమాన్యం ఇచ్చే అఫిడవిట్‌తో ఇక్కడే దరఖాస్తు చేసుకోవచ్చు. శాశ్వత చిరునామా వైజాగ్‌ కనుక అక్కడైనా తీసుకోవచ్చు. కాకపోతే ప్రస్తుతం ఎక్కడ ఉంటుందనేది దరఖాస్తులో పేర్కొనాలి.
* ఎన్నో రకాల సేవలు...
దరఖాస్తుదారుల ప్రయోజనార్థం ఎప్పటికప్పుడు అధికారులు వినూత్న సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగించుకుంటూ తక్కువ సమయంలో సేవలు అందించేందుకు కృషి చేస్తున్నారు.
* దరఖాస్తుదారులకు సమస్య తలెత్తితే సికిందాబ్రాద్‌లోని ప్రాంతీయ పాసుపోర్టు కార్యాలయంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉ.9.30 గంటల నుంచి 11.30 మధ్యలో వచ్చి టోకెన్‌ తీసుకొని పరిష్కారం పొందవచ్చు.
* దరఖాస్తుల సమర్పణపై సందేహాలుంటే 17 భాషల్లో 24 గంటలపాటు పనిచేసే టోల్‌ ఫ్రీ నంబరు ఉంది. 18002581800కు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చు.
* దరఖాస్తుదారులు హైదరాబాద్‌ పాసుపోర్టు కార్యాలయ అధికారులను 040-27704646, ఫ్యాక్స్‌ నంబరు: 040-27705656 లో సంప్రదించవచ్చు.
* సికింద్రాబాద్‌ కార్యాలయంలో సహాయక కేంద్రం(హెల్ప్‌ డెస్క్‌) ఉంది. అక్కడ దరఖాస్తులను నింపడం, లేఖలు రాయడం, వివిధ విభాగాలను సంప్రదించడానికి సహాయం చేస్తారు.
* స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులు మొబైల్‌ యాప్‌ mpassport seva ద్వారా పాసుపోర్టులకు సంబంధించిన చాలా వరకు సమాచారం తెలుసుకోవచ్చు.
* దరఖాస్తు చేసుకున్న తర్వాత పాసుపోర్టు సేవా కేంద్రం(పీఎస్‌కే)ల్లో రూ.30లు అదనంగా చెల్లిస్తే దరఖాస్తు స్థితిపై ఎస్‌ఎంస్‌లు అందుకోవచ్చు. తొమ్మిది సార్లు ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి. దరఖాస్తుదారు ఎస్‌ఎంఎస్‌ పంపి తమ దరఖాస్తు, పాసుపోర్టు స్థితిని తెలుసుకోవచ్చు. అందుకు 9704100100 నంబరుకు సంక్షిప్త సందేశం పంపించాలి. అందుకు status space file no. ను పంపించాలి. ఉదాహరణకు status hy106771561714 అని ఎస్‌ఎంఎస్‌ పంపితే సమాధానం వస్తుంది.
>> ఇవి మీకు తెలుసా..?
* పాసుపోర్టును పదేళ్ల వ్యవధికి ఇస్తారు. ఆ గడువు పూర్తయిన తర్వాత మళ్లీ పదేళ్ల కాలానికి రెన్యువల్‌ చేస్తారు.
* 18 సంవత్సరాల్లోపు వారిని మైనర్లుగా పరిగణిస్తారు. మైనర్లకు అయిదు సంవత్సరాల గడువు ఉన్నది ఇస్తారు.
* సాధారణ పాసుపోర్టు(నార్మల్‌) నీలం రంగు, డిప్లమాట్‌(జడ్జీలు, రాజ్యాంగ పదవుల్లో ఉండే సీఎం, ఎంపీలు తదితరులు) మెరూన్‌(రాణి రంగు), అఫీషియల్‌(అధికారిక పనులపై వెళ్లేవారికి) పాసుపోర్టు బూడిద రంగులో ఉంటుంది.
* అత్యధిక పాసుపోర్టు దరఖాస్తులు వస్తున్న రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అయిదో స్థానంలో ఉండేది.
* అత్యధిక దరఖాస్తులు వస్తున్న పాసుపోర్టు కార్యాలయాల్లో దేశంలోనే హైదరాబాద్‌ది మొదటి స్థానం. ఆ తర్వాత లక్నో, బెంగళూరు, దిల్లీ, కోల్‌కతా ఉన్నాయి.
>> హైదరాబాద్‌ ప్రాంతీయ కార్యాలయం మారిందిలా..
ప్రస్తుతం దీని పరిధిలో హైదరాబాద్‌లో బేగంపేట, అమీర్‌పేట, టోలీచౌకి, నిజామాబాద్‌, తిరుపతిలోని పాసుపోర్టు సేవా కేంద్రాలున్నాయి. తెలంగాణ 10 జిల్లాలతోపాటు కోస్తా, రాయలసీమలోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు సైతం హైదరాబాద్‌ ఆర్‌పీఓ పరిధిలో ఉన్నాయి. భవిష్యత్తులో ఈ ఆరు జిల్లాలు విశాఖపట్నం కార్యాలయం పరిధిలోకి వెళ్లే అవకాశం ఉంది.
>> విశాఖపట్నం పాసుపోర్టు కార్యాలయం పరిధి: మే నెల 21 వరకు ఈ కార్యాలయం కేవలం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలకు మాత్రమే సేవలందించేది. ఆ జిల్లాలో దరఖాస్తు చేసుకునేవారికి విశాఖపట్నం కార్యాలయమే పాసుపోర్టు ముద్రించి పంపిస్తుంది. మే 22వ తేదీ నుంచి కొత్తగా కృష్ణా, గుంటూరు జిల్లాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతంలో భాగమైన యానాం కూడా విశాఖపట్నం పరిధిలోకి వచ్చాయి. ఈ కార్యాలయం పరిధిలో విశాఖపట్నం, విజయవాడలో పాసుపోర్టు సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయి.
* నాలుగు గంటలు
హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన సలీమ్‌ పాషా మహ్మద్‌ తన రెండు నెలలు కూతురు అనైక్యా దియాకు టోలిచౌకిలో ఉదయం 10.30 గంటలకు తత్కాల్‌ పాసుపోర్టుకు దరఖాస్తు చేశారు. మధ్యాహ్నం 12.18 గంటలకు పాసుపోర్టును ముద్రించి 2.28 గంటలకు దాన్ని అందజేశారు.
* రెండు కోట్లు
పాసుపోర్టు సేవా కేంద్రాలను ప్రారంభించిన తర్వాత హైదరాబాద్‌ ప్రాంతీయ పాసుపోర్టు కార్యాలయం 2014 సెప్టెంబరు 29న జారీ చేసిన పాసుపోర్టులు.
> తత్కాల్‌ (36 పేజీలు) రూ.3,000 ; 60 పేజీలు రూ.4,000
> దరఖాస్తు స్థితిని తెలుసుకునేందుకు ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌కు రూ.30
> సాధారణ పాసుపోర్టు (36 పేజీలు) రూ.1,500 ; 60 పేజీలు సాధారణం రూ.2,000

posted on 24.6.2015