Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
పీజీ ప్రవేశాలకు దారి!

ఒకవైపు బీఎస్‌సీ పరీక్షలు, ఆ వెంటనే స్వల్ప వ్యవధిలో ఎంఎస్‌సీ ప్రవేశపరీక్షలతో విద్యార్థులు తీరిక లేకుండా ఉన్నారు. వచ్చే నెల నుంచి రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల పీజీ ప్రవేశపరీక్షలు ప్రారంభం కానున్నాయి. బేసిక్‌ సైన్సెస్‌, బయాలజీ సబ్జెక్టులకు పోటీ పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో పీజీ చేయాలనే కల నెరవేరాలంటే ఏం చేయాలి?
మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, మెటీరియల్‌ సైన్స్‌, నానోటెక్నాలజీ సబ్జెక్టులు ఇటీవల బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. మన రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు ఎంఎస్‌సీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశపరీక్షలకు ఈ సబ్జెక్టుల్లో విద్యార్థులు ఎక్కువగా పోటీ పడుతున్నారు. కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, మేథ్స్‌తోపాటు బయాలజీ సబ్జెక్టులైన బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీలకు భారీ పోటీ ఉంటోంది. అత్యుత్తమ ప్రణాళికతో చదివితేనే విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధించగలరు.

పద్ధతి ప్రకారం పునాది
బీఎస్‌సీ పరీక్షల తయారీకీ, పీజీ ప్రవేశపరీక్షల సన్నద్ధతకూ ముఖ్యమైన తేడా ఏమిటంటే.. బీఎస్‌సీ పరీక్షకు కొన్ని ఎంపిక చేసుకున్న అంశాల వరకూ సన్నద్ధమైతే సరిపోతుంది. కానీ, ఎంఎస్‌సీకి ప్రవేశపరీక్ష సిలబస్‌ మొత్తాన్నీ అనువర్తిత ధోరణిలో చదవాలి. 10+2 సిలబస్‌తో సన్నద్ధతను మొదలుపెట్టాలి. అంటే మొదట తెలుగు అకాడమీ, సీబీఎస్‌ఈ పుస్తకాలను రిఫర్‌ చేసి, ప్రాథమికాంశాలను మెరుగుపరచుకుని తర్వాత బీఎస్‌సీ సిలబస్‌ను అంశాలవారీగా రిఫరెన్స్‌ పుస్తకాల సాయంతో క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి.
పీజీ కోసం ఎంచుకున్న సబ్జెక్టులో డిగ్రీ స్థాయి పాఠ్యాంశాలను విశ్లేషణాత్మకంగా చదవాలి. వివిధ అంశాలను అన్వయించుకోవడం తెలుసుకోవాలి. ఇది ప్రవేశ పరీక్షలకు పునాదిగా ఉపయోగపడుతుంది. గ్రాడ్యుయేషన్‌ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడే పీజీ ఏ సబ్జెక్టులో చేయాలనేది నిర్ణయించుకోవాలి. ఎంచుకున్న సబ్జెక్టుకు పైన చెప్పిన పద్ధతిలో చదవడం ప్రారంభించాలి. ముందు ఇంటర్మీడియట్‌లో చదివిన విషయాలను ఒకసారి పునశ్చరణ చేసుకోవాలి. తర్వాత డిగ్రీ అంశాలను క్రమం తప్పకుండా చదవాలి.
ఈ పద్ధతిలో సన్నద్ధం కానివారు మాదిరి ప్రశ్నపత్రం ఎలా ఉంటుందో ముందు తెలుసుకోవాలి. దాని ప్రకారం పరీక్షలకు సిద్ధమవాలి. బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, జెనెటిక్స్‌ సబ్జెక్టుల ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్‌లోనే ఉంటాయి. కెమిస్ట్రీకి రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో తెలుగులో కూడా ప్రశ్నపత్రం ఇస్తారు.
ప్రస్తుతం ఉన్న పోటీని బట్టి చూస్తే 60-70 శాతం మార్కులు సాధిస్తే సీట్లు రావచ్చు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు, డిగ్రీ పూర్తయినవారు రోజుకు కనీసం 6-8 గంటలు చదవాలి. సబ్జెక్టుకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే తమ అధ్యాపకులను అడిగి నివృత్తి చేసుకోవచ్చు. డిగ్రీ పూర్తయ్యాక సన్నద్ధత ప్రారంభించేవారైతే కోచింగ్‌ తీసుకోవడమే మంచిది.
ప్రవేశపరీక్షకు సమయ నిర్వహణ కూడా ముఖ్యమైనదే కాబట్టి, అందుకోసం మాదిరి గ్రాండ్‌ టెస్టులను ఎక్కువగా సాధన చేయాలి.
విశ్వవిద్యాలయాల్లో స్థానిక విద్యార్థులకు 85 శాతం సీట్లను, స్థానికేతర విద్యార్థులకు 15% సీట్లను కేటాయిస్తారు. కాబట్టి, విద్యార్థులు ముందుగా స్థానిక ప్రాంత విశ్వవిద్యాలయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
మన తెలుగు రాష్ట్రాల్లో... ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, ఆంధ్ర, నాగార్జున, ఆదికవి నన్నయ, డా. బి.ఆర్‌. అంబేడ్కర్‌, కృష్ణా, శ్రీ వేంకటేశ్వర, శ్రీకృష్ణదేవరాయ, శ్రీ పద్మావతి, యోగి వేమన, రాయలసీమ, విక్రమసింహపురి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.
మన రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ఎంఎస్‌సీ ప్రవేశపరీక్ష ప్రశ్నపత్రాలను బహుళైచ్ఛిక రూపంలో రూపొందిస్తారు. కాబట్టి, సబ్జెక్టును అనవర్తిత ధోరణిలో విశ్లేషణాత్మకంగా చదవాలి. తర్వాత బహుళైచ్ఛిక ప్రశ్నలున్న రిఫరెన్స్‌ పుస్తకాలు, మాదిరి ప్రశ్నపత్రాలు, గత ప్రశ్నపత్రాలను అధ్యయనం చేయాలి.
తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలు నిర్వహించే ఎంఎస్‌సీ ప్రవేశపరీక్షల్లో 100 ప్రశ్నలకు 90 నిమిషాల్లో సమాధానం రాయాలి. వీటికి రుణాత్మక మార్కులు ఉండవు కాబట్టి అన్ని ప్రశ్నలకూ సమాధానాలు గుర్తించవచ్చు.

ముఖ్యమైన తేదీలు
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ గడువు: 25.04.2017
ఆన్‌లైన్‌ దరఖాస్తులను సమర్పించాల్సిన చివరి తేదీ: 25.04.2017
దరఖాస్తు ప్రింట్‌అవుట్‌ను సమర్పించడానికి తుది గడువు: 27.04.2017

ఆంధ్రా విశ్వవిద్యాలయం
ఆన్‌లైన్‌ దరఖాస్తులను రూ.1000 ఆలస్య రుసుముతో సమర్పించడానికి చివరి తేదీ: 25.04.2017

ఉస్మానియా విశ్వవిద్యాలయం
ఆన్‌లైన్‌ దరఖాస్తులను సమర్పించాల్సిన చివరి తేదీ: 05.05.2017
రూ.200 ఆలస్య రుసుముతో సమర్పించడానికి చివరి తేదీ: 15.05.2017

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం
ఆన్‌లైన్‌ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ: 05.05.2017

కాకతీయ విశ్వవిద్యాలయం
ఆన్‌లైన్‌ దరఖాస్తులను సమర్పించడానికి తుది గడువు: 10.05.2017
ఆలస్య రుసుము రూ.600తో సమర్పించడానికి చివరితేదీ: 15.05.2017

విశ్వవిద్యాలయాల వారీగా...
ఉస్మానియా విశ్వవిద్యాలయం
బయోటెక్నాలజీ (ఎంఎస్‌సీ), బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, జెనెటిక్స్‌, ఫోరెన్సిక్‌ సైన్స్‌, ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ సబ్జెక్టున్నింటికీ కలిపి ఒకే ప్రవేశపరీక్షను నిర్వహిస్తోంది. ఈ పరీక్షకు బీఎస్‌సీలో బయాలజీతోపాటు కెమిస్ట్రీ కలిగిన విద్యార్థులు, ఎంపీసీ విద్యార్థులు కూడా అర్హులే. బీఎస్‌సీలో తాము చదివిన ఏదైనా ఒక బయాలజీ ఆప్షనల్‌ను ఎంపిక చేసుకోవాలి. కెమిస్ట్రీ అందరికీ ఉమ్మడిగా ఉంటుంది. సాధారణంగా బయాలజీ విద్యార్థులు సంబంధిత బయాలజీతోపాటు కెమిస్ట్రీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ సిద్ధం కావాలి.
ఉస్మానియా బయోటెక్నాలజీ ఉమ్మడి ప్రవేశపరీక్ష రాసి మంచి ర్యాంకు సాధించిన విద్యార్థులు తమకు నచ్చిన స్పెషలైజేషన్‌లో ఎంఎస్‌సీ చేయవచ్చు.

ఆంధ్రా, కాకతీయ విశ్వవిద్యాలయాలు
ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహించే లైఫ్‌సైన్స్‌ (బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, బయో కెమిస్ట్రీ..) ప్రవేశపరీక్షల్లో, కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించే ఎంఎస్‌సీ బయోటెక్నాలజీ ప్రవేశపరీక్షలో సాధారణంగా కెమిస్ట్రీ ప్రశ్నలను అడగరు. బయాలజీ సిలబస్‌ నుంచే ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి సంబంధిత బయాలజీ సిలబస్‌ను శ్రద్ధగా చదవాలి.
ఆంధ్రా యూనివర్సిటీ ఎంఎస్‌సీ మెరైన్‌ బయోటెక్నాలజీ, ఎంఎస్‌సీ మెరైన్‌ కెమిస్ట్రీ, ఎంఎస్‌సీ న్యూక్లియర్‌ కెమిస్ట్రీ, ఎంఎస్‌సీ టెక్‌, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌ మొదలైన స్పెషలైజ్‌డ్‌ కోర్సులను అందిస్తోంది.

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం
ఎస్‌వీయూ పీజీసెట్‌ ఎంఎస్‌సీలో నూతన కోర్సులను అందిస్తోంది. ఇమ్యూనో టెక్నాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్‌, మెటీరియల్‌ సైన్స్‌, నానో టెక్నాలజీ, వైరాలజీలో ఎంఎస్‌సీ, ఎంటెక్‌ స్పేస్‌ టెక్నాలజీ మొదలైన కోర్సులను అందిస్తోంది.

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం
మన రాష్ట్రంలో పీజీ కోర్సులను అందించే విశ్వవిద్యాలయాల్లో దీనికి అధిక ప్రాధాన్యం ఉంది.
ఈ హెచ్‌సీయూ నిర్వహించే పీజీ ఎంట్రన్స్‌లో ప్రశ్నలన్నీ బహుళైచ్ఛిక పద్ధతిలో నిర్వహిస్తారు. రుణాత్మక మార్కులుంటాయి. కాబట్టి సరైన సమాధానం తెలిసినవాటికి మాత్రమే జవాబులు గుర్తించాలి. పీజీ ప్రవేశపరీక్ష ప్రశ్నపత్రాలన్నీ ఇంగ్లిష్‌లో ఉంటాయి. కాబట్టి తెలుగుమీడియం విద్యార్థులు ఆంగ్లంలో ఉన్న బహుళైచ్ఛిక మాదిరి ప్రశ్నలను అధ్యయనం చేయాలి.
సైన్స్‌ విభాగంలో కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, ప్లాంట్‌ బయోటెక్నాలజీ, ఆనిమల్‌ బయోటెక్నాలజీ, ఫిజిక్స్‌, స్టాటిస్టిక్స్‌, అప్లైడ్‌ మేథమేటిక్స్‌, ఎంసీఏ కోర్సులకు పీజీ ఎంట్రన్స్‌లను నిర్వహిస్తోంది.
పీజీ ప్రవేశపరీక్షలకు బీఎస్‌సీలో కనీసం 60% మార్కులను కలిగిన విద్యార్థులు మాత్రమే అర్హులు. ఎంసీఏ పరీక్షకు 10+2 స్థాయిలో మేథమేటిక్స్‌ చదివినవారు మాత్రమే అర్హులు.
హెచ్‌సీయూ గత సంవత్సరం నుంచి ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్‌సీ, పీహెచ్‌డీ బయోటెక్నాలజీ (6 సీట్లు) కోర్సును ప్రవేశపెట్టింది. దీనికి అర్హత బీఎస్‌సీ (ఫిజికల్‌), లైఫ్‌సైన్స్‌/ ఫార్మసీ/ ఇంజినీరింగ్‌/ ఎంబీబీఎస్‌లో 60% మార్కులు ఉండాలి. ప్రవేశపరీక్ష తర్వాత ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ప్రవేశపరీక్షలో మేథమేటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, క్వాంటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ మొదలైన సిలబస్‌ నుంచి 75 బహుశైచ్ఛిక ప్రశ్నలను అడుగుతారు. ఇంటర్వ్యూకు 25 మార్కులు.
ఎంఎస్‌సీ కెమిస్ట్రీ ప్రవేశపరీక్షకు బీఎస్‌సీ మేథమేటిక్స్‌, బయాలజీ విద్యార్థులు కూడా అర్హులే. కానీ ఈ ప్రశ్నపత్రంలో గణిత ప్రాథమికాంశాలపై 20% ప్రశ్నలను అడుగుతారు. కాబట్టి బయాలజీ విద్యార్థులు కెమిస్ట్రీతోపాటు ప్రాథమిక గణితంపై అధిక దృష్టి పెట్టాలి.
బయోకెమిస్ట్రీ, యానిమల్‌ బయోటెక్నాలజీ, ప్లాంట్‌ బయోటెక్నాలజీ ప్రవేశపరీక్షలో బయాలజీ నుంచి 80-90, కెమిస్ట్రీ నుంచి 10-20 శాతం ప్రశ్నలను అడుగుతారు. కాబట్టి బయాలజీని అనువర్తిత ధోరణిలో శ్రద్ధగా అధ్యయనం చేయాలి.
ఎంఎస్‌సీ ఫిజిక్స్‌, మేథమేటిక్స్‌ ప్రవేశపరీక్షలో ఆయా సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలను మాత్రమే అడుగుతారు. కాబట్టి ఎంచుకున్న సబ్జెక్టును క్షుణ్ణంగా చదవాలి.
హెచ్‌సీయూ ఎంటెక్‌ మెడికల్‌ బయోటెక్నాలజీ ప్రవేశపరీక్షను కూడా నిర్వహిస్తోంది. దీనికి 60 శాతం మార్కులతో బీటెక్‌ బయోటెక్నాలజీ/ ఎంఎస్‌సీలో బయోకెమిస్ట్రీ/ మైక్రోబయాలజీ/ బయోటెక్నాలజీ/కెమిస్ట్రీ చేసినవారు అర్హులు.
బయో ఇన్ఫర్మాటిక్స్‌ ప్రవేశపరీక్షకు 55% మార్కులతో బయాలజీ/ కెమికల్‌ సైన్స్‌/ ఫిజికల్‌ సైన్స్‌/ మేథమేటికల్‌ సైన్స్‌ల్లో మాస్టర్స్‌ డిగ్రీ కలిగిన విద్యార్థులు అర్హులు.
హెచ్‌సీయూ గత సంవత్సరం నుంచి 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్స్‌ డిగ్రీ కోర్సును మేథమేటిక్స్‌ సైన్స్‌/ ఫిజిక్స్‌/ కెమికల్‌ సైన్స్‌/ హెల్త్‌ సైకాలజీ/ నర్సింగ్‌ సైన్స్‌/ ఎకనామిక్స్‌/ హిస్టరీ/ పొలిటికల్‌ సైన్స్‌/ ఆంత్రపాలజీ/ లాంగ్వేజెస్‌ మొదలైన కోర్సులను అందిస్తోంది. దీనికి 10+2 ఇంటర్మీడియట్‌/ సీబీఎస్‌సీ/ ఐసీఎస్‌ఈ/ హెచ్‌ఎస్‌సీల్లో 60% మార్కులు కలిగిన విద్యార్థులు అర్హులు. ప్రవేశపరీక్ష తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఆంధ్రా యూనివర్సిటీ కూడా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ కోర్సును ఎంఎస్‌సీ- అప్లయిడ్‌ కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, జియాలజీ, మేథమేటిక్స్‌, ఎకనామిక్స్‌ మొదలైన కోర్సులను అందిస్తోంది.
పీజీ కోసం ఎంచుకున్న సబ్జెక్టులో డిగ్రీ స్థాయి పాఠ్యాంశాలను విశ్లేషణాత్మకంగా చదవాలి. వివిధ అంశాలను అన్వయించుకోవడం తెలుసుకోవాలి. ఇది ప్రవేశ పరీక్షలకు పునాదిగా ఉపయోగపడుతుంది.

Back..

Posted on 24-04-2017