Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
పీహెచ్‌డీకి ప్రవేశ ద్వారం!

విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యుల ఉద్యోగంలో ప్రవేశించడానికి పీహెచ్‌డీని తప్పనిసరి అర్హతగా నిర్ణయించారు. 2021 నుంచి ఇది అమలవుతుందని ఇటీవల కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ప్రకటించింది. ప్రసిద్ధ పరిశోధనా సంస్థల్లో పరిశోధకులుగా ప్రవేశించి ఉజ్వల భవిష్యత్తు ఏర్పరచుకోవడానికీ పీహెచ్‌డీ ఉపకరిస్తుంది. ఈ నేపథ్యంలో ఆగస్టులో పరీక్ష జరగనున్న ఆంధ్రప్రదేశ్ రిసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీఆర్‌సెట్) గురించి తెలుసుకుందాం!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని 14 విశ్వవిద్యాలయాల్లో, పరిశోధనారంగంలో పీహెచ్‌డీ, ఎంఫిల్. (ఫుల్‌టైమ్/ పార్ట్‌టైమ్) కోర్సుల్లో అడ్మిషన్ కోసం ఆంధ్ర యూనివర్సిటీ ఉమ్మడి ప్రవేశపరీక్ష ప్రకటన విడుదల చేసింది. 2018-19 విద్యా సంవత్సరానికి ఏపీఆర్‌సెట్ అనే ఒకే పరీక్షను ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించనుంది. దీనిద్వారా 69 సబ్జెక్టుల్లో దాదాపు 2400 పీహెచ్‌డీ, 500 ఎంఫిల్ సీట్లు భర్తీ చేయడానికి అవకాశం ఉంది. ప్రతిభ, ర్యాంకుల ఆధారంగా నిబంధనల మేరకు రాష్ట్రంలోని ఏ విశ్వవిద్యాలయంలోనైనా ప్రవేశం పొందొచ్చు.
ఏపీఆర్‌సెట్ ఆన్‌లైన్ పద్ధతిలో జరుగుతుంది. పరీక్ష రెండు విభాగాలుగా ఉంటుంది. మొత్తం 200 మార్కులు కేటాయించారు. రాతపరీక్ష - 180 మార్కులు; మౌఖిక పరీక్ష - 20 మార్కులు.
రాత పరీక్షలో పార్టు-ఎలో టీచింగ్ అండ్ రిసెర్చ్ ఆప్టిట్యూడ్ 90 మార్కులకు, పార్టు-బిలో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్టు 90 మార్కులకు రాయాల్సి ఉంటుంది. ప్రతి పేపర్‌కు 90 నిమిషాల చొప్పున 180 నిమిషాల సమయం కేటాయించారు.
సరైన సమాధానానికి 1 మార్కు. తప్పు సమాధానానికి 1/6 వంతు రుణాత్మక మార్కు ఉంటుంది.
మౌఖిక పరీక్ష/ వైవా-వోస్‌ను సంబంధిత యూనివర్సిటీ డిపార్ట్‌మెంట్ నిర్వహిస్తుంది. రాత, మౌఖిక పరీక్షల మొత్తం మార్కుల ఆధారంగా ర్యాంకును కేటాయిస్తారు.
అర్హత మార్కులు: ప్రతి విభాగంలో ఓసీ అభ్యర్థులకు 50 శాతం మార్కులనూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45% శాతం మార్కులనూ కనీస అర్హతగా పరిగణిస్తారు. అలా అర్హత పొంది ఉత్తీర్ణులైనవారు ప్రతిభ, సీట్ల లభ్యతను బట్టి రిజర్వేషన్లవారీగా అడ్మిషన్లు పొందవచ్చు.
సిలబస్: పార్ట్ -ఎ బోధన, పరిశోధన అభిరుచి కోసం యూజీసీ నెట్ పేపర్-1 సిలబస్‌నూ, పార్ట్-బి కోసం ఏపీఆర్‌సెట్ వెబ్‌సైట్‌లోని సిలబస్‌నూ ప్రామాణికంగా తీసుకోవాలి. హ్యుమానిటీస్ సబ్జెక్టులకు యూజీసీ-నెట్ సిలబస్‌ను, సైన్సు సబ్జెక్టులకు సీఎస్ఐఆర్-నెట్ సిలబస్‌ను, ఇంజనీరింగ్ సబ్జెక్టులకు గేట్ సిలబస్‌ను అనుసరించి సన్నద్ధం కావాల్సి ఉంది.
పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, రాజమహేంద్రవరం, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, కడప, తిరుపతి, హైదరాబాద్.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 25-07-2018
అపరాధ రుసుంతో దరఖాస్తుకు చివరి తేదీ: 10-08-2018
పరీక్ష నిర్వహించే తేదీలు: 22-08-2018 నుంచి 24-08-2018 వరకు
పరీక్ష ఫీజు: ఓసీ/బీసీలకు రూ.1300; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీలకు రూ.900
అర్హత: అభ్యర్థులు సంబంధిత పీజీ సబ్జెక్టులో 55% శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 5 శాతం మార్కుల సడలింపు ఉంటుంది. పార్ట్‌టైమ్ పీహెచ్‌డీకి దరఖాస్తు చేసేవారు వారి సర్వీస్ సర్టిఫికెట్ జతపరచడం/ అప్‌లోడ్ చేయాలి.
వయఃపరిమితి లేదు.
వెబ్‌సైట్: https://sche.ap.gov.in/RCET/RCET/RCET_HomePage.aspx
ఎలా సిద్ధం కావాలి?
* బోధనా సామర్థ్యంలో ప్రశ్నలు పాఠశాల దశకు సంబంధించి తరగతిగదిలో బోధన, అభ్యసన ప్రక్రియ, విద్యార్థి- ఉపాధ్యాయుల మధ్య పరస్పర సంబంధాలు మొదలైన భావనలపై అభ్యర్థుల సామర్థ్యాలను పరీక్షించడానికి అవకాశం ఉంది. బీఈడీ, ఎంఈడీ, పూర్తిచేసిన అభ్యర్థులకు ఈ విభాగంలోని భావనలు కొంత సులభంగా సమాధానాలు రాసేలా ఉంటాయి.
* పరిశోధన రంగాన్ని ఎంచుకొనే అభ్యర్థులను వారి సహజ సామర్థ్యాన్ని పరీక్షించే ప్రశ్నలు అడగవచ్చు. ప్రధానంగా పరిశోధన లోని సోపానాలు, రకాలు, విలువలు, పరిశోధన వ్యాసం ముఖ్య లక్షణాలు లోతుగా, పరిశీలనా దృష్టిలో అభ్యసించాలి. సాధన చేయాలి.
* ప్యాసేజ్‌ని ఆధారంగా చేసుకొని అడిగే ప్రశ్నల్లో అభ్యర్థుల అవగాహన సామర్థ్యాన్ని అంచనా వేసేలా ప్రశ్నలు ఉండవచ్చు.
* కమ్యూనికేషన్‌కు సంబంధించి సమాచార లక్షణాలు, రకాలు, తరగతి గదిలో సమాచారం ప్రభావంతంగా విద్యార్థులకు చేరడానికి అనుసరించాల్సిన వ్యూహాలు, మంచి సమాచారానికి ఉండే లక్షణాలు, అవరోధాలు నేర్చుకోవాల్సి ఉంటుంది.
* రీజనింగ్‌లో నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, రిలేషన్స్, క్లాసిఫికేషన్స్‌కు సంబంధించి వివిధ పోటీ పరీక్షల్లోని ప్రశ్నలను పరిశీలించి భావనలను అవగాహన చేసుకోవాలి. మాదిరి సమస్యలను సాధన చేయాలి.
* తార్కిక వివేచనలో (లాజికల్ రీజనింగ్) ఆగమన, నిగమన వివేచన నిర్వచనాలు, లక్షణాలు ఉదాహరణలతో అభ్యసించాలి. వెన్ డయాగ్రమ్‌కు సంబంధించి మాదిరి సమస్యలు, స్టేట్‌మెంట్స్ (ప్రవచనాలు), అజంప్షన్స్, కన్‌క్లూజన్స్ (నిర్ధారణలు) ఎనాలజీకి సంబంధించిన విషయాలను విస్తృతంగా అభ్యసించాలి.
* దత్తాంశ నిర్వహణ (డేటా ఇంటర్‌ప్రిటేషన్) విభాగంలో పై గ్రాఫ్, బార్ గ్రాఫ్ సమస్యలను ఇస్తుంటారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు గణిత చతుర్విధ ప్రక్రియలు, శాతాలు, లాభనష్టాలు అనే అంకగణిత భావనలపై ఆధారపడి ఉంటాయి. తక్కువ సమయంలో వేగంగా, కచ్చితంగా సమస్యల సాధన అవసరం. కాబట్టి అవగాహనతో కూడిన సాధన ముఖ్యం.
మాదిరి ప్రశ్నలు
1. తరగతిగదిలో ఉపాధ్యాయుడికి మంచి ప్రవర్తన ఎందుకు ఉండాలంటే?
1) విద్యార్థులు మరింత శ్రద్ధను కలిగివుంటారు.
2) విద్యార్థులు దాని విలువ తెలుసుకొని ప్రశంసిస్తారు.
3) అది అభ్యసనానికి ఎంతో సహకరిస్తుంది.
4) అది అనుసరించాల్సిన ఒక మంచి ఉదాహరణను ఏర్పరుస్తుంది. జ: 3
2. అభ్యసనలో తప్పనిసరిగా ఉండాల్సిన అంశం
1) అనుభవం 2) బోధన 3) లక్ష్యాలు 4) మార్గదర్శకత్వం జ: 1
3. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ద్వారా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్-2009 ను రూపొందించారు?
1) 45 2) 21 3) 21 (ఎ) 4) 16 (3) జ: 3
రిఫరెన్స్ పుస్తకాలు: 1) యూజీసీ నెట్/జేఆర్ఎఫ్/స్లెట్ జనరల్ పేపర్-1 - అరిహంత్ పబ్లిషర్స్
2) సీబీఎస్ఈ యూజీసీ నెట్/సెట్/జేఆర్ఎఫ్ పేపర్-1 - కేవీఎస్ మదన్
3) లాజికల్ రీజనింగ్ - డాక్టర్ ఆర్ఎస్ అగర్వాల్.

- డాక్ట‌ర్ వి.బ్ర‌హ్మం

Back..

Posted on 19-07-2018