Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఇందులో క్లిక్‌ కావచ్చు!

కాలేజ్‌ ఫెస్ట్‌ అయినా.. ఇంట్లో వేడుక అయినా.. టూర్‌కి వెళ్లినా.. కొత్తగా ఏది రుచి చూసినా.. అన్నింటికీ ఫొటోలు క్లిక్‌ మనిపించడమే! అరచేతిలోకి మొబైల్‌ వచ్చాక ఇది మరీ సాధారణమైంది. ఛాయాచిత్రాలు తీయటంలో కొందరికి చక్కని నేర్పు ఉంటుంది. ఇంకాస్త ముందుకెళ్లి సృజనాత్మకతను జోడించే నైపుణ్యం ఉంటే.. దీన్ని ఆసక్తికరమైన కెరియర్‌గానూ మలచుకోవచ్చు. కేవలం వ్యక్తుల, సంస్థల జ్ఞాపకాలను పదిలపరచటానికే పరిమితమవకుండా కొన్ని రంగాల్లో ఫొటోగ్రఫీ ఎంతో కీలకంగా మారింది. సహజంగానే ఆ ప్రత్యేక అంశాల్లో డిప్లొమా, సర్టిఫికేషన్‌ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ప్రతిభావంతులకు ఈ రంగంలో ఆకాశమే హద్దు!

ఒక ఫొటో ఏం చేస్తుంది? మాటల్లో చెప్పలేనిదానికి రూపాన్నిస్తుంది. రాసిన విషయానికి బలం చేకూర్చి తిరుగులేని విశ్వసనీయతను అందిస్తుంది. వార్తాపత్రికలోనో, మేగజీన్‌లోనో కొన్ని పేరాలతో నిండి ఉన్న సమాచారం కంటే.. ఒక ఫొటో ఎక్కువమందిని ఆకర్షిస్తుంది. విషయాన్ని కూడా ఇంకాస్త ఎక్కువగా అర్థమయ్యేలా చేస్తుంది. ఒక ఫొటో.. దాని వెనుక ఉన్న కథను అర్థం చేయిస్తుంది. కదిలిస్తుంది, కన్నీరు పెట్టిస్తుంది. ఎన్నో అనుభూతులను మూటగట్టి అందిస్తుంది. అందుకే ఫొటోకి అంత ప్రాముఖ్యం. పెద్ద ఫంక్షన్లనేకాదు.. ప్రతి చిన్న విజయాన్నీ, విషయాన్నీ ఫొటోల రూపంలో భద్రపరచుకుంటున్నాం. ఇది మన గతంతో మనల్ని ముడివేసి ఉంచి, అప్పటి పరిస్థితులు, మనుషులు, జ్ఞాపకాలను ఎప్పుడూ తాజా పరుస్తుంటుంది. సృజనాత్మకతను చూపించడానికి ఉన్న మార్గాల్లో ఫొటోగ్రఫీ ముందుంటుంది. విజువల్‌ ప్రపంచం పట్ల ఆసక్తి ఉండి, వాటిని బంధించాలనుకునేవారికి ఫొటోగ్రఫీనే మంచి మార్గం. ఈ హాబీని కెరియర్‌గా మలచుకుంటే సంతృప్తితోపాటు మంచి జీతభత్యాలనూ అందుకునే వీలుంది.

కమ్యూనికేషన్‌, మీడియా రంగాలు విస్తరిస్తుండటంతో ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్లకు గిరాకీ ఏర్పడింది. కొంచెం సృజనాత్మకంగా ఆలోచించగల శక్తి తోడైతే ఉత్తమ ఉపాధి మార్గమూ అవుతుంది. ఆసక్తి, కొద్దిగా కొత్తగా ఆలోచించగల నేర్పుతోపాటు, ప్రాథమిక ఫొటోగ్రఫీ పరిచయముంటే వారి నైపుణ్యాలకు మెరుగులు అద్దేలా సంస్థలు కొన్ని కోర్సులను అందుబాటులోకి తెచ్చాయి. కేవలం ఫొటోగ్రఫీకి సంబంధించిన కోర్సులనే అందించే సంస్థలున్నాయంటే వీటికున్న ఆదరణను అర్థం చేసుకోవచ్చు. ఫొటోగ్రఫీలో సర్టిఫికేషన్‌, డిప్లొమాతోపాటు డిగ్రీ కోర్సులూ అందుబాటులో ఉన్నాయి. సంప్రదాయ ఫొటోగ్రఫీ కోర్సులను అందించే సంస్థలు చాలా ఉన్నాయి. వీటిలో కొన్ని ప్రత్యేకంగా, కొన్ని విభిన్నమైన అంశాల్లో కోర్సులను అందిస్తున్నాయి. వీటికి కనీస విద్యార్హత ఇంటర్‌/ తత్సమాన విద్యను పూర్తిచేసుండాలి.

ఫోరెన్సిక్‌-నేరపరిశోధనలో

ఏదైనా నేరం జరిగినపుడు పోలీసులతోపాటు ఫొటోగ్రాఫర్లు రావడాన్ని గమనిస్తుంటాం. వాళ్లు వివిధ కోణాల్లో నేరం జరిగిన ప్రదేశాన్నీ, అనుమానాస్పదంగా అనిపించిన వాటినీ ఫొటోలు తీస్తుంటారు. వీరే ఫోరెన్సిక్‌ ఫొటోగ్రాఫర్లు. నేరాన్ని పరిష్కరించడంలో వీరిదీ ప్రధాన పాత్రే. నేర పరిశోధనలో నేరం జరిగిన తీరును అంచనా వేయడానికీ, విశ్లేషించడానికీ అవసరమైన పత్రాలను సమకూర్చుకోవడంలో పోలీసులు వీరి సాయం తీసుకుంటారు.
నేరం జరిగినచోట సాక్ష్యాలను సేకరించడం, అక్కడి పత్రాలను ఫొటోల రూపంలో సేకరించడం, బాధితులు పడివున్న తీరు, పాదముద్రలు, రక్తపు మరకలు విస్తరించిన తీరు ఇతర సాక్ష్యాలను విజువల్‌ రికార్డు రూపంలో భద్రపరుస్తారు.
ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలించే అలవాటుండి, నేర పరిశోధనపై ఆసక్తి ఉన్నవారికి ఇది బాగా ఉపయోగకరం. తీసే ఫొటోలకు వాస్తవికత, ఉపయోగం ఉండాలని భావించేవారు ఈ కెరియర్‌ను ఎంచుకోవచ్చు. ఫోరెన్సిక్‌ ఫొటోగ్రాఫర్‌ తీసే ఫొటోలను కేసు ఛేదనల్లో, కోర్టు కేసుల్లో సాక్ష్యాలుగానూ ఉపయోగిస్తారు. అయితే వీటికి కేవలం సాధారణ నైపుణ్యాలు సరిపోవు. వేలిముద్రలను స్పష్టంగా తీసివ్వగల డిజిటల్‌ ఇమేజింగ్‌ నైపుణ్యాలూ అవసరమవుతాయి. వీటి గురించి తప్పక నిపుణుల దగ్గర శిక్షణ అవసరం. క్రిమినాలజీ, ఫోరెన్సిక్‌ సైన్స్‌, లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నేపథ్యం ఉన్నవారికి ఇది మరింత లాభిస్తుంది.
కోర్సులు అందిస్తున్న సంస్థలు:
* ఇంటర్నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ (ఐఎఫ్‌ఎస్‌), పుణె
* ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఫొటోగ్రఫీ ఎక్సలెన్స్‌, అహ్మదాబాద్‌
* టీజీసీ, దిల్లీ, జయపుర
* రచనా సంసద్‌ ఇన్‌స్టిట్యూట్‌, ముంబయి.
వీరిని సాధారణంగా పోలీసుశాఖ, పరిశోధన సంస్థలు, డిటెక్టివ్‌ ఏజెన్సీలు ఉద్యోగులుగా తీసుకుంటాయి.

ఫుడ్‌ - నోరూరేలా..

సాధారణంగా ఏదైనా వంటకం వాసనకో, లేదా ఇష్టమైనదాన్ని తలచుకున్నపుడో నోట్లో నీరూరుతుంది. అది సహజం. ఇక్కడ వంటకంలో వాడిన పదార్థాల్లో లేదా ఇష్టమైనదైతే దానికి అలవాటు పడుంటాం కాబట్టి అలా జరుగుతుంది. కానీ ఒక ఫొటో చూశాక అదే భావన కలిగిందంటే.. దానికి కారణం మాత్రం ఫుడ్‌ ఫొటోగ్రాఫర్‌ పనితీరే. వీరు చూడగానే ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకునేలా, తినాలనే కోరిక కలిగించేలా ప్రతిభ ప్రదర్శిస్తారు. వీరు ఈ ఫొటోలను మేగజీన్లు, వంటల పుస్తకాలు, రెస్టారెంట్ల ప్రమోషన్ల కోసం ఉపయోగించే పుస్తకాలు, వెబ్‌సైట్ల కోసం తీస్తారు. ఫుడ్‌ స్టైలిస్ట్‌లతో పనిచేస్తూ, ఆహారం అందంగా, ఆకర్షణీయంగా ఉండేలా తీర్చిదిద్దుతారు. వినడానికి చాలా సులువుగా కనిపిస్తుంది కానీ, నిజానికి కాదు. ఈ విధంగా తీర్చిదిద్దాలంటే.. వారికి ‘కలినరీ’ నేపథ్యం అవసరమవుతుంది. అలాగే నిబద్ధతా ముఖ్యమే. వీరు ఫొటోలు తీయడానికే పరిమితం కాకుండా ఫుడ్‌సెటప్‌పైనా దృష్టిపెడతారు. అందుకు తగిన పదార్థాలను ఎంచుకోవడం, తాజాగా ఉండేలా జాగ్రత్త తీసుకోవడం వీటిలోని భాగమే. మౌలిక ఫొటోగ్రఫీతోపాటు ఆహార రంగంపై ఆసక్తి ఉన్నవారు దీన్ని ఎంచుకోవచ్చు. వంటలో ఉపయోగించే పదార్థాలపైనా అవగాహన ఉండాలి. అలాగే రంగుల మేళవింపు, మంచి ఎడిటింగ్‌ నైపుణ్యాలున్నవారికి అనుకూలం. ఎక్కువగా బృందంతో పనిచేయాల్సి ఉంటుంది. టీజీసీ, ఇంకా కొన్ని సంస్థలు మాత్రమే వారాల పరిధిలో సర్టిఫికేషన్‌ కోర్సులను అందిస్తున్నాయి. ఏటా కొన్ని సంస్థలు దిల్లీ, బెంగళూరు, ముంబయి, హైదరాబాద్‌లో రోజుల వ్యవధి గల వర్క్‌షాప్‌లను నిర్వహిస్తుంటాయి. వీటిలో పాల్గొన్నవారికి సర్టిఫికెట్‌ కూడా అందిస్తున్నారు. ఈవెంట్‌ హై, దీబా రాజ్‌పాల్‌, నోవాటెల్‌, డార్టర్‌ ఫొటోగ్రఫీ, ఫుడ్‌ షాట్స్‌, ఇన్‌సైడర్‌, ప్రో పిక్సర్‌ మొదలైనవి ప్రముఖమైనవి. వీరిని ఫుడ్‌ మ్యాగజీన్లు, పేపర్లు, రెస్టారెంట్లు, ఫుడ్‌ ప్యాకేజింగ్‌, ఫుడ్‌ మ్యానుఫాక్చరర్లు, డైరీ, ఐస్‌క్రీం సంస్థలు ఎంచుకుంటాయి.

వైల్డ్‌ లైఫ్‌ - ప్రకృతిపై ప్రేమతో..

జంతువులు ముఖ్యంగా ఇంట్లో పెంచుకోలేని వన్యమృగాల ఫొటోలను తీయడమే వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రఫీ. వీరు ప్రకృతి, అడవి జీవాలపైనే దృష్టిసారిస్తారు. మిగతావాటితో పోలిస్తే ఇది సవాళ్లతో కూడుకున్నది. సాహసపూరితమైన కెరియర్‌ కూడా. చుట్టూ ఉన్న పరిసరాలను, దూరాలను అంచనా వేయగలగడం ప్రధానం. కెమెరా యాంగిల్స్‌పైనా పట్టుండాలి.
కేవలం జంతువులు, మొక్కలను ఫొటో తీయడం మాత్రమే కాదు. వాటి జీవన చక్రాన్ని సహజసిద్ధంగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తారు. వీరికి సూక్ష్మపరిశీలన, ఇంద్రియ జ్ఞానం తప్పనిసరి. చురుకుగా పనిచేసే తత్వం, ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా పనిచేయగలిగేలా ఉండాలి. జంతువుల గురించి తెలుసుకోవాలనే కోరిక, ప్రకృతిని ఇష్టపడే మనస్తత్వం, ఎక్కువగా ప్రయాణాలు చేయగలిగే ఓపిక ఉన్నవారు దీన్ని ఎంచుకోవచ్చు.
ప్రముఖ సంస్థలు డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికేషన్‌ కోర్సులను అందిస్తున్నాయి.
కోర్సులు అందిస్తున్న ప్రముఖ సంస్థలు:
* క్రియేటివ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ, కేరళ
* దిల్లీ కాలేజ్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ, దిల్లీ ‌
* ద ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజిటల్‌ ఆర్ట్‌ అండ్‌ యానిమేషన్‌, కోల్‌కతా
* ఇమేజెస్‌ రీడిఫైన్‌డ్‌ ఫొటోగ్రఫీ ఇన్‌స్టిట్యూట్‌, కోల్‌కతా
* టీజీసీ, దిల్లీ, జయపుర ‌
* ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఫొటోగ్రఫీ ఎక్సలెన్స్‌, అహ్మదాబాద్‌
* శ్రీని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ, కోయంబత్తూరు
వార్తాపత్రికలు, ట్రావెల్‌ మేగజీన్లు, టీవీ చానళ్లు, పరిశోధన సంస్థలు, ఎన్‌జీఓలు వీరిని ఎక్కువగా ఎంచుకుంటున్నాయి. వీరు తీసిన ఫొటోలను గ్యాలరీలు, వెబ్‌సైట్లకు విక్రయించవచ్చు. ఫొటోగ్రఫీ కాంటెస్ట్‌లకూ పంపుకునే వీలుంటుంది.

ఫ్యాషన్‌ - ఆకర్షణీయంగా..

ప్రపంచంలోని ఆకర్షణీయమైన కెరియర్లలో ఇదీ ఒకటి. దుస్తులు, జ్యువెలరీ ప్రమోషన్లు, అడ్వర్టైజింగ్‌ల్లో భాగంగా మోడళ్లకు ఫొటోలు తీస్తుంటారు. ముఖ్యంగా పేపర్లు, మేగజీన్లు, హోర్డింగుల కోసం తీస్తుంటారు. దానిలో మోడల్‌ కంటే ప్రచారం చేయాలనుకుంటున్న దానిపైకి వినియోగదారుడి చూపు వెళ్లేలా చేయడం ఫ్యాషన్‌ ఫొటోగ్రాఫర్‌ పని. అందుకు ఏ రంగుల మేళవింపు అవసరం, ఏ కోణంలో పెడితే లక్ష్యం నెరవేరుతుంది వంటి అంశాలపై వీరికి అవగాహన ఉంటుంది. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగానూ ఫ్యాషన్‌ రంగం విస్తరిస్తున్నకొద్దీ వీరి అవసరం తప్పక ఉంటుంది.
ఫ్యాషన్‌ రంగంపై ఆసక్తి, పట్టు ఉన్నవారు దీన్ని ఎంచుకోవచ్చు. వీరు అడ్వర్టైజింగ్‌ కాంపెయిన్స్‌, మేగజీన్లకు ఫొటోలు తీస్తారు. డిజైనర్లు, ఫ్యాషన్‌ హౌజ్‌లతో కలిసి పనిచేస్తారు. డిజైనర్లకు తగ్గట్టుగా కాన్సెప్టులు తయారుచేయడం, ఫ్యాషన్లు, దుస్తులు, వాటి రంగుల ఆధారంగా ఫొటోలు తీయడం వంటివి చేస్తుంటారు.
ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సివస్తుంది. సమయంతో సంబంధం లేకుండా పనిచేయగలగాలి. వివిధ రకాల ఆధునిక సాంకేతికతలను ఉపయోగించడంతోపాటు ఎడిటింగ్‌ సాఫ్ట్‌వేర్లపై పట్టు ఉంటే వీరికి తిరుగుండదు.
కోర్సులు అందిస్తున్న ప్రముఖ సంస్థలు:
* జేడీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ, బెంగళూరు
* క్రియేటివ్‌ హట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ, కేరళ
* పెరల్‌ అకాడమీ, ముంబయి, జయపుర
* నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ, ముంబయి
* ఐఐపీ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ) అకాడమీ, నోయిడా
* దిల్లీ కాలేజ్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ, న్యూదిల్లీ
* ఉడాన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ, కోల్‌కతా
* ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఫొటోగ్రఫీ ఎక్సలెన్స్‌, అహ్మదాబాద్‌
వీరికి ఫ్యాషన్‌ మేగజీన్లు, అడ్వర్టైజింగ్‌ సంస్థలు, బొతిక్‌లు మొదలైన వాటిల్లో ఉద్యోగావకాశాలుంటాయి.

వెడ్డింగ్‌ - భావోద్వేగాల బంధం

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒక ముఖ్య ఘట్టం. అందుకే ఆ ఆనంద క్షణాలను అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడానికి ఎంత ప్రాముఖ్యమిస్తారో.. ఆ క్షణాలను భద్రంగా పదిలపరచుకోవడానికీ అంతే ప్రాధాన్యమిస్తారు. వారికి అందులో సహాయపడేవారే వెడ్డింగ్‌ ఫొటోగ్రాఫర్లు. కొద్దికాలంగా వీరికి ప్రాధాన్యం బాగా పెరిగింది. పెళ్లికొడుకు, పెళ్లికూతురు, ఆశీర్వదించడానికి వచ్చినవారిని తీయడం వరకే వారు పరిమితం అవ్వడం లేదు. వివిధ సందర్భాల్లో వారి భావోద్వేగాలనూ కెమెరాతో బంధించి అందిస్తున్నారు.
ఇప్పుడు వెడ్డింగ్‌ ప్లానింగ్‌ అనేది పెద్ద పరిశ్రమగా ఏర్పడింది. అందుకే ప్రతి సంస్థా తమకంటూ ప్రత్యేకమైన ఫొటోగ్రఫీ బృందాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. పెళ్లి రోజున మాత్రమే కాకుండా వధూవరులు ప్రీ వెడ్డింగ్‌, పోస్ట్‌వెడ్డింగ్‌ షూట్లకు ప్రాముఖ్యమిస్తున్నారు. ఇక పెళ్లి అనగానే.. సంగీత్‌, మెహందీ, పెళ్లి కొడుకును/ కూతురును చేయడం.. ఇలా ప్రతీ వేడుకకూ వెడ్డింగ్‌ ఫొటోగ్రాఫర్ల అవసరం ఏర్పడుతోంది.
అందుకే కేవలం ఫొటోగ్రఫీ నైపుణ్యాలు సరిపోవడం లేదు. సృజనాత్మకత, ప్రతిభ వంటి ప్రత్యేకతలూ అవసరమే. ఓపిక, ఏ సమయంలోనైనా పనిచేయడం, కొన్ని గంటలపాటు ఏకధాటిగా పనిచేయగలిగినవారు ఎంచుకోవచ్చు. వివిధ రకాల సంప్రదాయాలు, పెళ్లిళ్లపైనా అవగాహన ఉండాలి. వర్ణాల మేళవింపుపైనా పట్టుండాలి.
చాలా సంస్థలు డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికేషన్‌ స్థాయి కోర్సులను అందిస్తున్నాయి.
* నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ, దిల్లీ
* దిల్లీ కాలేజ్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ, దిల్లీ
* ఇమేజెస్‌ రిఫైన్డ్‌ ఫొటోగ్రఫీ ఇన్‌స్టిట్యూట్‌, కోల్‌కతా
* ఉడాన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ, కోల్‌కతా
* రచనా సంసద్‌, ముంబయి
* జేజే స్కూల్‌ ఆఫ్‌ అప్లయిడ్‌ ఆర్ట్‌, ముంబయి

Back..

Posted on 28-11-2018