Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ప్రిపరేషన్‌కీ ఉందో పద్ధతి!

* టెన్త్‌లో బాగా మార్కులు వచ్చినా ఇంటర్‌లో చదవడానికే ఇబ్బంది పడుతున్న వరుణ్‌.
* ఎప్పుడూ చదువుతూ కనిపించినా ఎంతకీ మార్కులు సరిగా రాకపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన వెంకట్‌.
* పోటీ పరీక్షల కోసం కనిపించిన పుస్తకాలన్నీ పోగేసుకొని అరకొరగా చదివి ఆందోళన చెందుతున్న ఇంకో అభ్యర్థి.

ఇలాంటి వారికి తగిన పరిష్కారం కావాలంటే సమస్యల మూలాలను తెలుసుకోవాలి. ఎప్పుడు చదవాలి? ఎలా చదవాలి? పిల్లల చదువులో తల్లిదండ్రుల పాత్ర ఏమిటి? చదువుకునే ప్రదేశం ఎలా ఉండాలి? ఈ విషయాలను తెలుసుకుంటే అనుకున్నట్లుగా, అర్థవంతంగా ప్రిపరేషన్‌ సాగుతుంది.
కష్టపడి కాదు ఇష్టపడి చదవమని అందరూ చెబుతారు. కానీ అలా ఇష్టపడి చదవడం ఎలా? అదే తెలుసుకోవాలి. ఎంతో ఆలోచించి చదవడానికి ప్లాన్‌ చేస్తారు. అమలు చేయడంలో మాత్రం పట్టుదల ప్రదర్శించరు. అదే లోపం.
చిన్న చిన్న పనులన్నీ కలిస్తే..
చదువంటే ఒక పని కాదు. చిన్న చిన్న పనుల సమాహారం.
* కొత్త విషయం విని లేదా చదివి అర్థం చేసుకోవడం
* నోట్సు సిద్ధం చేసుకోవడం
* విషయంపై అవగాహన పెంచుకోవడం
* చదివింది పరీక్షల వరకు గుర్తుంచుకోవడం
* పరీక్షలో కంగారు పడకుండా చదివింది రాయడం
* చక్కగా రాసి మంచి మార్కులు పొందడం
సరైన మార్కులు రాలేదంటే వీటిలో ఏదో ఒక అంశంలో మీరు బలహీనంగా ఉన్నారని అర్థం. దాన్ని తెలుసుకొని తగిన మార్పులు చేసుకోవాలి.
ప్రతీదానికి ఒకటే తీరు..
అర్ధరాత్రి వరకు అదే పనిగా చదివి టెన్త్‌లో బాగా మార్కులు తెచ్చుకున్న వరుణ్‌. ఇంటర్‌లో డీలా పడ్డాడు. కౌన్సెలింగ్‌లో విచారిస్తే టెన్త్‌లో ఉపయోగించిన కంఠస్థ ధోరణిని ఇంటర్‌లోనూ ప్రయత్నిస్తున్నాడని తేలింది. అవసరమైన చోట అప్లికేషన్‌ పద్ధతిలో చదవకపోతే దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు అతడికి సూచించారు. తెలుగు చదివే పద్ధతి, లెక్కలు చేసే తీరు వేరుగా ఉంటాయి. సైన్సుకూ, సోషల్‌కూ ఒకే రకంగా చదివే ధోరణి సరైంది కాదు. సైన్సులో భౌతిక, రసాయన, జీవశాస్త్రాలకు వేర్వేరు విధానాలు అవలంబించాలి. సామాజిక శాస్త్రాలలో చరిత్ర, రాజనీతిశాస్త్రం, ఆర్థికశాస్త్రం ఒకదానికొకటి భిన్నమైనవి. ఈ తేడాను గమనించాలి.
ఎందుకు చదువుతున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. కథల పుస్తకాన్ని చదవడం, పాఠాన్ని అధ్యయనం చేయడం ఒకటి కాదు. ప్రాజెక్ట్‌ వర్క్‌ కోసం వార్తాపత్రిక చదివే తీరు వేరు. మన లక్ష్యానికి అనుగుణంగా చదవాలి. పరీక్షలే ప్రాతిపదిక కాకుండా విషయాన్ని దీర్ఘకాలం గుర్తుంచుకునేలా విద్యార్థులు చదివేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి.
ఎక్కువ పుస్తకాలు వద్దు
వార్షిక పరీక్షలకు, ముఖ్యంగా పోటీపరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు రకరకాల పుస్తకాలను సేకరించే అలవాటు ఉంటుంది. కొత్తరకం మెటీరియల్‌ చూడగానే ఒకటి రెండు మార్కులైనా పెరుగుతాయేమో అనే ఆశతో కొనేస్తారు. చివరికి పుస్తకాలు ఎక్కువ, చదువు తక్కువ అవుతుంది. నిపుణుల సలహాతో ప్రామాణిక పుస్తకాలను వీలైనన్ని ఎక్కువసార్లు రివిజన్‌ చేయాలి. ఎన్ని పుస్తకాలు కొన్నాం అనేదాని కంటే ఎంత విషయాన్ని గ్రహించాం అనేదే ప్రధానమని గుర్తించాలి.
తల్లిదండ్రులు ఏం చేయాలి?
పిల్లల చదువు సక్రమంగా సాగడానికి తల్లిదండ్రులు చాలా శ్రద్ధగా సహకరించాలి. గట్టిగా మాట్లాడకూడదు. టీవీ, ఫోన్లను తక్కువగా వాడాలి. తిండికి తప్ప మిగతా ఏ విషయంలోనూ వాళ్ల చదువుకు అంతరాయం కలిగించకూడదు. అలా అని తలుపులు వేసి చదివించ వద్దు. పిల్లలు చదువుతున్నంతసేపు వారి గది తలుపులు తెరిచే ఉండాలి. తల్లిదండ్రులు కూడా ఆ సమయంలో ఏదో ఒకటి చదువుకోవడం ఇంకా మంచిది.
పిల్లల చదువును పూర్తిగా వారికే వదిలేయకూడదు. అతి జోక్యం కూడా తగదు. వాళ్లు ఏ సబ్జెక్టులను ఆసక్తిగా చదువుతున్నారు, వేటి విషయంలో ఇబ్బంది పడుతున్నారో గమనించాలి. ఉపాధ్యాయుల సాయంతో పిల్లల సమస్యలను తొలగించాలి.
విరామం అవసరం
చదివిన అంశాలను మెదడు గ్రహించాలంటే మధ్య మధ్యలో తగినంత విరామం ఇవ్వాలని శాస్త్రీయ పరిశీలనలో తేలింది. విద్యా సంస్థల్లో పీరియడ్‌లు 45 నిమిషాల కంటే ఎక్కువ ఉండకపోవడానికి కారణం ఇదే. ఇంటి దగ్గర చదివేటప్పుడు కూడా 30 నిమిషాలు ఏకాగ్రతతో చదివి తర్వాత ఒక 5 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. ఆ అయిదు నిమిషాల్లో కళ్లను చల్లటి నీళ్లతో కడుక్కోవడం, విశ్రాంతిగా కూర్చోవడం మంచినీళ్లు తాగడం వంటివి చేయాలి.
గ్రూప్‌ స్టడీలో అప్రమత్తత
ఒకే పరీక్షకు సిద్ధమవుతున్న ఇద్దరు, ముగ్గురు కలసి చదవడం మంచిదే కానీ అప్రమత్తంగా ఉండాలి. ఉమ్మడి లక్ష్యాలను పెట్టుకొని వాటిని చేరుకోడానికి ఒకరికొకరు సాయం చేసుకోవాలి. బృందంలో సభ్యుల సంఖ్య అయిదుకు మించకూడదు. ఒక్కో అంశానికి ఒక్కొక్కరు బాధ్యత తీసుకోవాలి. రోజులో కొంతసేపు కలిసి చదువుకున్నా, మరికొంతసేపు విడిగా అధ్యయనానికి కేటాయించుకోవాలి. అనవసరమైన చర్చల జోలికి పోకూడదు.
కంఠస్థం మంచిదేనా?
ఫార్ములాలు, గణిత సూత్రాలు, పేర్లు, సంవత్సరాల వంటి వాటిని శబ్దం ఆధారంగా కంఠస్థం చేయవచ్చు. కానీ మొత్తం విషయమంతా బట్టీ పట్టడం అంటే మెదడుపై భారాన్ని పెంచడమే. అది ప్రతికూల ఫలితాలకు దారి తీస్తుంది. అనువర్తన కోణంలో నేర్చుకోవాల్సిన వాటికి సంబంధించిన మౌలికాంశాలను అర్థం చేసుకొని చదవాలి. పాఠ్య సారాంశాన్ని గ్రహించడమే చదువు పరమార్థమని గుర్తుంచుకోవాలి.
పరిశుభ్ర ప్రదేశంలో!
ఎప్పుడూ చదువుతూ కనిపించే వెంకట్‌కి ఏనాడూ మంచి మార్కులు రాలేదు. తనకు ఇక చదువు రాదని అతడు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. కారణాలు వెతికితే అసలు సమస్య బయటపడింది. వాళ్ల ఇంట్లో ఖాళీ ఉండే ఒకే ఒక్క గది డ్రాయింగ్‌ రూం. అక్కడే వెంకట్‌ స్టడీ టేబుల్‌ ఉంది. టీవీకి, ఆ టేబుల్‌కి మధ్య ఒక కర్టెన్‌ పెట్టారు. ఎప్పుడూ టీవీ పెట్టే ఉంటుంది. ఇంటికి ఎవరు వచ్చి మాట్లాడుకుంటున్నా, ఫోన్‌ మోగినా వెంకట్‌ చెవులను దాటిపోవు. పైగా స్టడీటేబుల్‌ దగ్గరే తినడం, తాగడం. ఆ ఎంగిలి ప్లేట్లను, గ్లాసులను వాళ్లమ్మ ఎప్పటికో తీస్తుంది. ఇదంతా అతడి చదువును ప్రభావితం చేస్తున్నాయి.
అందుకే చదివే ప్రదేశం కూడా ఎంతో ముఖ్యం. రోజూ ఒకేచోట చదవాలి. ఎక్కడ చదివినా ఏదో ఒకపక్క ప్రశాంతంగా, పరిశుభ్రంగా ఉండేలా చోటు చూసుకోవాలి. తగినంత గాలీ, వెలుతురూ ఉండాలి. ట్యూబులైట్ల వెలుగు మొహం మీద పడకుండా చూసుకోవాలి. పుస్తకం మీదకి నీడ రాకూడదు. చదువుకు అవసరమైన సామగ్రి అంటే పెన్నులు, మార్కర్లు తదితరాలు అందుబాటులో ఉండాలి. ఎత్తుకు తగిన కుర్చీ, టేబుల్‌ ఏర్పాటు చేసుకోవాలి.
కంటికి ఇంపైన రంగు, ఆహ్లాదకరమైన సంగీతం, చక్కటి సువాసన ఏకాగ్రత పెంచుతాయి. ముదురు రంగులూ, రాక్‌ సంగీతం, ఘాటైన వాసనలూ ప్రతికూలమైనవి. చదువుకోడానికి కూర్చునే ముందే ఆ ప్రదేశాన్ని చక్కగా సర్దుకోవాలి.
ఉదయమే మంచిది!
ఎప్పుడు చదవాలి అనేది కూడా ఒక సమస్యే. తెల్లవారుఝామునా? అర్ధరాత్రి వరకా? రాత్రి 11 గంటల నుంచి ఉదయం 3 గంటల మధ్య మాత్రం తప్పకుండా నిద్రపోవాలి. కేవలం ఆ నాలుగు గంటల నిద్ర కూడా సరిపోదు. కనీసం 6 గంటల నిద్ర ఉండాలి. ఇంటి దగ్గరే ఉండి పోటీపరీక్షలకు చదువుతున్న అభ్యర్థులు మధ్యాహ్నం రెండు గంటలు నిద్రించవచ్చు. కానీ కాలేజీలకు వెళ్లే విద్యార్థులు రాత్రి 10 గంటలకు పడుకొని ఉదయం 4 గంటలకు లేవడం ఉత్తమం. రాత్రి బాగా నిద్రపోయి లేస్తే ఉదయం శరీరం, మనసూ, మెదడూ చురుగ్గా ఉంటాయి. అప్పుడు కొత్తవిషయాలను సులువుగా నేర్చుకోవచ్చు.

- డాక్ట‌ర్ టి.ఎస్‌.రావు, కౌన్సెలింగ్ సైకాల‌జిస్ట్‌

విద్య అంటే మెదడుకు శిక్షణ!
విద్య అంటే కేవలం వివరాలనూ, వాస్తవాలనూ తెలుసుకోవడం కాదు. మన ఆలోచనాశక్తి పెరిగే విధంగా మెదడుకు శిక్షణ ఇవ్వడం.
- ఆల్బర్ట్‌ ఐన్‌స్టెయిన్‌

Posted on 20-12-2017

Back..