Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
తెలుసుకో... గెలుచుకో!

* కెరియర్‌ వృద్ధికి నైపుణ్య మార్గాలు

ఈ నూతన సంవత్సరంలో కొత్త కోర్సులు నేర్చుకోవడం లాంటి ప్రణాళికలెన్నో వేసుకుని ఉంటారు. వాటితో పాటు కెరియర్‌ను అత్యున్నతంగా అభిÅవృద్ధి చేసుకుని పోటీలో దూసుకువెళ్లేందుకు కొన్ని నైపుణ్యాలు ముఖ్యమంటోంది ప్రఖ్యాత సంస్థ ఫోర్బ్స్‌. 2020లో వీటికి చాలా ప్రాధాన్యం పెరుగుతోందట. పైగా పెద్దగా ఖర్చులేకుండా ఈ నైపుణ్యాలు నేర్చుకోవచ్చు. వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిగతంగానూ ఉన్నతిలోకి రావొచ్చు. అవేమిటో చూద్దామా?

విద్యాపరిజ్ఞానం, నైపుణ్య శిక్షణ, శిక్షణలో భాగంగా ఏర్పడిన నెట్‌వర్క్‌ మొదలైనవన్నీ కలిస్తేనే.. కెరియర్‌. వీటిలో దేని పాత్రనీ తీసేయడానికి లేదు. ఇవన్నీ ఒక్కో కవచంలా ఏర్పడి కెరియర్‌ను బలోపేతం చేస్తాయి. కళాశాల/ ఉద్యోగ జీవితంలో ఎదుగుదలకు చాలామంది కొత్త కోర్సులు, శిక్షణలు, ఇంటర్న్‌షిప్‌ వంటివి తీసుకోవడం చూస్తుంటాం. కెరియర్‌ పురోగతికి ఇవి ఉపయోగపడుతుంటాయి కూడా. అందుకే వీటికి ఒక్కోసారి వేల రూపాయల్లో ఖర్చు అయినా వెనుకాడరు. వీటితోపాటు విద్యార్థులూ, ఉద్యోగార్థులూ దృష్టిపెట్టదగ్గ ముఖ్యమైన నైపుణ్యాలు-

మీ కథను మీరే..
ఎవరి గురించైనా సరిగా చెప్పగలిగేది ఎవరికి వారే. మిగతావారి కంటే మీరు ఎందుకు ప్రత్యేకమో.. ఆ కెరియర్‌ కథను మీరే చెప్పుకోవాలి. సాధారణంగా దీని అవసరం ఇంటర్వ్యూలు, రెజ్యూమె తయారీ సమయాల్లో వస్తుంది. చాలా చిన్న ప్రశ్నగా పరిగణించేవారే ఎక్కువ. అందుకే అప్పటికప్పుడు నాలుగు ముక్కలు సిద్ధమై వెళుతుంటారు. కానీ దీనికి ప్రాధాన్యం ఎక్కువ. అత్యున్నత సివిల్స్‌ ఇంటర్వ్యూల్లోనూ దీన్ని సంధిస్తారు. కాబట్టి, ముందుగానే ఆలోచించుకుంటే మీ బలాలేమిటో స్పష్టత వస్తుంది. గెలుపు, ఓటమి, పొందిన శిక్షణ, చిన్న ఆలోచన.. ఇలా వృత్తిగత- వ్యక్తిగత అనుభవాలు చిన్నగానే అనిపించినా పెద్ద ప్రభావాన్నే చూపగలవు. వాటిని ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా, వాట్సాప్‌.. లాంటి సోషల్‌ మీడియా వేదికల్లో పోస్టు చేయండి. వ్యక్తీకరణ మెరుగవుతుంది కూడా. ఇప్పుడు ఇవీ ఉద్యోగ మార్గాలవుతున్నాయి. దీన్ని ఉద్యోగం వచ్చే వరకే పరిమితం చేయకుండా తర్వాత కూడా కొనసాగిస్తే మంచిది.

చెప్పండి ‘నో’, ‘ఎస్‌’
ఏమనుకుంటారో అన్న మొహమాటమో, ఏమవుతుందో అన్న భయమో గానీ చాలామంది ‘వీలు కాదు/ లేదు’ అని చెప్పలేరు. ఒక్కోసారి దీనివల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఉదాహరణకు- త్వరగా ఇంటికి వెళ్లి చదువుకోవాలనుంటుంది. తోటి విద్యార్థులు ఆడుకుందామనో, లెక్చరర్‌ ఏదైనా విషయంలో సాయం కావాలనో అడగొచ్చు. సమయం ఉన్నపుడు ఎలాగూ అంగీకరిస్తారు. ఇబ్బందిగా ఉన్నపుడు/ వీలు కానపుడు స్పష్టంగా చెప్పేయాలి. ఇలా వీలుకాని, ఆసక్తిలేని వేటికైనా ‘నో’ చెప్పమంటున్నారు నిపుణులు. ఇదీ ఒక నైపుణ్యమే. సరైన నిర్ణయం తీసుకునే, స్పష్టమైన వైఖరి ఇక్కడ వ్యక్తమవుతుంది.
కొన్నిటికి మాత్రం ‘నో’ చెప్పకూడదు. కెరియర్‌కు సాయపడే సవాళ్లన్నిటికీ సరే అనాలి. చాలాసార్లు కొత్తవి చేయడానికి భయమేస్తుంది. దీంతో వెనకడుగు వేస్తుంటారు. కానీ కొత్త సవాళ్లు, అవకాశాలు ఎప్పుడు ఎదురైనా, పూర్తిగా తెలియకపోయినా ‘ఎస్‌’ చెప్పాలంటున్నారు. ఓటమి ఎదురైనా అదీ ఒక అనుభవమవుతుంది, కొత్త ఆలోచనలకు అవకాశమివ్వడంతోపాటు సానుకూల ప్రభావం చూపుతుందనేది నిపుణుల అభిప్రాయం. ఉదాహరణకు- ఒక ప్రాజెక్టు/ పని అప్పగించారు. దానిపై పూర్తి అవగాహన మీకు లేదు. కానీ దాన్ని స్వీకరించడం ద్వారా ఒక తెలియని విషయాన్ని తెలుసుకునే వీలుంటుంది. దానికి ఎవరిని సంప్రదించాలో తెలుస్తుంది. నెట్‌వర్కింగ్‌ కూడా సాధ్యమై, నాయకత్వ లక్షణాలు అలవడతాయి.

సాఫ్ట్‌స్కిల్స్‌దే హవా
ఉద్యోగార్థుల్లో పరిశీలిస్తున్న అతి ముఖ్యమైన అంశమిది. ఎక్కువమంది అశ్రద్ధ చూపేదీ ఇదే. కళాశాల, ఆఫీసు, ఇల్లు.. ఇలా చెప్పుకుంటే ప్రతిచోటా నలుగురితో మాట్లాడటం, కలిసి పనిచేయడం తప్పనిసరి. అది సాఫీగా సాగడం మన మాటతీరు, ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుంది. తోటివారితో మన సంబంధ బాంధవ్యాలను ప్రభావితం చేసేవే సోషల్‌ స్కిల్స్‌. మాటతీరుతోపాటు హావభావాలూ దీనిలో భాగమే. 2019లో లింక్‌డిన్‌ సహా ఎన్నో టాలెంట్‌ ట్రెండ్స్‌ నివేదికలు పని ప్రదేశంలో అతిముఖ్యమైన నైపుణ్యాలుగా సాఫ్ట్‌స్కిల్స్‌ను పేర్కొన్నాయి. కార్యాలయాల్లో చాలామందితో, భిన్న భావోద్వేగాలతో పనిచేయాల్సి ఉంటుంది. అక్కడ విజయం సాధించాలంటే సాఫ్ట్‌స్కిల్స్‌ తప్పనిసరి. హోదాతో సంబంధం లేకుండా వీటి అవసరం ఉంది.

పంచుకుంటే పెరుగుతుంది
తెలివిగలవాళ్లు, తెలివి తక్కువవాళ్లు అంటూ ప్రత్యేకంగా ఎవరూ ఉండరు. ఆసక్తి కారణంగా ఒక్కో విషయంపై ఒక్కొక్కరికి అవగాహన ఉంటుంది. దాన్ని అలానే అట్టిపెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. చిన్న ఆలోచన, పరిజ్ఞానం, అర్థం చేసుకున్న అంశం.. ఇతరులతో పంచుకున్నపుడే శక్తిమంతం అవుతుంది. కొత్త ఆవిష్కరణలకు దారి తీస్తుంది. ఉదాహరణకు- ఒక సబ్జెక్టు కాన్సెప్టును మీ స్నేహితుడికి వివరిస్తున్నారు. అప్పుడు తనకు ఓ సందేహం వచ్చింది. అది మీకు తెలియదు. దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు కదా! ఇంకో కోణం తెలుసుకునేలా లేదా భిన్నంగా ఆలోచించేలా ఉపయోగపడినట్టే కదా.

ఆలోచనల్లో వైవిధ్యం
ఒకే అంశాన్ని అందరి కంటే భిన్నంగా, ప్రభావవంతంగా చేయగలిగిన వారికే ఆదరణ, గుర్తింపు. దాన్నే సృజనాత్మకతగా చెబుతారు. సమస్యలకు కొత్త రీతిలో పరిష్కారాలను సూచించడం, ఊహత్మక ఆలోచనలకు కార్యరూపం ఇవ్వడం వంటివి దీనికిందకే వస్తాయి. ఒక సమస్యకు భిన్న కోణాలను ఆలోచించడం, ఏదైనా అంశాన్ని వైవిధ్యంగా ఆలోచించడం వంటివి అలవాటు చేసుకుంటే ఈ నైపుణ్యాన్ని అందుకోవచ్చు.

సానుకూలత చూడాలి
కెరియర్‌ అయినా, చూసే ప్రపంచం అయినా దృష్టికోణాన్ని బట్టే మారుతుంది. మీ గురించి మీరు చెప్పే అంశాల్లోనూ ఇది ప్రతిబింబిస్తుంది. శక్తియుక్తులపై ప్రభావం చూపుతుంది. సాధించే విజయం, ఆనందాల విషయంలోనూ దీని ప్రభావముంటుందనేది నిపుణుల అభిప్రాయం. కాబట్టి ప్రతి విషయాన్నీ, సందర్భాన్నీ సానుకూలంగా చూడటం అలవాటు చేసుకోవాలి. ఉదాహరణకు- ఏదైనా చెడు జరిగినపుడు ఎవరో కావాలనే చేశారనో, తమకే జరిగిందనో భావిస్తుంటాం. అలాకాకుండా దానిలో ఏదైనా సానుకూలాంశం ఉందేమో చూడగలగాలి. ఆలోచనాతీరు మారడమే కాదు, ఆనందమూ సొంతమవుతుంది.

Back..

Posted on 06-01-2020